అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను జనులకు పెద్దలనియు అధిపతులనియునీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను నాయొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతోకూడ నిలువబడవలెను.
నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను.
యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు.
అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళెములోనికి వెళ్లిరి.