
మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి–లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.
అందుకు అహరోను–మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా
ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి .
అతడు వారి యొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.