నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమికూడ యెహోవా పేరట విశ్రాంతికాలమును, ఆచరింపవలెను.
ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షములతోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును.
ఏడవ సంవత్సరము భూమికి మహావిశ్రాంతికాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్ధిపరచకూడదు.
నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు; అది భూమికి విశ్రాంతి సంవత్సరము.
అప్పుడు భూమియొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును.
మరియు నీ పశువులకును నీ దేశజంతువులకును దాని పంటఅంతయు మేతగా ఉండును.
మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును.
అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.