మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.
ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు, పదకొండు తెరల కొలత ఒక్కటే.
అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒక దానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను.
తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.
మరియు ఏబది యిత్తడి గుండీలను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను.
ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను.
మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను.