
దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొనివచ్చి రాజును దర్శనము చేసెను.
రాజు నీవు నాతో కూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు;
నీవు పట్టణమునకు తిరిగి పోయి రాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు.
అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను.
సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారుడైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చట నున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను.
దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.
దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయను నతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి రాజు చిరంజీవియగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా
అబ్షాలోము నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారమింతేనా నీ స్నేహితునితో కూడ నీవు వెళ్లకపోతివేమని అతని నడుగగా
హూషై యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును.
మరియు నేనెవనికి సేవచేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవచేయవలెను గదా? నీ తండ్రి సన్నిధిని నేను సేవచేసినట్లు నీ సన్నిధిని నేను సేవచేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను.