ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవియ్యగా
యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.
ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను; అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు, అతడును అతనితో కూడనున్న అతని నలుగురు కుమారులును దాగుకొనిరి.
దావీదు ఒర్నానునొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి, కళ్లములోనుండి వెలుపలికి వచ్చి, తల నేల మట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను.
ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా
ఒర్నానురాజైన నా యేలినవాడు దాని తీసికొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయును గాక; ఇదిగో దహనబలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడి సామగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి; ఇదియంతయు నేనిచ్చెదనని దావీదుతో అనెను.
రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసికొని యెహోవాకు దహనబలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాని తీసికొందునని ఒర్నానుతో చెప్పి
ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతని కిచ్చెను.
పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి. దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.
యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను.
యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలిసికొని అచ్చటనే బలి అర్పించెను
మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను.
దావీదు యెహోవాదూత పట్టుకొనిన కత్తికి భయపడినవాడై దేవునియొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ల లేకుండెను.