కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతులయొద్దను తాకీదులు తీసికొని, యూదా ఇశ్రాయేలు దేశములందంతట సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి ఇశ్రాయేలువారలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవావైపు తిరుగుడి; మీరు తిరిగినయెడల మీలో అష్షూరురాజుల చేతిలోనుండి తప్పించుకొని శేషించినవారివైపు ఆయన తిరుగును.
తమ పితరుల దేవుడైన యెహోవాయెడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరులవలెను మీ సహోదరులవలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదొ మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను.
మీ పితరులవలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధమందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదినుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి.
మీరు యెహోవావైపు తిరిగినయెడల మీ సహోదరులయెడలను మీ పిల్లల యెడలను చెరతీసికొనిపోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములు గలవాడు గనుక మీరు ఆయనవైపు తిరిగినయెడల ఆయన మీయందు ప్రసన్నుడగును.
అంచెవాండ్రు జెబూలూను దేశమువరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటివారు ఎగతాళిచేసి వారిని అపహసించిరి.
అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలోనుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.
యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకముచేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.