యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీమునకువచ్చి యీలాగు సెలవిచ్చెను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.
యెహోవా ఇశ్రాయేలీయులయొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్తులోనుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములోనుండి మిమ్మును తోడుకొని వచ్చితిని.
ఐగుప్తీయుల చేతిలో నుండియు మిమ్మును బాధించిన వారందరిచేతిలోనుండియు మిమ్మును విడిపించి, మీ యెదుటనుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని; మీ దేవుడనైన యెహోవాను నేనే.
నీవు నీతిమంతుడవైయుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి.
ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారియెడల బహుగర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారియెదుట సూచకక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధినొందితివి.
మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రముమధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.
ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రికాలమందు వారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయియుండి వారిని తోడుకొనిపోతివి.