నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రియైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి.
అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా
యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతిబొందిరి.
అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.