కావున వారు గిబియాలో ఆ రాత్రి గడపుటకు అక్కడికి చేర సాగిరి; అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను, బస చేయుట కెవడును వారిని తన యింటికి పిలువ లేదు.
ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పనినుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు.
అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్థుడైన ఆ మనుష్యుని చూచి నీ వెక్కడికి వెళ్లుచున్నావు? నీ వెక్కడనుండి వచ్చితివి? అని అడిగెను.
అందుకతడు మేము యూదా బేత్లెహేమునుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్లుచున్నాము. నేను అక్కడివాడను; నేను యూదా బేత్లెహేమునకు పోయి యుంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్లుచున్నాను, ఎవడును తన యింట నన్ను చేర్చుకొనలేదు.
అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడనున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏదియు తక్కువ లేదని అతనితో చెప్పగా
ఆ ముసలివాడు నీకు క్షేమమగునుగాక, నీకేవైన తక్కువైన యెడల వాటిభారము నామీద ఉంచుము.
మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి, తన యింట అతని చేర్చుకొని వారి గాడిదలకొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్లు కడుగుకొని అన్న పానములు పుచ్చుకొనిరి.
వారు సంతోషించుచుండగా ఆ ఊరివారిలో కొందరు పోకిరులు ఆ యిల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ యింటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని యింటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా
యింటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలువెళ్లి నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఈ మనుష్యుడు నా యింటికి వచ్చెను గనుక మీరు ఈ వెఱ్ఱిపని చేయకుడి.
ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియు నున్నారు. నేను వారిని బయటికి తీసికొని వచ్చెదను, మీరు వారిని నీచపరచి మీ యిష్టప్రకారముగా వారియెడల జరిగింపవచ్చునుగాని యీ మనుష్యునియెడల ఈ వెఱ్ఱిపని చేయకుడని వారితో చెప్పెనుగాని
అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారియొద్దకు తన ఉపపత్నిని తీసికొనిపోగా వారు ఆమెను కూడి ఉదయమువరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్లిరి.
ప్రాతఃకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చువరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని యింటి ద్వారమున పడియుండెను.
ఉదయమున ఆమె యజమానుడు లేచి యింటి తలుపులను తీసి తన త్రోవను వెళ్లుటకు బయలుదేరగా అతని ఉపపత్నియైన ఆ స్త్రీ యింటిద్వారమునొద్ద పడి చేతులు గడపమీద చాపి యుండెను.
అతడు లెమ్ము వెళ్లుదమనగా ఆమె ప్రత్యుత్తరమియ్యకుండెను గనుక అతడు గాడిదమీద ఆమెను ఉంచి లేచి తనచోటికి ప్రయాణము చేయసాగెను.