అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి .
ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి , తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా
తల్లి ఆలాగు వద్దు ; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను .
అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమె తో చెప్పి
వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి .
అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను ; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి .