
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడునప్పుడు, వాని చంపినవాడెవడో అది తెలియక యుండిన యెడల
నీ పెద్దలును నీ న్యాయాధిపతులును వచ్చి చంపబడినవాని చుట్టునున్న పురముల దూరము కొలిపింపవలెను.
ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి యీడ్వని పెయ్యను తీసికొని
దున్నబడకయు విత్తబడకయునున్న యేటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొనిపోయి అక్కడ, అనగా ఆ లోయలో ఆ పెయ్యమెడను విరుగ తియ్యవలెను.
అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను.
అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరు ఆ యేటి లోయలో మెడ విరుగతీయబడిన ఆ పెయ్యపైని తమ చేతులు కడుగుకొని
మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు.
యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము; నీ జనమైన ఇశ్రాయేలీయులమీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారినిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును.
అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్యనుండి నిర్దోషియొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించెదవు.