మరియు అతడు నాతో ఇట్లనెను నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దానిమీద రక్తము చల్లి, దహన బలులు అర్పించుటకై విధులనుబట్టి ఈలాగున జరిగింపవలెను.
ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా పరిచర్యచేయుటకై నా సన్నిధికివచ్చు సాదోకు సంతానపు లేవీయులగు యాజకులకు పాపపరిహారార్థబలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను.
వారు దాని తీసికొని పాపపరిహారార్థబలిగా నర్పించి, బలి పీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ములమీదను చూరుయొక్క నాలుగు మూలలమీదను చుట్టునున్న అంచుమీదను చమరవలెను.
తరువాత పాపపరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయస్థలములో దానిని దహనము చేయవలెను.
రెండవ దినమున పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక మేక పిల్లను అర్పింపవలెను ; కోడెచేతను బలిపీఠమునకు పాపపరిహారము చేసినట్లు మేకపిల్లచేతను పాపపరిహారము చేయవలెను.
ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతివారికొరకును , యెరూషలేము నివాసులకొరకును ఊట యొకటి తియ్య బడును .