రిబ్కాయు ఆమె పనికత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడివెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను.
ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను.
సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను,
రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీదనుండి దిగి
మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.
అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను.
ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొనిపోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణపొందెను.