రెండు స్తంభములను
1 రాజులు 7:15-24
15

ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోసెను; ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివిగలది, ఒక్కొక్కటి పండ్రెండు మూరల కైవారము గలది.

16

మరియు స్తంభములమీద ఉంచుటకై యిత్తడితో రెండు పీటలు పోతపోసెను; ఒకపీటయొక్క యెత్తు అయిదు మూరలు, రెండవ పీటయొక్క యెత్తు అయిదు మూరలు.

17

మరియు స్తంభములమీదనున్న పీటలకు అల్లిక పనివంటి పనియు, గొలుసు పని దండలును చేయబడెను; అవి పీటకు ఏడేసి కలిగి యుండెను.

18

ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని రెండు వరుసలు దానిమ్మపండ్లతో చేసెను; ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను.

19

మరియు స్తంభములమీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పమువంటి పనిగలవై యుండెను.

20

మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను; రెండువందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టునుండెను.

21

ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను.

22

ఈ స్తంభములమీద తామరపుష్పములవంటి పని యుండెను; ఈలాగున స్తంభములయొక్క పని సమాప్తమాయెను.

23

మరియు అతడు పోతపనితో ఒక సముద్రమును చేసెను; అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచువరకు పది మూరలు, అది అయిదుమూరల యెత్తుగలదై గుండ్రముగా ఉండెను; దాని కైవారము ముప్పది మూరలు.

24

దాని పై అంచునకు క్రింద చుట్టును గుబ్బలుండెను; మూరకు పది గుబ్బలచొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టును ఆవరించియుండెను; అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరుసలుగా పోత పోయబడెను.

యిర్మీయా 52:20-23
20

రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటికన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము.

21

వాటిలో ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల యెత్తుగలది, పండ్రెండు మూరల నూలు దాని చుట్టు తిరుగును, దాని దళసరి నాలుగు వ్రేళ్లు; అది గుల్లది.

22

దానిమీద ఇత్తడి పైపీట యుండెను; ఒక్క పైపీట అయిదేసి మూరల ఎత్తుగలది, పైపీటకు చుట్టు అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లును ఉండెను; అవి యన్నియు ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును ఆలాగుననే దానిమ్మ పండ్లుండెను.

23

ప్రక్కలయందు తొంబదియారు దానిమ్మపండ్లుండెను; చుట్టు ఉండిన వల అల్లికమీద దానిమ్మపండ్లన్నియు నూరు.