తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.
తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతిబొందెను.
యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.
అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైనవారిని తీసికొని కనానను దేశమునకు వచ్చిరి.