యెహోషువయు ఇశ్రాయేలీయులందరును వారి యెదుట నిలువలేక ఓడిపోయినవారైనట్టు అరణ్యమార్గముతట్టు పారిపోయినప్పుడు
వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.
ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరుమబోయి యుండిరి.
అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను నీవు చేతపట్టుకొనిన యీటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతి కప్పగింతును, అంతట యెహోషువ తన చేతనున్న యీటెను ఆ పట్టణమువైపు చాపెను.
అతడు తన చెయ్యి చాపగా పొంచియున్నవారు మాటులోనుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి.
హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణముయొక్క పొగ ఆకాశమున కెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టయినను ఆ తట్టయినను పారిపోవుటకు వారికి వీలులేక పోయెను.
పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ యెక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచినప్పుడు వారు తిరిగి హాయివారిని హతము చేసిరి.
తక్కిన వారును పట్టణములోనుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేసిరి. వారిలో ఒకడును మిగులలేదు; ఒకడును తప్పించుకొనలేదు.
వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువయొద్దకు తీసికొనివచ్చిరి.
బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరు హాయియొద్దకు తిరిగివచ్చి దానిని కత్తి వాతను నిర్మూలము చేసిరి.
ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరు పండ్రెండు వేలమంది.
యెహోషువ హాయి నివాసులనందరిని నిర్మూలము చేయువరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.
అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను; నేటి వరకు అది అట్లే యున్నది.
యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకుచున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.