అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేసెను; అతని ఆనుకొని తన భాగములో కెయిలాయొక్క సగముభాగమునకు అధిపతియైన హషబ్యా బాగుచేయువాడాయెను.
అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను. అతడు కెయీలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను.
అతని ఆనుకొని మిస్పాకు అధిపతియు యేషూవకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగుచేసెను.
అతని ఆనుకొని ఆ గోడ మలుపునుండి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు ఇంటిద్వారమువరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగుచేసెను.
అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారమునుండి ఆ యింటి కొనవరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను.
అతనిని ఆనుకొని యొర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగుచేయువారైరి.
వారిని ఆనుకొని తమ యింటి కెదురుగా బెన్యామీను హష్షూబు అను వారు బాగుచేసిరి; వారిని ఆనుకొని తన యింటియొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను.
అతని ఆనుకొని అజర్యా యిల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను.
అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురమువరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయెను; అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను.
ఓపెలులోనున్న నెతీనీయులు తూర్పువైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి.
వారిని ఆనుకొని ఓపెలు గోడవరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెకోవీయులు బాగుచేసిరి.
గుఱ్ఱపు గుమ్మమునకు పైగా యాజకులందరు తమ యిండ్ల కెదురుగా బాగుచేసిరి.
వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.
అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు ఆరవ కుమారుడైన హానూనును మరియొక భాగమును బాగుచేయువారైరి; వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను.
అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలముయొక్క మూలవరకును బంగారపుపనివాని కుమారుడైన మల్కీయా బాగుచేసెను.
మరియు మూలకును గొఱ్ఱల గుమ్మమునకును మధ్యను బంగారపుపనివారును వర్తకులును బాగుచేసిరి.