Hits: 1361
Print
రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 12:1, 12:2, 12:3, 12:4,5, 12:6, 12:7,12:8, 12:9,10, 12:11, 12:12, 12:13, 12:14, 12:15, 12:16, 12:17,18, 12:19,20, 12:21,22, 12:23, 12:24,25, 12:26,27, 12:28, 12:29,30, 12:31,32, 12:33,34, 12:35,36, 12:37, 12:38, 12:39, 12:40,41, 12:4212:43-45, 12:46, 12:47,12:48,49, 12:50, 12:51.

నిర్గమకాండము 12:1 మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను.

ఇంతవరకూ గడచిన అధ్యాయాలలో వరుస సంఘటనలు (తెగుళ్ళు) నమోదు చెయ్యబడినట్టుగా మనం చూసాం. ఐతే ఈ అధ్యాయం 11వ అధ్యాయానికి కొనసాగింపు కాదు‌. ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న పస్కా పండుగ ఏర్పాట్లు అప్పటికప్పుడు చెయ్యగలివేవి కావు కాబట్టి, ఇప్పటివరకూ సంభవించిన తొమ్మిది తెగుళ్ళ మధ్యలోనే దేవుడు ఈ మాటలను మోషేకు తెలియచేసాడు. కానీ మోషే ఈ మాటలను ఆ తెగుళ్ళ మధ్యలో ప్రస్తావించకుండా వారి విడుదలకు సంబంధించిన అధ్యాయంలో రాస్తున్నాడు.

నిర్గమకాండము 12:2 నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.

ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించబోతున్న నెలను, సంవత్సరంలో మొదటినెలగా ప్రతిష్టించడం మనం చూస్తాం. వారు ఐగుప్తు నుండి విడిపించబడుతున్న ఆ సమయం వారి చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి దాని జ్ఞాపకార్థంగా ఆయన ఆవిధంగా చేసాడు. లేఖన ఆధారాల ప్రకారం ఈ‌ నెల పేరు ఆబీబు (నిర్గమకాండము 23:15, 34:18).

ద్వితియోపదేశకాండము 16: 1 ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను.

వాస్తవానికి ఈ నెల అప్పటివరకూ ఇశ్రాయేలీయులు అనుసరించిన క్యాలండర్ లో ఏడవది. ఈ‌ నెలను ఆబీబు అనే కాకుండా నీసాను అని కూడా అంటారు ( నెహెమ్యా 2:1, ఎస్తేరు 3:7). ఇది మన క్యాలండర్ లో మార్చి-ఏప్రియల్ మధ్యలో వస్తుంది.

నిర్గమకాండము 12:3 మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.

ఈ వచనంలో దేవుడు అబీబు నెలలో పదవరోజు (తెలుగులో దశమినాడు అని తర్జుమా చేసారు) ఇశ్రాయేలీయులు పస్కాబలి నిమిత్తం, కుటుంబ సభ్యుల లెక్కచొప్పున ఒక గొఱ్ఱెపిల్లను కానీ మేకపిల్లను కానీ ప్రత్యేకపరచుకోవాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. క్రింది వచనాలలో ఈ ఏర్పాటుకు సంబంధించిన మరికొన్ని విషయాలు రాయబడ్డాయి. ఇక్కడ ఇశ్రాయేలీయులు పస్కా బలి నిమిత్తం ప్రత్యేకపరచిన ఆ గొఱ్ఱెపిల్ల/మేకపిల్ల క్రీస్తుకు ఛాయగా ఉంది (1 కోరింథీ 5: 7). దీనిగురించి ముందు మరింత వివరంగా చూద్దాం.

నిర్గమకాండము 12:4,5 ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొన వలెను. ఆ గొఱ్ఱెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.

ఈ వచనాలలో పస్కాను సిద్ధపరచుకునే వివరణ మనం చూస్తాం. ఈ పస్కా పశువు క్రీస్తుకు ఛాయగా ఉంది కాబట్టి, దాని మాంసము వృధా కాకుండా కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టే దానిని తీసుకోవాలి, కొన్ని కుటుంబాలలో సభ్యుల సంఖ్య తక్కువ ఉండి, గొఱ్ఱెపిల్ల అంతటినీ వారు తినలేరు కాబట్టి మరొక కుటుంబంతో కలసి దానిని తీసుకోవాలి. అయినప్పటికీ ఆ గొఱ్ఱెపిల్ల మాంసం మిగిలిపోతే 10వ వచనం ప్రకారం దానిని అగ్నితో కాల్చివెయ్యాలి.

నిర్గమకాండము 12:6 నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు పస్కాబలి నిమిత్తం తీసుకునే గొఱ్ఱెపిల్లయైనా మేకపిల్లయైనా అది నిర్దోషమైన ఒక సంవత్సరం వయస్సున్న మగదానిని తీసుకోవాలని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. ఇక్కడ నిర్దోషమైనది అంటే శారీరకంగా ఎలాంటి కళంకమూ (లోపం) లేనిదని అర్థం (లేవీకాండము 22:19-21). బలిలో అర్పించబడుతున్న పశువు క్రీస్తుకు ఛాయగా ఉంటుంది కాబట్టి, ఆ క్రీస్తుయొక్క నిష్కళంకతను సూచించేలా (హెబ్రీ 7: 26) ఆ పశువు శారీరకంగా లోపం లేనిదైయుండాలి.

నిర్గమకాండము 12:7 ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి-

3వ వచనం ప్రకారం ఇశ్రాయేలీయుల కుటుంబాల వారు ఆబీబు నెల పదవ తారీఖున తీసుకున్న పశువును ఆ నెల 14వ తారీఖు వరకూ ప్రత్యేకంగా ఉంచి ఆరోజు సాయంత్రం, దానిని చంపి దాని రక్తాన్ని వారి ఇంటి గుమ్మపు ద్వారాలపై చల్లి, మాంసాన్ని తినాలని ఈ వచనంలో మనం చూస్తాం. 22వ వచనం ప్రకారం; ఆ పశువుయొక్క రక్తాన్ని పళ్ళెంలో పట్టి హిస్సోపు కుంచెతో దానిని తీసుకుని గుమ్మపు ద్వారాలకు తాకించాలి. ఆ రక్తపు గుర్తు ఇశ్రాయేలీయులనూ ఐగుప్తీయులనూ వేరుచేసేదిగా ఉంటుంది. అదేవిధంగా ఈ పస్కాబలి యాజకుల చేత కాకుండా కుటుంబ పెద్దలచేతనే చెయ్యబడుతుంది‌‌. ఎందుకంటే అప్పటికి ఇంకా యాజకధర్మం నియమించబడలేదు, పైగా ఇశ్రాయేలీయులు బలి అర్పించడానికి ప్రత్యేకస్థలం కూడా ఏర్పడలేదు. తర్వా మాత్రం ఈ బలి యాజకుల చేత దేవాళయంలోనే జరగాలి (ద్వితీయోపదేశకాండము 16:5-7).

నిర్గమకాండము 12:8 ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను.

ఈ వచనంలో దేవుడు ఆ పశువుయొక్క మాంసాన్ని ఎలా తినాలో వేటితో తినాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ మాంసాన్ని అగ్నిచేత కాల్చుకుని పొంగని రొట్టెలతో అనగా అప్పటికప్పుడు కలిపిన పిండితో చేసిన రొట్టెలతో తినాలి. చేదుకూరలతో దానిని తినాలి. ఆ చేదు కూరలు ఇప్పటివరకూ ఇశ్రాయేలీయులు అనుభవించిన శ్రమను సూచిస్తున్నాయి (విలాపవాక్యములు 3:15).

అదేవిధంగా మనకోసం క్రీస్తు అనే పస్కా పశువు వధించబడడాన్ని బట్టి (1కోరింథీయులకు 5: 7) మారుమనస్సు పొందినప్పుడు మనం అనుభవించే పశ్చాత్తాపానికి కూడా ఈ చేదుకూరలు ఛాయగా ఉన్నాయి. మనల్ని ఐగుప్తు కంటే వేదనకరమైన పాప బంధకాలనుండి విడిపించడానికి ఆయన మరణించాడనే తలంపు మనల్ని ఎంతో వేదనకు లోనయ్యేలా చేసి పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది. అందుకే పేతురు యేసుక్రీస్తు సిలువ మరణం గురించి బోధించినప్పుడు అక్కడున్న ప్రజలు తీవ్రమైన వేదనకు గురయ్యారు (అపో.కార్యములు 2:36,37). ఇక్కడ ఆ ప్రజలు హృదయములో నొచ్చుకుని అనే చోట హృదయం/మనసు కోయబడి అనేది సరైన తర్జుమా. అంటే యేసుక్రీస్తు బలియాగం వారికి ఆస్థాయిలో వేదననూ పశ్చాత్తాపాన్నీ కలిగించింది. నిజంగా మారుమనస్సు పొందిన మన విషయంలోనూ అదే జరుగుతుంది. మన పాపాలకోసం యేసుక్రీస్తు పస్కాపశువుగా చనిపోయాడనే వేదన పశ్చాత్తాపం కలగనివాడు విశ్వాసి కానేకాదు. అతను పొందింది నిజమైన మారుమనస్సు కాదు.

జెకర్యా 12: 10 దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద (వాని) దృష్టియుంచి, "యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

నిర్గమకాండము 12:9,10 దాని తలను దాని కాళ్లను దాని ఆంత్ర ములను అగ్నితో కాల్చి దాని తినవలెను; దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.

ఈ వచనాలలో ఆ పశువుయొక్క మాంసం తినే విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తెలియచెయ్యబడడం మనం చూస్తాం. ఆ పశువు యొక్క తల, కాళ్ళు, లోపలి భాగాలను కూడా అగ్నితో కాల్చుకునే తినాలి. దేవుని ఉగ్రతకు ఛాయగా ఉండే అగ్ని ఆ పశువును దహించాలి. ఎందుకంటే ఆ పశువు క్రీస్తుకు ఛాయగా ఉందని ఇప్పటికే నేను జ్ఞాపకం‌ చేసాను (1కోరింథీయులకు 5: 7) క్రీస్తు మన నిమిత్తం సిలువపై దేవుని‌ ఉగ్రతను పూర్తిగా భరించాడు‌ (యెషయా 53:4,5, రోమా 8: 4).

కాబట్టి ఆ పశువుయొక్క మాంసం సరిగా ఉడకకుండా (సరిగా కాలకుండా) తినకూడదు, దేవుని ఉగ్రతకు ఛాయగా ఉండే అగ్నితోనే దానిని‌ కాల్చి ఉడికించాలి తప్ప, దానికి ప్రత్యామ్నాయంగా నీటిలో ఉడకబెట్టకూడదు. ఉదయకాలం వరకూ దానిలో ఏదీ మిగల్చకూడదు, కుటుంబసభ్యుల లెక్క చొప్పునే దానిని తీసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఆ మరునాడు ఉదయమే ఐగుప్తు నుండి‌ వెళ్ళిపోతారు కాబట్టి, ఆ మిగిలిన మాంసం వారి గృహాలలో ఉండిపోతే ఐగుప్తీయులకు ఆ మాంసాన్ని కాలితో త్రొక్కడమో బయట పారవెయ్యడమో చేసి పస్కా బలిని అవమానించొచ్చు. అందుకే ఒకవేళ ఆ మాంసంలో ఏదైనా మిగిలిపోతే దేవుని‌ ఉగ్రతకు ఛాయగా ఉన్న అగ్నితో దానిని పూర్తిగా కాల్చివెయ్యాలి.

నిర్గమకాండము 12:11 మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను; అది యెహో వాకు పస్కాబలి.

ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులు పస్కా పశువును తినవలసిన పద్ధతి గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం.‌ ఇది వారు ఐగుప్తునుండి బయటకు వెళ్ళే తొందరపాటును సూచిస్తుంది. ఎందుకంటే ఆ ఉదయమే ఫరో మరియు అతని సేవకులు ఇశ్రాయేలీయులను తొందరపెట్టి మరీ ఐగుప్తునుండి పంపివేస్తారు. అది జరగకముందే అనగా ఆ ముందు రాత్రే ఇశ్రాయేలీయులు దానిని విశ్వసించాలనే భావం ఇందులో ఉంది.

నిర్గమకాండము 12:12 ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతు వులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను.

11వ అధ్యాయంలో దేవుడు హెచ్చరించిన తెగులు గురించి ఈ వచనంలో రాయబడడం మనం చూస్తాం. ఇక్కడ ఆయన చెప్పినట్టుగానే ఆ తెగులు సంభవించి ఇశ్రాయేలీయులు‌ ఐగుప్తునుండి బయలువెళ్ళేటప్పుడు ఐగుప్తు దేవతలందరికీ ఆయన తీర్పు తీర్చినట్టు లేఖనం నిర్థారిస్తుంది (సంఖ్యాకాండము 33:3,4).

ఇంతవరకూ దేవుడు తాను రప్పించిన తొమ్మిది తెగుళ్ళ ద్వారా ఐగుప్తీయుల తొమ్మిదిమంది దేవతలపై తీర్పు తీర్చాడు. ఇక ఈ చివరి తెగులు ద్వారా ఐగుప్తీయుల జీవదేవుడిపై ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అది సంభవించినప్పుడు ఆ జీవదేవుడితో సహా మిగిలిన దేవుళ్ళు ఎవరూ కూడా ఐగుప్తీయులను కాపాడలేక అసమర్థులుగా అవమానం పాలయ్యారు. ఐగుప్తీయుల దేవతలపై తీర్పు తీర్చడమంటే ఇదే. దీనివల్ల ఐగుప్తీయులతో పాటు ఇతర అ‌న్యులు కూడా యెహోవా దేవుని శక్తిని గుర్తించగలిగారు (నిర్గమకాండము 18:10,11, 1 సమూయేలు 4: 8).

నిర్గమకాండము 12:13 మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.

ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులు పస్కా పశువును చంపి దాని రక్తాన్ని గుమ్మపు ద్వారాలపై ఎందుకు చిమరాలో తెలియచెయ్యడం మనం చూస్తాం. ఈ గుర్తు ఐగుప్తీయుల గృహాలనూ ఇశ్రాయేలీయుల గృహాలనూ వేరు చేసేదిగా ఉంది. ఇక్కడ "దాటిపోయెదను" అనే మాటను బట్టే ఈ పండుగకు ఇంగ్లీష్ లో Passover అనే పేరు వచ్చింది. తెలుగులో దానిని పస్కా అని తర్జుమా చేసారు. పస్కా అంటే దేవుడు హాని చెయ్యకుండా "దాటిపోవడం". దీనిగురించి ఆ సందర్భంలో మరింతగా మాట్లాడుకుందాం.

నిర్గమకాండము 12:14 కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచ రింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచ రింపవలెను.

ఈ వచనంలో దేవుడు పస్కాబలిని తరతరాలకు నిత్యమైన కట్టడగా ఆచరించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. నిత్యమైన కట్టడగా అంటే ఈ‌ బలి దేనికి ఛాయగా ఉందో దాని నెరవేర్పు జరిగేంతవరకూ ఆచరించాలని అర్థం. ఉదాహరణకు బలుల గురించి కూడా ఆయన‌ ఇలాంటి ఆజ్ఞనే జారీచేసాడు, అయితే ఆ బలులన్నీ ఏ క్రీస్తు బలియాగానికి ఛాయగా ఉన్నాయో ఆ క్రీస్తు బలియాగం జరిగిపోయాక ఇక ఆ బలులను అర్పించవలసిన అవసరత లేదు కాబట్టి, వాటిని అర్పించకూడదు (హెబ్రీ 7:28, '8,9,10 అధ్యాయాలు).

కొలొస్సయులకు 2:16,17 కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది (ఆదికాండము 17:7 వ్యాఖ్యానం చూడండి). మరో విధంగా విశ్వాసులమైన మనం కూడా మన పస్కా పశువైన క్రీస్తు శరీర రక్తాలకు సాదృశ్యమైన ప్రభువుబల్లలో పాలుపొంది ఆయన బలిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ‌ పస్కాను నిత్యమైన కట్టడగా పాటిస్తున్నాము. ఇశ్రాయేలీయులు ఛాయను పాటిస్తే మనం నెరవేర్పును పాటిస్తున్నాము.

నిర్గమకాండము 12:15 ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్ల లోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీ యులలోనుండి కొట్టివేయబడును.

ఈ వచనంలో దేవుడు పులియని రొట్టెల గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆబీబు నెలలో 14వ తారీఖున పస్కా పశువు వధించబడితే ఆ మరునాడు నుండి, అంటే యూదుల కాలమానం ప్రకారం పస్కాపశువు వధించబడిన సాయంత్రం నుండి ఏడు రోజులు ఈ పులియని రొట్టెలనే తినాలి. అలా చెయ్యనివాడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివెయ్యబడతాడు, ఇశ్రాయేలీయుల నుండి కొట్టివెయ్యబడడమంటే అదేమీ జనసంఖ్యనుండి కొట్టివెయ్యబడడం కాదు, ఇక ఆ వ్యక్తికి ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చే ఆశీర్వాదం, రక్షణ దక్కకుండా ఆయన సన్నిధినుండి‌ వెలివెయ్యబడతాడు. ఇంతకూ పస్కా తర్వాత ఏడు దినాలు పులియని రొట్టెలను ఎందుకు తినాలంటే; 34,39 వచనాల ప్రకారం ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు ఎంత తొందరపెట్టి వెళ్ళగొట్టారంటే వారు రొట్టెలకోసం కలుపుకున్న పిండి పులిసే సమయం కూడా వారిని ఐగుప్తులో ఉంచలేదు. దేవుడు ఆవిధంగా వారిని రొట్టెలకోసం కలుపుకున్న పిండి పులిసే సమయం వరకూ కూడా అక్కడ నిలవనివ్వకుండా బయటకు తీసుకువచ్చాడు అనేదానికి జ్ఞాపకంగా ఈ ఆచారం నియమించబడింది.‌ ఇశ్రాయేలీయులు పస్కా పండుగలో పులియని రొట్టెలనే తింటూ అది జ్ఞాపకం చేసుకోవాలి.

అదేవిధంగా ఈ కట్టడ క్రీస్తు రక్తాన్ని బట్టి మనం దేవుని‌ ఉగ్రతనుండి తప్పించుకున్నాక, మరలా పాపంలో (పులిసిన‌ పిండి) కొనసాగకూడదనే నూతననిబంధన నియమానికి ఛాయగా ఉంది. పౌలు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని బోధించాడు (1 కొరింథీ 5:7,8). దీనిని బట్టి క్రీస్తు రక్తంలో పవిత్రపరచబడిన విశ్వాసులందరూ పాపం (పులిసిన పిండి) విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఇశ్రాయేలీయుల్లో ఆ నియమాన్ని మీరినవాడు కొట్టివెయ్యబడినట్టుగా మనం కూడా ఆయన సన్నిధినుండి వెలివెయ్యబడతాం.

హెబ్రీయులకు 10:26-29 మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?

నిజంగా మారుమనస్సు పొంది రక్షణలో ప్రవేశించిన ఏ విశ్వాసీ ఇలా చెయ్యలేడు. దీనిని బట్టి నిజవిశ్వాసులు ఎవరో అబద్ధ క్రైస్తవులు ఎవరో మనం గుర్తిస్తాం.

నిర్గమకాండము 12:16 ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవ దినమున పరిశుద్ధ సంఘము గాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియు గాక మరి ఏ పనియు చేయకూడదు.

ఈ వచనంలో దేవుడు పులియని రొట్టెలపండుగలో ఇశ్రాయేలీయులు పాటించవలసిన మరికొన్ని విధుల గురించి వివరించడం‌ మనం చూస్తాం.‌ ఇశ్రాయేలీయులకు శనివారం మాత్రమే కాకుండా ఈ పస్కా పండుగలో మరో రెండు విశ్రాంతి దినాలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు పస్కా పండుగలో చనిపోయిన కారణాన్ని బట్టి, ఆయన విశ్రాంతి దినానికి ముందు రోజు చనిపోయాడంటే శనివారానికి ముందు శుక్రవారం కాదు‌‌ కానీ ఈ పండుగలో వచ్చే విశ్రాంతి దినానికి ముందు రోజు చనిపోయాడని చాలామంది బైబిల్ పండితులు విశ్వసిస్తారు‌. ఇది తర్కబద్ధం కూడా. దీనిప్రకారం యేసుక్రీస్తు మూడురాత్రింపగళ్లు భూగర్భంలో ఉంటానని పలికిన మాటలను మనం చాలా సులభంగా వివరించవచ్చు.

అదేవిధంగా పస్కా బలిని బట్టి ఇశ్రాయేలీయులు సమాజంగా కూడుకోవడం విశ్వాసులమైన మనం సమాజంగా కూడుకుని ప్రభువును ఆరాధించడానికి ఛాయగా ఆజ్ఞాపించబడింది. ఈ కారణంగా ఎవరూ కూడా సమాజంగా కూడుకుని ప్రభువును ఆరాధించడాన్ని అశ్రద్ధ చెయ్యకూడదు (హెబ్రీ 10: 24,26).

నిర్గమకాండము 12:17,18 పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల పదునాలుగవదినము సాయం కాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను.

ఈ వచనంలో దేవుడు పులియని రొట్టెల పండుగను ఎందుకు ఆచరించాలో ఆ పండుగలో ప్రజలు ఏయే దినాన కూడుకోవాలో మరలా జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఇది ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి, దీనిగురించి ఆయన మరలా జ్ఞాపకం‌ చేస్తున్నాడు. పైన వివరించినట్టుగా పస్కాపశువు‌ వధించబడిన ఆబీబు నెల 14వ రోజు సాయంత్రం నుండీ ఏడు దినాలవరకూ అంటే, 21వ రోజు సాయంత్రం వరకూ ఇశ్రాయేలీయులు పులియని రొట్టెలనే తినాలి.

నిర్గమకాండము 12:19,20 ఏడు దినములు మీ యిండ్లలో పొంగిన దేదియును ఉండ కూడదు, పులిసిన దానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టిన వాడేగాని ఇశ్రాయేలీ యుల సమాజములో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను.

ఈ వచనాలలో దేవుడు పులిసిన పిండిని తినకూడదని, అలా తిన్నవాడు ఇశ్రాయేలీయులనుండి కొట్టివెయ్యబడతాడని మరలా జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. దానికి కారణం 15వ వచనంలో వివరించాను. అదేవిధంగా ఇశ్రాయేలీయులతో పాటు కొందరు అన్యులు కూడా నివసించేవారు, దేవుడు ఇశ్రాయేలీయులకు‌ విడుదల‌‌‌ కలిగించినప్పుడు వారు కూడా ఇశ్రాయేలీయులతో కలసి బయలువెళ్ళారు (38వ వచనం). ఇక్కడ వారి గురించే ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో నివసించే అన్యులు కూడా పులిసినదానిని తినకూడదని రాయబడింది.

నిర్గమకాండము 12:21,22 కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెను మీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింప వలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు.

ఈ వచనాలలో మోషే ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి పస్కా గురించి వారికి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడ వధింపబడిన పస్కా పశువుయొక్క రక్తాన్ని హిస్సోపు కుంచె (రెమ్మ) తో గుమ్మం ద్వారాలపై తాకించాలని రాయబడింది. ఈ హిస్సోపును యాజకులు కొన్ని దహనబలులలోనూ (సంఖ్యాకాండము 19:6) కుష్టురోగిని శుద్ధిచేసే క్రమంలోనూ పవిత్రజలం తయారు చేసే క్రమంలోనూ అపవిత్రుడైన వాడిని శుద్ధి చేసే క్రమంలోనూ (సంఖ్యాకాండము 19:18) ఉపయోగిస్తారు. ఇది మంచి సువాసనను వెదజల్లే చెట్టు. దీనిని పరిసరాలను శుభ్రం చెయ్యడానికీ అస్తమా రొమ్ములు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలను నయం చెయ్యడానికి కూడా (ఔషధంగా) వినియోగించేవారు. ఐతే ఇది భౌతికమైన శుద్ధికి సంబంధించిందే కాకుండా ఆత్మీయ శుద్ధికి కూడా ఛాయగా ఉంది. అందుకే దానిని గుర్తించిన దావీదు "నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము." (కీర్తనలు 51:7) అని ప్రార్థిస్తున్నాడు. ఈవిధంగా ఈ హిస్సోపు పరిశుద్ధాత్ముడు మనకు క్రీస్తు రక్తాన్ని అన్వయించడానికీ మనల్ని శుద్ధి చెయ్యడానికీ ఛాయగా ఉంది (1 పేతురు 1:2, 2 థెస్సలొనిక 2: 13). పస్కా పశువు వధించబడితే సరిపోదు, ఆ పశువుయొక్క రక్తం హిస్సోపు కుంచెద్వారా గుమ్మపు ద్వారాలపై తాకించబడాలి. అలానే క్రీస్తు యొక్క రక్తం పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు అన్వయించబడాలి. అప్పుడే మన పాపాలకు క్షమాపణ కలుగుతుంది. విశ్వాసి రక్షణలో ఇది పరిశుద్ధాత్ముడు పోషించే పాత్ర. తండ్రి ఎన్నుకున్నాడు, యేసుక్రీస్తు ఆ ఎన్నికలో ఉన్నవారికోసం రక్తం కార్చాడు, పరిశుద్ధాత్ముడు ఆ రక్తాన్ని వారికి అన్వయించి శుద్ధులుగా చేస్తున్నాడు.

1యోహాను 1: 7 ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

ఇలా పాతనిబంధనలోని వస్తువులూ వాటి రూపాలూ నూతననిబంధనలో జరిగేవాటికి ఛాయలుగా ఉన్నాయి (హెబ్రీ 10:1).

అదేవిధంగా మోషే ఇక్కడ "తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదని" ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఎందుకంటే వారు పస్కా పశువు యొక్క రక్తం తాకించబడిన గుమ్మం లోపల ఉన్నంతవరకే వారికి భద్రత ఉంటుంది. ఈ మాటలు ఒక విశ్వాసి దేవుని రక్షణలో ఉన్న సహవాసాన్ని (సంఘాన్ని) విడిచిపెట్టి మరలా లోకంవైపుకు తిరిగిపోకూడదని‌ మనల్ని హెచ్చరిస్తున్నాయి. పైన జ్ఞాపకం చేసినట్టు నిజమైన విశ్వాసి ఎప్పటికీ అలా చెయ్యలేడు, పొరపాటున బయటకు వెళ్ళినా మరలా తప్పిపోయిన కుమారుడిలా తిరిగివస్తాడు. నామకార్థ క్రైస్తవులు మాత్రం ఇక ఎప్పటికీ తిరిగిరారు.

1 యోహాను 2: 19 వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలువెళ్లిరి.

నిర్గమకాండము 12:23 యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.

ఈ వచనంలో మోషే పస్కా పశువు వధించబడిన రాత్రి ఐగుప్తులో ఏం జరుగుతుందో వివరించడం మనం చూస్తాం. ఇక్కడ ఆయన ఇశ్రాయేలీయుల గుమ్మాలపై ఉన్న రక్తపు గుర్తులను "చూసి" వారికి ఎటువంటి హానీ చెయ్యకుండా దాటిపోతాడని ఉంది. "చూసి" అంటే లక్ష్యపెట్టి అని అర్థం. ఈ సంఘటన క్రీస్తు రక్తం అన్వయించబడిన విశ్వాసిపై ఇక దేవుని ఉగ్రత నిలిచియుండదు, అనే నూతననిబంధన సత్యానికి ఛాయగా ఉంది. ఎందుకంటే దేవుడు తన కుమారుడైన క్రీస్తు రక్తాన్ని లక్ష్యపెట్టి ఆ రక్తం ఎవరికైతే అన్వయించబడిందో వారందరినీ నీతిమంతులుగా ప్రకటించి తన దత్తపుత్రులుగా స్వీకరిస్తాడు (రోమా 5:9-11). ఒకవేళ క్రీస్తు అనే పస్కాపశువు మనకోసం వధించబడకపోతే మన క్రియలను బట్టి మాత్రమే కాదు, మనలో ఉన్న పాపస్వభావాన్ని బట్టి కూడా మనందరమూ దేవుని ఉగ్రతకు పాత్రులం, ఆ ఉగ్రత కేవలం మనం రెండవమరణమైన నరకంలో పాలుపొందినప్పుడు మాత్రమే శాంతించేది (ఎఫెసీ 2:3).

నిర్గమకాండము 12:24,25 కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను.

ఈ వచనాలలో ఇశ్రాయేలీయులు పస్కాపండుగను ఆచరించేలా కట్టడ విధించబడడం మనం చూస్తాం. ఈ పస్కాను బట్టి కలుగుతున్న విడుదల ఇశ్రాయేలీయుల చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనది కాబట్టి, వారు దానిని ఆచరించి దేవుణ్ణి మహిమపరచాలి. అదేవిధంగా ఇక్కడ ఆ పండుగను నిరంతరం ఆచరించాలని ఆజ్ఞాపించబడింది. నిరంతరం అంటే అది దేనికైతే ఛాయగా ఉందో దాని నెరవేర్పు జరిగేంతవరకూ అని అర్థం. ఆ ఛాయ క్రీస్తులో నెరవేరింది. ఇప్పుడు మనమంతా క్రీస్తు బలికి సాదృశ్యమైన ప్రభువుబల్లలో పాలుపొందడం ద్వారా పస్కాను ఆచరిస్తున్నాం.‌

నిర్గమకాండము 12:26,27 మరియు మీకుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారముచేసిరి.

ఈ వచనాలలో పస్కా పండుగ గురించి ఇశ్రాయేలీయులు తమ పిల్లలకు బోధించాలని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. దేవుడు ఇలాంటి ఆచారాలను నియమించింది వాటి ద్వారా భవిష్యత్తు తరాలకు ఆ ఆచారం వెనుకున్న ఆయన గొప్ప కార్యాలను వివరించడానికే (నిర్గమకాండము 13:8,9, కీర్తనలు 145:4-6). అలా జరగకపోతే ఆ ఆచారాలు భవిష్యత్తు తరాలకు కేవలం ఒక ఆనవాయితీగా లేదా ఒక మూఢభక్తిగా మిగిలిపోతాయి. ఈ విషయంలో తల్లితండ్రులూ కుటుంబపెద్దలూ తమ పిల్లల విషయంలో జాగ్రత తీసుకోవాలి. ప్రభువు బల్ల తీసుకునే మనపై కూడా ఆయన మరణాన్ని ప్రకటించాలనే బాధ్యత మోపబడింది (1 కోరింథీ 11: 26). వాస్తవానికి ఆ సందర్భంలో "మీకుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు" వారికి ఏం చెప్పాలో రాయబడింది. మనమైతే మన పిల్లలు, ఇతరకుటుంబ సభ్యులు అడగకపోయినా వారు వినకపోయినా కూడా క్రీస్తు మరణం గురించే చెప్పేవారిగా ఉండాలి.

నిర్గమకాండము 12:28 అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు పస్కా విషయంలో మోషే చెప్పినమాటలన్నీ పాటిస్తున్నట్టు మనం చూస్తాం. గతంలో ఏ ప్రజలైతే మోషేను తృణీకరించారో (నిర్గమకాండము 5:21, 6:9) అదే ప్రజలు ఇక్కడ మోషే మాటప్రకారం నడుచుకుంటున్నారు. ఎందుకంటే అప్పటికే వారు మోషే ద్వారా దేవుడు చేయించిన తొమ్మిది తెగుళ్ళను చూసారు. ఈవిధంగా దేవుడు వారు మోషే మాట వినేలా చేసి, పస్కా విషయంలో తప్పిపోయి ఐగుప్తీయులతో పాటు నాశనం కాకుండా అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ఆయన చేసిన ప్రమాణం చొప్పున వారందరూ ఐగుప్తునుండి విడుదల పొందేలా వారిపట్ల కృపచూపించాడు. తొమ్మిది తెగుళ్ళ బాధనూ అనుభవించిన ఫరోకు కలగని వెలిగింపు, అవే తెగుళ్ళను కళ్ళారా చూసిన వీరికి కలిగింది. ఎందుకంటే దేవుడు తన ప్రమాణం నెరవేర్చుకునేలా ఆయనే ఆ వెలిగింపును వీరికి ప్రసాదించాడు. మానవహృదయాలపై దేవుని నియంత్రణను ఇక్కడ మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను

నిర్గమకాండము 12:29,30 అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.

ఈ వచనాలలో దేవుడు ముందుగా చెప్పినట్టే ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను సంహరించడం మనం చూస్తాం. తొలిచూలు పిల్లలు అన్నప్పుడు చిన్నపిల్లలే కాకుండా కుటుంబంలో మొదటపుట్టిన ప్రతీఒక్కరూ కాబట్టి, ఐగుప్తీయుల గృహాలన్నిటిలోనూ మొదటపుట్టినవారందరూ సంహరించబడ్డారు. ఈ తీర్పులో ఫరో కుమారుడు కూడా చనిపోయాడు. ఒకవేళ ఫరో కనుక మోషే హెచ్చరించినప్పుడే అతని‌ మాట వినుంటే ఈ పరిస్థితి రాకుండును. ఆ సమయంలో ఐగుప్తు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే ప్రతీ ఇంట్లోనూ ఎవరో ఒకరు చనిపోవడం‌ వల్ల కనీసం చుట్టుప్రక్కల ఇళ్ళవారు ఓదార్చడానికి వచ్చే పరిస్థితి కానీ ఆహారం తీసుకువచ్చే పరిస్థితి కానీ కనీసం శవాలను పాతిపెట్టడానికి సహకరించే పరిస్థితి కానీ లేదు. ఎవరి ఇంట్లో శవాన్ని వారే పాతిపెట్టుకోవలసి వచ్చింది (సంఖ్యాకాండము 33:3). దేవునితో పోరాడాలని చూస్తే పరిస్థితి ఇలానే ఘోరంగా ఉంటుంది.

అదేవిధంగా ఫరో ఇశ్రాయేలీయులను నిర్బంధిస్తే ఐగుప్తీయుల అందరి పిల్లలనూ చంపడం ఎంతవరకూ సమంజసం అనే ప్రశ్నకు ఇప్పటికే నేను వివరణ ఇచ్చాను (నిర్గమకాండము 11:5 వ్యాఖ్యానం చూడండి).

నిర్గమకాండము 12:31,32 ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించివారితో మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.

ఈ వచనాలలో ఫరో మరియు అతని సేవకులు వారి గృహాల్లో చనిపోయిన పిల్లల శవాలను పాతిపెట్టడం మానేసి మరీ మోషేను బ్రతిమిలాడుకోవడం మనం చూస్తాం. ఇది నిర్గమకాండము 11:4-8లో మోషే ఫరోకు చేసిన హెచ్చరికకు నెరవేర్పు. ఎప్పుడైతే తొలిచూలు పిల్లలు సంహరించబడ్డారో అది కూడా అర్థరాత్రి, ఐగుప్తీయులకు మహా వేదనతో పాటు ఇంకా ఏం ఘోరం జరుగుద్దో అనే భయం కూడా తీవ్రస్థాయిలో కలిగింది. అందుకే ఇక్కడ అప్పటికప్పుడు మోషే అహరోనులను పిలిపించిన ఫరో ఒకప్పటిలా ఎలాంటి నియంత్రణలూ పెట్టకుండా వారిని వెళ్ళిపోమని తనపై ఇంకే కీడూ రాకుండా దీవించమంటున్నాడు. దేవుడు ఈ విషయాన్ని ప్రారంభంలోనే మోషేకు తెలియచేసాడు (నిర్గమకాండము 4:21-23, నిర్గమకాండము 6:1).

నిర్గమకాండము 12:33,34 ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బల వంతముచేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టు కొని, తమ భుజములమీద పెట్టుకొని పోయిరి.

ఈ వచనాలలో ఐగుప్తీయులు కూడా తమ బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను తొందరపెట్టి ఐగుప్తునుండి పంపించే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం. దీనికి కారణం పై సందర్భంలో వివరించాను. తాను సూర్యదేవుని వంశీకుడినని దైవంతో సమానమైనవాడినని పొంగిపోయే ఫరోనే మోషే అహరోనులకు నమస్కరించి మరీ బ్రతిమిలాడుకుంటే ఇక సాధారణ ఐగుప్తీయుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో చెప్పనవసరం లేదుకదా! వారిక్కడ తమను తాము శవాలతో సమానం అనుకుంటున్నారు. తగిన సమయం వచ్చినప్పుడు దేవుని ప్రజలముందు ఎవరైనా తగ్గవలసిందే. ఇంతవరకూ తమ దేవతలను బట్టి అతిశయించిన వీరికి ఇప్పుడు ఆ దేవతలు కూడా ఏమీ చెయ్యలేని శవాలుగానే తోస్తున్నాయి. అందుకే ఈ సందర్భం గురించి ఆయన ఐగుప్తీయుల దేవతలన్నిటికీ తీర్పు తీర్చినట్టు రాయబడింది‌ (సంఖ్యాకాండము 33: 3,4).

అదేవిధంగా ఇక్కడ ఇశ్రాయేలీయులు రొట్టెల కోసం  సిద్ధపరచుకున్న పిండి పులియకముందే అక్కడినుండి వెళ్లగొట్టబడ్డారు. ఇలా తొందరపెట్టబడి అక్కడినుంచి భయటకు వచ్చాం అనడానికి జ్ఞాపకంగానే ఇశ్రాయేలీయులు పస్కా పండుగలో పులియని రొట్టెలను మాత్రమే తినాలి (15వ వచనం వ్యాఖ్యానం చూడండి). 

నిర్గమకాండము 12:35,36 ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పునచేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి. యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.

ఈ వచనాలలో దేవుడు ముందుగా చెప్పినట్టుగానే ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల దగ్గర వెండి బంగారు నగలు అడగడం, ఐగుప్తీయులు యెహోవా కలుగచేసిన కటాక్షాన్ని బట్టి వారు అడిగినవన్నీ వారికి ఇవ్వడం మనం చూస్తాం. ఇది అబ్రాహాముకు దేవుడు సెలవిచ్చిన మాటకు నెరవేర్పు (ఆదికాండము 15:14). దీనిగురించి మనం మూడు విషయాలు తెలుసుకోవాలి.

1. ఐగుప్తీయులు ఇంతవరకూ ఇశ్రాయేలీయుల చేత కఠినసేవ చేయించుకున్నారు కాబట్టి ఇశ్రాయేలీయులు వారిదగ్గర వెండి బంగారు నగలు తీసుకోవడం న్యాయమే. వాస్తవానికి అది వారికి రావలసిన జీతం‌.

2. ఇశ్రాయేలీయులు ఐగుప్తుపై యుద్ధం చెయ్యకపోయినా అక్కడినుండి యుద్ధసైన్యంగా ఐగుప్తీయులను జయించినవారిగా బయలుదేరారు, యుద్ధంలో కొల్లసొమ్ము తీసుకోవడం న్యాయమే.

యోబు 27:16,17 ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ పరచుకొనినను వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు.

3. భూమియూ దాని సంపూర్ణతయూ యెహోవాయే అయినప్పుడు (కీర్తనలు 24:1) ఆయన ఎవరి దగ్గరనుంచైనా దేనినైనా తీసుకుని వేరేవారికి పంచగలడు. దాని వెనుక న్యాయమైన కారణాలు ఉంటాయి.

కీర్తనలు 146:7 బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడిన వారిని విడుదలచేయును.

ఈవిధంగా ఐగుప్తీయుల దగ్గర వెండిబంగారు నగలను తీసుకోమని దేవుడే ఆజ్ఞాపించాడు కాబట్టి వారు తీసుకున్నారు. మనమెందుకు తీసుకోవట్లేదంటే మనకు అలా చెయ్యమని ఆజ్ఞాపించలేదు.

నిర్గమకాండము 12:37 అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కో తుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు వెళ్ళినట్టు మనం చూస్తాం. రామసేసు అనేది అంతవరకూ ఇశ్రాయేలీయులు నివసించిన గోషెను అనే ప్రాంతానికి మరోపేరు (ఆదికాండము 47:4,11). సుక్కోతు అనే ప్రాంతానికి ఆ పేరు యాకోబును బట్టి పెట్టబడింది (simple_tooltip content='అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై పోయి తనకొకయిల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను.']ఆదికాండము 33: 17[/simple_tooltip]).

అదేవిధంగా ఇక్కడ ఇశ్రాయేలీయుల కాల్బలము ఆరులక్షలుగా చెప్పబడడం మనం చూస్తాం. కాల్బలము అంటే స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కాకుండా 20 సంవత్సరాలు పైబడి యుద్ధం చెయ్యగలిగే పురుషులని అర్థం (సంఖ్యాకాండము 1:3). ఇక్కడ ఆరులక్షలు అనేది ఇంచుమించుగా చెప్పబడిన సంఖ్య, వాస్తవానికి వీరు ఆరులక్షల, మూడువేల, ఐదువందల యాబై మంది (సంఖ్యాకాండము 1: 46). అయితే దేవునిమాట చొప్పున ఈ సంఖ్యలో లేవీగోత్రం లెక్కించబడలేదు‌ (సంఖ్యాకాండము 1: 47-49).

నిర్గమకాండము 12:38 అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు వారి మందలతో పాటుగా అనేకులైన అన్యుల సమూహం కూడా బయలువెళ్ళినట్టు మనం చూస్తాం. ఈ అన్యులు కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ ఇశ్రాయేలీయులతో సంబంధం కలిగియున్నారు. అది స్నేహ సంబంధం కావొచ్చు వివాహ సంబంధం కూడా కావొచ్చు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు విడుదల‌ కలుగచేసినప్పుడు వారు కూడా ఇశ్రాయేలీయులతో పాటు బయలుదేరారు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా ఉండడం స్పష్టంగా గమనించిన వీరు భౌతికపరమైన ప్రయోజనాలకోసం కూడా వారితో బయలుదేరారు. వీరిలో కొందరు ఇశ్రాయేలీయులకూ ఐగుప్తీయులకూ పుట్టినపిల్లలు కూడా ఉన్నారు (లేవీకాండము 24:10-14). ఇశ్రాయేలీయులు మాంసము విషయంలో దేవుణ్ణి శోధించి, శిక్షించబడడానికి ఈ మిశ్రితజనం కూడా ఒక కారణం (సంఖ్యాకాండము 11: 4). కాబట్టి మనం అన్యులతో కలసి జీవిస్తున్నప్పుడు వారి పాపంలో పాలిభాగస్తులు కాకుండా వారిని బట్టి దేవుణ్ణి శోధించేవారంగా మారకుండా జాగ్రతలు తీసుకోవాలి. బైబిల్ అన్యులతో స్నేహం చెయ్యవద్దని కానీ వారితో కలసి జీవించవద్దని కానీ చెప్పడం లేదు.  (1 కొరింథీ 5:10). కానీ వారి పాపం విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఉండమంటుంది.

ఈరోజు చదువుకునే ప్రాంతాల్లోనూ (కాలేజ్, హాస్టల్) ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లోనూ అన్యులతో కలసి పయనిస్తున్న విశ్వాసులందరూ ఈ ఇశ్రాయేలీయుల సంఘటనను బట్టి చాలా జాగ్రత్త కలిగియుండాలి. వారు ఇశ్రాయేలీయుల్లో మాంసాపేక్షను పుట్టించి దేవుణ్ణి శోధించేలా చేసినట్టే వీరు కూడా దేవునికి ఇష్టం కాని కార్యాలపై మనకు ఆసక్తి పెరిగేలా వారి పాపంలో మనం కూడా పాలివారమయ్యేలా ప్రేరేపిస్తుంటారు. దీనివల్ల దేవునికి వ్యతిరేకంగా పాపం‌చేసి ఆయనను శోధించినవారం ఔతాం. ఉదాహరణకు; సినిమాలు చూపించడం, పోకిరీమాటలు మాట్లాడడం, వెళ్ళకూడని ప్రదేశాలకు తీసుకెళ్ళేలా బలవంతం చెయ్యడం. ముఖ్యంగా యవ్వన విశ్వాసులందరూ ఈ విషయాలలో జాగ్రత్త కలిగియుండాలని నా మనవి. "మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి" (1 కోరింథీ 10: 9).

నిర్గమకాండము 12:39 వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు రొట్టెల కోసం సిద్ధపరచుకున్న పిండి పులవకుండా ఉండడం వారు దానితోనే రొట్టెలను చేసుకుని తినడం మనం చూస్తాం. వారు ఇలా రొట్టెలకోసం కలుపుకున్న పిండి పులియడానికి ముందే ఐగుప్తీయులు తొందరపెట్టి  అక్కడినుంచి భయటకు పంపించేసారు అనడానికి జ్ఞాపకంగానే ఇశ్రాయేలీయులు పస్కా పండుగలో పులియని రొట్టెలను మాత్రమే తినాలి.

నిర్గమకాండము 12:40,41 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు. ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను.

ఈ వచనాలలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం గురించీ ఇశ్రాయేలీయులు ఆయన సేనలుగా వర్ణించబడడం గురించీ మనం చూస్తాం. వాస్తవానికి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించింది 430సంవత్సరాలు కాదు. మన బైబిళ్ళు తర్జుమా చెయ్యబడిన హీబ్రూ "Masoretic" వ్రాతప్రతిలో (క్రీస్తుశకం 10/11) ఈ వచనం తప్పుగా అనువదించబడింది. చేతులతో ప్రతులు రాసే ఆ సమయంలో ఆలాంటి పొరపాట్లు జరగడం సహజం. దీనిగురించి మనం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందిన "Septuagint" (LXX) అదేవిధంగా "Masoretic" వ్రాతప్రతికంటే పురాతన ప్రతియైన "Samaritan Pentateuch" లను పరిశీలించినప్పుడు "ఇశ్రాయేలీయులు మరియు వారి పితరులు, కనానులోనూ ఐగుప్తులోనూ నివసించిన కాలం 430సంవత్సరాలు" అని ఉంటుంది. అబ్రాహాము కనాను దేశానికి వచ్చినప్పటినుండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయలువెళ్ళే వరకూ మధ్య ఉన్న సమయమే ఈ 430 సంవత్సరాలు. దీనిగురించి పౌలు కూడా తన పత్రికలో జ్ఞాపకం చేస్తాడు (గలతీ 3:16,17). ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా జీవించింది కేవలం 215 సంవత్సరాలు మాత్రమే. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

ఇశ్రాయేలీయులు, ఐగుప్తులో ఎంతకాలం బానిసలుగా, నివసించారు? 430/400/215?

అదేవిధంగా "ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను" అని‌‌ మనం చదువుతున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని తరపున దుర్మార్గులైన కనానీయులపై యుద్ధం చేయబోతున్నారు కాబట్టి, వారు దేవుని సేనగా వర్ణించబడ్డారు.

ద్వితియోపదేశకాండము 20: 16 అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్య ముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రదుకనియ్యకూడదు.

నిర్గమకాండము 12:42 ఆయన ఐగుప్తుదేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే.

ఈ వచనంలో పస్కాను ఆచరించవలసిన రాత్రి గురించి మరోసారి జ్ఞాపకం చెయ్యబడడం మనం చూస్తాం. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం; పస్కాపశువు యొక్క రక్తాన్ని గుమ్మపు ద్వారాలకు తాకించడం, ఆ ఇంటినుండి బయటకు వెళ్ళకపోవడం, కాళ్ళకు చెప్పులు తొడుగుకుని కర్రను చేతపట్టుకుని త్వరపడుతూ దానిని తినడం, ఎవరి గృహాల దగ్గర వారే పస్కా పశువును వధించడం ఈసారికి మాత్రమే పరిమితం.

నిర్గమకాండము 12:43-45 మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెనుఇది పస్కాపండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవ డును దాని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును. పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.

ఈ వచనాలలో ఇశ్రాయేలీయులతో కలసి జీవిస్తున్న అన్యులకు కూడా పస్కాలో పాలుపొందే అవకాశం కల్పించబడడం మనం చూస్తాం. అయితే దానికి వారు ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధనకు గురుతైన "సున్నతి" చేయించుకుని ఆ‌ నిబంధన క్రిందకు రావాలి. అప్పుడు వారు కూడా ఇశ్రాయేలీయులతో పాటు దేవుని ప్రజలుగా గుర్తించబడతారు.

నిర్గమకాండము12:46 మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు.

ఈ వచనంలో దేవుడు పస్కా పశువును ఒకే ఇంటిలో తినాలని, ఆ పశువుయొక్క శరీరం ఒక్క ఎముకను కూడా విరవకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. 4వ వచనంలో వివరించినట్టుగా క్రీస్తుకు ఛాయగా ఉన్న పస్కా పశువుయొక్క మాంసం వృధా కాకుండా ఉదయం వరకూ మిగిలిపోకుండా ఏదైనా కుటుంబంలో సభ్యులు తక్కువగా ఉంటే వేరే కుటుంబంతో కలసి ఆ పశువును వధించాలి. అయితే వారు ఆ పశువు మాంసాన్ని ఆ ఇంటినుండి తమ స్వంత ఇంటికి తీసుకునిపోకుండా ఏ ఇంటివద్ద ఐతే ఆ పశువు వధించబడిందో ఆ ఇంటి గుమ్మపు ద్వారాలకే దాని రక్తాన్ని తాకించి అదే ఇంటిలో ఆ మాంసం తిని తెల్లవారేవరకూ అక్కడే నివసించాలి. ఆ ఇతర కుటుంబానికి చెందిన ఇంటిలో ఆ రాత్రి ఎవరూ ఉండరు కాబట్టి, ఆ ఇంటి గుమ్మానికి రక్తాన్ని తాకించకపోయినా ఎలాంటి ప్రమాదమూ లేదు.

ఇక ఆ పశువుయిక్క శరీరంలో ఒక్క ఎముకను కూడా విరవకూడదు అనే ఆజ్ఞ సిలువలో క్రీస్తు ఎముకలు ఒకటి కూడా విరిగిపోకుండా ఆయన కాపాడేదానికి ఛాయగా ఉంది (కీర్తనలు 34: 20, యోహాను 19:31-36).

సిలువ వెయ్యబడిన వ్యక్తి కాళ్ళకు చేతులకూ మేకులు కొట్టబడి వ్రేలాడుతుంటాడు. ఆ సమయంలో కాళ్ళపైన ఆధారపడుతూ ఊపిరి తీసుకుంటుంటాడు. మేకు కొట్టబడిన కాళ్ళపై ఆధారపడి అలా చెయ్యడం అత్యంత బాధను‌ కలిగిస్తుంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం సాయంత్రం అయ్యేసరికి ఇశ్రాయేలీయుల దేశంలో ఎవరూ అలా వ్రేలాడుతూ ఉండకూడదు కాబట్టి, సాయంత్రానికి ముందే సైనికులు సిలువలో అలా కాళ్ళపై ఆధారపడి ఊపిరితీసుకుంటున్న నిందితుల కాళ్ళను విరగగొట్టేస్తారు. అప్పుడు వారిక ఊపిరి తీసుకోవడం కష్టమై చనిపోతారు (యోహాను 19:31,32). ఇది సిలువ మరణంలో ఆనవాయితీగా జరిగేదే. కానీ యేసుక్రీస్తు విషయంలో దేవుడు దీనిని అద్భుతంగా తప్పించాడు. దానికి ఛాయయే పస్కాపశువు యొక్క ఎముకలు విరగకుండా భుజించడం.

నిర్గమకాండము 12:47 ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.

ఈ వచనంలో మరలా పస్కాపండుగ గురించి జ్ఞాపకం చెయ్యబడడం మనం చూస్తాం. దీని ప్రాముఖ్యతను వివరించడానికే అన్నిసార్లు జ్ఞాపకం చెయ్యబడుతుంది.

నిర్గమకాండము 12:48,49 నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలెననెను.

ఈ వచనాలను ఇప్పటికే నేను వివరణ ఇచ్చాను (43-45 వ్యాఖ్యానం చూడండి). ఒక్క పస్కా విషయంలో మాత్రమే కాదు, చట్టపరంగా కూడా దేవుడు ఇశ్రాయేలీయులకూ వారిమధ్య నివసించే పరదేశులకూ ఒకే న్యాయాన్ని ప్రకటించాడు. ఇది ఆయన అనుసరించే సమానత్వాన్ని సూచిస్తుంది. ఆయనలో ఎలాంటి పక్షపాతం, వివక్షలకు చోటు ఉండదు (లేవీయకాండము 24:17-22, సంఖ్యాకాండము 15:29-31). దేవుని పిల్లలు కూడా ఇలాంటి స్వభావమే కలిగియుండాలి. బహిరంగంగా కాకపోయినా చివరికి మనసులో అలాంటి బేధాలు పెట్టుకున్నా సరే (పక్షపాతం వివక్షలు) వారు అసలు దేవునిపిల్లలుగా పిలవబడడానికి అనర్హులు (యోబు 13: 10, యాకోబు 2: 9).

నిర్గమకాండము 12:50 ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల మాటలప్రకారం చేస్తున్నట్టు మనం చూస్తాం. ఇప్పటికే దీనికి వివరణ ఇచ్చాను (28వ వచనం వ్యాఖ్యానం చూడండి).

నిర్గమకాండము 12:51 యెహోవా ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినట్టు మనం చూస్తాం. ఇది అబ్రాహాము యాకోబులతో దేవుడు చేసిన ప్రమాణంయొక్క నెరవేర్పు (ఆదికాండము 15:13-16, ఆదికాండము 46:2-4). భక్తుడైన యోసేపు ప్రవచనానికి కూడా ఇది నెరవేర్పు (ఆదికాండము 50:24).