
అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషునొద్దకు వచ్చెను.
లేచి తనయొద్దనున్న ఆరువందలమందితో కూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను.
దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయైయుండిన కర్మెలీయురాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి.