పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవుపుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తలవెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.
పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించుకొనినయెడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను.
ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.
అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు.
అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.
అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు.
తన దేవునికి మీదు కట్టబడిన తలవెండ్రుకలు అతని తలమీద నుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరిగాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు.