Hits: 141
Print
రచయిత: కె విద్యా సాగర్

 లేవీయకాండము 27:1-7 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను. నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలము యొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను. ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను. అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను. ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను. అరువది ఏండ్ల ప్రాయముదాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.

ఈ వచనాలలో "విశేషమైన మ్రొక్కుబడి" చేసుకున్నవారు చెల్లించవలసిన వెల గురించి మనం చూస్తాం. విశేషమైన మ్రొక్కుబడి అంటే దేవుడు తమకు చేసిన మేలులను బట్టో లేక హృదయ ప్రేరేపణను బట్టో చేసుకునే మ్రొక్కుబడి. అలా చేసుకున్నవారు ఈ వచనాలలో నిర్ణయించబడిన వెలను యాజకుని వశం చెయ్యాలి. యాజకుడు వాటిని ప్రత్యక్షగుడారం యొక్క సేవ నిమిత్తం ఉపయోగిస్తాడు. అయితే ఈ మ్రొక్కుబడి సొమ్ములో మూడు విధాల వయసుల వారికీ మరియు స్త్రీ పురుషులకు మధ్య బేధం ఉన్నట్టు గమనిస్తాం. "ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలము యొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను. ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను" కానీ "అరువది ఏండ్ల ప్రాయముదాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను".

దీనికి కారణం ఏంటంటే; 20-60 వయసులో ఉన్నవారు బాగా కష్టపడి ధనం సంపాదిస్తారు కాబట్టి వారికి "యేబది తులముల వెండి" నిర్ణయించబడింది. కానీ 60 యేళ్ళు దాటినవారు అంతగా కష్టపడి సంపాదించలేరు కాబట్టి వారికి "పదునైదు తులముల వెండి" మాత్రమే నిర్ణయించబడింది. అదే 5 యేళ్ళు నుండి 20 యేళ్ళు లోపుగలవారు ఇంకా తక్కువ సంపాదించడమో లేక తల్లితండ్రులపైన ఆధారపడో జీవిస్తారు కాబట్టి వారికి ఇంకా తక్కువ ధనం నిర్ణయించబడింది. ఈవిధంగా వారు సంపాదించే సామర్ధ్యాన్ని బట్టి వారికి వెల నిర్ణయించబడింది. ఆ కాలంలో స్త్రీలు కూడా పురుషులకంటే తక్కువే సంపాదించేవారు కాబట్టి వారి అన్ని వయసుల వారికీ పురుషులకంటే తక్కువ వెల నిర్ణయించబడింది. దీనినిబట్టి ఆయన మనుషుల సామర్థ్యాన్ని బట్టే అడిగే దేవుడని మనకు అర్థమౌతుంది. ఈ నియమం క్రింది వచనంలో కూడా స్పష్టమౌతుంది.

లేవీయకాండము 27:8 ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన యెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమిచొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను.

ఈ వచనంలో బీదల పట్ల దేవుని కనికరాన్ని మనం చూస్తాం. ఈ నియమాన్ని బట్టి మ్రొక్కుబడికి నిర్ణయించబడిన సొమ్ము లేనంతమాత్రాన ఎవరూ మ్రొక్కుబడి చేసుకోకుండా ఆగిపోవక్కర్లేదు. యాజకుడు ఆ బీదవాడికి ఉన్న కలిమిని బట్టి మ్రొక్కుబడి సొమ్మును నిర్ణయిస్తాడు. బలి అర్పణల విషయంలో కూడా బీదలపట్ల ఇలాంటి కనికరమే చూపించబడింది (లేవీకాండము 5:7-11). కాబట్టి ఆయనపట్ల భక్తితో చేసుకునే మ్రొక్కుబడులూ పాపపరిహారార్థం నిమిత్తమైన బలి అర్పణలూ కొందరు చెయ్యగలిగియుండి కొందరు చెయ్యలేకుండా నియమించబడినవి కావు. అవి అందరూ చెయ్యగలిగేలానే నియమించబడ్డాయి. ఎందుకంటే ఆయన ఎవరికీ దూరంగా ఉండే దేవుడు కాడు.

ఈ నియమాన్ని‌ బట్టి సంఘంలో మనం పోషించవలసిన పాత్రల విషయంలో చెల్లించవలసిన కానుకల విషయంలో మన స్థాయికి తగ్గ నిర్ణయాలు తీసుకోవాలి. పెద్ద పాత్రలను పోషించే అలానే ఎక్కువ కానుకను చెల్లించే సామర్థ్యాన్ని ఆయన అనుగ్రహించియుంటే ఆ సామర్థ్యానికి తగినట్టుగా ప్రవర్తించాలి. చిన్న పాత్రలనే పోషించే తక్కువ కానుకనే చెల్లించే స్థాయి మనదైతే ఆ స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. ఏ పాత్రనూ పోషించకుండా ఉండడం, ఏమీ చెల్లించకుండా ఉండడం మాత్రం నిషేధం. అలా ఎవ్వరూ ఉండకూడదనే ఆయన స్థాయికి తగినట్టుగా నియమించాడు.

లేవీయకాండము 27:9,10 యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. అట్టిదానిని మార్చకూడదు; చెడ్డదానికి ప్రతిగా మంచిదాని నైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చినయెడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును.

"యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో" అంటే గోవులలో కానీ గొర్రె మేకలలో కానీ అయ్యుండాలి (లేవీకాండము 1:1,2). అలాంటి వాటిలో దేనినైనా దేవునికి మ్రొక్కుకుంటే దానిని ఆయనకు తప్పనిసరిగా బలి అర్పించాలని ఏ కారణాన్ని బట్టి కూడా ఆ పశువును మార్చకూడదని ఈ వచనం చెబుతుంది. "చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు" ఎందుకంటే దేవునికి చెందింది అన్నప్పుడు అది దేవునికి చెందిందే. దేవునికి చెందినవాటి విషయంలో తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే హక్కు మనిషికి ఉండదు. ఒకవేళ వాటికి ఏదైనా కళంకం కలిగితే కళంకం ఉన్నవాటిని ఆయనకు అర్పించకూడదు కాబట్టి ఆ పశువు విషయంలో ఏం చెయ్యాలో యాజకుడు నిర్ణయిస్తాడు. అంటే అపవిత్ర జంతువు తరహాలో దాని వెలను నిర్ణయించి తీసుకుంటాడు (11-13) మ్రొక్కుబడి చేసుకున్న వ్యక్తి మాత్రం ఆ పశువు స్థానంలో మరో పశువును ప్రవేశపెట్టకూడదు‌.

ఈ నియమం దేవునికి చెందిన మన జీవితాలు దేవునికి మాత్రమే స్వంతమని బోధిస్తుంది. ప్రభువును విశ్వసించిన సమయంలో మనమంతా ఇక మన జీవితాలు ఆయనకే అంకితమని మ్రొక్కుబడి చేసుకున్నాం. ఆ విషయంలో ఇక ఎలాంటి మార్పూ ఉండకూడదు. ఆయనకు చెందిన మన జీవితం విషయంలో మనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే హక్కు మనకు లేదు.

"పశువుకు పశువును మార్చినయెడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును"

దీనిప్రకారం; ఒక పశువును మ్రొక్కుబడి చేసుకుని దాని స్థానంలో మరో పశువును ప్రవేశపెట్టినవాడు రెండింటినీ ఆయనకే అర్పించాలి. దేవునికి మ్రొక్కుబడి చేసుకున్నవాటి విషయంలో మార్పులు చేస్తే రెండింతలుగా నష్టపోవలసి వస్తుందని ఈ నియమం హెచ్చరిస్తుంది.

లేవీయకాండము 27:11-13 జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల ఆ జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టిదానిని విడిపింపగోరిన యెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను.

దేవునికి అర్పించకూడని జంతువులు అంటే; గోవులు, గొర్రెలు, మేకలు మినహా అన్నీ ఆయనకు అర్పించకూడనివే. అలాంటి జంతువుల విషయంలో ఏం చెయ్యాలనేది ఈ వచనాల్లో చూస్తాం. వాటిని యాజకుడి వద్దకు తీసుకురావాలి, యాజకుడు వాటిని బలి అర్పించకుండా వెలను నిర్ణయించి ఆ వెలకు తీసుకుంటాడు. "యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును" ఈ మాటలు బాగా గమనించండి. దేవునికి చెందిన వాటి విషయంలో ఏ నిర్ణయమైనా దేవుడే చెయ్యాలని వాటి అర్థం. యాజకుడు దేవుని ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఆ నిర్ణయం అతనే చెయ్యాలి. అది కూడా దేవుని ఆజ్ఞ ప్రకారమే అతను చెయ్యాలి.

"అయితే ఒకడు అట్టిదానిని విడిపింపగోరిన యెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను"

ఈ మాటలు తొందరపాటు మ్రొక్కుబడుల విషయంలో హెచ్చరికగా ఉన్నాయి. అంటే ఒకడు తన పశువును మ్రొక్కుబడి చేసుకుని తీరా ఆ మ్రొక్కుబడిని ఉపసంహరించుకోవాలంటే (ఆ మ్రొక్కుబడి నుండి విడిపించాలంటే) అప్పుడు అతను ఇంకా ఎక్కువగా అనగా యాజకుడు ఆ పశువుకు నిర్ణయించిన వెలకు మరో 5% కలిపి చెల్లించాలి. తొందరపాటు మ్రొక్కుబడులు చేసుకుని వాటి విషయంలో ఉపసంహరణలకు (విడిపింపులకు) పోకుండా ఈ నియమం ప్రవేశపెట్టబడింది. అందుకే "అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్యమైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేని నైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించిన యెడల ప్రతి ష్ఠించినదానిని అమ్మకూడదు "విడిపింపనుకూడదు" ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును" (లేవీయకాండము 27:28) అని రాయబడింది. దీనివల్ల ఎవ్వరూ తొందరపాటు మ్రొక్కుబడులు చేసుకోరు, చేసుకున్నా ఉపసంహరించుకోరు.

"అట్టిదానిని విడిపింపగోరిన యెడల" అనే మాటలు ఈ భావంలోనే ఎందుకు తీసుకోవాలంటే ఆ విడిపింపు అపవిత్ర జంతువుల తరహాలో సాధారణ విడిపింపే ఐతే యాజకుడు నిర్ణయించిన వెలకు మరలా 5% అధనంగా చెల్లించనవసరం లేదు కదా!. అందుకే సందర్భంలో ఆ మాటలు మ్రొక్కుబడి ఉపసంహరణలకు సూచిస్తున్నాయి.

ఇక్కడ "యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో" కూడా ఆయనకు మ్రొక్కుబడులు ఎందుకు అనుమతించబడింది, అర్పించే పశువుల విషయంలోనే ఆ అనుమతి ఉండొచ్చుగా అనే సందేహానికి స్పష్టతను ఇవ్వదలిచాను.

8 వచనపు వ్యాఖ్యానంలో ఆయన మ్రొక్కుబడులు కొందరు చెయ్యగలిగియుండి కొందరు చెయ్యలేనివిగా నియమించబడలేదని తెలియచేసాను. ఆవిధంగా ఆలోచించినప్పుడు అర్పించకూడని జంతువులు మాత్రమే ఉన్నవారు మ్రొక్కుబడి విషయంలో నిరాశపడకుండేలా అర్పించకూడని జంతువులను కూడా ఆయనకు మ్రొక్కుబడి చేసుకునే అవకాశం ఆయన కల్పించాడు. ఎవరికి వారు తమకు ఉన్నదానిలోనే ఆయనకు సమర్పించవచ్చని ఈ నియమం నేర్పిస్తుంది.

లేవీయకాండము 27:14,15 ఒకడు తన యిల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన యెడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన యిల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన యెడల అతడు నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు దానితో కలుపవలెను; అప్పుడు ఆ యిల్లు అతనిదగును.

ఈ వచనాల్లో ఇళ్ళకు సంబంధించిన ప్రతిష్టత గురించి మనం చూస్తాం. అలా ఇంటిని ప్రతిష్టించినవారికి ఆ ఇంటికి తగిన వెలను యాజకుడు నిర్ణయిస్తాడు, ఇంటి యజమాని ఆ వెలను చెల్లించాలి. ఒకవేళ ఇంటిని ప్రతిష్టించినవాడు ఆ ప్రతిష్టను ఉపసంహరించుకోవలంటే (ప్రతిష్ట నుండి విడిపించాలంటే) యాజకుడు నిర్ణయించిన వెలకు మరో ఐదంతలు అధనంగా చెల్లించాలి. ఈ నియమం తొందరపాటు మ్రొక్కుబడుల విషయంలో హెచ్చరికగా ప్రవేశపెట్టబడిందని 11-13 వ్యాఖ్యానంలో వివరించాను.

అయితే ఇళ్ళకు సంబంధించిన ఈ ప్రతిష్టత కొందరికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ దేవునికి మ్రొక్కుబడి చేసుకోవడానికి పశువులూ భూములూ లేనివారికి ఇది మంచి అవకాశంగా మనం భావించవచ్చు, లేదా ఆ ఇంటికివారికి ఆశీర్వాదం కలిగేలా కూడా ఈ ప్రతిష్టత నియమించబడియుండొచ్చు.

లేవీయకాండము 27:16-18 ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన యెడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది. అతడు సునాదసంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతి ష్ఠించినయెడల నీవు నిర్ణయించు వెల స్థిరము. సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాదసంవత్సరము వరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను.

ఈ వచనాలలో పొలం ప్రతిష్ట గురించి మనం చూస్తాం. "విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను" అంటే ఆ పొలంలో ఎంతమేర విత్తనాలు చల్లి పంట పండించగలమో దాని లెక్క చొప్పున యాజకుడు ఆ పొలానికి వెల‌ నిర్ణయిస్తాడు. "పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది" పందుము అంటే వారు విత్తనాలను కొలిచే తూనిక. ఒక పందుము విత్తనాలు పట్టే భూమికి 50 తులాల వెండి చొప్పున నిర్ణయించాలి. జూబిలీ (50వ సంవత్సరం) కి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఆ సంవత్సరాల లెక్క చొప్పున నిర్ణయించాలి. ఒకవేళ జూబిలీ సంవత్సరానికి మరు సంవత్సరమే పొలాన్ని ప్రతిష్టిస్తే ఇంకా 50 సంవత్సరాల లెక్క చొప్పున వెల నిర్ణయించాలి. జూబిలీకి 10 సంవత్సరాలే ఉంటే ఆ సంవత్సరాల లెక్క చొప్పున వెల నిర్ణయించాలి. ఎందుకంటే ఆ జూబిలీ (సునాద) సంవత్సరంలో ఎవరి భూమి వారికి తిరిగి చెందుతుంది కాబట్టి ఆ సంవత్సరాల లెక్క చొప్పునే వెల నిర్ణయించాలి. ఈ జూబిలీ గురించి ఇప్పటికే వివరించాను (లేవీకాండము 25:10-16 వ్యాఖ్యానం చూడండి).

లేవీయకాండము 27:19 పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును.

ఈ వచనం ప్రకారం; పొలాన్ని ప్రతిష్టించినవాడు ఆ పొలాన్ని విడిపించాలంటే అనగా ఆ ప్రతిష్టను ఉపసంహరించుకోవాలంటే యాజకుడు ఆ పొలానికి నిర్ణయించిన వెలకు మరో 5% కలిపి చెల్లించాలి. ఈ నియమం తొందరపాటు ప్రతిష్టల విషయంలో హెచ్చరికగా ఉంది.

లేవీయకాండము 27:20,21 అతడు ఆ పొలమును విడిపింపనియెడలను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు. ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.

ఈ వచనం ప్రకారం పొలాన్ని ప్రతిష్టించిన వ్యక్తి ఆ పొలానికి యాజకుడు నిర్ణయించిన వెల చెల్లించి దానిని విడిపించుకోకుండా ఉన్నా మోసంగా ఆ పొలాన్ని వేరే వ్యక్తికి అమ్మివేసినా ఆ పొలం జూబిలీ సంవత్సరంలో కూడా ఇంక ఎవరికీ చెందదు, యాజకుడే దానికి హక్కుదారుడు ఔతాడు. అంటే ప్రతిష్టపేరుతో దేవుణ్ణి‌ మోసం చెయ్యాలనుకున్నవాడు శాశ్వతంగా తన పొలాన్ని కోల్పోతాడని ఈ మాటలు హెచ్చరిస్తున్నాయి.

లేవీయకాండము 27:22-24 ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించిన యెడల యాజకుడు సునాదసంవత్సరము వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను. సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను.

ఈ వచనాల ప్రకారం; ఎవరైనా వ్యక్తి తాను కొనుక్కున్న పొలాన్ని దేవునికి ప్రతిష్టిస్తే యాజకుడు జూబిలీ సంవత్సరాల లెక్క చొప్పున దానికి వెల నిర్ణయించి ఆ వ్యక్తి వద్దనుండి ఆ వెలను తీసుకోవాలి. అయితే ధర్మశాస్త్ర నియమం ప్రకారం జూబిలీ (50 వ) సంవత్సరంలో పొలాలను అమ్మినవారంతా మరలా వాటిని పొందుకుంటారు కాబట్టి ప్రతిష్టించబడిన ఈ పొలం కూడా ప్రతిష్టించిన వ్యక్తికి అమ్మినవాడికి స్వంతం ఔతుంది. దేవునికి ప్రతిష్టించినప్పటికీ ఆ పొలాన్ని అమ్మినవాడికి అప్పగించవలసిందే. జూబిలీ నియమం మారదు. ఈ నియమం దేవుని ప్రతిష్టిత పేరుతో దేవుని నియమాలను మార్చలేమని బోధిస్తుంది.

లేవీయకాండము 27:25 నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు.

ఈ వచనంలో యాజకుడు నిర్ణయించవలసిన వెల కొలత గురించి మనం‌ చూస్తాం. "ఒక తులము ఇరువది చిన్నములు". చిన్నమును Gerah అంటారు. మన కొలతలో అది 0.57 గ్రాములు. అలాంటి 20 చిన్నాలు ఒక తులం. అంటే 11.4 గ్రాములు కలిపి ఒక తులం. ఈ పరిశుద్ధ స్థలం అనగా ప్రత్యక్షగుడారంలో దేవుడు నిర్ణయించిన కొలత చొప్పునే ప్రతిష్టతల విషయంలో యాజకుడు వెలలు నిర్ణయించాలి. తనంతట తానుగా చెయ్యడానికి ఉండదు.

లేవీయకాండము 27:26 అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱెమేకల మందలోనిదైననేమి యెహోవాదగును.

ఈ అధ్యాయంలో చెప్పబడిన జంతు ప్రతిష్టతలన్నీ స్వచ్చందంగా మ్రొక్కుబడి చేసుకునేవి. కానీ తొలిచూలులు స్వచ్చందంగా మ్రొక్కుకునేవి కావు. ఎందుకంటే దేవుడు ఐగుప్తీయుల పశువుల తొలిచూలులని నాశనం చేసినదానికి జ్ఞాపకంగా ఇశ్రాయేలీయుల తొలిచూలులన్నీ దేవునికే స్వంతం (నిర్గమకాండము 13:12-15, 34:19). కాబట్టి వాటిని స్వచ్చందంగా మ్రొక్కుబడి చేసుకోకూడదు. అవి అప్పటికే దేవునివి. ఈ నియమం మనం దేవునికి మ్రొక్కుకునేవి/చెల్లించేవి మనవే అయ్యుండాలని నేర్పిస్తుంది. అవి దేవునికి చెందినవి కానీ లేక ఇతరులకు చెందినవి కానీ అయ్యుండకూడదు.

లేవీయకాండము 27:27 అది అపవిత్రజంతువైన యెడల వాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును. దాని విడిపింపని యెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను.

అపవిత్రజంతువులను అనగా గోవులు, గొర్రెలు మేకలు మినహా మిగిలినవన్నీ అపవిత్రజంతువులయ్యుండి వాటిని దేవునికి అర్పించకూడదు కాబట్టి యాజకుడు వాటికి నిర్ణయించిన వెలను చెల్లించాలి. వాటిని అమ్మైనా సరే ఆ వెలను చెల్లించాలి. గమనించండి; ప్రతిష్ట చేసినంతమాత్రాన అపవిత్రజంతువులు పవిత్రజంతువులై పోలేదు, అవి బలికి వినియోగించబడలేదు. ఎందుకంటే దేవుడు తన‌ బలికోసం నిర్ణయించినవే పవిత్ర జీవులు. అవి మాత్రమే బలికి వినియోగించాలి. నియమం మారదు. దీనినిబట్టి దేవుని నిర్ణయంలో లేనివారిని మనం బాప్తీస్మాల పేరుతో ప్రతిష్టించినప్పటికీ ఏ ఉపయోగం ఉండదని గుర్తించాలి.

లేవీయకాండము 27:28,29 అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్యమైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించిన యెడల ప్రతిష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను.

ఈ వచనాల్లో మొదటిగా దేవునికి ప్రతిష్టించినవాటిని "అమ్మకూడదు, విడిపింపనుకూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును" అని చూస్తాం. అవి ఆయనకు ప్రతిష్టించినవి కాబట్టి మనుషులు వాటిని "అమ్మకూడదు, విడిపింపనుకూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును". అయితే యాజకుడు నిర్ణయించిన వెల‌ చెల్లించి వాటిని విడిపించకూడదని కాదు, మ్రొక్కుబడిని ఉపసంహరించుకునేలా విడిపించకూడదని అర్థం. దానిగురించి 11-13 వ్యాఖ్యానంలో వివరించాను.

"మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను"

ఇవి చాలా వివాదాస్పదమైన మాటలు. కొందరు ఈ మాటలను "మనుష్యులలో గాని..." అనే మాటలతో ముడిపెట్టి యెహోవా దేవుడు మనుషులను కూడా తనకు బలి అర్పించమంటున్నాడు (హతం చెయ్యమంటున్నాడు) అని ఆరోపిస్తుంటారు. కానీ ఈ మాటలకు ఆయనకు బలిగా అర్పించేవి మాత్రమే విడిపించకుండా హతం చెయ్యాలని భావం. ఎందుకంటే పై వచనాల్లోనే ఆయనకు ప్రతిష్టించినప్పటికీ అపవిత్రజంతువులను బలిగా అర్పించకూడదని చూసాం. అలాగే ఇక్కడ "పొలములలో" అని కూడా చెప్పబడింది. పొలాన్ని ఎలా హతం చెయ్యగలం? కాబట్టి ఈ మాటలను పూర్తి ధర్మశాస్త్రం వెలుగులో అర్థం చేసుకోవాలి. దానిప్రకారం; అపవిత్ర జంతువులను కానీ మనుష్యులను కానీ ఆయనకు బలి అర్పించకూడదు, వెల చెల్లించి విడిపించాలి. ఈ వ్యాసం చదవండి. అందులో ఈ నియమాన్ని బట్టే యొప్తా తన కుమార్తెను బలి అర్పించాడా అనేదానికి కూడా వివరణ ఇచ్చాను.

యెహోవా దేవుడు నరబలులు కోరేవాడా?

లేవీయకాండము 27:30 భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.

ఈ వచనంలో ధాన్యంలోనూ ఫలాల్లోనూ దశమభాగం గురించి మనం చూస్తాం. దశమభాగం అంటే పదవవంతు అని అర్థం. అది యాజకుల కుటుంబాలకూ దేశంలోని పేదలకూ వినియోగించబడుతుంది.

లేవీయకాండము 27:31 ఒకడు తాను చెల్లింపవలసిన దశమభాగములలో దేనినైనను విడిపింపగోరిన యెడల దానిలో అయిదవ వంతును దానితో కలుపవలెను.

ఈ మాటలు దశమభాగం విషయంలో తప్పించుకునేవారికి హెచ్చరికగా రాయబడ్డాయి. దానివల్ల వారు ఇవ్వవలసిన దానికి మరో 5% కలిపి చెల్లించాలి. ఎందుకంటే దశమభాగం దేవునికి చెందింది కాబట్టి ఆ విషయంలో ఏ మినహాయింపూ ఉందదు. ఆయనకు చెందింది ఆయనకు ఇవ్వవలసిందే. ఈ నియమం మనకు కూడా వర్తిస్తుంది. సంఘానికి మనం దశమభాగం కంటే ఎక్కువ ఇవ్వొచ్చు కానీ తక్కువ ఇవ్వకూడదు. అది ఆయన నియమించిన కొలత. కొందరు జ్ఞానహీనులు ఇది ధర్మశాస్త్రంలోని ఆజ్ఞ కాబట్టి మనకు వర్తించదని బోధిస్తుంటారు‌. కానీ కొట్టివెయ్యబడని ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నీ మనకు ప్రామాణికమే. నూతననిబంధన దశమభాగాన్ని ఎక్కడా కొట్టివెయ్యలేదు. అలాగే దశమభాగం అనేది ధర్మశాస్త్రంలోనే కాదు అబ్రాహాము నుండీ మనం చూస్తాం (ఆదికాండము 14:18-20). అయితే ఇచ్చేవారు ఎలాంటి బోధకులకు ఇస్తున్నారో దానిని ఆ‌ బోధకుడు ఎలా వినియోగిస్తున్నాడో పరీక్షించుకోవడం ప్రాముఖ్యం.

లేవీయకాండము 27:32,33 గోవులలోనేగాని గొఱ్ఱె మేకలలోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చ కూడదు. దాని మార్చిన యెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును; అట్టిదాని విడిపింపకూడదని చెప్పుము.

ఈ వచనాల్లో పశుసంపందలో దశమభాగం గురించి మనం చూస్తాం. ప్రతిష్టించినవాటి తరహాలోనే "అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చ కూడదు. దాని మార్చిన యెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును" అనే మాటలను ఇక్కడ మరలా చూస్తున్నాం. దానికి కారణం; 9-10 వచనాలలో వివరించాను. ఈ దశమభాగం ద్వారా వచ్చిన పశుసంపదను యాజకులు నిత్యం అర్పించవలసిన బలులకోసం వినియోగిస్తారు‌. అలానే వారి పోషణకు కూడా అవి నియమించబడ్డాయి. పశుసంపదే కాదు, ఈ అధ్యాయంలో చెప్పబడిన ప్రతిష్టల వెల సొమ్ములు, ధాన్యం, ఫలాలు అవన్నీ ప్రత్యక్షగుడారపు సేవకోసమూ యాజకుల కుటుంబాల పోషణకోసమూ దేశంలోని పేదవారికోసమూ వినియోగించబడతాయి. కాబట్టి దేవుడు ఒక ఉద్దేశంతో ప్రతిష్టలకు వెల నిర్ణయించాడు, దశమభాగం నియమించాడు.

లేవీయకాండము 27:34 ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.

ఇంతటితో ఈ పుస్తకం ముగుస్తుంది. ఇంతవరకూ సీనాయి కొండ నుండి మోషేతో మాట్లాడిన ఆయన తదుపరి పుస్తకం నుండి ప్రత్యక్షగుడారం నుండి మాట్లాడడం గమనిస్తాం.