నీవు లోపలికి చొచ్చి, యిక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా
నేను లోపలికి పోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను.
మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆ యాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను.
అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.
మరియు ఆయన నీవు ఈతట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి
యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని.
అప్పుడాయన నరపుత్రుడా, యిది చూచితివి గాని నీవు తిరిగి చూచిన యెడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి
యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు ఇరువది యయిదుగురు మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి.
అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగెముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.