యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.
నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను
విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను