మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవలెననెను.
మరియు మోషే ఇట్లనెను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్తుదేశమునుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను.
కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.