
తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా... లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా
దావీదు యోవాబునకును జనులయొక్క అధిపతులకును మీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి, వారి సంఖ్య నాకు తెలియుటకై నాయొద్దకు దాని తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చెను.
అందుకు యోవాబు రాజా నా యేలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నవారికంటె నూరంతలు ఎక్కువమందిని చేయునుగాక;వారందరు నా యేలినవాని దాసులుకారా? నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగినయెడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవిచేసెను.
అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతట సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను.
ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయువారు పదకొండు లక్షల మందియు యూదా వారిలో కత్తి దూయువారు నాలుగు లక్షల డెబ్బదివేల మందియు సంఖ్యకు వచ్చిరి.
రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు.
ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను.
దావీదు నేను ఈ కార్యముచేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా
యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెను నీవు వెళ్లి దావీదుతో ఇట్లనుము.
యెహోవా సెలవిచ్చునదేమనగా మూడు విషయములు నేను నీయెదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనినయెడల దాని నీకు చేయుదును.
కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను
మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువలేక నశించిపోవుట, మూడు దినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగజేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము.
అందుకు దావీదు నేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను; యెహోవా మహా కృపగలవాడు, నేను మనుష్యులచేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను.
కావున యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో డెబ్బదివేలమంది చచ్చిరి.
యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతోచాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునొద్ద నిలిచెను.
దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యాకాశముల మధ్యను నిలుచుచు, వరదీసిన కత్తిచేత పట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా
దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపము చేసి చెడుతనము జరిగించినవాడను నేనేగదా? గొఱ్ఱలవంటివారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనులమీద నుండకుండ నామీదను నా తండ్రి యింటివారిమీదను ఉండనిమ్మని దేవునితో మనవిచేసెను.
ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతియైన యోవాబును పిలిచి జనసంఖ్య యెంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారముచేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా
యోవాబు జనుల సంఖ్య యెంత యున్నను నా యేలినవాడవును రాజవునగు నీవు బ్రదికి యుండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక; నా యేలినవాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏలపుట్టెననెను.
అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుటచేత యోవాబును సైన్యాధిపతులును ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజుసముఖమునుండి బయలు వెళ్లి
యొర్దాను నది దాటి యాజేరుతట్టున గాదు లోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి
అక్కడనుండి గిలాదునకును తహ్తింహోద్షీ దేశమునకును వచ్చిరి; తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి.
అక్కడనుండి బురుజులుగల తూరు పట్టణమునకును హివ్వీయులయొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణదిక్కుననున్న బెయేర్షెబావరకు సంచరించిరి.
ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమి్మదినెలల ఇరువది దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.
అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను; ఇశ్రాయేలువారిలో కత్తి దూయగల యెనిమిది లక్షలమంది యోధులుండిరి; యూదా వారిలో అయిదు లక్షలమంది యుండిరి.
జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని; యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా
ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
నీవు పోయి దావీదుతో ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా మూడు విషయములను నీ యెదుట పెట్టుచున్నాను; వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన యెడల నేనది నీమీదికి రప్పించెదను.
కావున గాదు దావీదునొద్దకు వచ్చి యిట్లని సంగతి తెలియజెప్పెను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల యెదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచనచేసి నన్ను పంపినవానికి నేనియ్యవలసిన యుత్తము నిశ్చయించి తెలియజెప్పుమనెను.
అందుకు దావీదు నాకేమియు తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యతగలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండ యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను.
అందుకు యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళ వరకు అది జరుగుచుండెను; అందుచేత దానునుండి బెయేర్షెబావరకు డెబ్బది వేలమంది మృతి నొందిరి.