Hits: 166
Print
రచయిత: కె విద్యా సాగర్

సంఖ్యాకాండము 5:1-4 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతి వానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతి వానిని, పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్ర పరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్టవలెను. ఇశ్రాయేలీయులు ఆలాగు చేసిరి; పాళెము వెలుపలికి అట్టివారిని వెళ్లగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి.

ఈ వచనాలలో దేవుడు కుష్ఠరోగినీ స్రావముగల వారినీ శవాన్ని ముట్టడం వల్ల అపవిత్రులైనవారినీ పాళెం నుండి దూరంగా వెళ్ళగొట్టాలని ఆజ్ఞాపించడం, ఇశ్రాయేలీయులు అలానే చెయ్యడం మనం చూస్తాం. ఎందుకంటే "నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండునట్లు" అని రాయబడింది. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతీరోగం, శారీరక అపవిత్రతలు పాపానికి ఛాయగా ఉన్నాయి. అందుకే ఆ రోగాల బారిన పడినవారూ అపవిత్రతలకు గురైనవారూ దేవుడు నివసించే పాళెం నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఈ నియమాన్ని బట్టి దేవుని నివాసం వద్ద పాపులకు స్థానం ఉండడని నేర్చుకుంటున్నాం.‌

అయితే కుష్టురోగులు కానీ స్రావం గలవారు కానీ ఇతర శారీరక అపవిత్రతలకు గురైనవారు కానీ శాశ్వతంగా పాళెం వెలుపలే ఉండక్కర్లేదు. ఆ రోగం నుండి స్వస్థపడేంతవరకే వారు వెలుపల ఉండాలి, తర్వాత పాళెంలో చేరవచ్చు. ఆ వివరణ లేవీకాండము 14,15 అధ్యాయాల్లో రాయబడింది. అలాగే శవాన్ని ముట్టినవాడు మూడు లేక ఏడురోజులు మాత్రమే అపవిత్రుడై పాళెంకు వెలుపల నివసిస్తాడు (సంఖ్యాకాండము 19:11,12).

సంఖ్యాకాండము 5:5-8 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలో పురుషుడుగాని స్త్రీగాని యెహోవామీద తిరుగబడి మనుష్యులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధమువలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో అయిదవవంతు దానితో కలిపి యెవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను. ఆ అపరాధ నష్టమును తీసికొనుటకు ఆ మనుష్యునికి రక్తసంబంధి లేని యెడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకునివగును.

ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా వేరొక వ్యక్తికి ఏవిధంగానైనా నష్టం కలుగచేస్తే ఏం చెయ్యాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ నియమం మొదటిసారి లేవీకాండము 6:1-7లో ప్రస్తావించబడింది. దానిప్రకారం ఎవరిదైనా బలవంతంగా తీసుకున్నా తాకట్టు పెట్టినదాని విషయంలో బొంకినా ఇలా ఏవిధంగానైనా వేరొక వ్యక్తికి నష్టం కలుగచేస్తే మొదటిగా ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనిషి మరో మనిషి పట్లే పాపం చేసినప్పటికీ అది దేవునికి విరుద్ధంగా లేక ఆయనపై తిరగబడి చేసినట్టే. అందుకే ఆ పాపం విషయంలో "ఇశ్రాయేలీయులలో పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరుగబడి మనుష్యులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను" అని రాయబడింది. తర్వాత ఆ వ్యక్తి మరో‌ వ్యక్తికి ఎంతైతే నష్టం కలుగచేసాడో దానితో పాటు మరో ఐదంతలు కలిపి చెల్లించాలి. ఉదాహరణకు 100 రూపాయలు నష్టం కలుగచేస్తే దానితో పాటు మరో 20 రూపాయలు కలిపి 120 రూపాయలు చెల్లించాలి. ఒకవేళ నష్టం కలిగిన వ్యక్తి అప్పటికే చనిపోయి అతనికి రక్తసంబంధి లేకపోతే ఆ సొమ్మును యాజకుడికి అప్పగించాలి. అలాగే పొట్టేలును బలిగా అర్పించాలి. ఈవిధంగా ఆయన ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా మరో వ్యక్తికి అన్యాయం చేస్తే ఏవిధంగా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలో కట్టడ విధించాడు. దీనివల్ల ఎవరైనా మరో వ్యక్తికి నష్టం కలుగచెయ్యాలంటే ఐదంతలు అదనపు సొమ్ము బలికి పొట్టేలును కూడా ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఎవరికీ నష్టం కలిగించకుండా జాగ్రత్తపడతారు. ఈ కట్టడ ఉద్దేశం అదే (లేవీకాండము 6:1-7 వ్యాఖ్యానం చూడండి).

సంఖ్యాకాండము 5:9,10 ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతనివగును. ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చినయెడల అది అతనిదగునని చెప్పుము.

ఈ వచనాలలో దేవుడు యాజకుల భాగం గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అంటే వారికి బలుల్లోనూ అర్పణల్లోనూ రావలసిన భాగాలే కాకుండా ఎవరైనా స్వేచ్చగా ఏమైనా ఇచ్చినా ఇవ్వాలని ప్రతిష్టించుకున్నా అవి వారికే స్వంతం. ఎవరికీ వాటిపై హక్కు ఉండదు. ఎందుకంటే యాజకులకు పరిచర్య తప్ప మరో ఆదాయపు వనరు లేదు. అందుకే వారి పోషణ నిమిత్తం దేవుడు ఇలాంటి భాగాలను నియమించాడు. ఈ నియమాన్ని బట్టి సంఘంలో పరిచర్య తప్ప మరే ఆదాయపూ వనరూ లేని సేవకులను సంఘమే పోషించాలని నేర్చుకుంటున్నాం. దీనిగురించే "ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము నొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో పాలివారైయున్నారనియు మీరెరుగరా? ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువునియమించియున్నాడు" (1కోరింథీ 9:13,14) అని రాయబడింది.

సంఖ్యాకాండము 5:11-31 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకని భార్య త్రోవతప్పి వానికి ద్రోహముచేసినయెడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన యెడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేక పోయినను, ఆమె పట్టుబడకపోయినను, వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్యమీద కోపపడిన యెడల, లేక వాని మనస్సులో రోషముపుట్టి అపవిత్ర పరచబడని తన భార్యమీద కోపపడినయెడల, ఆ పురుషుడు యాజకునియొద్దకు తన భార్యను తీసికొనివచ్చి, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను. వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు; ఏలయవగా అది రోషవిషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకముచేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసికొనివచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను. తరువాత యాజ కుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసికొనవలెను, మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసికొని ఆ నీళ్లలో వేయవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తల ముసుకును తీసి, రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీచేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసిన దేమనగా ఏ పురుషుడును నీతో శయనింపనియెడలను, నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయినయెడలను, శాపము కలుగజేయు ఈ చేదు నీళ్లనుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవతప్పి అపవిత్ర పరచబడినయెడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమిచేసిన యెడల యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక. శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమేన్‌ అని చెప్పవలెను. తరువాత యాజకుడు పత్రముమీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి ‌శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగజేయు ఆ నీళ్లు ఆమె లోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతినుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసికొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్య మును అల్లాడించి బలిపీఠము నొద్దకు దాని తేవలెను. తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్య ములోనుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడి పోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పదముగా నుండును. ‌ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రు రాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగు నని చెప్పుము. రోషము విషయమైన విధియిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన యెడలనేమి, లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడినయెడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజ కుడు ఆమెయెడల సమస్తము విధిచొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను.

ఈ వచనాలలో దేవుడు ఎవరైనా భర్తకు తన భార్య విషయంలో అక్రమసంబంధపు అనుమానం కలిగితే దానికి సరైన సాక్ష్యాలు లేకపోతే ఆ అనుమానాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలో వివరించడం మనం చూస్తాం. ఆ భర్త తన భార్యతో పాటు తూములో పదియవవంతు యవలపిండిని తీసుకుని యాజకుని యొద్దకు రావాలి. యవలపిండి చాలా చవకైనది, పేదవారు కూడా దానిని తీసుకురాగలరు. యాజకుడు ఆ నైవేద్యాన్ని ఆమె చేతిలో ఉంచి ప్రమాణం చేయించి పరిశుద్ధ స్థలపు దూలికలిపిన నీటిని ఆమెతో త్రాగించాలి. అప్పుడు ఆమె నిర్దోషి ఐతే గర్భవతి ఔతుంది దోషి ఐతే నడుపు పడిపోయి కడుపు ఉబ్బిపోయి ఇక సంసార జీవితానికి పనికిరానిదిగా మారిపోతుంది. ఈవిధంగా దేవుడు తన అద్భుతంతో ఒక భర్తకు కలిగిన అనుమానాన్ని నివృత్తి చేసుకునే పద్ధతిని ప్రవేశపెట్టాడు.

అయితే చాలామంది బైబిల్ విమర్శకులూ స్త్రీవాదులూ ఈ పద్ధతిని చూపించి ఇది స్త్రీని అవమానించేదిగా ఉందని ఆరోపిస్తుంటారు‌. కానీ నిజానికి ఈ పద్ధతి శీలవతులైన స్త్రీలకు భద్రతగా ప్రవేశపెట్టబడింది. ఎలాగంటే; ఆ కాలంలో భార్యలపై అనుమానం కలిగిన భర్తలు తమకు తామే ఆ భార్యలను శిక్షించేవారు. దానివల్ల ఏ తప్పూ చెయ్యని భార్యలు కూడా అన్యాయంగా శిక్షించబడే భర్త కోపానికి బలయ్యే అవకాశం ఉంది. అలా జరక్కుండా ఉండాలనే అనగా అనుమానం కలిగిన భర్తలు తమకు తాముగా తమ భార్యలను శిక్షించకుండా ఉండాలనే దేవుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీనివల్ల శీలవతులైన భార్యలు గర్భవతులౌతారు, తప్పు చేసిన భార్యలు ఇక సంసారానికి కూడా పనికి రాకుండా పోతారు. ఆవిధంగా ఈ పరీక్ష నిర్దోషులను రక్షించేదిగా దోషులను శిక్షించేదిగా ఉంది. అలాంటప్పుడు ఇక‌ సమస్య ఏముంది?

మీకా 2:7 యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా?

హోషేయా 14:9 జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహిం తురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.

కానీ భార్యలకే ఈ పరీక్ష ఎందుకు? భర్తలకు ఎందుకు లేదు? అనేది ఇక్కడ స్త్రీవాదుల మరో అభ్యంతరం. అలాగైతే బైబిల్ ప్రకారం; పురుషులే యుద్ధం చెయ్యాలి. సాధారణ యుద్ధాల్లో పురుషుల్ని మాత్రమే చంపాలి. స్త్రీలను చంపకూడదు (ద్వితీయోపదేశకాండము 20:13,14). మరిప్పుడు వారు పురుషుల్నే ఎందుకు చంపాలి, స్త్రీలను ఎందుకు చంపకూడదు అని ప్రశ్నించగలరా? వారికి కావలసింది సమానత్వమే కదా!.

ఇక భార్యలకే ఈ పరీక్ష ఎందుకు? భర్తలకు ఎందుకు లేదంటే; ఈ పరీక్ష శీలవతులైన భార్యలకు భద్రతగా ప్రవేశపెట్టబడిందని అనగా ఆ కాలంలో అనుమానం‌ కలిగిన భర్తలు తమకు తామే తమ భార్యలను శిక్షించే పద్ధతిని అనుసరించేవారు కాబట్టి దానివల్ల శీలవతులైన భార్యలకు అన్యాయం జరగకుండా వారికోసమని ఆయన ఈ పరీక్షను ప్రవేశపెట్టాడని ఇప్పటికే వివరించాను. ఒకవేళ ఆ కాలంలో భార్యలు కూడా ఇప్పటి కొందరు భార్యల్లా అనుమానపు పిశాచులై తమ భర్తలను శిక్షిస్తుంటే భర్తలకోసం కూడా అలాంటి పరీక్షను ప్రవేశపెట్టేవాడేమో? అలాంటి అవసరం అప్పుడు లేదు కాబట్టి భర్తలకు అలాంటి పరీక్ష లేదు. ఇక్కడ స్త్రీవాదులూ బైబిల్ విమర్శకులూ గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏంటంటే; బైబిల్ ప్రకారం భార్య భర్తకు లోబడాలి‌, అతనిపట్ల పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఆ భార్య క్రీస్తు యేసు సంఘానికి ఛాయగా ఉంది (ఎఫెసీ 5:31,32). అందుకే ఆమె శీలానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడింది. అలాగే భర్తలకు భార్య యొక్క భారం అప్పగించబడింది. అందుకే అతను ఆమెను పోషించాలి, సంరక్షించాలి.

మరో విషయం ఏంటంటే ఈ శీలపరీక్ష పద్ధతిలో "అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను" అనే ఈ మాటలు పరిశీలించండి. అంటే నిర్దోషియైన భార్యపై కనుక ఏ భర్తైనా అలాంటి ఆరోపణ చేసి ఆమెను ఆ పరీక్షకు తీసుకెళ్ళుంటే అక్కడ ఆ భర్త దోషి ఔతాడు. కాబట్టి ఎవరుబడితే వారు కచ్చితమైన అనుమానం లేకుండా ఆ పరీక్షకు సిద్ధపడరు. భార్యపై కచ్చితమైన అనుమానం ఉన్నవారు మాత్రమే దానికి సిద్ధపడతారు, తనను పోషించి సంరక్షిస్తున్న భర్త విషయంలో త్రోవతప్పి వ్యభిచరించిన భార్య శిక్షించబడవలసిందే కదా!

గమనించండి; ఈ పరీక్ష ప్రత్యక్షగుడారం, ఆయన మహిమ నిలిచిన మందసం ఉన్నంతవరకే కొనసాగింది. మందసం, పరిశుద్ధ స్థలం ఇశ్రాయేలీయుల మధ్యనుండి అవి తీసివెయ్యబడగానే దేవుని అద్భుతం కారణంగా నిజనిజాలు రుజువయ్యే ఈ పరీక్ష కూడా రూపుమాసిపోయుంది. 

ఈ శీలపరీక్ష విషయంలో మరో ఆరోపణకు సమాధానం కోసం ఈ వ్యాసం చదవండి.

స్త్రీకి శీలపరీక్ష, బైబిల్ దేవుని‌ వివక్షేనా?