- పరిచయం
- చారిత్రక నేపథ్యం
- తేదీ గందరగోళం
- ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు మరణించాడు?
- అయితే పస్కా పండుగ జరుపుకోవడం వాక్యానుసారమే కదా!
- ఆచారాల విశ్లేషణ
- సాధారణ సాకులు మరియు సత్యాధారిత సమాధానాలు
- ముగింపు
1. పరిచయం
ప్రతి సంవత్సరం వసంతకాలం రాగానే క్రైస్తవ లోకంలో ఒక వింతైన మార్పు కనిపిస్తుంది. చికెన్ ముక్క స్థానంలో పప్పు చారు, విందుల స్థానంలో విచారకరమైన ముఖాలు ప్రత్యక్షమవుతాయి. క్యాలెండర్ లో కొన్ని తేదీలు ఎరుపు రంగులో దర్శనమిస్తాయి. ఆ రోజుల్లోనే దేవుడు మన భక్తిని తూకం వేస్తాడని, శుభ శుక్రవారం రోజున గడియారంలో ముల్లు మూడు గంటలు కొట్టగానే మన ఆత్మీయత శిఖరాగ్రానికి చేరుతుందని మనం భ్రమపడుతుంటాం. అయితే, ఈ 'సీజనల్ పరిశుద్ధత' వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? అది దేవుడు ఆజ్ఞాపించిన ఆరాధనా లేక మనకు మనమే సృష్టించుకున్న ఒక మతపరమైన నాటకమా?
అపోస్తలులకే తెలియని ఈ పండుగ ఆచారాలు, కొన్ని మనుషుల చేత కల్పించబడి, మరికొన్ని ఇతర సంస్కృతుల నుండి 'క్రైస్తవీకరించబడి' మన చర్చిల్లోకి ఎలా చొరబడ్డాయి? అబద్ధ దేవుళ్ళ కోసం పుట్టిన ఆచారాలకు క్రైస్తవ రంగు పులిమినంత మాత్రాన అవి దేవునికి ఆమోదయోగ్యమవుతాయా లేక అవి కేవలం మన మనస్సాక్షిని శాంతింపజేసుకోవడానికి మనం వేసుకున్న 'ఆధ్యాత్మిక ముసుగులా'? ఈ వ్యాసం మీ ముందుకు తెస్తున్న చేదు నిజం ఏమిటంటే, మనం అత్యంత భక్తితో ఆచరిస్తున్న అనేక పద్ధతులు బైబిల్ ఎరుగని సరికొత్త ఆవిష్కరణలు, పైగా అన్యమత సంస్కృతుల కలయిక మాత్రమే.
ఈ విశ్లేషణ కేవలం మతపరమైన ఆడంబరాలను ప్రేమించేవారి కోసం కాదు; దేవుని వాక్యం పట్ల నిజాయితీగా ఉండేవారి కోసం. గుడ్ ఫ్రైడే మధ్యాహ్నం మూడు గంటల ఉపవాసం నుండి, ఈస్టర్ గుడ్ల వరకు ప్రతి ఆచారాన్ని లేఖనాల వెలుగులో మనం పరిశీలించబోతున్నాం. మీ ‘ఆత్మీయ గడియారాన్ని, క్యాలెండర్'ని ఒకసారి పక్కన పెట్టి, ఈ లోతైన అధ్యయనంపై మనసు పెడితే, మనం చేస్తున్నది ఆరాధనా లేక వాక్యాన్ని అతిక్రమిస్తూ చూపుతున్న 'అవిధేయతా' అనే పచ్చి నిజం మీకు అర్థమవుతుంది. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే సత్యం కొన్నిసార్లు మీ 'పరిశుద్ధ వారాల' ప్రశాంతతను దెబ్బతీయవచ్చు!
2. చారిత్రక నేపథ్యం
నిర్దిష్టమైన సాకుల గురించి మాట్లాడే ముందు, ఈ "పండుగ దినాల" చారిత్రక మూలాలను మనం అర్థం చేసుకోవాలి. రోమన్ల పండుగైన ‘సోల్ ఇన్విక్టస్’ (Sol Invictus) స్థానంలో డిసెంబర్ 25, ఒక "క్రైస్తవ" పండుగగా స్థాపించబడింది. అలాగే బైబిల్లోని యేసుక్రీస్తు మరణపునరుత్థానాలను ఆధారం చేసుకొని, యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటున్నాము అని చెప్పుకుంటూ, అనేక బైబిలేతర సాంప్రదాయాలనూ క్రైస్తవీకరించిన అన్యమతాచారాలనూ దానికి అంటగట్టి, ఒక సరికొత్త క్రైస్తవ పండుగగా దానిని స్థాపించారు. ఇలా చేయడాన్ని ‘అన్యమతాచారాల కలయిక’ (Syncretism) అని అంటారు.
"ఈస్టర్" (Easter) యొక్క మూలాలు:
రెండవ శతాబ్దం నుండి ఈ పండుగను జరుపుకుంటున్నవారంతా మేము పస్కా పండుగను జరుపుకుంటున్నాము అని చెప్పుకొచ్చారు. అయితే క్రైస్తవులు పస్కా పండుగను ఆచరించాలని మన ప్రభువు గానీ, అపొస్తలులు గానీ సూచనప్రాయంగానైనా ఎక్కడా సెలవివ్వలేదు, అపొస్తలులు ప్రతి సంవత్సరం దానిని ఆచరించిన దాఖలాలు అసలే లేవు. ఈ పండుగను ఆచరించేవారు ప్రారంభంలో యూదులు పస్కా పండుగ ఆచరించే రోజే జరుపుకునేవారట (ఆదివారంతో నిమిత్తం లేకుండా). ఆ తరువాత యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ఆధారం చేసుకొని ఈ పండుగను అదివారానికి మార్చారు. ఆ తరువాతి కాలంలో రోమన్ కాథలిక్కులు మరియు ఇతర క్రైస్తవ మతనాయకులు, ఎన్నెన్నో బైబిలేతర ఆచారాలను పుట్టించి, మరెన్నో అన్యమత ఆచారాలకు క్రైస్తవ రంగు పులిమి, వాటిని ఈ పండుగతో జత చేసి, ఈ మానవ కల్పిత క్రైస్తవ పస్కా పండుగను ఎప్పటికప్పుడు విభిన్న ప్రాంతాల్లో విభిన్న ఆచారాలతో జరుపుకునే ఒక వినూత్న పండుగగా ఆవిష్కరిస్తూ, నేడు మనం చూస్తున్న రూపంలోకి తీసుకొచ్చారు.
"ఈస్టర్" అనే పదం గ్రీకు లేదా హెబ్రీ లేఖనాలలో ఎక్కడా కనిపించదు. ఇదొక ఇంగ్లీషు పదం. దీనికి సమాంతర పదము జర్మన్ భాషలో మాత్రమే ఉంది - ‘ఒస్టర్న్’ (Ostern). 8వ శతాబ్దపు సన్యాసి బీడ్ (Bede), ‘డె టెంపోరం రాటియోనె’ (De Temporum Ratione) అనే పుస్తకంలో దీని గురించి ప్రస్తావించాడు. క్రైస్తవ మతము జర్మన్ల ప్రాంతాలకు విస్తరించిన తరువాత "ఈయోస్ట్రే" (Eostre) అనే జర్మన్లు ఆరాధించే ఒక సంతాన దేవత పేరు లేదా ‘ఈస్టర్ మోనాత్’ (Eosturmonath) అనే వసంతఋతువు పేరును బట్టి ఈ క్రైస్తవ పండుగకు ‘ఈస్టర్’ అనే పేరు వచ్చిందని బీడ్ తన పుస్తకంలో రాశాడు. బీడ్ గారు చెప్పిన వాదనకు వేరే చారిత్రాత్మక ఆధారాలు లేని కారణంగా పండితులు దీనిని ఒక బలహీనమైన వాదనగా పరిగణిస్తారు. కానీ ఈ పండుగకు ఈస్టర్ అనే పేరు ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు ఆధారసహిత సమాధానం ఏదీ పండితులు ఇప్పటివరకు కనుక్కోలేకపోయారు.
ఈస్టర్' (Easter) అనే పదం 'ఈస్ట్' (East - తూర్పు) అనే పదంతో సంబంధం కలిగి ఉందనీ ఇది సహజంగానే సూర్యోదయాన్ని, కొత్త దినాన్ని మరియు నూతన ఆరంభాలను సూచిస్తుందనీ అందుకే పునరుత్థాన పండుగకు ఈస్టర్ అనే పేరు పెట్టారు అనీ కొందరు అభిప్రాయపడుతుంటారు. మరి కొందరేమో యేసుక్రీస్తు ప్రభువు వారు పెందలకడనే సూర్యోదయ సమయంలో పునరుత్థానం చెందాడు కాబట్టి ఈస్టర్ అని పేరు పెట్టారని చెబుతారు.
అయితే ఈ పండుగకు ఈస్టర్ అని పేరు పెట్టడం వెనకున్న ఉద్దేశం ఇదే అని చెప్పడానికి ఎటువంటి లేఖనాధారాలు గానీ, చారిత్రక ఆధారాలు గానీ లేవు. "తూర్పు అంటే సూర్యోదయం, సూర్యోదయం అంటే కొత్త ఆరంభం, కాబట్టి ఇది పునరుత్థానానికి సాదృశ్యం" అని చెప్పడం కేవలం మనస్సాక్షిని సమాధానపరచుకోవడానికి (soothe the conscience) మరియు ఈ లేఖనేతర ఆచారాన్ని సమర్థించుకోవడానికి చెప్పుకునే ఒక సాకు మాత్రమే.
గుడ్ ఫ్రైడే (Good Friday) యొక్క మూలాలు:
క్రీస్తు యొక్క సిలువ మరణం చారిత్రాత్మకంగా మరియు దైవశాస్త్రపరంగా వాస్తవమే అయినప్పటికీ, "గుడ్ ఫ్రైడే"ని విధిగా ఆచరించాల్సిన వార్షిక సంతాప దినంగా ఏర్పాటు చేయడం అనేది తరువాత కాలంలో జరిగిన పరిణామం. ప్రారంభ శతాబ్దాలలో సంఘం యొక్క దృష్టి అంతా ప్రతి ఆదివారం ఆచరించే "ప్రభువు దినం" పైనే ఉండేది. తరువాతి కాలంలో గుడ్ ఫ్రైడే మాత్రమే కాకుండా క్రమక్రమంగా "పరిశుద్ధ వారాన్ని" (Holy week) జరుపుకోవడం కూడా మొదలుపెట్టారు. చివరికి కొన్ని శతాబ్దాలు గడిచేటప్పటికి అపొస్తలులు ఎన్నడూ ఎరుగని లేదా ఆజ్ఞాపించని ఒక కొత్త పండుగగా గుడ్ ఫ్రైడేను రూపొందించారు.
3. తేదీ గందరగోళం
యూదుల పస్కా పండుగ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించాడు. యూదులు పస్కా పండుగను హిబ్రూ నీసాను నెల 14వ రోజున ఆచరిస్తారు. కాబట్టి పస్కా పండుగ ఎప్పుడూ వసంతకాలంలోనే వస్తుంది. క్రీ. శ. 2, 3 శతాబ్దాలలో ఈ పండుగను ఆచరించేవారు యూదుల పస్కా పండుగ రోజునే జరుపుకునేవారట (ఆదివారంతో నిమిత్తం లేకుండా). లేదు, లేదు, క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ఈ పండుగను ఆదివారమే ఆచరించాలని పట్టుబట్టిన మరో గుంపు బయల్దేరడంతో ఈ విషయంలో ఆ రెండు వర్గాల వారి మధ్య విబేధం పుట్టింది.
ఆసియా మైనర్ లో ఉన్న సంఘాలవారు యూదుల పస్కా పండుగ దినానే యేసుక్రీస్తు పునరుత్థాన పండుగ జరుపుకోవాలని వాదించారు, నీసాను మాసం 14న వచ్చే పస్కా పండుగ రోజును ప్రతిపాదిస్తున్నారు కాబట్టి లాటిన్ భాషలో పదనాల్గవ రోజు అనే అర్థం వచ్చే విధంగా ఈ గుంపువారిని క్వార్టాడెసిమెన్స్ (Quartadecimens) అని పిలిచారు. వీరు పునరుత్థాన పండుగను ఖచ్చితంగా పస్కా పండుగ రోజునే జరుపుకుంటారు. అది వారంలో ఏ రోజు వచ్చిందో అస్సలు పట్టించుకోరు. వీరికి వ్యతిరేకంగా పునరుత్థాన పండుగను పస్కా పండుగ తరువాత వచ్చే ఆదివారమే జరుపుకోవాలని పటుబట్టినవారు రెండవ గుంపు.
ఆ విభేధాలు, చర్చలు చాలా శతాబ్దాలు కొనసాగాయి. అవి ఎంత తీవ్రంగా ఉండేవి అంటే క్రీ.శ. 195లో పోపు విక్టర్ I, నీసాను మాసము 14న పునరుత్థాన పండుగను ఆచరించే సంఘాలను బహిష్కరించాలని ప్రయత్నించాడు. ఎఫెసుకు చెందిన పాలిక్రేట్స్ దీనిని తీవ్రంగా ప్రతిఘటించాడు. అలా ఈ వివాదం నాలుగవ శతాబ్దం వరకు కొనసాగి క్రీ.శ. 325లో జరిగిన మొదటి నైసియ కౌన్సిల్ లో ఓ కొలిక్కి వచ్చింది. యూదులు పాటించే కాలెండర్ తో నిమిత్తం లేకుండా వసంత విషవత్తు (Spring Equinox) మార్చి 21 తరువాత వచ్చే మొదటి పౌర్ణమి తరువాతి ఆదివారం రోజున ఈస్టర్ పండుగను ఆచరించాలని తీర్మానించడం జరిగింది.
వసంత విషవత్తు (Spring Equinox or Vernal Equinox): సంవత్సరానికి రెండు విషవత్తు దినాలు ఉంటాయి. విషవత్తు అంటే పగలు పన్నెండు గంటలు, రాత్రి పన్నెండు గంటలు సరిసమానంగా ఉంటాయి. వసంత కాల ప్రారంభంలో వచ్చే విషవత్తు సాధారణంగా మార్చి 20 లేదా 21 తేదీల్లో ఉంటుంది. కానీ ఈస్టర్ తేదీని లెక్కించడం కోసం వసంత విషవత్తు తెదీనీ మార్చి 21కి స్థిరపరిచారు. ఒకవేళ మార్చి 21వ తారీఖు పౌర్ణమి వచ్చి, మరుసటి రోజు ఆదివారం వస్తే, ఆ రోజే ఈస్టర్ రోజుగా నిర్ధారిస్తారు. కానీ ఒకవేళ మార్చి 21కి ముందు రోజే పౌర్ణమి వస్తే, అప్పుడు మళ్ళీ పౌర్ణమి దాకా ఆగాలి. అంటే ఏప్రిల్ 18 వరకు ఆగాలి. ఒకవేళ ఆ రోజే ఆదివారం అయితే, ఆ రోజే ఈస్టర్ రోజుగా నిర్ధారిస్తారు. ఒకవేళ ముందు రోజు ఆదివారం అయితే, మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఆగాలి, అంటే ఏప్రిల్ 25న ఈస్టర్ గా నిర్ధారిస్తారు. కాబట్టి మార్చి 21 నుండి ఎంత దూరంగా ఈస్టర్ ఉండే అవకాశం ఉంటుందో లెక్కిస్తే ఏప్రిల్ 25 అని తెలుస్తోంది. కాబట్టి ఈస్టర్ పండుగ ఎప్పుడు మార్చి 22 నుండి ఏప్రిల్ 25 మధ్యలోనే వస్తుంది.
అయితే పౌర్ణమి ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడం కోసం చాంద్రమాన కాలెండర్ ను ఉపయోగిస్తారు. ఆ కాలెండర్ ప్రకారం నెలకు 29.5 రోజులు ఉంటాయి.
పౌర్ణమి: పౌర్ణమి ఎప్పుడో కనుక్కోవడం కోసం ఆకాశంలో చంద్రుడి గమనాన్ని పరిశీలించే అవసరం లేకుండా మెటోనిక్ చట్రంపై (Metonic cycle) ఆధారపడతారు. 19 సంవత్సరాల చాంద్రమాన నమూనా ఇది. (మెటోనిక్ చట్రం ప్రకారం నిర్ధారించే పౌర్ణమి, నిజంగా పౌర్ణమి రోజు కాకపోవచ్చు కానీ ఈస్టర్ తేదీని లెక్కించడం కోసం ఒక స్థిరమైన కాలెండర్ కావాలి కాబట్టి ఈ కాలెండర్ ని వాడాలని నిర్ణయించారు).
ఉదాహరణకు, 2026వ సంవత్సరం ఈస్టర్ తేదీని ఎలా నిర్ధారించారో పరిశీలిద్దాము.
స్టెప్ 1 - వసంత విషవత్తు - మార్చి 21
స్టెప్ 2 - 2026 ÷ 19 = 12 + 1 = 13 (దీన్ని గోల్డెన్ నెంబర్ అంటారు. గోల్డెన్ నెంబర్ కనుక్కునే ఫార్ములా: (సంవత్సరం ÷ 19) + 1)
మెటోనిక్ సైకిల్ అనేది 19 సంవత్సరాల సైకిల్. ప్రతి సంవత్సరానికి ఒక గోల్డెన్ నెంబర్, ప్రతి గోల్డెన్ నెంబర్ కి ఒక పౌర్ణమి తేదీ ఉంటుంది. అంటే మొత్తం 19 గోల్డెన్ నంబర్స్, 19 పౌర్ణమి తేదీలు ఉంటాయి.
2026 సంవత్సరానికి గోల్డెన్ నెంబర్ 13, ఆ నెంబర్ యొక్క పౌర్ణమి తేదీ ఏప్రిల్ 4, శనివారం. (వాస్తవానికి పౌర్ణమి ఏప్రిల్ 3, అందుకే మెటోనిక్ క్యాలెండర్ ప్రకారం నిర్ధారించే పౌర్ణమిని సంఘపరమైన పౌర్ణమి Ecclesiastical New మూన్ అని అంటారు),
స్టెప్ 3: పౌర్ణమి తరువాతి ఆదివారం. ఏప్రిల్ 4, శనివారం కాబట్టి ఏప్రిల్ 5, ఆదివారమే ఈస్టర్.
ఈ పద్ధతి ప్రకారం లెక్కిస్తారు కాబట్టే ప్రతి సంవత్సరం శుభ శుక్రవారం, శుక్రవారం రోజున, ఈస్టర్ ఆదివారమున వస్తుంటాయి కానీ తేదీలు మారుతూ ఉంటాయి.
4. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు మరణించాడు?
యేసుక్రీస్తు ప్రభువువారు ఖచ్చితంగా ఏ తేదీన మరణించాడనే విషయంలో పండితుల మధ్య పూర్తి ఏకాభిప్రాయం లేదు. చారిత్రక పరిశోధనలు, యూదుల పస్కా కాలెండర్ లెక్కలు, ఖగోళ గణనలు మొదలైన వాటి ఆధారంగా కొందరు క్రీ.శ. 30 ఏప్రిల్ 7 తేదీని సూచిస్తే, మరికొందరు క్రీ.శ. 32 లేదా క్రీ.శ. 33 ఏప్రిల్ 3 తేదీలను ప్రతిపాదిస్తున్నారు. ఈ భేదాభిప్రాయాలు ఉన్నందున, మనము ఒక ఖచ్చితమైన ఆధునిక క్యాలెండర్ తేదీని నిశ్చయంగా నిర్ణయించలేము. అయితే లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేసేది ఏమిటంటే, ప్రభువు పస్కా పండుగ సమయములో సిలువపై మరణించాడని. కాబట్టి బైబిల్ మనకు ఆయన మరణం యొక్క తారీఖు కంటే, దాని రక్షణార్థక ప్రాముఖ్యతను ప్రధానంగా చాటుతోంది; అందువల్ల దానిని ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట దినంగా ఆచరించమని ఎక్కడా ఆజ్ఞాపించలేదు. అలా కాకుండా ఒకవేళ ఆ దినాన్ని ఒక వార్షిక పండుగగా సంఘం ఆచరించాలి అనేది దేవుని చిత్తం అయ్యుంటే, అటువంటి ఆలోచన దేవుని మనసులో ఉండుంటే, ఈ రోజున తేదీ విషయంలో ఇన్ని చర్చలకు తావు లేకుండా దేవుడే స్పష్టంగా తన లేఖనాలలో ఆ సంగతులు రాయించేవాడు. పస్కా పండుగ ఎప్పుడు ఆచరించాలో దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేశాడో పరిశీలించండి.
నిర్గమ 12
“3 మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమినాడు (గొర్రెపిల్లను తీసుకోవలసిన నిర్దిష్టమైన రోజు) వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. ........... 7 ఈ నెల పదునాలుగవ దినమువరకు (నిర్దిష్టమైన నెల & రోజు) మీరు దాని నుంచుకొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు (నిర్దిష్టమైన సమయము) దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి
8-11 వచనాలలో నిర్దిష్టమైన విధానం తెలియజేయబడింది.
దేవుడే ఒక వార్షిక పండుగను నియమిస్తే దానిని ఎందుకు ఎప్పుడు ఎలా ఆచరించాలో ఇంత స్పష్టంగా తెలియజేస్తాడు. దీనిని బట్టి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ లను వార్షిక పండుగలుగా సంఘం ఆచరించాలి అనే ఆలోచన దేవుని మనసులో ఎన్నడూ లేదు అని స్పష్టం అవుతోంది. లేఖనాలలో అలాంటి ఆజ్ఞ లేదా సూచన ఎక్కడా కనిపించదు”.
5. అయితే పస్కా పండుగ జరుపుకోవడం వాక్యానుసారమే కదా!
కొలస్సీ 2:16-17 - “కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది.”
ఈ వచనంలో ప్రస్తావించబడిన అన్నపానముల నియమ నిబంధనలు గానీ పండుగలు గానీ బలి అర్పణలు గానీ విశ్రాంతి దినాచారము గానీ పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో భాగంగా యూదులకు నియమించబడినవి. పస్కా పండుగ కూడా ఒకానొక యూదుల పండుగే. వాటిని ఉద్దేశించే పౌలు ‘ఛాయలు’ అంటున్నాడు. ఆ పాత నిబంధన ఛాయలు (shadows) కొత్త నిబంధన యొక్క వెలుగులో అనగా క్రీస్తులో సంపూర్ణంగా నెరవేరిపోయాయి. పస్కా పండుగ అనేది కొత్త నిబంధన సంఘం ప్రతి సంవత్సరం ఆచరించాల్సిన పండుగ కాదు; దాని అసలు ఉద్దేశం మన నిజమైన పస్కా గొర్రెపిల్ల అయిన క్రీస్తులో సంపూర్ణంగా, అంతిమంగా నెరవేరింది. నిజ స్వరూపం (substance) వచ్చినప్పుడు, ఆ ఛాయలు గతించిపోయాయి. ఆయన ముగించిన కార్యానికి కేవలం ముంగుర్తులుగా (pointers) ఉన్న వార్షిక పండుగలను, అమావాస్యలను లేదా "ప్రత్యేక దినాలను" ఆచరించాల్సిన ఏ బైబిల్ ఆజ్ఞ ఇప్పుడు మనకు వర్తించదు. "గుడ్ ఫ్రైడే" లేదా "ఈస్టర్" వంటి కొత్త పేర్లతో వాటిని తిరిగి ప్రతిష్టించడం అంటే, క్రీస్తు సాధించిన నెరవేర్పు ఏదో అసంపూర్ణంగా ఉన్నట్లు భావించి, మనల్ని మనం మళ్ళీ పాత నిబంధన ఆచార పద్ధతుల్లోకి నెట్టేసుకోవడమే అవుతుంది.
6. ఆచారాల విశ్లేషణ
కొన్ని ఆచారాలు మానవ కల్పితమైనవి అయితే, మరికొన్ని క్రైస్తవీకరించబడిన అన్యమత ఆచారాలు.
మానవ కల్పిత ఆచారాలకు కొన్ని ఉదాహరణలు చూద్దాము.
1)గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ రోజులను ప్రత్యేకమైన దినాలుగా పరిగణిస్తూ, ఆ రోజులలో ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహిస్తారు.
-గలతీయులకు 4:10-11 వెలుగులో ఈ ఆచారాన్ని పరిశీలిద్దాము.
అపోస్తలుడైన పౌలు గలతీయులకు పత్రిక రాస్తూ ఎంతగా ఆవేదన చెందాడో చూడండి! ఆయన గలతీ విశ్వాసులను చూసి, "మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను” (గలతీ 4:10-11) అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
పౌలుగారు తన కష్టం వ్యర్థమైపోతుందేమో అని భయపడితే, మనవాళ్ళు మాత్రం "గుడ్ ఫ్రైడే", "ఈస్టర్" అంటూ క్యాలెండర్ మీద డేట్లు మార్క్ చేసుకొని ఆయన భయాన్ని నిజం చేయడం కోసం కంకణం కట్టుకున్నారు.
స్వయంగా దేవుడు ఆజ్ఞాపించిన పాత నిబంధన పండుగలే 'ఛాయలు' అనీ అవి క్రీస్తులో నెరవేరిపోయాయనీ పౌలు నొక్కి చెప్తున్నాడు. దేవుడు నియమించిన పండుగలే ఇప్పుడు మనకు సంబంధం లేని ఆచారాలైతే, మరి బైబిల్లో ఎక్కడా లేని ఈ "మానవ కల్పిత" పండుగ దినాలను సంఘంలోకి ప్రవేశపెట్టే 'లైసెన్స్' వీరికి ఎవరిచ్చారు?
ఆ కాలంలో ధర్మశాస్త్ర ఆచారాలను యూదేతర క్రైస్తవులపై రుద్దాలని చూసిన దుర్భోధకులను పౌలు ఖండించాడు. కానీ నేడు, ఎటువంటి వాక్యాధారమూ లేని గుడ్ ఫ్రైడే సర్వీసులు, ఈస్టర్ ప్రత్యేక కూటాలు నిర్వహించకపోతే ఏదో పాపం జరిగిపోతుందన్నట్లు ప్రజలను భయపెట్టడం చూస్తుంటే, ఆ పాత దుర్భోధకుల కంటే మనవాళ్లు ఒక అడుగు ముందే ఉన్నట్లు కనిపిస్తోంది!
ఏ విషయాలలో దేవుని వాక్యం మౌనంగా ఉందో ఆ విషయాలలో మనం కూడా మౌనంగా ఉండాలి. కానీ, వాక్యం చెప్పని పండుగలను 'ప్రత్యేక దినాలు'గా సంఘంపై రుద్దుతూ, పౌలు హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న ఈ "ఆచార ప్రియులు" నిజానికి ఆరాధన చేయడం లేదు, దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ అవిధేయత చూపుతున్నారు. ఇదంతా చూస్తుంటే, దేవుని కంటే తమకే ఎక్కువ పండుగలు కనిపెట్టే జ్ఞానం ఉందని వారు గర్విస్తున్నారేమో అనిపిస్తోంది!
2)గుడ్ ఫ్రైడే రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు సర్విస్ నిర్వహించడం & ఈస్టర్ రోజున పెందలకడ సూర్యోదయానికి ముందే సర్వీస్ కలిగియుండటం -మన వాళ్ల "ఆధునిక భక్తి" ఎలా తయారైందంటే, గడియారంలో ముల్లు ఎక్కడ ఉందో చూసి దాని ఆధారంగా మన ఆత్మీయతను కొలుచుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు సర్విస్ నిర్వహించడం, ఈస్టర్ రోజున పెందలకడ సూర్యోదయానికి ముందే కళ్ళు నలుపుకుంటూ సన్ రైస్ సర్వీస్ కి హాజరు అవ్వడం, ఇవే కదా మన అసలైన ఆత్మీయకు కొలమానం! బైబిల్ ఈ సంఘటనలు జరిగిన సమయాన్ని కేవలం వర్ణనాత్మకంగా (descriptive) చెప్పిందన్న కనీస జ్ఞానం లేకుండా, దాన్ని ఒక నిర్దేశాత్మకమైన (prescriptive) ఆజ్ఞగా మార్చేయడంలో మనకు మనమే సాటి.
సమయం మూడు గంటలు ఎప్పుడు అవుతుందా అని గడియారం వంక చూస్తూ చేసే ఈ 'టైమ్-బౌండ్' భక్తిని చూసి దేవుడు మురిసిపోతాడని అనుకోవడం మన అమాయకత్వమే!
3) పరిశుద్ధ వారాన్ని ఆచరించడం
-సంవత్సరమంతా లోకానుసారంగా బతికినా, ఈ ఒక్క వారం మాత్రం "పరిశుద్ధుడి" ముసుగు వేసుకుంటే దేవుడు మనల్ని క్షమించేస్తాడు అనేది ఒక వింత నమ్మకం. ఈ వారం రోజులు ముఖం గంభీరంగా పెట్టి, లోకానుసారమైన కార్యకలాపాలను పక్కన పెట్టి చేసే హడావిడి చూస్తే, దేవుడు కేవలం క్యాలెండర్ లోని డేట్లను బట్టి మన పరిశుద్ధతను కొలుస్తాడని మనం అనుకుంటున్నట్లుంది. 51 వారాలు లోకంతో స్నేహం చేసి, ఆ ఒక్క వారం "పరిశుద్ధడు" అని ముసుగు వేసుకోవడం అంటే, దేవుణ్ణి మనం మోసం చేయగలమని భ్రమపడటమే.
4) మట్టల ఆదివారం రోజున యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించినప్పుడు జరిగిన సంగతులను ప్రదర్శిస్తూ ఊరంతా తిరగడం
-పాస్టర్ గారికి గానీ, మరో వ్యక్తికి గానీ యేసుక్రీస్తు వేషం వేసి గాడిదపై కూర్చోబెట్టి, రోడ్ల మీద ఈత మట్టలు ఊపుతూ, ఊరంత తిరుగుతూ చేసే ప్రదర్శనలు చూస్తుంటే, మనం యెరూషలేము వీధుల్లో ఉన్నామా లేక ఏదైనా సినిమా షూటింగ్ లో ఉన్నామా అనిపిస్తుంది. బైబిలులో ఆనాడు జరిగిన సంఘటన కేవలం వర్ణనాత్మకమైనది (descriptive), కానీ మనం మాత్రం దాన్ని ప్రతి సంవత్సరం చేయాల్సిన "స్టేజ్ షో"గా మార్చేశాం.
దేవుడు తాను ఆజ్ఞాపించినవాటన్నిటినీ గైకొనమన్నాడు తప్ప (మత్తయి 28:20), ఆయన చేసిన ప్రతి పనినీ అనుకరించమని చెప్పలేదు. ఇలాంటి ఆచారాలు సంఘంపై రుద్దడం అనేది లేఖనానుసారం కాదు. గాడిదపై ఊరేగించినంత మాత్రాన వినయం రాదు, మట్టలు ఊపినంత మాత్రాన జయం కలగదు. హృదయంలో క్రీస్తుకు చోటు ఇవ్వడం చేతగాక, వీధుల్లో ఎవరినో గాడిదల మీద ఊరేగిస్తూ భక్తి చేస్తున్నాము అని భ్రమపడుతున్నారు.
5) గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మధ్యలో వచ్చే శనివారం రోజున Run for Jesus అనే కార్యక్రమం చేస్తున్నారు.
-ఇటీవల పుట్టుకొచ్చిన ఈ ఆచారం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. చెమటలు చిందుస్తూ రోడ్ల మీద పరిగెత్తితే యేసుక్రీస్తు సంతోషిస్తాడని ఎవరు చెప్పారు? సువార్తను ప్రకటించడానికి ఆదిమ సంఘం ఇటువంటి కార్యక్రమాల సహాయం తీసుకున్న దాఖలాలే లేవు.
సువార్త చెప్పడానికి నోరు విప్పడం కష్టమై, రోడ్ల మీద పరిగెత్తడం సులభమని ఇలాంటి "స్పిరిచువల్ కార్డియో" ప్రోగ్రాములు పెట్టుకుంటున్నట్లున్నారు. ఇది ఆరాధన కాదు, ఆడంబరం మాత్రమే.
6) గుడ్ ఫ్రైడే రోజు తెల్ల బట్టలు వేసుకోవడం & ఈస్టర్ రోజున కొత్త బట్టలు ధరించడం
-బట్టల రంగును బట్టి దేవుడు మనల్ని గుర్తిస్తాడని మనం అనుకుంటున్నామా? లేక మన తెల్ల బట్టలు మన లోపలి నలుపును కప్పేస్తాయని మన భ్రమనా?
"భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పు పొందము" అని ఆహారం గురించి చెప్పినట్లే, బట్టల రంగును బట్టి కూడా మనం మెప్పు పొందలేము. ఇలాంటి ఆచారాలు మనుషులు కల్పించిన పద్ధతులే తప్ప, బైబిలు ఆజ్ఞలు కావు.
తెల్ల బట్టలు వేసుకుంటే సరిపోదు, హృదయం క్రీస్తు రక్తంతో కడగబడాలి.
- లెంట్ దినాలలో పాటించే ఆచారాలు
నేటి క్రైస్తవ లోకంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి పండుగలకు ఎంత ప్రాముఖ్యత ఉందో, వాటికి ముందు వచ్చే 'లెంట్' రోజులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ వార్షిక పండుగలు గానీ, వాటికి సంబంధించిన ఆచారాలు గానీ దేవుని వాక్యం ద్వారా ఆజ్ఞాపించబడలేదని ప్రాథమిక అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది.
7) నలభై రోజుల పాటు ఉపవాసం ఉండటం
-యేసుక్రీస్తు ప్రభువు నలభై రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు కాబట్టి మేము కూడా ఉపవాసం ఉంటాము అని చెప్పి 40 రోజులు పాటు 'డైటింగ్' చేసి గొప్ప భక్తి చేస్తున్నాము అనుకుంటారు. ప్రభువు ఒకే ఒక్కసారి చేసిన అద్భుత కార్యాన్ని ఒక ఆచారంగా మార్చేశారు. ఇలా చెయ్యడం క్రైస్తవులకు అలవాటే కదా!
యేసుక్రీస్తు ప్రభువు ఉపవసించడం అనేది ఒక ప్రత్యేక సందర్భంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో జరిగింది (మత్తయి 4:2). దాన్ని ప్రతి ఏటా ఒక మతపరమైన ఆచారంగా సంఘం అంతా చేయాలని ఆయన ఎక్కడా ఆజ్ఞాపించలేదు. అపోస్తలులు ఎక్కడా ఆజ్ఞాపించలేదు, ఎప్పుడూ ఆచరించలేదు. ఈ 40 రోజులు టీ, కాఫీలు మానేసి, 41వ రోజు నుండి మళ్ళీ యథావిధిగా కొనసాగడం ఆధ్యాత్మికత ఎలా అవుతుంది? ఇది కేవలం మనస్సాక్షిని శాంతింపజేసుకోవడం కోసం కనిపెట్టిన ఒక ఆచారం మాత్రమే.
8) కొన్ని రకాల ఆహారాలను (మాంసాహారాన్ని, కోడి గుడ్లను) నిషేధించడం
- లెంట్ రోజుల్లో మాంసాహారం లేదా గుడ్లు తినకూడదనే నియమం బైబిలు ఎన్నడూ ఎరుగని ఒక సరికొత్త ఆచారం.
అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు 8:8లో చాలా స్పష్టంగా ఇలా చెప్పాడు: "భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు’. కానీ మన 'లెంట్' భక్తుల తర్కం వేరేలా ఉంటుంది: 40 రోజుల పాటు ప్లేట్ లో చికెన్ ముక్క లేకుండా చూసుకుంటే, దేవుడు పరలోకంలో మన భక్తికి 'బోనస్ మార్కులు' వేస్తాడని వీరి నమ్మకం. అంటే, దేవునితో మన సంబంధం మన హృదయం మీద కాకుండా, మనం తినే కూర మీద ఆధారపడి ఉందా? మీరు మటన్ బిర్యానీ తిన్నా, పచ్చి గడ్డి తిన్నా దేవుని దృష్టిలో మీ ఆత్మీయ హోదా మారదు.
ఈ లెంట్ నియమాల విషయంలో 1 తిమోతి 4:1-5 ఇంకా ఘాటుగా స్పందిస్తోంది. కడవరి దినాల్లో కొందరు వచ్చి,"దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని" ఆజ్ఞాపిస్తారట. దీనిని పౌలు ఏమన్నాడో తెలుసా? "దెయ్యాల బోధ! దేవుడు కోడిని, మేకను, గుడ్డును మనం కృతజ్ఞతలు చెల్లించి తినడానికే సృష్టించాడు. కానీ లెంట్ నియమాలు ఏమంటాయంటే, "దేవుడు సృష్టించినదాన్ని దేవుని కోసమే తినడం మానేయండి" అని! ఇదొక వింత లాజిక్ మాత్రమే కాదు మెనూ కార్డ్ ఆధారంగా పుట్టించిన ఒక దయ్యాల బోధ.
నిజం చెప్పాలంటే, ఈ ఆహార నియమాలు కేవలం ఒక 'మతపరమైన ముసుగు' మాత్రమే. నాన్-వెజ్ మానేసి, దానికంటే రెట్టింపు ఖర్చు పెట్టి పన్నీర్ బటర్ మసాలా వంటి ఖరీదైన శాఖాహార విందులు చేస్తే దేవుడు సంతోషిస్తాడా? లేదా కడుపు నిండా ఇష్టమైనవి తింటూ, కేవలం 'మాంసం' అనే పేరున్న పదార్థాన్ని పక్కన పెడితే దేవుడు మురిసిపోతాడా?
దేవుడు ఏమి చేయవద్దని నిర్దిష్టంగా చెప్పాడో, దాన్నే ఆయనకు అర్పిస్తున్నట్లయితే, అది ఆరాధన కాదు; అది అవిధేయత. దేవుడు మీ హృదయంలోని 'కుళ్లు'ను తీసేయమంటే, మనం ప్లేట్ లోని 'కూర'ను తీసేసి, దానికి భక్తి అని పేరు పెట్టుకుంటున్నాము. మన సొంత ఆచారాలతో కాకుండా, ఆయన ఆజ్ఞాపించినవాటన్నిటిని గైకొనే శిష్యులుగా ఉండటమే శ్రేష్ఠము.
‘మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి–చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును’ (కొలొస్సయులకు 2:20-22).
9) పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం
-లెంట్ సీజన్ వచ్చిందంటే చాలు, పెళ్ళిళ్ళు ఆపేస్తారు. ఆ రోజుల్లో పెళ్ళి చేసుకుంటే దేవునికి కోపం వస్తుందని లేదా అది అపవిత్రమని కొందరి భయం. దేవుడే వివాహ వ్యవస్థను స్థాపించాడు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి ప్రమాణాలు చేసి స్త్రీపురుషులు తమ వివాహ జీవితాన్ని ప్రారంభిస్తారు. దేవుడే సాక్షిగా ఉండి, దేవుడే స్త్రీపురుషులను జతపరచడం ద్వారా జరిగే పెళ్ళి, ఈ 40 రోజుల్లో చేసుకుంటే మాత్రం 'శాపం'గా మారిపోతుందా?
అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 4:1-3 లో కడవరి దినములలో కొందరు దయ్యముల బోధపై లక్ష్యముంచుతారు అనీ ఆ బోధలను బోధించేవారు వివాహాన్ని నిషేధిస్తారనీ చాలా ఘాటుగా హెచ్చరించాడు. దేవుడు పవిత్రమని చెప్పిదాన్ని, మనం కొన్ని రోజులు అపవిత్రమని దూరం పెట్టడం అంటే, అది దేవుని జ్ఞానాన్నే వెక్కిరించడం కాదా?
క్యాలెండర్ చూసి పెళ్ళిళ్ళు ఆపే ఈ భక్తి చూస్తుంటే, దేవుడి కంటే ఎక్కువగా ఈ మతపరమైన ఆచారాలే వారిని నియంత్రిస్తున్నాయని అర్థమవుతోంది.
10) భార్యభర్తలు లైంగికంగా కలవకపోవడం
-లెంట్ రోజుల్లో భార్యాభర్తలు దూరంగా ఉండాలనే నియమాన్ని సంఘంపై రుద్దడం ఒక వింత ఆచారం. ఇది పూర్తిగా వాక్య విరుద్ధమైన బోధ. దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని, ఆత్మీయత పేరుతో విడగొట్టడం మనకే చెల్లింది.
1 కొరింథీయులకు 7:5 లో పౌలు స్పష్టంగా చెప్పాడు: "ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి." ఇది భార్యాభర్తలు వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన నిర్ణయమే తప్ప, లెంట్ పేరుతో సంఘమంతా పాటించాల్సిన ఆచారం కాదు. ఇది మనుషుల ఆజ్ఞలను అనుసరించడమే తప్ప మరేమీ కాదు.
ప్రార్థన కోసం కాకుండా, కేవలం ఒక ఆచారం కోసం దూరంగా ఉండటం అంటే సాతానుకు చోటు ఇవ్వడమేనని వాక్యం హెచ్చరిస్తోంది. కానీ మనం మాత్రం వాక్యం కంటే మాన్-మేడ్ రూల్స్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామేమో దేవుని భయం కలిగినవారు ఆలోచించుకోవాలి.
11) నలభై రోజులపాటు సిలువ గురించి ధ్యానించడం
-సంవత్సరమంతా సినిమాల గురించి, రాజకీయాల గురించి ధ్యానించి, ఈ 40 రోజులు మాత్రం సిలువ గురించి ధ్యానించేస్తే దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటారు. అంటే వారి భక్తి కూడా 'సీజనల్' అన్నమాట!
క్రైస్తవుడు అనుదినము తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి (లూకా 9:23). కేవలం లెంట్ లోనే ధ్యానించాలని బైబిలు ఎక్కడా ఆజ్ఞాపించలేదు. నిజానికి ప్రతి ఆదివారం నాడు మనం ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకోవాలి, కేవలం సంవత్సరానికి ఒక్కసారి కాదు.
40 రోజులు భక్తిగా ఉండి, తర్వాత 325 రోజులు సిలువను మర్చిపోయే ఈ 'లెంట్ స్పిరిచ్యువాలిటీ' దేవునికి ఆమోదయోగ్యం కాదు. ఇది కేవలం ఒక బాహ్య రూపమైన భక్తి మాత్రమే.
12) లెంట్ దినాల ప్రారంభ రోజును భస్మ బుధవారంగా ఆచరించడం,
-నొసటి మీద బూడిదతో సిలువ గుర్తు వేయించుకుంటే మనం చాలా వినయవంతులమని లోకానికి చాటుకోవడమే ఈ భస్మ బుధవారం యొక్క ముఖ్య ఉద్దేశంలా కనిపిస్తోంది. పాత నిబంధనలో వారు పశ్చాత్తాపంతో బూడిద వేసుకున్నారు కానీ, అది ఒక వార్షిక పండుగగా, అందరూ చూసేలా ఒక గుర్తుగా కాదు.
మన ప్రభువు మత్తయి 6:16-18లో ఉపవాసం ఉన్నప్పుడు మనుష్యులకు కనబడకూడదని, మొఖం కడుక్కోవాలని చెప్పాడు. కానీ మనం మాత్రం నొసటి మీద గుర్తు పెట్టుకుని మరి "నేను ఉపవాసం ఉన్నాను" అని ప్రకటిస్తున్నాం. ఇలాంటి ఈఆచారాలు మనుషులు కల్పించినవే తప్ప దేవుడు ఆజ్ఞాపించినవి కావు.
నొసటి మీద బూడిద ఉండి, హృదయంలో పశ్చాత్తాపం లేకపోతే అది కేవలం ముఖానికి పూసుకున్న మురికి మాత్రమే. దేవుడు హృదయాన్ని చూస్తాడు తప్ప, నొసటి మీదున్న బూడిదను కాదు.
భస్మ బుధవారం రోజున చేసే ఇతర ఆచార వ్యవహారాల గురించి ‘భస్మ బుధవారం మరియు శ్రమ దినాలు’ అనే వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది
ఈ ఆచారాలన్నీ పైకి ఎంతో బైబిల్ ఆధారితమైనవిగా కనిపించవచ్చు కానీ, ఇవేవీ చేయమనని మన ప్రభువు గానీ, అపొస్తలులు గానీ సంఘానికి ఆజ్ఞాపించలేదు.
క్రైస్తవీకరించబడిన అన్యమత ఆచారాలకు కొన్ని ఉదాహరణలు చూద్దాం:
1) ఈస్టర్ ఎగ్స్ (Easter eggs - గుడ్లు)
అన్య మత ఆచరాలలో గుడ్లను సంతానోత్పత్తికి, నూతన జీవానికి ప్రతీకలుగా వాడేవారు, వాటికి రంగులు వేయడం గురించి కొన్ని కథలు, వాటిని పంచడం గురించి కొన్ని కథలు, వాటిని దాచిపెట్టి కనిపెట్టమని ఆటలు ఆడుకోవడం గురించి కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి కొందరు బైబిల్ తో ఏ సంబంధం లేని ఈ ఆచారాన్ని వెనకేసుకు రావడంలో భాగంగా గుడ్డు పెంకు యేసుక్రీస్తు సమాధికి ప్రతీక అని, గుడ్డులోని జీవం యేసుక్రీస్తుకు ప్రతీక అని అసంబద్ధమైన సమర్థనలు చేస్తుంటారు. ‘వాక్యం ఏం చేబుతుందో మాకు సంబంధం లేదు, మా ఆచారాన్ని మేము కాపాడుకోవాలి’ అని తీర్మానించుకున్నవాళ్ళే ఇలాంటి ఆధారరహిత వాదనలకు పాల్పడతారు. అయితే సత్యం కంటే ప్రజలకు ఈ "సోది కబుర్లే" ఎక్కువ రుచిస్తున్నాయని అర్థమవుతోంది.
బైబిలు సందేశంతో ఏ విధంగానూ పొసగని ఈ ఆచారాన్ని వెనకేసుకు రావడం అంటే, వాక్యం కంటే తమ సంప్రదాయమే గొప్పదని ప్రకటించుకోవడమే. యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచాడని చెప్పడానికి మనకు వాక్యం సరిపోదు అన్నట్లు, ఈ "గుడ్డు పెంకు" సాదృశ్యాలు ఒకటి! రంగులు వేసిన గుడ్లను దాచిపెట్టి ఆడుకునే 'ఈస్టర్ ఎగ్ హంట్' ఆటల వల్ల పిల్లలకు బైబిలు సత్యం కంటే ఈ వింత ఆచారాలే ఎక్కువగా గుర్తుంటాయి. ఇది ఆరాధన కాదు, కేవలం క్రైస్తవీకరించబడిన ఒక అన్యాచారం మాత్రమే.
2) ఈస్టర్ బన్నీస్ (Easter bunnies- ఈస్టర్ కుందేళ్ల)
అన్యమతాల్లో సంతానోత్పత్తికి చిహ్నమైన కుందేళ్లను తెచ్చి, ఈస్టర్ పండుగకు "బ్రాండ్ అంబాసిడర్లు"గా మార్చేసారు. కుందేళ్లు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి తింటాం అనే వెర్రి సాకులు చెప్పడం మానేసి, ఇది క్రైస్తవీకరించబడిన ఒక అన్యమత సంస్కృతి అని ఒప్పుకుంటే మంచిది. కుందేళ్లకు బట్టలు తొడగడం, చాక్లెట్ బన్నీస్ తినడం చూస్తుంటే, దేవుని వాక్యం కంటే ఈ "బొమ్మల భక్తే" వారికి సరదాగా ఉన్నట్లుంది.
స్విట్జర్లాండ్‌లో కుకూ పక్షిని, జర్మనీ లో కుందేళ్లను (తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది) వాడుతున్నారంటేనే ఇది కొన్ని ప్రాంతాల్లో పుట్టుకొచ్చిన ఒక అనాచారం అని అర్థం కావడం లేదా?
అలాగే క్రిస్మస్ పండుగకు ముందు రాత్రి సాంటా క్లాజ్ బహుమతులు పంచుతాడనే కథల మాదిరిగానే, ఈ కుందేలు కూడా ఈస్టర్ ముందు రోజు రాత్రి పిల్లల ఇళ్లకు రంగురంగుల గుడ్లు, మిఠాయిలు మరియు కొన్నిసార్లు బొమ్మలతో నిండిన బుట్టలను తీసుకువస్తుందని చెబుతుంటారు. ఈ ఈస్టర్ బన్నీ ఆ బుట్టలను ఒక నిర్ణీత స్థలంలో ఉంచడం లేదా పిల్లలు ఉదయాన్నే నిద్రలేవగానే వాటిని వెతికి కనుక్కునేలా ఇంట్లో లేక తోటలో ఎక్కడో ఒకచోట దాచిపెడుతుంది. దీని నుండే 'ఈస్టర్ ఎగ్ హంట్' (Easter egg hunt) అనే వింత ఆచారం పుట్టుకొచ్చింది.
ఈ కథలు , ఆటల ద్వారా, పిల్లలకు క్రీస్తు పునరుత్థాన సత్యం కంటే ఈ కల్పిత గాథల మీదే నమ్మకం పెరిగుతుంది. అయితే, వీటన్నిటికీ బైబిల్‌తో ఎలాంటి సంబంధం లేదనేది సుస్పష్టం.”
3) ఈస్టర్ విజిల్ (Easter Vigil - ఈస్టర్ జాగరణ)
- దీనినే 'పాస్కల్ విజిల్' లేదా 'గ్రేట్ విజిల్ ఆఫ్ ఈస్టర్' అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా రోమన్ క్యాథలిక్, ఆంగ్లికన్, లూథరన్, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ మరియు ఓరియంటల్ ఆర్థోడాక్స్ సంఘాలలో ఆచరించే ఒక సంప్రదాయం. ఈ ఈస్టర్ విజిల్ అనేది 40 రోజుల పాటు ఆచరించే 'లెంట్' (Lent) కాలానికి ముగింపు ఆచారంగా ఉంటుంది. ఈ లెంట్ కాలంలో విశ్వాసులు తమను తాము ఉపేక్షించుకోవడం (self-denial) అభ్యసించడానికి, తమకున్న ఏదైనా అలవాటును లేదా ఇష్టమైన ఏదైనా వస్తువును (ఆహార వస్తువులు కూడా కావొచ్చు) విడిచిపెట్టడం ఒక గంభీరమైన ఆచారంగా కొనసాగుతూ వచ్చింది.”
అయితే యేసు ప్రభువు మత్తయి 15:9లో ఇలా గద్దించాడు: "....మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు…..". రాత్రంతా మేలుకొని ఉండటం వల్ల ఆత్మీయత పెరగదు, అది కేవలం శరీరం అలసిపోయేలా చేస్తుంది, అంతే. దేవుడు కోరుకున్నది హృదయ పరివర్తన తప్ప, గడియారం చూస్తూ చేసే ఈ జాగరణలు కాదు. వాక్యం చెప్పని ఈ ఆచారాన్ని సంఘంపై రుద్దే అధికారం ఎవరికీ లేదు.
4) ఈస్టర్ రోజున సిలువ ముందు దీపాలు వెలిగించడం
-హైందవ ఆచారాలను క్రైస్తవకరించడం మొదలు పెడితే ఎక్కడ ఆగాలో ఎవరు నిర్ణయిస్తారు? ఎటువంటి వాక్యాధారం లేని ఈ ఆచారాలకు ఎవరూ పరిమితులు విధించలేదు కాబట్టే కొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి అగర్బత్తులు వెలిగించి కొబ్బరి కాయలు కొడుతుంటే, ఇంకొందరు యేసుక్రీస్తు విగ్రహాలకు దండలు వేసి బొట్టు పెడుతున్నారు, మరికొందరు యేసు మాలలు వేసుకొని దీక్ష చేస్తున్నారు.
2 కొరింథీయులకు 6:14-16 ప్రకారం “ …… నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? …..”
దేవుడు ఆజ్ఞాపించని ఆరాధనను అర్పించడం అంటే అది లేవీయకాండము 10:1-2లోని "అన్యాగ్ని" (Strange Fire) అర్పించడమే అవుతుంది.
ఈస్టర్ రోజున సిలువ ముందు దీపాలు వెలిగించడం, యేసు మాలలు వేసుకుని దీక్షలు చేయడం వంటివి కేవలం ఇతర మతాలను అనుకరించడం తప్ప మరేమీ కాదు.
5)యేసుక్రీస్తు విగ్రహాలను లేదా సిలువను ఊరేగించడం
-రోడ్ల మీద విగ్రహాలను లేదా పెద్ద పెద్ద సిలువలను ఊరేగించడం చూస్తుంటే, క్రైస్తవ్యం కూడా ఇతర అన్యమత సంస్కృతులతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం క్రైస్తవీకరించబడిన మరొక అన్యాచారం. పాపానికి క్రైస్తవ రంగు పులిమినంత మాత్రాన అది పవిత్రం కాదు.
"పైన ఆకాశమందేగాని, క్రింద భూమియందేగాని.. దేని రూపమునైనను విగ్రహమునైనను చేసికొనకూడదు" అన్న పది ఆజ్ఞలలోని మొదటి ఆజ్ఞను మనం చాలా తేలిగ్గా మర్చిపోయాం. అబద్ధ దేవుళ్ళ కోసం ఉద్దేశించబడిన పద్ధతులను తీసుకుని క్రీస్తు కోసం వాడటం వాక్య విరుద్ధం. దేవుడు అలాంటి ఆచారాలను నిషేధించాడు (యిర్మీయా 10:2).
విగ్రహారాధనను వ్యతిరేకించే క్రైస్తవులే, ఇప్పుడు తమ సొంత విగ్రహాలను ఊరేగిస్తూ 'భక్తి' అని పేరు పెట్టుకోవడం ఒక పెద్ద జోక్. ఇది దేవుని ఆరాధనను కలుషితం చేయడం తప్ప మరేమీ కాదు.
దేవుడు ఎన్నడూ ఆమోదించని ఈ ఆచారాలకు “కొత్త అర్థం” ఇవ్వడం ద్వారా వాటిని పరిశుద్ధం చేయలేము. పాపానికి కొత్త పేరు పెట్టినంత మాత్రాన అది పరిశుద్ధం కాలేదు; అదే విధంగా, అన్యాచారాలకు క్రైస్తవ రంగు పులిమినంత మాత్రాన అవి దేవునికి ఆమోదయోగ్యమవ్వవు.
ఈ రెండు రకాల ఆచారాలు ఒకే మూల సమస్యను తెలియజేస్తున్నాయి: మనుషులు దేవుడు ఆజ్ఞాపించినదానికంటే ఎక్కువగా చేయాలని ప్రయత్నించడం. ఒకటి, బైబిల్ సత్యాలకు మానవ కల్పనలను జోడించడం. మరొకటి, అన్యమత ఆచారాలను క్రైస్తవీకరించడం. ఈ రెండూ చివరికి దేవుని ఆరాధనను కలుషితం చేస్తున్నాయి. అలా దేనినైనా ఆచారంగా విధించడాన్ని ప్రభువైన యేసుక్రీస్తు, భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం వంటి చిన్న విషయాలలో సైతం సమ్మతించలేదు (మత్తయి 15:1-6). అలాంటప్పుడు ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి పండుగలను ఒక పారంపర్యాచారంగా సంఘంపై బలవంతంగా రుద్దే హక్కు గానీ, అధికారం గానీ ఎవరికైనా ఉందని అనుకోవటం లేఖనానుసారం కాదు. కాబట్టి మనం అడగాల్సిన ప్రశ్న ఇదే: దేవుడు దీనిని ఆజ్ఞాపించాడా? ఆయన ఆజ్ఞాపించనిదాన్ని మనం ఆయనకు అర్పిస్తున్నట్లయితే, అది ఆరాధన కాదు, అది అవిధేయత.
ఈ వ్యాసం యొక్క ప్రధాన వాదన ఏమిటంటే: సంఘ ఆరాధనలో దేవుడు ఆజ్ఞాపించినవాటినే ఆచరించాలి; ఆయన ఆజ్ఞాపించనివి, అవి ఎంత మంచిగా కనిపించినా, ఆరాధనలో వాటికి స్థానం కల్పించకూడదు.
7. సాధారణ సాకులు మరియు సత్యాధారిత సమాధానాలు
1) "ఇది చాలా చిన్న విషయం కదా, ఎందుకు వాదించడం?"
చాలామంది గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగల గురించిన పరిశీలన ఏమాత్రం చర్చించదగిన విషయం కాదనీ, ఒక అల్పమైన విషయమనీ కొట్టిపారేస్తారు. ఈ పండుగలను ఆచరించడం అనేది నిజంగా "చిన్న" విషయమే అయితే, వాటిని ప్రశ్నించినప్పుడు యావత్ క్రైస్తవలోకం ఎందుకు అంత తీవ్రమైన గందరగోళానికి, భావోద్వేగానికి లోనవుతుంది? విషయం చిన్నదా పెద్దదా అనేది కాదు, దానిని ఆచరించే అధికారం ఎవరిచ్చారు అనేది అసలు ప్రశ్న. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వాక్యానుసారమైనవా కావా?
లేఖనాల ద్వారా పరీక్షించబడకుండా ఈ పండుగలను కాపాడుకోవడానికి “ఇది చాలా చిన్న విషయం" అనే సాకును ఒక కవచంగా వాడుతుంటారు. చిన్న విషయాల్లో ఎంత నమ్మకంగా ఉంటున్నాము అనేది పెద్ద విషయాలలో మనం ఎంత నమ్మకంగా ఉంటామో తెలియజేస్తుందని మన ప్రభువు మనకు బోధించాడు(లూకా 16:10). ఏదైనా విషయంలో బైబిల్ మౌనంగా ఉన్నప్పుడు, మనం కూడా మౌనంగా ఉండాలి. ఈ పండుగ విషయంలోనే వాక్యానికి నమ్మకంగా ఉండలేనివారు, "ప్రాథమిక" సిద్ధాంతాల విషయంలోనూ, మౌలిక బోధల విషయంలోనూ నమ్మకంగా ఉన్నామని ఎలా చెప్పుకోగలరు? సమస్తమును పరీక్షించి మేలైనదానినే చేపట్టాల్సిన (1 థెస్స 5:21) బైబిలుపరమైన బాధ్యత మనకు ఉందని గుర్తుంచుకోండి.
2) "ప్రతిదీ బైబిల్లో ఉండాలా? నేను ఎన్ని పూటల భోజనం చేయాలి, ఏమేం తినాలి, అవన్నీ అందులో ఉండవు కదా!"
సాధారణంగా ఆరాధనను నియంత్రించే సూత్రాన్ని (Regulative Principle of Worship) ఈ విధంగా అపహాస్యం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మన దైనందిన జీవితంలోని ప్రతి పనిని (ఆహారం ఎన్నిసార్లు తీసుకోవాలి, ఏమేం తినాలి) బైబిలు స్పష్టంగా ప్రస్తావించనందున, ఆరాధించడం కోసం మన స్వంత పద్ధతులను, ఆచారాలను, పండుగలను కనిపెట్టుకోవడానికి మనకు స్వేచ్ఛ ఉందని ప్రజలు వాదిస్తారు. అయితే, సాధారణ దైనందిన వ్యక్తిగత జీవితానికి మరియు సంఘ ఆరాధనకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది.
మన దైనందిన కార్యకలాపాల గురించి దేవుడు ఎలాంటి నిర్దేశాలు ఇవ్వనప్పటికీ, తనను ఎలా సమీపించాలో, ఎలా ఆరాధించాలో తెలిపే నిర్దిష్టమైన నియమాలను ఆయన లేఖనాలలో స్పష్టంగా బోధించాడు. అంగీకరింపబడని కయీను అర్పణ మొదలుకొని, మందసాన్ని ముట్టినందుకు ఉజ్జా పొందిన విషాదకరమైన మరణం వరకు, బైబిలు స్పష్టంగా ఘోషించే ఒకే ఒక్క సందేశం ఏమిటంటే: మానవ కల్పిత ఆచారాలతో కూడిన ఆరాధనను దేవుడు అంగీకరించడు. క్రొత్త నిబంధనలో సైతం, "స్వేచ్ఛారాధన"కు (కొలస్సీ 2:23) మరియు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసే మనుష్యుల పారంపర్యాచారాలకు (మత్తయి 15:6) వ్యతిరేకంగా మనం అనేక మార్లు హెచ్చరించబడ్డాము.
3) "మేము కేవలం ఆయన బలియాగాన్ని మరియు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే ఈ పండుగను ఆచరిస్తున్నాము!"
ఇది బహుశా చాలా నిజాయితీగా అనిపించే సాకు కావొచ్చు. "ప్రభువు చేసినదానిని జ్ఞాపకం చేసుకోవడం తప్పా?" కచ్చితంగా కాదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే: ఆయనను మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు?
ఈ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు, సంఘానికి విడిచిపెట్టేసెయ్యలేదు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువు రాత్రి భోజనాన్ని (పరిశుద్ధ బల్లను) ఆచరించాలని ఆయన స్పష్టంగా ఆజ్ఞాపించాడు (లూకా 22:19). క్రీస్తు నియమించినదానికి అదనంగా మనకు "గుడ్ ఫ్రైడే" (Good Friday) అవసరమని సూచించడం, సంఘానికి ప్రభువు స్వయంగా అనుగ్రహించిన పద్ధతి సరిపోదని చెప్పడమే అవుతుంది. ఒకవేళ క్రీస్తు తన జన్మదినాన్ని లేదా సిలువలో మరణించిన దినాన్ని వార్షిక పండుగలుగా నియమించాలనుకుంటే, ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో స్వయంగా ఆ పని చేసుండేవాడు లేదా కనీసం తన అధికార ప్రతినిధులైన అపొస్తలుల ద్వారా ఈ పండుగలను సంఘానికి నియమించి ఉండేవాడు. దానికి బదులుగా, ఆయన మనకు రొట్టెను, ద్రాక్షరసాన్ని తీసుకుంటూ ఆయనను జ్ఞాపకం చేసుకునే ప్రభు బల్ల సంస్కారాన్ని మరియు ప్రతి వారం వచ్చే ప్రభువు దినాన్ని అనుగ్రహించాడు.
4) "కానీ ఇవి చారిత్రక క్రైస్తవ సంప్రదాయాలు కదా!"
ఈ వార్షిక పండుగలు అపొస్తలుల సంప్రదాయంలో భాగం కాదని మద్దతుదారులు మరియు విమర్శకులు ఇద్దరూ అంగీకరిస్తారు. అవి అపొస్తలుల ఆజ్ఞ లేదా మాదిరి ద్వారా స్థాపించబడలేదు. అందుకు బదులుగా, అవి అపొస్తలులు మరణించిన చాలా కాలం తర్వాత సంఘంపై రుద్దబడ్డాయి, అదనంగా అప్పటికే ఆచరణలో ఉన్న అనేక సాంస్కృతిక ఆచారాలను "క్రైస్తవీకరించి" ఈ పండుగలో భాగంగా ఆచరించడం మొదలుపెట్టారు.
అన్యాచారాలను అలాగే బైబిలేతర పండుగలను సంఘంలోకి తీసుకురావడంలో రోమన్ క్యాథలిక్ వ్యవస్థ ప్రావీణ్యం సంపాదించిందని చరిత్ర సాక్ష్యమిస్తోంది. ఈ చరిత్రను విస్మరించడం అంటే క్రైస్తవ విశ్వాస బోధ విషయంలో జరిగిన అవినీతిని విస్మరించడమే. అబద్ధ దేవుని కోసం ఉద్దేశించబడిన వాటిని తీసుకుని, యేసుక్రీస్తు కోసం "పునర్వినియోగం" వాక్య విరుద్ధం. అలా చేసే హక్కు మనకు లేదు. “ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని" తన ప్రజలు అనుకోకూడదని దేవుడు ప్రత్యేకంగా ఆజ్ఞాపించాడు (ద్వితీయో 12:30).
5) "ఇది క్రైస్తవ స్వేచ్ఛకు సంబంధించిన విషయం (రోమీయులకు 14)."
కొందరు రోమీయులకు 14వ అధ్యాయం నుండి "బలహీనమైన సహోదరుడు" గురించిన వాదనను తీసుకొస్తారు, ఇక్కడ పౌలు "ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచిదని యెంచుచున్నాడు" అని పేర్కొన్నాడు. ఈ వాక్యం మనకు ఈస్టర్ లాంటి పండుగ దినాలను సృష్టించుకునే "స్వేచ్ఛను" ఇస్తుందని వారు వాదిస్తారు.
అయితే, పౌలు ఇక్కడ ఒక నిర్దిష్ట సందర్భాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు: గతంలో దేవుడు స్వయంగాఆజ్ఞాపించిన పాత నిబంధన పండుగ దినాలను విడిచిపెట్టే విషయంలో ఇంకా పోరాడుతున్న యూదా విశ్వాసులను ఉద్దేశించి రాస్తున్నాడు. అన్యుల ఆచారాలను క్రైస్తవీకరించడానికి లేదా మనుషుల ఇష్టానుసారంగా సరికొత్త పండుగదినాలను సృష్టించడానికి పౌలు సంఘానికి ఎటువంటి స్వేచ్ఛను ఇవ్వలేదు. ఈస్టర్‌ను సమర్థించడానికి రోమీయులకు 14ను ఉపయోగించడం అంటే, మనుషుల మొండితనాన్ని సమర్థించడానికి లేఖనాలను దుర్వినియోగం చేయడమే.
6) "నశించిపోతున్నవారికి సువార్త ప్రకటించడానికి మాత్రమే మేము జరుపుకుంటాము!"
దీనిని తరచుగా ఒక "మిషనరీ" సాకుగా ఉపయోగిస్తారు. ఈస్టర్ సమయంలో లోకం ఎటూ యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తుంటుంది కాబట్టి, మనం ఆ పండుగను సువార్తీకరణకు సాధనంగా ఉపయోగించుకోవాలని ప్రజలు వాదిస్తారు.
ఆదిమ సంఘం ఎటువంటి పండుగలు లేదా "పరిశుద్ధ వారం" సహాయం లేకుండానే చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సువార్తీకరణలో నిమగ్నమైంది. అకస్మాత్తుగా సువార్తను ప్రభావవంతంగా ప్రకటించడానికి మనకు మానవ నిర్మిత సంప్రదాయాలు అవసరమని ఎందుకు అనుకుంటున్నాము? రాజైన సౌలు "ప్రభువుకు బలి అర్పించాలనే" సాకుతో అమాలేకీయుల నిషేధిత దోపుడు సొమ్మును ఉంచుకున్నప్పుడు, దేవుడు అతనిని తిరస్కరించాడు. దేవుని ప్రతిస్పందన ఎలా ఉండిందో మనకు స్పష్టంగా తెలుసు: "బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుట .. శ్రేష్ఠము" (1 సమూయేలు 15:22). దేవుడు ఎన్నడూ అధికారపూర్వకంగా ఆమోదించని సంప్రదాయాలను రక్షించడానికి మనం "సువార్త"ను ఒక సాకుగా ఉపయోగించకూడదు.
7) "దేవుని గొప్ప సేవకులందరూ, సంఘాలన్నీ తప్పు చేస్తున్నాయని మీరు అంటున్నారా?"
"ఎవ్వరికీ లేని జ్ఞానోదయం మీకే కలిగిందా? ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటున్నవారంతా వెర్రివాళ్ళా, అజ్ఞానులా, వాళ్ళందరికీ బైబిల్ తెలీదా?" అని అనేవారు లేకపోలేదు. ఈ సాకు చెప్పేవారు గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ ఆచరించే పెద్ద పెద్ద సంఘాలను, ప్రసిద్ధ బోధకులను చూపించి మరీ, పేర్లు ప్రస్తావించి మరీ వాపోతుంటారు.
కానీ చరిత్ర చెప్పే వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. సంఘ సంస్కరణ (Reformation) ప్రారంభ కాలం నుండి, జాన్ ఓవెన్ (1616 – 1683), థామస్ వాట్సన్ (1620 – 1686), రిచర్డ్ బాక్స్టర్ (1615 – 1691), జాన్ కాటన్ (1585 – 1652), ఇంక్రీస్ మాథర్ (1639 – 1723), కాటన్ మాథర్ (1663 – 1728) వంటి నమ్మకమైన "వాక్య సేవకులు" అనేకులు ఈ పండుగలలోని అనేక ఆచారాలు రోమన్ క్యాథలిక్కుల కల్పితాలేనని, ఈ ప్రత్యేక దినాలను ఆచరించడానికి వాక్యాధారం ఏ మాత్రం లేదని గుర్తించి, వాటిని ఆచరించడానికి నిరాకరించారు. 16వ శతాబ్దంలో అమెరికాలోని ప్యూరిటన్లు (Puritans) లేఖనాధారం లేని ఈ పండుగలను నిషేధిస్తూ చట్టాలు కూడా చేశారు. 1957 వరకు స్కాట్లాండ్‌లో ఈ పండుగ దినాలు, పబ్లిక్ హాలిడేస్ కావు, సాధారణ పని దినాలుగానే ఉండేవి. మేము ఒక్కళ్ళమే ఈ సంగతులను ఈ విధంగా బోధించట్లేదు; మానవ పారంపర్యాచారాల కంటే దేవుని వాక్యానికే అత్యంత ప్రాధాన్యతనిచ్చిన నమ్మకమైన బోధకుల సుదీర్ఘ వరుసలో మేము కూడా నిలబడుతున్నాము.
8) "మనకు కూడా ఏదో ఒక పండుగ ఉంటే బాగుంటుంది కదా! పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది."
ఈ పండుగలు లేకపోతే కుటుంబంతో గడపడానికి, కొత్త బట్టలు వేసుకోవడానికి లేదా ప్రత్యేక విందులకు వేరొక సందర్భం గానీ, అవకాశం గానీ అస్సలు దొరకదన్నట్లు ప్రజలు ఆందోళన చెందుతారు. "మరి పిల్లలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు?" అని వారు అడుగుతారు.
బైబిల్ సంఘానికి ప్రతి సంవత్సరం 52 పండుగలను అనుగ్రహించింది: ప్రతి ఆదివారం ప్రభువు దినమే. ప్రతి వారం పరిశుద్ధులు కూడుకోవడంలో, వాక్యబోధలో, ప్రభువు బల్లలో మనం ఆనందాన్ని కనుగొనలేకపోతే, మన హృదయాలు ఆత్మీయ దారిద్ర్యంలో ఉన్నట్లే. మనం నిజంగా ప్రతి వారం పునరుత్థాన శక్తిలో జీవిస్తున్నట్లయితే, పునరుత్థానాన్ని జరుపుకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఒక "ప్రత్యేకమైన" దినం మనకు అవసరం లేదు. సంవత్సరంలో ఏ రోజైనా కుటుంబాలు కలుసుకోవడానికి, భోజనం చేయడానికి, సంతోషంగా గడపడానికి స్వేచ్ఛ ఉంది, కానీ మానవ కల్పితమైన మతపరమైన ఆచారాలను సంఘంపై రుద్దే అధికారం మాత్రం ఎవ్వరికీ లేదు.
8. ముగింపు
మనం సేవించే దేవుడు రోషముగల దేవుడు, ఆయన తన చిత్తాన్ని స్పష్టంగా బయలుపరిచాడు. తన నామంలో బైబిలేతర సంప్రదాయాలను, అన్యజనుల ఆచారాలను ఉపయోగించడాన్ని ఆయన నిషేధించాడు (యిర్మీయా 10:2) మరియు "అన్యాగ్ని" అనగా ఆయన ఆజ్ఞాపించని ఆరాధన, హేయమైనదని హెచ్చరించాడు (లేవీ 10:1-2). దేవుడు మనల్ని ఏమి చేయవద్దని నిర్దిష్టంగా చెప్పాడో లేదా దేని గురించి ఆయన మౌనంగా ఉన్నాడో, దాన్ని మనం ఆయనకు అర్పిస్తున్నట్లయితే, మనం ఆయనను ఆరాధించడం లేదు; మనం ఆయనను అవమానిస్తున్నాము. అటువంటి ఆరాధన వ్యర్థమైన ఆరాధన అని మన ప్రభువే చెప్పాడు (మత్తయి 15:6-9).
నేటి క్రైస్తవ్యం, దేవుడు వాస్తవానికి ఆజ్ఞాపించినవాటిని విస్మరిస్తూ, ఆయన నిషేధించినవాటిని చేయడానికి తొందరపడుతుంది. మనం కల్పించినవన్నీ కాకుండా, ఆయన ఆజ్ఞాపించినవాటన్నిటిని గైకొనే శిష్యులుగా ఉండటానికి మనం పిలువబడ్డాము (మత్తయి 28:20). అపొస్తలుల మాదిరికి మరియు ఆయన వాక్యసంపూర్ణతకు మాత్రమే నమ్మకంగా ఉండేలా ఆయన కృపను వేడుకుందాము (2 థెస్స 2:15).
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.