నెబాతు కుమారుడును రాజునైన యరొబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమున అబీయాము యూదా వారిని ఏలనారంభించెను.
అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను; అతని తల్లి పేరు మయకా; ఆమె అబీషాలోము కుమార్తె.
అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచెను; తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవాయెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు.
దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక
దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూషలేమును స్థిరపరచుటకును, అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను.
రెహబాము బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.
అబీయాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగియుండెను.
అబీయాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.