Hits: 2630
Print
రచయిత: కె విద్యా సాగర్

22:1, 22:2, 22:3-5, 22:6-8, 22:9, 22:10-12, 22:13, 22:14, 22:15-18, 22:19, 22:20-24

ఆదికాండము 22:1 ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను.

ఈ వచనంలో దేవుడు అబ్రాహామును పరిశోధిస్తున్నట్టు మనం చూస్తాం. ఆయనకు తన సృష్టిని మరిముఖ్యంగా తన పిల్లలను పరిశోధించే అధికారం ఉంటుంది. ఆ పరిశోధనలో ఆ పిల్లల మేలు, ఘనత నిక్షిప్తమైయుంటుంది. ఉదాహరణకు; ఈ సందర్భంలో ఆయన అబ్రాహామును పరిశోధించాడు కాబట్టే నేడు మనమంతా అతన్ని గొప్ప విశ్వాసిగా భావిస్తున్నాం. 

కొందరు "ఆయన ఎవనిని శోధింపడు" (యాకోబు 1:13) అని రాయబడిన మాటలను ఈ సంఘటనతో ముడిపెట్టి ఇదేదో వైరుధ్యంగా ఆరోపిస్తుంటారు. మరికొందరు ఆ ఆరోపణకు సమాధానంగా దేవుడు పరిశోధిస్తాడు తప్ప శోధించడని, అబ్రాహామును దేవుడు పరిశోధించాడే తప్ప శోధించలేదని, శోధించేవాడు కేవలం సాతానుడని చెబుతుంటారు‌. అయితే మనం హెబ్రీ 11:17వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ అబ్రాహాము శోధించబడ్డాడు అనే రాయబడింది. అదేవిధంగా "నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించువాడు సైన్యములకధిపతియగు యెహోవాయే" (యిర్మియా 11:20) అని కూడా రాయబడింది. కాబట్టి శోధన, పరిశోధన అనేపదాలు పర్యాయపదాలుగా ఉపయోగించబడ్డాయని మనం గుర్తించాలి. అందుకే యూదులు పాతనిబంధనను గ్రీకులోకి తర్జుమా చేసినప్పుడు (LXX) " "దేవుడు అబ్రాహామును పరిశోధించెను" అన్నచోట πειράζω' (peirazo) అనే పదాన్ని ఉపయోగించారు. నూతననిబంధనలో "శోధించెను" అన్నప్పుడు కూడా గ్రీకులో అదే పదం ఉపయోగించబడింది (హెబ్రీ 11:17).

ఇక యాకోబు పత్రికలో "దేవుడు ఎవరినీ శోధించడు" అనే మాటలు ఆయన పాపం చేసేలా ఎవర్నీ ప్రేరేపించడు అనే భావంలో రాయబడ్డాయి. అందుకే ఆ మాటలు "దేవుడు "కీడు" విషయమై శోధింపబడనేరడు" అని ప్రారంభించబడి "ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును" అని ముగించబడ్డాయి.

అదేవిధంగా ఈ సందర్భంలో మనకు "ఆయా సంగతులు‌ జరిగిన తరువాత" అనే మాటలు కనిపిస్తాయి. దీనికి ముందున్న అబ్రాహాము‌ చరిత్రను మనం పరిశీలిస్తే అప్పటికే అతను ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఇష్మాయేలును కూడా దూరంగా పంపిచేసి ప్రస్తుతం వాగ్దానపుత్రుడైన ఇస్సాకుతో సంతోషంగా జీవిస్తున్నాడు. ఆ సంతోష సమయంలోనే అతనికి అత్యంత బాధాభరితమైన శోధన సంభవించింది. దీనిని బట్టి విశ్వాసులమైన మనం గతంలో ఎన్ని శోధనలను ఎదుర్కొన్నప్పటికీ అవి అంతటితో ముగిసిపోయాయని అనుకోకూడదు, ఈలోకంలో జీవించినంతకాలం వాటికి సిద్ధంగా ఉంటూ అబ్రాహాములా దేవుడు మన జీవితంలోకి ఎలాంటి శోధనను, ఎలాంటి సంతోష సమయంలో అనుమతించినప్పటికీ "చిత్తం ప్రభువా" అనేలా ఉండాలి.

ఆదికాండము 22:2 అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతనినర్పించమని చెప్పెను.

ఈ వచనంలో దేవుడు ఇస్సాకును బలిగా కోరడం మనం చూస్తాం. గమనించండి; ఇక్కడ ఆయన నీవు ప్రేమించే ఇస్సాకును అని అంటున్నాడు. అంటే మనం ప్రేమించేదానిని ఆయనకు ఇవ్వ (ఆయనకోసం కోల్పోవ) సిద్ధపడినప్పుడే ఆయనపై మనకున్న ప్రేమ ఎంత గొప్పదో రుజువౌతుంది. అన్నిటికంటే ఆయనను ఎక్కువగా ప్రేమించినప్పుడే కదా అవన్నీ ఆయనకు ఇవ్వడమో ఆయనకోసం వదులుకోవడమో సాధ్యమౌతుంది. కాబట్టి విశ్వాసులమైన మనమంతా ఆయనపట్ల ఇలాంటి ప్రేమను కలిగియుండాలి. ఎందుకంటే మనకున్న ప్రేమలన్నీ బంధాలన్నీ ఆయన దానమే.

ద్వితీయోపదేశకాండము 6:5 నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.

1కోరింథీ 16:22 ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక.

అదేవిధంగా కొందరు ఈ సందర్భాన్ని ప్రస్తావించి బైబిల్ దేవుడు నరబలిని కోరేవాడంటూ విమర్శిస్తుంటారు. కానీ కొంచెం విజ్ఞతతో ఈ వచనాన్ని చదివినా ఆయన ఇస్సాకును బలి అర్పించమన్నది అబ్రాహామును పరిశోధించడానికేయని స్పష్టంగా అర్థమౌతుంది. ఒకవేళ ఆయన‌ నరబలి కోరేవాడే ఐతే ఆ బలి‌ని ఎందుకు అడ్డుకుంటాడు? (ఆదికాండము 22:11,12). ఈ ఆరోపణకు మరింత వివరణ తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

యెహోవా దేవుడు నర బలులను కోరేవాడా?

ఇక ఈ సందర్భంలో దేవుడు నీకు ఒక్కడైయున్న కుమారుడిని నాకు బలిగా అర్పించమనడం మనం చూస్తాం. దీనిని బట్టి ఇస్లాం దావా ప్రచారకులు అబ్రాహాము బలిగా అర్పించబోయింది ఇస్సాకును కాదు ఇష్మాయేలునని వాదిస్తారు. ఎందుకంటే అబ్రాహాముకు ఇస్సాకు పుట్టకముందే ఇష్మాయేలు అనే కుమారుడు ఉన్నాడు. ఆయన "నీకు ఒక్కడైయున్న" అంటున్నాడు కాబట్టి ఆ ఒక్కడూ ఇష్మాయేలే ఈ సంఘటన జరిగే సమయానికి అసలు ఇస్సాకే పుట్టలేదనేది వీరి వాదన. అయితే ఇది జరిగే సమయానికి ఇష్మాయేలు అబ్రాహాముతో లేడు ముందు అధ్యాయంలోనే అబ్రాహాము‌ అతన్ని తన ఇంటినుండి పంపివేసాడు. ప్రస్తుతం అబ్రాహాముతో ఇస్సాకు మాత్రమే ఉంటున్నాడు కాబట్టి పైగా అతను వాగ్దానపుత్రుడు కాబట్టి ఆ విధంగా సంబోధించబడడంలో ఎలాంటి అభ్యంతరం లేదు.

ఆదికాండము 22:3-5‌ తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను. మూడవ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి తన పని వారితోమీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి-

ఈ వచనాలలో అబ్రాహాము దేవుడు తనకు ఆజ్ఞాపించినదాని ప్రకారం ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతంపైకి వెళ్ళడం మనం చూస్తాం. "తెల్లవారినప్పుడు" అబ్రాహాము జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు దేవుడు‌ సున్నతి గురించి ఆజ్ఞాపించినా ఇష్మాయేలును‌ పంపివెయ్యమని ఆజ్ఞాపించినా చివరికి ఇస్సాకును‌ బలి అర్పించమని ఆజ్ఞాపించినా కూడా ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే దానికి సిద్ధపడుతున్నట్టు గమనిస్తాం. ఇవన్నీ అతనికి చాలా బాధకలిగించేవే. అయినప్పటికీ అతను ఆలస్యం చెయ్యట్లేదు. ఆయన ఆజ్ఞల విషయంలో మనమూ ఇంత విధేయులంగా సిద్ధపడితే ఎంత‌ మేలు. ఈ విషయం ఆయా సందర్భాలలో ఇప్పటికే వివరించాను కాబట్టి ముందుకు సాగుతున్నాను.

ఇక్కడ అబ్రాహాము తన పనివారితో "మ్రొక్కి" అని పలికినచోటే ఇంగ్లీషు బైబిల్ లో మొదటిసారి worship అనే పదం అనువదించబడింది. హీబ్రూలో ఐతే అక్కడున్న పదం שָׁחָה (shachah) దీనికి సాష్టాంగపడడం, విధేయత చూపించడం, పూర్తిగా లోబడడం అనే అర్థాలు వస్తాయి. దీనిప్రకారం; దేవుణ్ణి ఆరాధించడమంటే అన్నిటికంటే ఆయనను అధికంగా ప్రేమించి ఆయనకు లోబడడమే. అబ్రాహాము తాను ఎంతగానో‌ ప్రేమించే ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడుతూ ఇక్కడ అదే‌ చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసులు దేవుణ్ణి ఆరాధించడమంటే నోటితోనూ చేతులతోనూ చేసేది మాత్రమేయని భావించకుండా అబ్రాహాములా దేవుని మాటకు విధేయత చూపించాలి. అలాంటి విధేయత లేని ఆరాధనను దేవుడు అసహ్యించుకుంటాడే తప్ప భక్తిగా భావించడు. అందుకే "ధర్మశాస్త్రము వినబడకుండ (ఆయన ఆజ్ఞలు పాటించకుండా) చెవిని తొలగించుకొనువాని ప్రార్థన (ఆరాధన) హేయము" (సామెతలు 28:9) అని రాయబడింది.

అదేవిధంగా ఇక్కడ అబ్రాహాముకున్న శ్రేష్టమైన విశ్వాసం మనకు కనిపిస్తుంది. అతను ఇస్సాకును బలిగా అర్పించడానికి పర్వతం ఎక్కే తరుణంలో పనివారిని‌ చూసి మేము దేవునికి మ్రొక్కి మరలా వస్తాము అంటున్నాడు. అంటే అబ్రాహాము చాలా కచ్చితంగా ఇస్సాకు సజీవుడిగా తిరిగివస్తాడని నమ్ముతున్నాడు. ఎందుకంటే; దేవుడు చేసిన నిబంధన ప్రకారం ఇస్సాకు ద్వారా తన సంతానం ఆకాశనక్షత్రాల వలే విస్తరించాలి (ఆదికాండము 17:16,21, 21:12). ఆ నిబంధన నెరవేరాలంటే ఇస్సాకు బ్రతికేయుండాలి. కాబట్టి అబ్రాహాము తనకు వాగ్దానం చేసిన దేవుడు‌ నమ్మదగినవాడని, ఆయన ఇస్సాకు చనిపోయాక కూడా (బలిలో) తిరిగి బ్రతికిస్తాడని‌ విశ్వసించాడు. ఈ విషయమే హెబ్రీ గ్రంథకర్త స్పష్టంగా చెబుతున్నాడు (హెబ్రీ 11:17-19).

నిజానికి అబ్రాహాము దేవుడు ఆ బలిని అడ్డగిస్తాడని ఊహించలేదు, చంపిన తర్వాత కూడా ఆయనే మరలా బ్రతికిస్తాడని విశ్వసించాడు, అది నిజంగా గొప్ప విశ్వాసం. అయితే అతను ఎందుకు బాధపడ్డాడనే ప్రశ్న మనకు రావొచ్చు. అబ్రాహాము ప్రస్తుతానికి తన చేతులతో ఇస్సాకును చంపాలి. అది బాధకలిగించే విషయమేగా?

ఆదికాండము 22:6-8 దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తనచేతితో నిప్పును కత్తిని పట్టుకొనిపోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రీ అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా అబ్రాహాము నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.

ఈ వచనాలలో అబ్రాహాము ఇస్సాకులు తమ పనివారిని విడిచిపెట్టి దేవుడు చెప్పిన పర్వతంపైకి ఎక్కిపోవడం, మార్గమధ్యంలో ఇద్దరూ దహనబలికై గొఱ్ఱెపిల్ల గురించి చర్చించుకోవడం మనం చూస్తాం. వారిద్దరూ దేవుడు చెప్పిన పర్వతం పైకి చేరుకోవడానికి మూడురోజుల సమయం పట్టింది (4వ). గమనించండి; అబ్రాహాము దేవుని వాగ్దానంపై తనకున్న నమ్మకం చొప్పున ఈ‌ బలికి సిద్ధపడినప్పటికీ ఈ ప్రయాణ సమయంలో అతని మనసులో ఎన్నో సందేహాలు కలిగే అవకాశం ఉంది. ప్రాముఖ్యంగా అతను అప్పటివరకూ చనిపోయిన వారు తిరిగి బ్రతకడం చూడలేదు కాబట్టి, నా కుమారుడి విషయంలో ఇది జరుగుతుందా అనే ప్రశ్న అతడిని వెంటాడవచ్చు. అయినప్పటికీ అబ్రాహాము దేవునిపై తనకున్న విశ్వాసంతో ఆ సందేహాలు అన్నిటినీ జయించాడు. మనం కూడా ఆయన వాగ్దానంపై నమ్మకంతో అన్నిటినీ జయించగలగాలి.

ఆదికాండము 22:9 ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.

ఈ వచనంలో అబ్రాహాము ఆ పర్వతంపైకి చేరి, బలిపీఠం‌ కట్టి దానిపై కట్టెలు పేర్చి, ఇస్సాకును బంధించి దానిపై ఉంచడం మనం చూస్తాం. ఇక్కడ అబ్రాహాము మనసులో తన కుమారుడిని చంపుతున్నందుకు ఎంతబాధ ఉన్నప్పటికీ బలి యొక్క క్రమాన్ని మరచిపోవడం లేదు. అందుకే బలిపీఠం కట్టి దానిపై కట్టెలను చక్కగా పేర్చుతున్నాడు. కాబట్టి మన మనసులో ఉండే వేదనలు మనం చేసే దేవుని పనిని ప్రభావితం చెయ్యకుండా జాగ్రతపడాలి. మనకు మాదిరిగా జీవించిన ప్రవక్తలు, అపోస్తలులు తమముందు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళనలతో జీవిస్తున్నప్పటికీ దేవుని కార్యం విషయంలో అశ్రద్ధచూపలేదు కదా.

అదేవిధంగా ఈ ఇస్సాకు బలికి కావలసిన కట్టెలను పర్వతంపైకి మోసుకుపోవడాన్ని బట్టి అతను తన తండ్రికంటే బలవంతుడైన యవ్వనుడిగా కనిపిస్తున్నాడు. అయినప్పటికీ అబ్రాహాము అతడిని బంధించి బలిపీఠంపై ఉంచుతున్నప్పుడు అతనికి విషయం అర్థమైనప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చెయ్యలేదు.‌‌ అతను తలచుకుంటే అబ్రహామును త్రోసివేసి అక్కడినుంచి పారిపోగలడు‌. అయినా అతనలా చెయ్యలేదు. ఇక్కడ ఇస్సాకుకు దేవునిపట్ల ఉన్న విధేయత మనకు కనిపిస్తుంది, అతను దేవుని ఆజ్ఞను బట్టి తన ప్రాణాలను కోల్పోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఇస్సాకులా దేవుని వాగ్దానాన్ని బట్టి జన్మించిన (తిరిగి జన్మించిన) మనమందరం అతనివలే విధేయులంగా జీవించాలి.‌ ఇలాంటి విధేయతనే మనం పౌలు మాటల్లో చూస్తాం (అపో.కా 20: 24).

ఆదికాండము 22:10-12 అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. అతనినేమియు చేయకుము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను.

ఈ వచనాలలో అబ్రాహాము ఇస్సాకును‌ బలిగా అర్పించబోతున్నప్పుడు యెహోవా దూత అతడిని నిలువరించి, ఇస్సాకును కాపాడడం‌ మనం చూస్తాం. మొదటి వచనం ప్రకారం ఇస్సాకును బలిగా కోరింది దేవుడు. కానీ ఇక్కడ యెహోవా దూత మాట్లాడుతూ "నీ కుమారుడిని నాకు ఇవ్వడానికి వెనుతియ్యలేదంటూ" ఆ బలిని ఆయనే కోరినట్టు తనకు ఆపాదించుకుంటున్నాడు.‌ కాబట్టి అబ్రాహామును బలిగా కోరిన దేవుడే ఇక్కడ యెహోవా దూతగా వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈ దూత గురించి వివరంగా తెలుసుకునేందుకు ఈ వ్యాసం చదవండి.

యెహోవా దూత యేసుక్రీస్తు

అదేవిధంగా దేవునికి సమస్తమూ తెలుసు ఆయన మనకు పెట్టిన పరీక్షలను బట్టి మనం ఎలాంటివారిమో అప్పటికప్పుడు తెలుసుకోడు (కీర్తనలు 139:1-6). అయినప్పటికీ ఇక్కడ యెహోవా దూత "నీవు నీ కుమారుడిని నాకు అర్పించడానికి వెనుదియ్యలేదు కాబట్టి నీవు దేవునికి భయపడేవాడివని ఇందువల్ల నాకు కనబడుతుంది" అంటున్నాడు. దీనిని మనం క్రియల కోణంలో అర్థం చేసుకోవాలి, దేవునికి మనమేంటో తెలిసినప్పటికీ ఆ క్రియలే మనలోపల ఉన్నదానిని బాహాటంగా రుజువు చేస్తాయి కాబట్టి ఆయన ఈవిధంగా మాట్లాడుతున్నాడు. స్పష్టంగా చెప్పాలంటే దేవునిపై మనకున్న భయాన్ని మన క్రియల్లో చూపించాలని ఈ మాటలు మనకు బోధిస్తున్నాయి. అందుకే అబ్రహాము క్రియలమూలంగా కూడా నీతిమంతునిగా తీర్చబడినట్టు లేఖనం చెబుతుంది (యాకోబు 2:21-23).

ఇక్కడ మనం గుర్తించవలసిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తన కుమారుడిని చంపే బాధను అబ్రాహాము అనుభవించకూడదని అతను‌ బలి ఇవ్వకముందే నియంత్రించిన దేవుడు నిత్యత్వంలో‌‌ తాను ప్రేమించిన కుమారుడిని మాత్రం మనకోసం‌ బలిగా ఇచ్చాడు. ఇది ఆయనకు మనపై ఉన్న గొప్ప ప్రేమను రుజువుచేస్తుంది (రోమీయులకు 8:32, యోహాను 3:16).

ఆదికాండము 22:13 అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను.

ఈ వచనంలో అబ్రాహాము పొదలో కనిపించిన పొట్టేలును బలిగా అర్పించడం మనం చూస్తాం. ఈవిధంగా ఆయన "దహనబలికి గొఱ్ఱెపిల్లను దేవుడే చూసుకొనును" అని పలికిన అబ్రాహాము మాటను నెరవేర్చాడు. కొందరు దీని ఆధారంగా కూడా ఆయనిలా ముందే అడ్డగిస్తాడని అబ్రాహాముకు తెలుసంటూ భావిస్తుంటారు. అది వాస్తవం కాదని‌ ఇప్పటికే నేను వివరించాను. అదే వాస్తవమైతే అబ్రాహాముకు ఇది శోధన అయ్యే అవకాశం లేదు. ఇస్సాకును చంపే పరిస్థితే అతనికి రాదన్నప్పుడు అది శోధన ఎలా ఔతుంది?. కాబట్టి అబ్రహాము అక్కడ "దహనబలికి గొఱ్ఱెపిల్లను దేవుడే చూసుకొనును" అనేమాటలను ఇస్సాకును ధైర్యపరచడానికి ఉపయోగించుంటాడు. కానీ దేవుడు దాన్ని నిజం చేసాడు.

అదేవిధంగా బైబిల్ గ్రంథంలోని బలులన్నీ యేసుక్రీస్తుకు ఛాయగా ఉన్నాయి, ఈ సందర్భంలో ఇస్సాకుకు ప్రతిగా బలైన పొట్టేలు కూడా ఆయనకు ఛాయగానే ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు మనందరికీ ప్రతిగా సిలువలో బలయ్యాడు (మార్కు 10: 45, యెషయా 53:4-11).

ఆదికాండము‌ 22:14 అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.

ఈ వచనంలో అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించబోయిన ప్రదేశానికి యెహోవా ఈరే అని పేరుపెట్టడం మనం చూస్తాం. ఎందుకంటే అతను చెప్పినట్టుగానే దేవుడు ఇస్సాకుకు ప్రతిగా బలిని చూసుకున్నాడు. ఇదే ప్రదేశంలో సొలోమోను యెరుషలేము మందిరాన్ని నిర్మించాడు (2 దినవృత్తాంతములు 3:1).

ఆదికాండము 22:15-18 యెహోవా దూత రెండవమారు పరలోకము నుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశనక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.

ఈ వచనాలలో యెహోవా దూత మరలా నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని వాగ్దానం చెయ్యడం మనం చూస్తాం. అయితే ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రాహాముకు గతంలోనే చేసినట్టు లేఖనాలు మనకు సాక్ష్యమిస్తున్నాయి (ఆదికాండము 12:2,3, 13:16, 15:5) అప్పటికి అబ్రాహాము ఇస్సాకును‌ బలిగా అర్పించబోలేదు. కాబట్టి ఇది వైరుధ్యంలా అనిపించే అవకాశం ఉంది కానీ అలాంటిదేమీ లేదు. అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడే ఈ వాగ్దానం చేసినప్పటికీ ఇక్కడ అతను వాగ్దానం చేసిన దేవునిపట్ల సంపూర్ణ విధేయత చూపిస్తూ ఆ వాగ్దానానికి అర్హుడిగా చాటుకున్నాడు. అంటే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే క్రియలు అతనిలో ప్రత్యక్షమయ్యాయి. అందుకే ఆ వాగ్దానం అతని క్రియమూలంగా నెరవేరుతున్నట్టు ఇక్కడ జ్ఞాపకం చెయ్యబడింది (యాకోబు 2:21,22).

మనల్ని కూడా ఆయన ముందుగానే రక్షణ పాత్రులుగా నిర్ణయించినప్పటికీ (రోమా 8:29,30, ఎఫెసీ 1:4-6,12) ఆ రక్షణకు తగిన క్రియలు చెయ్యమని బోధిస్తున్నాడు (ఎఫెసీ 2:10). అందుకే వానివాని క్రియలచొప్పున జీతమిస్తానని కూడా అంటున్నాడు.

అదేవిధంగా ఆ సందర్భంలో యెహోవా దూత "నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును" అని పలకడం మనం చూస్తాం. ఇది ఒకవైపు చారిత్రాత్మకంగా ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధాల్లో సాధించిన విజయాలను సూచిస్తుంటే మరోవైపు విశ్వాసం ద్వారా అబ్రాహాము సంతానమైన మనం క్రీస్తు ద్వారా అపవాదిపై సాధించే విజయాన్ని కూడా తెలియచేస్తుంది. అబ్రాహాము సంతానంలో జన్మించిన క్రీస్తు మూలంగానే ఈరోజు ప్రపంచంలోని జాతులన్నీ ఆశీర్వదించబడుతున్నాయి.

ఆదికాండము 22:19 తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయేర్షెబాకు వెళ్లిరి. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను.

ఈ వచనంలో అబ్రాహాము తన కుమారుడితోనూ పనివారితోనూ బెయేర్షెబాకు వచ్చి అక్కడ నివసిస్తున్నట్టు మనం చూస్తాం.‌ ఆదికాండము 21:31 ప్రకారం; అబీమెలెకు అబ్రాహాము దగ్గరకు వచ్చి ప్రమాణం చేసుకున్నప్పుడు ఆ చోటికి అబ్రాహాము బెయేర్షెబా అని నామకరణం చేసాడు, అప్పటికి శారా కూడా అక్కడే ఉంది. కాబట్టి అబ్రాహాము అదేచోటికి తిరిగివెళ్ళి తన భార్యయైన శారా మరియు తన కుమారుడైన ఇస్సాకుతో‌ కలసి అక్కడే నివసించాడు. కొందరు ఇస్లాం దావా ప్రచారకులు హాగరు ఇష్మాయేలుతో వెళ్ళగొట్టబడినప్పుడు దారితప్పి బెయేర్షెబా అరణ్యంలో తిరిగిన సంఘటనను (ఆదికాండము 21:14) వక్రీకరించి ఇక్కడ అబ్రాహాము కూడా ఆమె‌దగ్గరకే వెళ్ళిపోయాడని చెబుతుంటారు. కానీ అబ్రాహాము వెళ్ళింది బెయేర్షెబాలో శారా ఉన్న చోటికే తప్ప హాగరు దగ్గరకు కాదు.

తర్వాత కాలంలో కూడా అబ్రాహాము, శారా ఇస్సాకులు ఒకేచోట కలసి ఉన్నారు అనడానికి ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకున్నప్పుడు ఆమెను తన తల్లియైన శారా గుడారంలోకి తీసుకుని వెళ్ళడం మంచి ఆధారంగా కనిపిస్తుంది (ఆదికాండము 24:67). అప్పటికి శారా చనిపోయినప్పటికీ ఆమె గుడారం అబ్రాహాము, ఇస్సాకుల దగ్గరే ఉంది. కాబట్టి అబ్రాహాము శారాలు చివరివరకూ కలసే జీవించారు.

ఆదికాండము 22:20-24 ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు, కెసెదు, హజో, షిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను. ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను. మరియు రయూమా అను అతని, ఉపపత్నియు తెబహును, గహమును తహషును మయకాను కనెను.

ఈ వచనాలలో అబ్రాహాము విడిచివచ్చిన తన సహోదరుడి సంతానం గురించి‌ మనం చూస్తాం. ఈ సంతానంలో జన్మించిన రిబ్కానే ఇస్సాకు వివాహం చేసుకున్నాడు. దీని గురించి 24వ అధ్యాయంలో చూద్దాం.