జనసమూహముతో పండుగచేయుచున్న సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.
యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.
యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి
యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు
ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమునుబట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.
ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.