తిర్సాలో తనకు గృహనిర్వాహకుడగు అర్సాయింట అతడు త్రాగి మత్తుడై యుండగా, యుద్ధ రథముల అర్ధభాగముమీద అధికారియైన జిమీ అతని మీద కుట్రచేసి లోపలికి చొచ్చి
అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను. ఇది యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువది యేడవ సంవత్సరమున సంభవించెను.
అతడు సింహాసనాసీనుడై యేలనారంభించిన తోడనే బయెషా సంతతివారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరినేగాని మిగులనియ్యక అందరిని హతముచేసెను.
బయెషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపముచేసి, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకులై, తాము పెట్టుకొనిన దేవతలచేత ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి గనుక
వారు చేసిన పాపములనుబట్టి ప్రవక్తయైన యెహూద్వారా బయెషానుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమీ బయెషా సంతతివారినందరిని నాశనముచేసెను.
ఏలా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువదియేడవ సంవత్సరమున జిమీ తిర్సాలో ఏడు దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా
జిమీ కుట్రచేసి రాజును చంపించెనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇశ్రాయేలువారందరును ఆ దినమున సైన్యాధిపతియైన ఒమీని దండుపేటలో ఇశ్రాయేలు వారిమీద రాజుగా పట్టాభిషేకము చేసిరి.
వంటనే ఒమీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరును తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి.
పట్టణము పట్టుబడెనని జిమీ తెలిసికొని, తాను రాజనగరునందు జొచ్చి తనతో కూడ రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను.
యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై యుండి తానే పాపము చేయుచు, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను.
జిమీ చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన రాజద్రోహమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.