Hits: 224
Print
రచయిత: పి. శ్రావణ్ కుమార్

పౌలు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో రక్షణ (salvation) ఎలా వస్తుందో స్పష్టంగా క్రమబద్ధంగా వివరించాడు. గలతీ సంఘానికి ఈ సత్యాన్ని అర్థమయ్యేలా ఆయన మూడు ముఖ్య అంశాల ద్వారా బోధించాడు:

1. మొదటి 5 వచనాలు – అనుభవానికి సంబందించిన ప్రశ్నలు
పౌలు గలతీ విశ్వాసులను వారి స్వంత అనుభవాన్ని గుర్తు చేస్తూ ఐదు ప్రశ్నలు అడుగుతున్నాడు.
వారు ధర్మశాస్త్ర క్రియల ద్వారా రక్షణ పొందారా? లేక విశ్వాసముతో సువార్త విని రక్షణ పొందారా? అనే విషయాన్ని వారి నోటితోనే ఒప్పించే విధంగా ప్రశ్నలు వేస్తున్నాడు. దీని ద్వారా రక్షణ విశ్వాసం ద్వారానే వచ్చిందని స్పష్టం చేస్తున్నాడు.

2. 6 నుండి 18 వచనాలు – లేఖనాల ద్వారా నిరూపణ
ఈ భాగంలో పౌలు పాత నిబంధన లేఖనాలను ఉదాహరణగా తీసుకుని రక్షణ విశ్వాసం ద్వారా వస్తుందని నిరూపిస్తున్నాడు.
ప్రత్యేకంగా అబ్రాహాము ఉదాహరణను చూపిస్తూ అతను ధర్మశాస్త్రం వల్ల కాదు, దేవునిపై విశ్వాసం వలననే నీతిమంతుడిగా లెక్కించబడ్డాడని చెబుతున్నాడు.

3. 19వ వచనం నుండి - ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం
“అయితే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది?” అనే ప్రశ్నకు సమాధానం ఈ భాగంలో చూస్తాం. ధర్మశాస్త్రం రక్షణ కోసం కాదు, మనుషుల పాపాన్ని తెలియచెయ్యడానికి, మరియు క్రీస్తు వరకు మనలను నడిపించే గురువులాగా (teacher/guardian) ఇవ్వబడింది అని వివరిస్తున్నాడు.

సారాంశం:
ఈ అధ్యాయంలో పౌలు ఒక ముఖ్యమైన సత్యాన్ని బలంగా ప్రకటిస్తున్నాడు -
రక్షణ ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాదు, యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే లభిస్తుంది.

“ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!" గలతి 3:1

"ఓ అవివేకులైన గలతీయులారా" - అవివేకులు అంటే తెలివిలేని వారు లేదా తర్కబద్ధంగా ఆలోచించని వారు అని అర్ధం. "అవివేకులు" అనే పదం గ్రీకులో "అనోఎటోస్" (anoētos) అని ఉంది. ఈ పదం క్రొత్త నిబంధనలో 6 సార్లు వాడబడింది. ఇందులో 5 సార్లు పౌలే ఈ పదాన్ని వాడాడు. నిజానికి ఈలోకంలో పుట్టిన ప్రతిఒక్కరూ అవివేకులు అని పౌలు తీతుకు రాసిన పత్రికలో చెబుతున్నాడు (తీతుకు 3:3). ప్రతిఒక్కరు దేవుడు లేడని, ఉన్నా ఆయన నా పాపాన్ని పట్టించుకోడని, తమను తాము సంతోషపరచుకోవడమే జీవిత లక్ష్యమని భావిస్తారు (కీర్తనలు 14:1, 53:1, లూకా 12:19,20, మత్తయి 7:26). గలతీయులు ఇంకా అలంటి అవివేకులుగా ఉన్నారు అని పౌలు చెప్పట్లేదు. వారు సువార్తను విన్నారు, విని విశ్వసించారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మారిన వీరు, దేవుని సువార్త ప్రకారం నడుచుకోకుండా కొందరు అబద్ధ బోధకుల మాటలు విని, భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోతున్నారు. అందుకే పౌలు వీరిని అవివేకులు అని సంబోధిస్తున్నాడు.

"మిమ్మును ఎవడు భ్రమపెట్టెను" - "బాస్కినో" (baskaino) అనే గ్రీకు పదాన్ని భ్రమపెట్టెను అని తెలుగులోకి అనువదించారు. ఈ పదం కొత్త నిబంధనలో ఒక్కసారి మాత్రమే వాడబడింది అది ఇక్కడే. రెండు రకాలుగా జనాలు భ్రమపెట్టబడే అవకాశం ఉంది. ఏమి తెలియని వాళ్ళకి ఒక అబద్ధం చెప్పి దానిని నమ్మించి వారిని ఆవిధంగా భ్రమపెట్టొచ్చు లేదా అన్నీ తెలిసిన వారిని వారికి తెలిసిన విషయాలు సరైనవి కావు అని నమ్మించి భ్రమపెటోచ్చు.

అపొస్తలుల కార్యములు 8:9 లో గారడీ సీమోను, తన గారడీ విద్యలను ప్రదర్శించి జనాలను విభ్రాంతిపరచుచుండెను అని చూస్తాం. అక్కడ ఉన్న జనాలకి దేవుని గురించిన సత్యం తెలియదు గనుక, "కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరు దేవుని మహాశక్తి యనబడిన వాడు ఇతడే అని చెప్పు కొనుచు అతని లక్ష్యపెట్టిరి" అని మనం చదువుతున్నాం. దేవుని గురించి ఏమి తెలియనివాళ్ళని భ్రమపెట్టొచ్చు. ఎలా భ్రమపెట్టొచ్చు అంటే నేనే దేవుణ్ణి అని చెప్పొచ్చు, దేవుళ్ళు కానీ వాటిని దేవుళ్ళు అని జనాలను నమ్మించిన మోసం చెయ్యొచ్చు.

దేవుని గురించి తెలిసిన వాళ్ళు కొన్ని సార్లు అబద్ద బోధకుల మాయ మాటలకు లొంగిపోయి దేవుని సత్యం నుండి తొలిగిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు, పౌలు కొరింధీయులకు రెండవ పత్రిక రాస్తూ 11:3లో "సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడు చున్నాను." అని అంటున్నాడు. అదేవిధంగా గలతీ సంఘంలో అబద్ద బోధకులు (సాతాను రాయబారులు) నిజమైన సువార్తను నమ్మి క్రీస్తును వెంబడిస్తున్న వారిని, వేరొక సువార్త తట్టు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వేరొక సువార్తే నిజమైన సువార్త అని, వీరు ఇప్పటివరకు నమ్మింది నిజం కాదు అని భ్రమపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా - నిజానికి క్రీస్తును సిలువ వేసినప్పుడు గలతీయులు అక్కడ లేరు, వారికి ఆ విషయాల గురించి ఏమి తెలియదు. అయితే పౌలు గలతీ ప్రాంతంలో బహుగా సువార్తను ప్రకటించాడు. గలతీయులు క్రీస్తు సిలువ వేయబడడం చూడకపోయినప్పటికీ క్రీస్తు సిలువవేయబడడం, మరణించి, పాతిపెట్టబడి, మూడవ రోజున తిరిగి లేవడం అనే ఈ వాస్తవాలను పౌలు వీరికి కచ్చితంగా బోధించాడు అని మనం అర్ధం చేసుకోవాలి. క్రీస్తు సిలువ కార్యాన్ని కళ్ళకు కట్టినట్టు పౌలు వీరికి వర్ణించాడు కాబట్టి ఈ మాటలు చెబుతున్నాడు.

“ఇది మాత్రమే మీవలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా?" గలతి 3:2

పౌలు తన ప్రశ్నలను కొనసాగిస్తూ తన రెండవ ప్రశ్నను అడుగుతున్నాడు. గలతీ సంఘం వారు పరిశుద్ధాత్మను ఎలా పొందారో చెప్పాలి అని ప్రశ్నిస్తున్నాడు. సువార్త ప్రకటనలో భాగంగా ఆత్మను పొందుకోవడం అనే అంశం గురించి అపొస్తలులు ఎప్పుడూ ప్రకటిస్తూనే ఉన్నారు. గలతీ ప్రాంతంలో కూడా పౌలు సువార్త ప్రకటించినప్పుడు ఈ విషయాలు ఖచ్చితంగా బోధించే ఉంటాడు. ఈ వాక్యభాగాలను గమనించండి:

"మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి." (ఎఫెసీ 1:13)

"పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను." (అపొ.కార్యములు 10:44)

ఈ వచనాలను బట్టి సువార్త విని, క్రీస్తు నందు విశ్వసించిన వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, విశ్వాసమూలంగా ఆ కార్యం జరుగుతుంది. విశ్వాసమూలంగా ఆత్మను పొందుకుంటారు అని గలతీ సంఘస్థులకు తెలుసు. వారు రక్షణ పొందినప్పుడు వారి క్రియలను బట్టి కాకుండా క్రీస్తును విశ్వసించడం ద్వారానే ఆత్మను పొందుకున్నారు. పౌలు వారి నోటి ద్వారానే ఈ సమాధానం రప్పించడానికి ఈ ప్రశ్నను లేవనెత్తాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఆత్మను పొందకపోతే రక్షణకు ధర్మశాస్త్ర క్రియలు అవసరం అని చెప్పే వాదన ఎంత అవివేకమో పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. రక్షణకు ధర్మశాస్త్ర క్రియలు అవసరం లేదు, వాటిని చెయ్యడాన్ని బట్టి మనం దేవుణ్ణి మెప్పించలేము, ఆ క్రియల ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోలేము.

“మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?" గలతి 3:3

పౌలు గలతీ సంఘాన్ని ఎందుకు అవివేకులు అని మొదటి వచనంలో (గలతీ 3:1) ప్రస్తావించాడో ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. ఇది పౌలు గలతీయులను అడుగుతున్న మూడవ ప్రశ్న.

మొదట ఆత్మానుసారముగా ఆరంభించి - అని పౌలు చెప్పినప్పుడు, వారు నిజంగా దేవుని సువార్త విని రక్షణ పొందారు అని అర్ధం చేసుకోవాలి. మొదట అంటే వారు సువార్త విన్నపుడు అని అర్ధం. అప్పుడు వారు ఆత్మ ద్వారా జీవింపచెయ్యబడ్డారు, పాపం విషయంలో ఒప్పించబడి, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారు, దీనినే పౌలు ఆత్మానుసారంగా ఆరంభించడం అంటున్నాడు. ప్రభువే నన్ను రక్షించేది అనే గ్రహింపుతో ఆరంభించి, నేనే నా రక్షణను కొనసాగించుకోవాలి అనే తప్పుడు మార్గంలోకి వెళ్ళే క్రమంలో వీళ్ళు ఉన్నారు. అందుకే:

యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా - అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాడు. శరీరానుసారముగా అని పౌలు చెప్పినప్పుడు, అది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అని అర్ధం చేసుకోవాలి. శరీరానుసారముగా పరిపూర్ణులవ్వడం అంటే ధర్మశాస్త్ర క్రియలను బట్టి పరిపూర్ణులవ్వడం లేదా పరిశుద్ధపరచబడడం అని అర్ధం. ఆత్మానుసారంగా ఆరంభమైన రక్షణను, శరీరానుసారమైన పద్ధతులద్వారా మెరుగు పరుస్తారా? ఆలా సాధ్యపడదు అని మనం గ్రహించాలి. రక్షణను అనుగ్రహించింది దేవుడైతే దానిని కొనసాగించేది కూడా దేవుడే.

"మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును." (1 కొరింథీ 1:8)

"తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వ మును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక." (యూదా 1:24,25)

తొట్రిల్లకుండా తన ప్రజలను కాపాడేది దేవుడే అంతము వరకు మనలను నిరపరాధులగా ఉంచగలిగేది దేవుడు మాత్రమే. మన శక్తి మరియు మన క్రియలు మన రక్షణను నిలపలేవు. ఇక్కడ గలతీయులు శరీరానుసారంగా పరిపూర్ణులవ్వడానికి ప్రయత్నిస్తున్నారా అని పౌలు ప్రశ్నించినప్పుడు తన ఉద్దేశం, "మీ రక్షణకు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలం కాదు, వాటిని చెయ్యడం ద్వారా దేవుని ఆత్మకార్యాన్ని మీరు అవమానిస్తున్నారు" అని చెప్పడమే.

ఒక్క విషయం గమనించండి, రక్షణ కోసం ధర్మశాస్త్రాన్ని పాటించే వారి గురించి మాత్రమే పౌలు ఈ మాటలు చెబుతున్నాడు. అయితే రక్షించబడిన వారు దేవుని ధర్మశాస్త్రంలోని నైతికపరమైన ఆజ్ఞలను పాటించకూడదు అని చెప్పట్లేదు. రక్షణ పొందిన వారు దేవుని ఆజ్ఞలను రక్షణ పొందడానికి పాటించరు కాని, రక్షణ పొందారు కాబట్టి, దేవుని ఆత్మతో నింపబడి నూతన స్వభావాన్ని సంతరించుకున్నారు కాబట్టి పాటిస్తారు. ఈ వ్యత్యాసాన్ని ఈ పత్రిక చదివేప్పుడు గుర్తుంచుకోవాలి. పౌలు ధర్మశాస్త్రం అని ఎప్పుడు సంబోధించినా అది రక్షణ కోసం దానిని పాటించే వారిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడుతున్నాడు తప్ప రక్షించబడిన వారు దేవుని నైతికపరమైన ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంలో మాట్లాడడం లేదు.

“వ్యర్థముగానేయిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? " గలతి 3:4

ఇది పౌలు గలతీయులను అడుగుతున్న నాల్గవ ప్రశ్న. మీరు ఇప్పటివరకు సువార్త పక్షాన పడిన కష్టాల వలన ఉపయోగం ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు, "వ్యర్థముగానేయిన్ని కష్టములు అనుభవించితిరా?"

రక్షణ విశ్వాసమూలముగానే అనే సువార్తను ప్రకటించినప్పుడు, యూదులు ఆ సువార్తకు వ్యతిరేకంగా దానిని ప్రకటించిన వారిని మరియు దాని పక్షాన నిలబడ్డ వారిని హింసించారు.

"అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగపుట్టించిరి" (అపొ.కార్యములు 14:2)

"అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి" (అపొ.కార్యములు 14:22)

పై వచనాలను చూసినప్పుడు, రక్షణ విశ్వాసమూలంగానే అని చెప్పినవారిని లేదా నమ్మిన వారిని యూదా అధికారులు హింసించారు అని తెలుస్తుంది, అదే సందర్భంలో పౌలు, ఈ సువార్త పక్షాన నిలబడి దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు, దీని కోసం చాలా శ్రమలు అనుభవించవలసి వస్తుంది అని చెప్పాడు.

ఈ విషయంలోనే పౌలు గలతీయులను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నలను బట్టి గలతీయులు, రక్షణ విశ్వాసమూలముగానే అని నమ్మి రక్షింపబడి దాని పక్షాన శ్రమపొందారు అని మనం అర్ధం చేసుకోవచ్చు, అయితే ఇప్పుడు ఆ సువార్తను విడిచిపెట్టేసి ధర్మశాస్త్ర క్రియల వైపు తిరుగుతున్నారు గనుక, మీరు సువార్త పక్షాన పొందిన శ్రమలు గుర్తుచేసుకోండి, దీని కోసం శ్రమపడ్డారా?, ధర్మశాస్త్రం రక్షణకు అవసరం అని మీరు ముందే ఒప్పుకొని ఉంటే అసలు ఈ శ్రమలు మీకు ఉండేవే కాదు కదా. అందుకు భిన్నంగా గలతీయులు రక్షణకు విశ్వాసం అవసరం అని ఒప్పుకొని రక్షించబడి దాని పక్షాన శ్రమపొంది ఇప్పుడు వేరొక సువార్త వైపుకు తిరిగి పోతున్నారు గనుక, వారి శ్రములు కూడా నిజముగా వృథా అయిపోతాయేమో అని పౌలు వారిని ప్రశ్నిస్తున్నాడు.

“ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు? " గలతి 3:5

పౌలు ఇక్కడ తన ఐదవ ప్రశ్నను గలతీ సంఘం ముందు ఉంచుతున్నాడు. మీ మధ్య అద్భుతకార్యాలు ఎలా జరుగుతున్నాయి అని ప్రశ్నిస్తున్నాడు. గలతీయులకు ఈ విషయం ఇంకొంచెం స్పష్టంగా అర్ధం కావడానికి, వారి ముందు రెండు ఎంపికలు ఉంచాడు.

1. ధర్మశాస్త్రసంబంధ క్రియలవలన అద్భుతాలు జరుగుతున్నాయా?

2. విశ్వాసముతో వినుటవలన అద్భుతాలు జరుగుతున్నాయా?

కచ్చితంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల ఎప్పుడూ ఏ అద్భుతం జరగలేదు. ఉదాహరణకు, సున్నతి పొందడం వల్ల ఏమైనా అద్భుతాలు జరిగాయా? లేదు. గలతీ సంఘంలో కూడా దేవుని యందు విశ్వాసముంచడాన్ని బట్టే అద్భుతాలు జరిగాయి అని మనం తెలుసుకోవాలి. ఈ ప్రశ్నకు గలతీయులు "విశ్వాసమూలంగానే" అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పుంటారు.

కొన్ని వచనాలు గమనిద్దాం:

"మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను; అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను." (అపొ.కార్యములు 19:11,12)

"ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను." (రోమా 15:18)

ఈ వచనాలను బట్టి దేవుడు పౌలు ద్వారా అనేక అద్భుతాలను జరిగించాడని, అది తాను ప్రకటిస్తున్న సువార్తను ధృవీకరించేదిగా ఉందని తెలుస్తుంది. పౌలు గలతీ సంఘంలో కూడా సువార్త ప్రకటించినప్పుడు అద్భుత కార్యాలు చేసాడు, అదేవిధంగా అద్భుతవరాలు కలిగిన విశ్వాసులు కూడా ఆ సంఘంలో ఉన్నారు అని భావించొచ్చు. పౌలు గలతీయులను అడిగిన ప్రశ్నలు వారిని సూటిగా గుచ్చేలాగా సత్యాన్ని వెలికితీసేలాగా ఉన్నాయి అని గమనించాలి.

పౌలు గలతీయులను అడిగిన ఐదు ప్రశ్నలు, వాటికి గలతీ సంఘంవారు ఇచ్చిన సంభావ్యమైన సమాధానాలు చూద్దాం.

ప్రశ్న 1. సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!

జవాబు 1. ఔను క్రీస్తు సిలువవేయబడ్డాడు

ప్రశ్న 2. ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా?

జవాబు 2. విశ్వాసంతో వినుటవలనే ఆత్మను పొందుకున్నాం

ప్రశ్న 3. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?

జవాబు 3. లేదు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులవ్వడం సాధ్యపడదు

ప్రశ్న 4. వ్యర్థముగానేయిన్ని కష్టములు అనుభవించితిరా?

జవాబు 4. ఈ కష్టాలన్నీ మేము క్రీస్తు కోసం అనుభవించాం, వ్యర్ధంగా పోవడానికి ఈ కష్టాలన్నీ మేము అనుభవించలేదు.

ప్రశ్న 5. మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు

జవాబు 5. విశ్వాసంతో వినుటవలనే మా మధ్య అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు

గలతీయులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా వారు భ్రమపరచబడుతున్నారు అనే సంగతిని గ్రహించి, తమ రక్షణ యొక్క గొప్పతనాన్ని, దేవుని ఉచితమైన కృపను తెలుసుకుని అబద్ద బోధకుల మార్గం నుండి బయటకు వచ్చివుంటారు అని ఖచ్చితంగా చెప్పగలం.

ప్రియా సహోదరుడా/సహోదరి, ఇవే ఐదు ప్రశ్నలు దేవుడు నిన్ను అడుగుతుంటే నీ పరిస్థితి ఎలా ఉంది. రక్షణకు క్రీస్తు చేసిన సిలువ యాగం మాత్రమే మార్గం అని, విశ్వాసమూలంగానే రక్షణ అని తెలుసుకుని, ఆ మార్గంలో కాకుండా ఇప్పుడు వేరొక మార్గంలో నడుస్తున్నావా? గుర్తుంచుకో మన నీతి కార్యాలన్నీ దేవుని ముందు మురికి గుడ్డలలాంటివి. నీ రక్షణకు నీ క్రియలు కారణం కావు, అలాంటి రక్షణ అసలు రక్షణే కాదు.

నేను దేవునికోసం చాలా పనులు చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నేను రక్షింపబడ్డాను అని నువ్వు అనుకుంటే అది పొరపాటే అని గమనించు. దేవుని చేత విశ్వాసమూలముగా నువ్వు అంగీకరించబడిన తర్వాత, నువ్వు దేవుని కోసం పని చెయ్యి దానిని దేవుడు అంగీకరిస్తాడు.

గలతీ సంఘం వారిలాగా నువ్వు కూడా ఏ విషయంలో అయినా తప్పుడు బోధలు విని వారి మార్గంలో నడుస్తుంటే వెంటను నీ మనసు మార్చుకో ఆ అబద్ద బోధకులు నిన్ను నాశనానికి తీసుకుపోతున్నారు అని తెలుసుకో వారి భ్రమలో పడిపోయి అలానే కొనసాగొద్దు, ఆలా ఉంటే నువ్వు కూడా అవివేకివే అని, నీ రక్షణ నిజమైనది కాదు అని, నువ్వు దేవుని కోసం అనుకుని చేసే ప్రతి పనీ వ్యర్థమని, నువ్వు ఆయన పక్షాన పడ్డ కష్టాల వలన కూడా ఏ ఉపయోగం లేదు అని తెలుసుకో నీ మనసు మార్చుకో.

“అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచబడెను." గలతి 3:6

రక్షణ విషయంలో గలతీయుల అనుభవం గురించి మొదటి ఐదు వచనాలు చూసాం, ఇప్పుడు రక్షణ విషయంలో లేఖనాలు ఏమి చెబుతున్నాయి అనే విషయాన్ని పౌలు వివరించబోతున్నాడు. ఈ వచనంలో "అబ్రాహాము.....నీతిమంతుడుగా ఎంచబడ్డాడు" అనే అంశం ప్రస్తావించబడింది. ఇది ఎలా సాధ్యపడింది అనే విషయాన్ని పరిశీలిస్తే "అబ్రాహాము దేవుని నమ్మెను" అనే మాటను చూస్తున్నాం. అంటే అబ్రాహాము యొక్క రక్షణ ధర్మశాస్త్ర క్రియల మూలంగా కలిగింది కాదు, విశ్వాసమూలంగానే కలిగింది. ఇది పౌలు స్వంతంగా చెబుతున్న మాట కాదు, ఇది పాతనిబంధనలో రాయబడిన విషయమే.

"అతడు (అబ్రాహాము) యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను." (ఆదికాండము 15:6)

ఆదికాండము 15 వ అధ్యాయం సందర్భం చూస్తే: అక్కడ దేవుడు అబ్రాహాముకు - ఇస్సాకు పుట్టుక గురించిన వాగ్దానాన్ని ఇచ్చాడు, అతని ద్వారా నీ సంతానం ఆకాశ నక్షత్రాలలాగా విస్తరిస్తుంది అని చెప్పాడు. ఇన్ని సంవత్సరాలనుండి సంతానం లేకుండా ముసలి వాడైపోయిన అబ్రాహాము, దేవుని మాటలను నమ్మాలా? వద్దా? అన్న సందర్భంలో "అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను" అనే మాటను చూస్తాం. అంటే దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన దేవుని పైనే ఆధారపడింది కాని, అబ్రాహాము క్రియల మీద ఆధారపడి లేదు అని తెలుస్తుంది. ఆ నిబంధనలో పాలుపంచుకోవడానికి, అబ్రాహాము చెయ్యగలిగిందల్లా దేవుని మాటను నమ్మడమే, అదే అబ్రాహాము చేసాడు. అందును బట్టి అతను నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. గలతి 3:6లో "యెంచబడెను" అనే మాటను గమనిస్తే, నిజానికి అబ్రహాము దేవుని ముందు నీతిమంతుడు కాదు, అన్య దేవుళ్ళను పూజిస్తున్న సమయంలో దేవుడు అబ్రాహామును పిలిచాడు (యెహోషువ 24:2). అబ్రాహాము యొక్క స్వంత నీతి అంటూ ఏమి లేదు, అతను కూడా దేవుని ముందు అందరిలాగా పాపిగానే పరిగణించబడ్డాడు. అయితే దేవుని మాటను విశ్వసించడాన్ని బట్టి, అబ్రాహాముకు లేని నీతిని దేవుడు అతనికి ఆపాదించాడు. అందుకే, అబ్రాహాము యొక్క విశ్వాసం (దేవునిని నమ్మడం) అతనికి నీతిగా యెంచబడెను అని వాక్యం చెబుతుంది.

అయితే మీకు ఒక సందేహం రావచ్చు, అబ్రాహాము దేవుని నమ్మిన కారణంగా నీతిమంతుడు అని ఎంచబడ్డాడు అనేది వాస్తవమైతే అబ్రాహాము క్రియలు ఎందుకు అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి? ఉదాహరణకు ఆదికాండము 22 వ అధ్యాయంలో, ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకుపోయిన సందర్భంలో దేవుడు, "నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు." (ఆదికాండము 22:16,17) అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు తన నిబంధనను, అబ్రాహాము చేసిన క్రియను బట్టి దయచేస్తున్నాడు అనే అర్ధం కనబడుతుంది కదా అని ప్రశ్నించొచ్చు.

ఈ విషయం అర్ధం చేసుకోవడానికి ఒక చిన్న ప్రశ్న, అబ్రాహాము తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి వెనుకాడడు అని దేవునికి ముందే తెలుసా తెలియదా? ఖచ్చితంగా ఆ విషయం దేవునికి ముందే తెలుసు, అయితే దేవుడు ఎందుకు ఈ పని చెయ్యమన్నాడు అంటే 15వ అధ్యాయంలో చెప్పబడిన అబ్రాహాము విశ్వాసం (దేవుని నమ్మడం) యొక్క నిజరూపం క్రియల్లో వ్యక్తపరచబడడానికి అని గమనించాలి. ఇంకా సులభంగా చెప్పాలంటే నేను చెప్పే మాట, నేనే చేసే ఆలోచనలు, నా క్రియల మూలంగా ధృవీకరించబడతాయి. నేను మా క్లాస్ లో ఫస్ట్ రాంక్ అని చెప్పుకుంటే అది నిజామా కాదా అనేది నాకు ఎగ్జామ్స్ లో వచ్చిన మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఎగ్జామ్స్ లేకపోతే నేను ఫస్ట్ ర్యాంకా లేక లాస్ట్ ర్యాంకా ఎలా తెలుస్తుంది. అదేవిధంగా అబ్రాహాము తన విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించకపోతే అబ్రాహాము నిజంగా దేవుని నమ్మాడా లేదా అని ఎలా తెలుస్తుంది. అబ్రాహాము తన కుమారుని దేవుని కోసం బలి ఇవ్వడానికి వెనకాడలేదు గనుక, దేవుని యందు అతని విశ్వాసం నిజమైనదని ధృవీకరించబడింది.

అబ్రాహాము యొక్క రక్షణ విశ్వాసమూలంగా కలిగింది అని దేవుడు సాక్షమిస్తుంటే అబ్రాహాము సంతానమైన వారందరి రక్షణ ఎలా కలుగుతుంది, ధర్మశాస్త్రం ద్వారానా లేదా విశ్వాసమూలంగానా? తర్వాత వచనంలో చూద్దాం.

“కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి." గలతి 3:7

ఎవరు నిజమైన అబ్రాహాము కుమారులు అనే విషయానికి వివరణ ఇక్కడ చూస్తున్నాం. విశ్వాసం అవసరంలేదు, ధర్మశాస్త్రం మాత్రమే అవసరం అని చెప్పేవారు అబ్రాహాము కుమారులు కారు. విశ్వాసంతో పాటు ధర్మశాస్త్ర క్రియలు కూడా రక్షణకు అవసరం అని చెప్పేవారు కూడా అబ్రాహాము కుమారులు కారు. నేను నీతిమంతుడిగా ఎంచబడడానికి కేవలము దేవుని కృప మరియు నా విశ్వాసం మాత్రమే కారణం అని నమ్మేవారు, అనగా "విశ్వాససంబంధులే" "అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి" అని పౌలు చెబుతున్నాడు.

పౌలు గలతీ సంఘంతో ఇలా అంటున్నాడు, "మీరు నిజంగా అబ్రాహాము కుమారులైతే అబ్రాహాములాంటి విశ్వాసమే మీలో ఉంటుంది, దాని మూలంగానే మీరు రక్షింపబడ్డారు". అబ్రాహాము యొక్క రక్షణ ఆయన పొందిన సున్నతిలో లేదు, ఆయన చూపించిన విధేయతలో లేదు, ఆయన దేవునియందు ఉంచిన విశ్వాసంలో మాత్రమే ఉంది.

“దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను." గలతి 3:8

లేఖనము ముందుగా చూచి, అనే మాటను మనం అర్ధం చేసుకుంటే అసలు లేఖనం (వాక్యం) చూడడమేంటి? ఏ విషయాన్ని లేఖనం ముందుగా చూసింది? ఇక్కడ పౌలు లేఖనాన్ని వ్యక్తీకరించి (అంటే లేఖనం ఒక వ్యక్తయితే అనే భావంలో) మాట్లాడుతున్నాడు. లేఖనాలు దేవుని ఆత్మ చేత ప్రేరేపించి రాయబడినవి గనుక, లేఖనం ఒక వ్యక్తి ఐతే అది దేవుని ఉద్దేశాన్ని లేదా దేవుని చిత్తాన్ని ముందుగా చూసి, "నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు" అని అబ్రాహామునకు ప్రకటించింది.

నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు, అనే మాట మనం ఆదికాండంలో అనేక సార్లు చూడొచ్చు:

"భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా" (ఆదికాండము 12:3)

"అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును." (ఆదికాండము 18:18)

"మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను." (ఆదికాండము 22:18)

పౌలు దీనినే సువార్త అని అంటున్నాడు. ఎందుకు ఆలా అంటున్నాడు? ఎందుకంటే భూమియొక్క సమస్త వంశాలు అబ్రాహాము లేదా అబ్రాహాము సంతానమువలన ఆశీర్వదించబడును అనే వాగ్దానం ఎలా నెరవేరింది? ఇది యేసు క్రీస్తులో నెరవేరింది. భూలోకములోని జనములన్నియు ఎవరి ద్వారా ఆశీర్వదించబడ్డారు, యేసు క్రీస్తు ద్వారా. యేసు క్రీస్తే సమస్త వంశాలను ఆశీర్వదించే నిజమైన అబ్రాహాము సంతానం, ఆయన యందే రక్షణ అని మనకు తెలుసు. ఈ విషయం అబ్రాహాముకు పరోక్షంగా తెలియజేయబడింది.

“కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు." గలతి 3:9

పౌలు 7వ వచనంలో చెప్పిన మాటలనే భిన్నమైన రీతిలో ఇక్కడ చెబుతున్నాడు. విశ్వాసం లేకపోతే నువ్వు అబ్రాహాము కుమారునివి (లేదా కుమార్తెవు) కావు, నువ్వు అబ్రాహాముతో పాటు ఆశీర్వదించబడలేవు. ఈ ఆశీర్వాదం రక్షణకు సంబంధించింది అని మనం అర్ధం చేసుకోవాలి.

“ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది." గలతి 3:10

ధర్మశాస్త్రం క్రింద జీవించే వారు శాపానికి లోనైయున్నారు అని ఈ వచనం చెబుతుంది. ధర్మశాస్త్రములో ఉన్న విధులన్నీ దేవుని ఆజ్ఞలు గనుక, దేవుడు వాటిని పాటించమన్నాడు గనుక దాని క్రింద ఉన్నవారు ఆ ఆజ్ఞలన్నిటిని పాటించాలి, లేనిపక్షంలో వారు దేవుని శిక్షకు పాత్రులవుతారు.

ధర్మశాస్త్ర క్రియలు చెయ్యని వారు శాపగ్రస్తులు అని వ్రాయబడియున్నది అని పౌలు చెబుతున్నాడు, ఇలా ఎక్కడ వ్రాయబడియున్నదో చూద్దాం:

"ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్ అనవలెను." (ద్వితీయోపదేశకాండము 27:26)

"ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లనివాడు శాపగ్రస్తుడగును." (యిర్మీయా 11:3)

ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు, దేవుని ముందు నీతిమంతులుగా నిలబడాలంటే ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి ఆజ్ఞకు పరిపూర్ణమైన విధేయత చూపిస్తూ ఈ లోకంలో ఉన్నంత కాలం ఏ ఒక్క విషయంలో తప్పిపోకుండా పడిపోకుండా ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే లోపంలేని వాడిగా పరిపూర్ణుడిగా ఉండాలి. అయితే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాప స్వభావం గలిగిన వారే గనుక, దేవుని ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి పరిశుద్ధంగా ఆయన ముందు నిలబడడం అనేది అసాధ్యం. పౌలు ఆ విషయాన్నే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు, ఒకవేళ ఆలా చెయ్యలేని పక్షంలో ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు శాపగ్రస్తులు. వీరు దేవుని ఆజ్ఞలను మీరి, దేవుని కోపానికి గురై, శిక్షను అనుభవించడానికి యోగ్యులుగా ఉన్నారు.

“ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును." గలతి 3:11

పౌలు ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారు అందరూ శాపగ్రస్తులు అని ముందు వచనంలో స్పష్టం చేసిన తర్వాత, దాని నిర్ధారణ ఏంటో ఇక్కడ చెబుతున్నాడు. ఏంటట? "ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడు" ఇది స్పష్టమైన విషయమే అని తెలియచేస్తున్నాడు. పౌలు ఈ నిర్ధారణ చెయ్యడానికి 10వ వచనంలో ఉన్న విశ్లేషణ మాత్రమే కాకుండా మరొక విషయాన్ని కూడా చెబుతున్నాడు. ఇది రెండవ కారణం కాదు కాని, ధర్మశాస్త్రం క్రింద శాపగ్రస్తులుగా ఉన్నవాళ్ళు నీతిమంతులుగా ఎలా తీర్చబడతారు అనే ప్రశ్నకు సమాధానం: "ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును" అని చెబుతున్నాడు. ఈ మాటను పౌలు హబక్కూకు 2:4 నుండి తీసుకున్నాడు:

"వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును." (హబక్కూకు 2:4)

దేవుని మాటను నమ్మినవాడు లేదా విశ్వసించిన వాడు మాత్రమే నీతిమంతుడు, ఆ నీతిమంతుడు తనకు దేవుని పైన ఉన్న విశ్వాసాన్ని ఆధారం చేసుకుని జీవిస్తాడు అని మనం తెలుసుకోవాలి.

“ధర్మశాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును" గలతి 3:12

ధర్మశాస్త్రం విశ్వాససంబంధమైనది కాదు అని మనకు తెలుసు, దాని క్రింద జీవించే వారు అందులోని ప్రతి ఆజ్ఞకు విధేయత చూపాలి. పాత నిబంధనలో చాలా సార్లు ఈ విషయం స్పష్టంగా చెప్పడం మనం చూస్తాం.

"మీరు నాకట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను." (లేవీకాండము 18:5)

"వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైన వాటి ననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును." (యెహెజ్కేలు 20:11)

యేసుక్రీస్తు ప్రభువు కూడా నిత్యజీవము పొందాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్నకు, ధర్మశాస్త్రమందు రాయబడిన ఆజ్ఞలను గైకొనమని (పాటించమని) చెప్పాడు (మత్తయి 19:17, లూకా 10:25-28). అయితే యేసు క్రీస్తు ప్రభువు ఉద్దేశం, ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను గైకొనడం ద్వారా రక్షణ వస్తుంది అని కాదు, అది మనం చాలా స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం లేదా సంపూర్ణంగా పాటించడం పాపియైన మానవునికి సాధ్యపడదు అని ఆయనకు తెలుసు.

మత్తయి సువార్త 19 వ అధ్యాయంలో (17వ వచనం నుండి) ఒక మనుష్యుడు యేసు దగ్గరికి వచ్చి, నిత్యజీవము పొందడానికి నేను ఏ మంచి కార్యం చెయ్యాలి అని అడిగాడు. అందుకు బదులుగా ప్రభువు, "నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను". ఆ మనుష్యుడు ఏ ఆజ్ఞలను అని ప్రభువును ప్రశ్నించినప్పుడు, ప్రభువు "నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రు లను సన్మానింపుము, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను." ఆ మనుష్యుడు ఓహో ఈ ఆజ్ఞలా, ఇవి నేను పాటిస్తూనే ఉన్నాను, నిత్యజీవము పొందడానికి ఇవే ఆజ్ఞలైతే నాకు కొదువేమి లేదు అన్నట్టు ప్రభువుతో మాట్లాడాడు. అప్పుడు ప్రభువు, "నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను." అయితే అతను చాలా ధనవంతుడు గనుక, "ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లి పోయెను" అని చూస్తాం. దీనిని బట్టి, ఆ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నాను నాకేమి కొదువలేదు అని అనుకున్నాడు గానీ, అతను నిజంగా ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నాడా లేదా అని నిరూపించడానికి ప్రభువు ఒక పరీక్ష అతని ముందు ఉంచినప్పుడు అతని నిజస్వరూపం బయటపడినట్టు చూస్తున్నాం.

నిత్యజీవము ఎలా కలుగుతుంది అనే విషయాన్ని ప్రభువు చాలా చక్కగా చెప్పాడు, "లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు." (యోహాను 5:39,40).

లేఖనాలు (అనగా పాత నిబంధన గ్రంథాలు) నిత్యజీవము ఎలా పొందాలి అనే ప్రశ్నకు జవాబు చెబుతుంది అని యేసు చెబుతున్నాడు. లేఖనాలలో నిత్యజీవం లేదు, లేఖనాలు చెప్పిన పనులు చెయ్యడంలో నిత్యజీవం లేదు (ధర్మశాస్త్ర క్రియలు చెయ్యడం ద్వారా కూడా నిత్యజీవం రాదు) అయితే "మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు" అని ప్రభువు చెప్తున్నాడు. నిత్యజీవము కావాలంటే ప్రభువు దగ్గరికి రావాలి.

ఈ విశ్లేషణ అంతటిని బట్టి మనకు రెండు విషయాలు అర్ధమౌతున్నాయి,

1. ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటిస్తే నిత్యజీవం కలుగుతుంది, అయితే పరిపూర్ణులు ఎవరు లేరు గనుక ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించగలవారు ఎవరూ లేరు, అయినా సరే నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను అని పట్టు పట్టేవారు ధర్మశాస్త్ర క్రియలను చేస్తూ దాని ద్వారా జీవం కలుగుతుంది అని ఆశిస్తారు. నిజానికి వీరు దేవుని ఉగ్రత క్రిందే ఉన్నారు అని అర్ధం చేసుకోలేకపోతున్నారు. ధర్మశాస్త్రము ఆచార సంబంధమైనది అని దీనిని బట్టి మనకు అర్ధమౌతుంది

2. జీవం కలగాలంటే అది యేసు క్రీస్తునందు విశ్వాసముంచడం వలన మాత్రమే సాధ్యపడుతుంది, ఆచార సంబంధమైన ఏ క్రియ వలన మనకు నీతి కలగదు

“ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;" గలతి 3:13

యేసు క్రీస్తు ప్రభువు మనకోసం శాపమయ్యాడు అని పౌలు చెబుతున్నాడు. ఏంటి ఈ శాపం? ఏ విధంగా ఇది జరిగింది అని ఆలోచిస్తే వాక్యం ఈ విషయంలో చాలా స్పష్టమైన సమాధానం ఇస్తుంది.

ఈ క్రింది వచనాలను పరిశీలించండి:

"మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను" (2 కొరింథీ 5:21)

"మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను" (1 పేతురు 3:18)

"ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు." (రోమా 5:19)

ఈ వచనాలలో మనకు చాలా స్పష్టంగా "శాపం" అంటే ఏంటో తెలియచెయ్యబడింది. పాప మెరుగని యేసు క్రీస్తు పాపంగా చెయ్యబడ్డాడు. నీతిమంతుడైన క్రీస్తు అనీతిమంతుల శిక్షను అనుభవించాడు. దేవుని మాటకు విధేయత చూపించిన క్రీస్తు, అవిధేయులు పొందాల్సిన శిక్షను పొందాడు. మీకు అర్ధమైంది అనుకుంటున్నాను, ఇక్కడ "శాపం" అంటే "పాపానికి రావాల్సిన ప్రతిఫలం" లేదా "పాపం పై దేవుని ఉగ్రత". ఈ ప్రతిఫలం ప్రతి పాపి అనుభవించాలి, అయితే అది జరగకుండా మన పక్షాన క్రీస్తు మన శాపాన్ని తీసుకుని, మన స్థానంలో ఆ శాపాన్ని అనుభవించాడు.

ఆయన మన శాపాన్ని తీసుకున్న కారణాన్ని బట్టి, మనం "ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించబడ్డాము". ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటో ముందు వచనాలలో మనం చూసాం, ధర్మశాస్త్ర విషయంలో ఒక్క ఆజ్ఞకైనా అవిధేయత చూపిస్తే దానికి తగ్గ శిక్షను అనుభవించాలి, అయితే మనం (అనగా మనుషులు) ధర్మశాస్త్రంతో మన జీవితాన్ని పోల్చి చూసినప్పుడు మరణానికి అర్హులంగా కనబడతాం. ఈ శాపం నుండి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన మరణం నుండి మనలను క్రీస్తు విడిపించాడు, "క్రీస్తుయేసు నందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను" (రోమా 8:2)

క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించడానికి ముడిపడి ఉన్న రెండు ఆశీర్వాదాల గురించి పౌలు వివరిస్తున్నాడు:

1. అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై - అనగా అన్యజనులు కూడా ఇక మీద దేవుని ప్రజలుగా పిలువబడే ఆశీర్వాదం, వారు కూడా అబ్రాహాము వారసులుగా పిలువబడే ఆశీర్వాదం, వాగ్దానాన్ని బట్టి విశ్వాసమూలంగా నీతిమంతులుగా తీర్చబడే ఆశీర్వాదం (అబ్రాహామును యొక్క ఆశీర్వాదం) పొందుకోవడానికి, అదేవిధంగా-

2. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు — అనగా క్రీస్తునందు విశ్వసించిన వారికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు అనుగ్రహించాడు, ఈ వరం క్రీస్తు మనకోసం తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించి, తన ప్రజలుగా చేసుకోవడాన్ని బట్టే జరిగింది. "మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి." (ఎఫెసీ 1:13)

“ఇందును గూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది." గలతి 3:14

పౌలు ఈ వచనంలో మాట్లాడుతున్న విషయం ధర్మశాస్త్రములో ఎక్కడ ఉంది అని పరిశోధిస్తే అది ద్వితీయోపదేశకాండం 21:22,23 లో చూడొచ్చు.
"మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు" (ద్వితీయోపదేశకాండము 21:22,23)

చావడానికి ఉరితీయాలి అని దేవుడు చెప్పలేదు, మరణకరమైన పాపం చేసినవాడిని చంపిన తర్వాత వాడు దేవునికి శాపగ్రస్తుడు అని తెలియచెయ్యడానికి మ్రాను మీద వ్రేలాడదియ్యాలి అని చెప్పాడు. ఇలా జరిగిన సన్నివేశాలు మనం వాక్యంలో చూడొచ్చు, ఉదాహరణకు:

"అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ప్రజల అధిపతుల నందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీదనుండి తొలగిపోవునని చెప్పెను." (సంఖ్యాకాండము 25:4)

"ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి, సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచిపోయెను." (సంఖ్యాకాండము 25:6-8)

ఇక్కడ మనం చూస్తే, 4 వ వచనంలో దేవుడు ఉరితీయమన్నాడు, 8 వ వచనంలో ఫీనెహాసు వారిని బల్లెంతో చంపాడు, అంటే ఫీనెహాసు దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తించాడా? కాదు, దేవుడు చెప్పిన ఉద్దేశం, మరణకరమైన పాపం చేసినవాడిని చంపినప్పుడు వాడు దేవునికి శాపగ్రస్తుడు అని రుజువుగా వాడిని ఉరితీయాలి లేదా మ్రాను మీద వేలాడదీయాలి అని అర్ధం.

యేసుక్రీస్తు చెట్టుతో చెయ్యబడిన సిలువ కొయ్యకు మేకులతో వ్రేలాడదీయ్యబడ్డాడు, ఆలా వ్రేలాడదీయ్యబడినప్పుడు, అతను దేవునికి శాపగ్రస్తుడు అయ్యాడు అని మనం అర్ధం చేసుకోవాలి. ఏ పాపం చెయ్యకపోయినప్పటికీ దేవుడు ఎన్నుకున్న వారి పాపాన్ని తాను మోసి దేవుని దృష్టిలో శాపగ్రస్తునిగా చనిపోయాడు.

నీతిమంతుడు అయిన యేసు అనీతిమంతులమైన మనకోసం శాపంగా మారి మన శాపాన్ని తీసివేసి నీతిమంతులుగా తీర్చాడు

పౌలు 3వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు వరకు రక్షణ యేసు క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి విశ్వాసం ద్వారానే కలుగుతుంది అని చెబుతున్నాడు, 15 వ వచనం నుండి అది ఎలా సాధ్యమో చూపిస్తున్నాడు.

“సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; మనుష్యుడుచేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు." గలతి 3:15

ఇక్కడ పౌలు, "సహోదరులారా" అని అంటున్నాడు, మీరు గమనిస్తే ఇంతకముందు వీరిని, "అవివేకులైన గలతీయులారా" అని సంబోధించాడు. వీరు అవివేకులుగా ప్రవర్తించినప్పటికీ పౌలు వీరిని సహోదరులుగానే భావిస్తున్నాడు అని, వీరు నిజమైన విశ్వాసులు అని పౌలు యొక్క సంబోధన ద్వారా తెలుస్తుంది. నిజంగా దేవునిచేత రక్షింపబడిన వారిలో కొందరు తెలియక తప్పుడు బోధలలో ఉండి ఉండొచ్చు, అయితే వీరు అవిశ్వాసులని, రక్షణ పొందలేదని తీర్మానించడం తప్పు. వారి తప్పును చూపించి సత్యాన్ని తెలియచేసినప్పుడు, నిజమైన విశ్వాసులు సత్యం వైపు తిరుగుతారు. గలతీయులను అంత తీవ్రంగా ఖండించిన పౌలు కూడా వారిని అవిశ్వాసులు అని అనట్లేదు, సహోదరులు అనే అంటున్నాడు. మనం కూడా ఈ విషయంలో సత్యం చెబుతూ తప్పును బహిర్గతం చేస్తూ నిజమైన విశ్వాసులను సత్యం వైపు తిప్పే ప్రయత్నం చెయ్యాలి. "మనుష్యరీతిగా మాటలాడుచున్నాను" అంటే అర్ధం ఏంటి, ఎందుకు పౌలు ఈ విధంగా చెబుతున్నాడు. ఈరకమైన పదప్రయోగం పౌలు రాసిన వేరే పత్రికలలో కూడా చూడొచ్చు (రోమా 6:19, 1 కొరింథీ 15:32)

ఇక్కడ మనకు అర్ధంమౌతున్న విషయం ఏంటి అంటే వారి పరిపక్వతను బట్టి, వారికి సులభంగా అర్ధమవ్వడానికి పౌలు అందరికి అర్ధమయ్యే విధమైన ఉదాహరణలు లేదా అలంకారం ఉపయోగిస్తున్నాడు.

ఒడంబడిక లేదా ఒప్పందం అంటే మనకి అర్ధం ఔతుంది. వివాహం ఒక ఒడంబడిక, లేదా ఇల్లు కొనేప్పుడు ఒడంబడిక/అంగీకార పత్రం రాసుకుంటాం. ఇవి ఒకసారి స్థిరపడిన తర్వాత వీటిని మార్చడం లేదా ఏదైనా కలపడం వీలుపడదు. అందుకే వివాహం జరిగే ముందు సంఘాలలో వివాహ ప్రకటనలు చేస్తారు, ఈ వివాహం జరగకూడదు అని ఎవరైనా భావిస్తే కారణాలతో సహా సంఘ పెద్దలకు తెలియచెయ్యండి అని చెబుతారు. ఎందుకంటే ఒక్కసారి వివాహం జరిగాక ఆ ఒడంబడిక స్థిరపడిపోతుంది ఎవరూ దానిని మార్చలేరు. పౌలు అదే చెబుతున్నాడు, మనుష్యులు చేసుకున్న ఒడంబడికలే ఒక సారి స్థిరపరచబడిన తర్వాత మార్చలేకపోతే దేవుడు చేసిన నిబంధన లేదా ఒడంబడిక మారుతుందా? ఎప్పటికి మారదు.

అయితే ఇక్కడ ఒడంబడిక అని అనువదించబడిన గ్రీకు పదం సంకల్పం/will అని కూడా అనువదించొచ్చు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారు. అయితే పౌలు మాట్లాడుతున్న సందర్భం దేవుని "covenant/ఒడంబడిక" కాబట్టి తాను మనుష్యులకు ఆపాదించి మాట్లాడుతున్న విషయం కూడా "covenant/ఒడంబడిక" అని, సంకల్పం/will కాదు అని మరికొందరు అభిప్రాయబడ్డారు, ఈ రెండవ అభిప్రాయమే సరైనది అని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే బైబిల్ లో మనుష్యులు చేసుకున్న ఒడంబడికలు చాలానే ఉన్నాయి. (ఆదికాండము 21:22-32, 26:26-31, 31:44-45, 1 సమూయేలు 18:3, 20:8, 22:8, 23:18, 2 సమూయేలు 3:12). మనుష్యుల సంకల్పం మారే అవకాశం ఉంది, అయితే ఒకసారి చెయ్యబడిన ఒడంబడిక ఇక మారదు అని తెలుసుకోవాలి.

“అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు." గలతి 3:16

దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం గురించి, దాని యొక్క స్వభావం గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఎవరికి వాగ్దానం చెయబడిందో చెబుతున్నాడు, "అబ్రాహామునకును", "అతని సంతానమునకును" అని చూడొచ్చు. ఈ వాగ్దానం యొక్క స్వభావాన్ని చూస్తే అది అనేకులు అన్నట్టు కాకుండా "ఒకని గూర్చి అన్నట్టే" అని చూస్తున్నాం.

ఇక్కడ "నీ సంతానమునకును" (and to your offspring) మరియు "నీ సంతానములకును" (and to your offspring) అనే పదాలను గమనిస్తే ఒకటి ఏకవచనంలో మరొకటి బహువచనంలో ఉన్నట్టు గమనిస్తాం. ఆ గ్రీకు పదాలు "sperma" అంటే seed/offspring (సంతానము) అని, "spermasin" అంటే seeds/offsprings (సంతానములు) అని అర్ధం. అయితే ఇక్కడ పౌలు చెబుతున్న తర్కం ఏంటి? సంతానము అంటే ఏకవచనం, సంతానములు అంటే బహువచనం గనుక, దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసేప్పుడు సంతానం అని మాత్రమే చెప్పాడు, సంతానములు అని చెప్పలేదు గనుక ఆ సంతానం క్రీస్తే అని పౌలు వాదిస్తున్నాడా? ఒకవేళ పౌలు యొక్క వాదన ఇదే అయితే గనుక, పౌలుకు సంతానం అనే గ్రీకు పదం "sperma" ఒక సామూహిక నామవాచకం (a collective noun) అని కూడా తెలియదా అని ప్రశ్నించొచ్చు. సాముహిమ నామవాచకం అంటే బహువచన భావాన్నిచ్చే ఏకవచన పదం (Collective nouns are singular in form but plural in meaning). ఉదాహరణకు, ఒక జట్టు క్రికెట్ ఆడుతుంది అని చెప్పినప్పుడు, "జట్టు" అనే పదం ఆడుతున్న అందరిని సూచిస్తుంది. అయితే "ఆ జట్టు వాదిస్తుంది" అని చెప్పినప్పుడు దాని అర్ధం, ఆ జట్టులో ఉన్న వారందరు వాదించుకుంటున్నారు. ఆలా "sperma" అనే పదానికి ఏకవచనం మరియు బహువచన అర్ధాలు రావచ్చు అని పౌలుకు బాగానే తెలుసు. పౌలే 29 వ వచనంలో "మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు అని రాసాడు." ఇక్కడ క్రీస్తు సంబంధులు ఎవరో చెబుతూ వారు "అబ్రాహాము యొక్క సంతానమైయుండి" అని అంటున్నాడు గమనించారా ఇక్కడ "సంతానం" అనే మాటను పౌలే బహువచనంలో ఉపయోగిస్తున్నాడు. అందుకే పౌలు, దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం ఏకవచంలో చెయ్యబడింది గనుక (బహువచము కాదు గనుక) ఆ ఏకవచనమైన సంతానం క్రీస్తే అని చెప్పట్లేదు.

మరి దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి. అబ్రాహాముకు ఎంతమంది సంతానం? ఇద్దరు అని మనకు తెలుసు (ఇస్సాకు, ఇష్మాయేలు). అయితే "ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును" (ఆది 21:12) అని దేవుడు అబ్రాహాముతో చెప్పినప్పుడు అందులో దేవుని ఎన్నిక, ఏకవచన భావం ఉంది అని అర్ధమౌతుంది. అదే విధంగా ఇస్సాకు సంతానంలో దేవుడు ఎన్నుకున్నది యాకోబును అని కూడా మనకు తెలుసు. దేవుడు దావీదుకు చేసిన ప్రమాణాన్ని బట్టి దావీదు రాజ్యము తన సంతానం ద్వారా స్థిరపడుతోంది అని చెప్పాడు (నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను - 1 సమూయేలు 7:16). అది కొంతవరకు సొలొమోనులో నెరవేరినప్పటికీ "నిత్యమును స్థిరపరచబడును" అనే వాగ్దానం దావీదు సంతానమైన క్రీస్తులో మాత్రమే నెరవేరింది అని చెప్పాలి. నిత్యమూ దావీదు సింహాసనంపై రాజ్యమేలేది యేసు ప్రభువు మాత్రమే. ఈ విషయం మనకు లూకా 1: 32,33 చదివితే తెలిసిపోతుంది, "ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను."

దీని ప్రకారం పౌలు ఏకవచనం లేదా బహువచనల గురించి మాట్లాడట్లేదని, రక్షణ ప్రణాళికలో దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం యొక్క అంతిమ నెరవేర్పు యేసు క్రీస్తు ఈ లోకానికి రావడమే అని తెలుస్తుంది. దేవుని వాగ్దానాన్ని బట్టి అబ్రహాముకు బాహ్యమైన సంతానంగా కలిగిన ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు వీరందరూ రాబోయే క్రీస్తుకు ముందు సూచనగా (foreshadow) ఉన్నారు అని, ఆ నిజమైన సంతానం - అనగా వాగ్దాన నెరవేర్పు అయిన సంతానం, పాపమనే శాపాన్ని తొలగించి ఆశీర్వాదాన్ని అందించగల సంతానం, అబ్రహాముకు కలిగిన నీతిని తన యందు విశ్వసించువారికి అందించగల సంతానం ఆ ఒకే ఒక్క సంతానం యేసు క్రీస్తు మాత్రమే అని అర్ధం చేసుకోవాలి.

“నేను చెప్పునదేమనగా నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు." గలతి 3:17

"నేను చెప్పునదేమనగా" అనే మాట పౌలు చాలా సార్లు వేరే పత్రికలలో కూడా ఉపయోగించాడు. ఏదైనా విషయాన్ని నొక్కి చెప్పాలి అనుకున్నప్పుడు, పౌలు ఈ విధమైన పద ప్రయోగం చేస్తాడు అని తెలుసుకోవాలి (1 కొరింథీ 7:29-31, కొలొస్సి 2:4, 1 కొరింథీ 10:19, 2 కొరింథీ 9:6, గలతి 5:16).

అయితే పౌలు ఇక్కడ నొక్కి చెబుతున్న విషయం ఏంటో చూద్దాం?

ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని నిరర్ధకం చెయ్యలేదు (అంటే అర్ధం లేనిదిగా చెయ్యలేదు). దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ధర్మశాస్త్రం వలన రక్షణ రాదు కాని, దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాని బట్టే లేదా ఆ వాగ్దాన మూలంగానే రక్షణ కలుగుతుంది అని చెప్పడం.

ఇదే మాటలు తర్వాత వచనంలో పౌలు చెబుతున్నాడు. అది చూసే ముందు ఈ వచనంలో ఉన్న ఒక ప్రశ్న లేదా అభ్యంతరం గురించి ఆలోచిద్దాం.

ధర్మశాస్త్రం అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసిన 430 సంవత్సరాల తర్వాత ఇవ్వబడిందా? ఆలా అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 400 సంవత్సరాలు నివసించారు అని కూడా బైబిల్ లో ఉంది కదా! మరి 400 సంవత్సరాలు వారు ఐగుప్తులో బానిసలగానే ఉంటే అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసి అప్పటికే చాలా కాలం అయిపోయింది కదా (ఎందుకంటే అంతక ముందే యోసేపు, యాకోబు, ఇస్సాకు వీరందరూ చనిపోయారు). ఈ సందేహం నివృత్తిచెయ్యడానికి కొంచెం సమయం మరియు ఎక్కువ విశ్లేషణ అవసరం గనుక, హితబోధలో మేము ఇంతక ముందు ఈ విషయమై ప్రచురించిన ఒక వ్యాసాన్ని ఇక్కడ జతచేస్తున్నాము. ఈ అభ్యంతరానికి మా వ్యాసంలో చక్కని అర్ధవంతమైన సమాధానం ఇచ్చాము గనుక, దానిని చదవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను.

ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎంతకాలం నివసించారు? 430/400/215

“ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగినయెడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను." గలతి 3:18

ఇక్కడ అబ్రాహాము పొందుకున్న స్వాస్థ్యము గురించిన ప్రస్తావన చూస్తున్నాం. ఏంటి ఏ స్వాస్థ్యము? దేని గురించి పౌలు మాట్లాడుతున్నాడు అని అర్ధం చేసుకోవడం అంత కష్టమేమి కాదు. "అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచబడెను" అని ఇదే అధ్యాయం 6వ వచనంలో మరియు "అబ్రాహాము పొందిన ఆశీర్వచనము" అని 13వ వచనంలో చూస్తాం. అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యము ఏంటి అంటే అది అబ్రాహాము విశ్వాసమూలముగా దేవుని నుండి పొందుకున్న నీతి అని చెప్పాలి.

ఇదే 18వ వచనాన్ని ఇంక ముందుకు చదివితే, "ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగినయెడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు" అంటున్నాడు. ఎందుకు అని మనం ప్రశ్నిస్తే దానికి సమాధానం చాలా సులభం. ఒకవేళ ఇక్కడ ప్రస్తావించబడిన స్వాస్థ్యము ధర్మశాస్త్రం ద్వారా వస్తే ఆ స్వాస్థ్యము అబ్రాహాము పొందుకునే అవకాశమే లేదు, ఎందుకంటే అబ్రాహాము ఉన్న సమయంలో ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. లేని ధర్మశాస్త్రం ద్వారా అబ్రాహాము ఆ స్వాస్థ్యాన్ని (నీతిమంతుడుగా అవ్వడం) పొందుకోలేడు గనుక, దేవుడు అబ్రాహాముకు ఆ స్వాస్థ్యము ఇవ్వలేదు అని చెప్పాలా? లేదు. దేవుడు అబ్రాహాముకు ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రం లేని సమయంలో అబ్రాహాము ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు అంటే ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రానికి బయటనే (లేదా ధర్మశాస్త్రం లేకుండానే) లభించివుండాలి. అదే ఇక్కడ పౌలు చెబుతున్నాడు, ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం లేని సమయంలో అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి కలిగింది (దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను).

అబ్రాహాము దేవుని వాగ్దానాన్ని బట్టి నీతిమంతుడు ఐతే మిగతావాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు ఔతారా? లేదు అని పౌలు చెబుతున్నాడు. అబ్రాహాము ఎలాగైతే దేవుని వాగ్దానాన్ని బట్టి విశ్వాసమూలముగా నీతిమంతుడు అని ఎంచబడ్డాడో అలానే అబ్రాహాము దేవుని దగ్గరికి వచ్చిన ఎవరైనా (అది భౌతికమైన అబ్రాహాము సంతానమైనా లేదా అన్యులైనా) ఆ దేవుని వాగ్దానాన్ని బట్టే నీతిమంతులుగా తీర్చబడతారు, ధర్మశాస్త్రాన్ని బట్టి లేదా ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు.

పౌలు ఇప్పటివరకు ఈ అధ్యాయంలో చెప్పాలనుకున్న సారాంశం ఇదే. రక్షణ ధర్మశాస్త్రం మూలంగా రాదు అది విశ్వాసమూలంగా మనం పొందుకున్న దేవుని ఉచితమైన బహుమానం అని అర్ధం చేసుకోవాలి. క్రింది వచనాలు గమనించండి:

"మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు." (ఎఫెసీ 2:8,9)

"మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను" (తీతుకు 3:5)

ప్రియ చదువరీ రక్షణ నువ్వు చేసే క్రియల మీద ఆధారపడి ఉంది అని నువ్వు భ్రమపడుతుంటే దయచేసి దేవుని మాటను తెలుసుకుని అంగీకరించమని నేను ప్రాధేయపడుతున్నాను. నువ్వు దేవుని ముందు నీతిమంతునిగా నిలబడేంత నీతిని ఎప్పటికి నీ క్రియల ద్వారా సంపాదించుకోలేవు. నువ్వు రక్షించబడి ఉంటే దేవుడు నీకు చూపిన కృపను బట్టి ఆయనకు స్తుతి చెల్లించు, ఆయన నీ పట్ల చూపిన ప్రేమను బట్టి, నువ్వు కూడా ఆయనను ప్రేమించు (ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము - 1 యోహాను 4:19). ఒకవేళ నువ్వు రక్షింపబడకపోతే రక్షణ కోసం నీ స్వంత క్రియలను విడిచిపెట్టి, దేవుడు విశ్వాసమూలంగా ఉచితంగా ఇస్తున్న నీతిని అపేక్షించు.

మరి ధర్మశాస్త్రం వలన రక్షణ కలగకపోతే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏ ఉద్దేశం లేకుండా ఇచ్చాడా? దీనికి సమాధానం తర్వాత వచనంలో చూద్దాం.

“ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను." గలతి 3:19

దేవుడు ఏది చేసినా ఒక ఉద్దేశంతోనే చేస్తాడు కదా మరి రక్షించలేని ధర్మశాస్త్రం ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఏంటి? మూడు ఉద్దేశాలను మనం చూద్దాం. మొదటిది, ధర్మశాస్త్రం మనము పాపులము అని ఎత్తి చూపిస్తుంది. పౌలు రోమా 7:7లో "ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును" అని చెబుతున్నాడు. అంటే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం మనం పాపులము అని ఎత్తి చూపడం. రోమా 8:7లో "ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు" అనే మాట చూస్తాం. అంటే మన పతన స్థితిలో దేవుని ధర్మశాస్త్రం మన పాపాలను కేవలం ఎత్తి చూపిస్తుంది అని ఈ వచనాలను బట్టి స్పష్టమౌతుంది. సులభంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం ఒక అద్దం లాంటిది, మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నామో మనకు తెలుస్తుంది. అంతేకాని అద్దం మనలను మార్చలేదు. మన జుట్టు సరిగా లేకపోతే అద్దం ఆ జుట్టుని సరిచెయ్యలేదు. అదే భావంలో ధర్మశాస్త్రం అద్దం లాగా మన పాపాన్ని చూపిస్తుందే తప్ప సరిచెయ్యలేదు. అందుకే పౌలు రోమా 3:20 లో "ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది" అని చెప్పాడే తప్ప సరిచెయ్యబడుతుంది అని చెప్పలేదు.

రెండవది, ధర్మశాస్త్రం మనలో ఉన్న పాపాన్ని ఆధారం చేసుకుని మనలో ఇంక ఎక్కువ పాపాన్ని పుట్టిస్తుంది. రోమా 7:5లో "ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను" అని అలానే రోమా 7:8లో "అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను" అని చూస్తాం. ఇంకొంచెం స్పష్టంగా అర్ధమవ్వడానికి రోమా 5:20లో "మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను" అనే మాటను గమనించొచ్చు. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, దేవుని నీతిని తెలియచేసేది అయినప్పటికీ, మన శరీరబలహీనతను బట్టి అది మనలో పాపాన్ని విస్తరిస్తుంది తప్ప పరిహరించలేదు. ధర్మశాస్త్రం నన్ను పాపం చెయ్యి అని ప్రేరేపిస్తుంది అని వాక్యం చెప్పట్లేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని స్థితిలో నేను ఉన్నాను గనుక, ధర్మశాస్త్రం లోని ఆజ్ఞలు నాకు భారమైనవిగా ఉంటూ వాటిని తూచా తప్పకుండ పాటించాలి అని ప్రయత్నించిన ప్రతిసారి నేను విఫలమయ్యి ఇంకా ఎక్కువ పాపాన్ని కూడగట్టుకుంటున్నాను. ఈ విధంగా ధర్మశాస్త్రం నాలో ఉన్న పాపాన్ని ఆధారం చేసుకుని నాలో ఇంక ఎక్కువ పాపాన్ని పుట్టిస్తుంది.

మూడవదిగా ధర్మశాస్త్రం దేవుని ఉగ్రతను పుట్టిస్తుంది. పౌలు రోమా 4:15లో "ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేకపోవును" అని చెబుతున్నాడు. దేని మీద దేవుడు తన ఉగ్రతను చూపిస్తున్నాడు అని ఆలోచిస్తే "దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది" అని రోమా 1:18లో చూస్తాం. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మీరిన లేదా దానికి అవిధేయత చూపిన ప్రతి ఒక్కరి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. అందుకే పౌలు 1 కొరింధీ 15:56 లో "మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే" అని చెప్తున్నాడు.

కాబట్టి ప్రియ చదువరీ ధర్మశాస్త్ర మూలముగా నీతి రాదని, అది మనలను దేవుని ఉగ్రతకు మరి ఎక్కువగా పాత్రులను చేస్తుంది అని గ్రహించి, రక్షణ కోసం ధర్మశాస్త్రాన్ని పాటించడం మానేసి, యేసు క్రీస్తు దగ్గరికి రండి. పౌలు రోమా 8:2,4 వచనాలలో చెప్పిన మాటలు గుర్తు పెట్టుకుందాం, "ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను; దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను." పాప క్షమాపణ కోసం యేసు దగ్గరకు రావడం తప్ప వేరొక మార్గం ఏది లేదు అని గుర్తుపెట్టుకోండి. మనకు హెచ్చరికగా అపొస్తలుడైన యోహాను చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నాను, "ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను." (యోహాను 3:18)

ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు ఒక పద్యంలాగా ఇదంతా చెప్తే బాగుంటుందేమో అని అనిపించి కింది పద్యాన్ని రాసాను :

ధర్మశాస్త్రం దేవుని నియమం

పాపం నా స్వభావం

రాదు నిత్యజీవం కాదు క్రియా ఫలం

యేసు నందు తప్ప లేదు వేరే మార్గం

యేసు మరణం తీరుస్తుంది నా ఋణం

ఆయన పునరుత్థానం నా జీవం

పాప క్షమాపణకై దేవుని ఉద్దేశం

యేసు క్రీస్తు నందు నీ విశ్వాసం

ఇది దేవుని కృపే, కాదు నీ కష్టం

ధర్మశాస్త్రం నియమించడంలో దేవుడు ఉపయోగించుకున్న పాత్రల గురించి ఈ వచనం రెండొవ భాగంలో చూస్తాం. మధ్యవర్తి చేత నియమించబడెను అన్నప్పుడు, ఆ మధ్యవర్తి మోషే అని మనకు తెలుసు. లేవీయకాండం 26:46లో "యెహోవా మోషేద్వారా సీనాయికొండమీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే" అని చెప్పడం, ఈ విషయాన్నే యోహాను తన సువార్తలో ప్రస్తవించడం కూడా చూడొచ్చు ("ధర్మశాస్త్రము మోషేద్వారా అనుగ్రహింపబడెను - యోహాను 1:17)" .

దేవదూతల ద్వారా ఈ ధర్మశాస్త్రం నియమించబడింది అని చూస్తున్నాం. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆయనతో పాటు దేవదూతలు ఉన్నారు అని మనకు తెలుసు. ఉదాహరణకు దేవుడు సీనాయి పర్వతం మీదికి దిగివచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ మోషే ఈ విధంగా చెప్తున్నాడు, "యెహోవా సీనాయినుండి వచ్చెను శేయీరులోనుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను" (ద్వితీయోపదేశకాండము 33:1,2). అలానే స్తెఫను యెరూషలేములోని మతాధిపతులతో మాట్లాడుతూ "దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను" (అపో.కార్యములు 7:53). హెబ్రీ పత్రిక 2:2లో "ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున" అని ధర్మశాస్త్రం ఇవ్వబడిన విధానం గురించి చెబుతున్నాడు. అయితే ప్రత్యేకంగా దేవదూతలు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడంలో పోషించిన పాత్ర ఏంటో మనకు స్పష్టంగా చెప్పబడలేదు. దేవుడే తన చేతితో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని (ద్వితీయోపదేశకాండము 9:10), మోషే తో ముఖాముఖిగా మాట్లాడాడని (ద్వితీయోపదేశకాండము 33:11) మనకు తెలుసు. అయితే దేవదూతలు ప్రత్యేకంగా పోషించిన సంపూర్ణమైన పాత్ర ఏంటో తెలీదు. బహుశా ఆయన సీనాయి పర్వతం పై వచ్చినప్పుడు ఆ కనబడిన భయంకరమైన దృశ్యం దేవదూతల ద్వారా దేవుడు చేయించాడేమో (ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి - నిర్గమకాండము 20:18). అలానే "దేవదూతల ద్వారా పలుకబడిన ఈ వాక్యము" అన్నప్పుడు దేవుడే కదా మాట్లాడింది అని మనం అడగొచ్చు (నిర్గమకాండము 20), అయితే దేవదూతలను కూడా దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మోషేకు తెలియచేస్తున్నప్పుడు మాట్లాడే మధ్యవర్తిత్వపు పనికి ఏదోరకంగా వారిని వాడుకున్నాడు అని తెలుస్తుంది.

“మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే" గలతి 3:20

మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే "ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు?" అని పౌలు 19వ వచనంలో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానాన్ని అదే 19వ వచనంలో ఆరంభించి ఈ 20 వ వచనంతో ముగిస్తున్నాడు. గనుక ఈ వచనాన్ని వ్యాఖ్యానించేప్పుడు ఇది "ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు?" అనే ప్రశ్నకు ఇస్తున్న సమాధానంలో భాగమే అని గ్రహించాలి. ఈ వచనానికి బైబిల్ వ్యాఖ్యానకర్తలు వివిధ రకాల వ్యాఖ్యానాలు చేసారని, అందరికి ఒకే అభిప్రాయం లేదు అని గమనించాలి (నేను బైబిల్ వ్యాఖ్యానకర్తలు అని చెప్పినప్పుడు అది రిఫార్మ్డ్ దృక్పథం (reformed view) ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాను). బైబిల్ లో అర్ధం చేసుకోవడానికి కష్టమైన వచనాలలో ఈ వచనం ఒకటి అని చెప్పొచ్చు.

"మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని", అని చెప్పినప్పుడు ఏ మధ్యవర్తి గురించి పౌలు మాట్లాడుతున్నాడు అనేది ప్రశ్న?"

John Calvin, John Owen, Stephen Baugh మరియు ఇంకొంతమంది రిఫార్మ్డ్ దృక్పథం కలిగిన బైబిల్ వ్యాఖ్యానకర్తలు - మధ్యవర్తి అని ఇక్కడ సంబోధించబడింది మోషే గురించి కాదు అని యేసు క్రీస్తు గురించి అని చెబుతారు. మరికొందరు (Thomas R. Schreiner, Douglas Moo, Dunn) ఈ మధ్యవర్తి మోషే అని చెప్తారు. ఈ రెండు ఆలోచనలలో ఏది సరైనదో మనం తర్కించే ముందు అసలు వాళ్ళు ఆలా చెప్పడానికి గల కారణం ఏంటో చూద్దాం.

ఈ మధ్యవర్తి యేసు క్రీస్తే అని చెప్పేవారి వాదనను నేను సులభంగా మీకు అర్ధమయ్యే విధంగా అందించే ప్రయత్నం చేస్తాను. పౌలు ఈ పత్రికలో 18వ వచనం వరకు రక్షణ ధర్మశాస్త్రములముగా రాదు అని దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దాన మూలంగానే వస్తుంది అని చెబుతున్నాడు. ఆ అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చాక, "ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు?" అనే ప్రశ్నలోకి వెళ్తున్నాడు.

19వ వచనం మరియు 20వ వచనంలో "మధ్యవర్తి" అనే పదాన్ని గ్రీకులో కొంచెం అర్ధం చేసుకుందాం. "µεσίτου" (mesitou/మెసితౌ) అనే పదం 19వ వచనంలో వాడబడింది, "μεσίτης" (mesitēs/మేసిట్స్) అని 20వ వచనంలో వాడబడింది. ఈ గ్రీకు పదం వాక్యంలో వాడబడిన అన్ని సందర్భాలలో యేసు క్రీస్తునే సూచిస్తుంది అనేది వీరి వాదన. ఆ వచనాలు గమనించండి.

"దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు (mesitēs/మేసిట్స్) ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు." (1 తిమోతి 2:5)

"ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై (mesitēs/మేసిట్స్) యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు." (హెబ్రీ 8:6)

"ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై (mesitēs/మేసిట్స్) యున్నాడు." (హెబ్రీ 9:15)

"క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన (mesitēs/మేసిట్స్) యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు." (హెబ్రీ 12:24)

"మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి (mesitēs/మేసిట్స్) మాకులేడు." (యోబు 9:33) (in greek translation)

“mesitēs” అనే గ్రీకు పదం కొత్త నిబంధనలో ఉపయోగించబడిన ప్రతిసారి, అది క్రీస్తును సూచించడానికి మాత్రమే ఉపయోగించబడింది. అందువల్ల, నిజమైన మధ్యవర్తి యేసు క్రీస్తు మాత్రమే అని కొందరు వాదిస్తారు. గలతి 3:19–20 వచనాలలో కూడా ఈ పదం యేసు క్రీస్తునే సూచిస్తుందని వారు వివరిస్తారు.

జాన్ ఓవెన్, 1 సమూయేలు 2:25 వచనాన్ని ఉదహరిస్తూ ఇలా అంటాడు: “మనుష్యుడు మనుష్యునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు తీర్పు చెప్పగలడు; కానీ ఎవరు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు అతనికోసం మధ్యవర్తిత్వం చెయ్యగలరు?” ఈ వచనం ప్రకారం, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన మనిషికి నిజమైన మధ్యవర్తి యేసు క్రీస్తు మాత్రమే. ఈ భావాన్ని గలతీ 3:20తో కలిపి చూస్తే అక్కడ పేర్కొన్న “మధ్యవర్తి” కూడా క్రీస్తేనని ఓవెన్ భావించాడు.

జాన్ కాల్విన్ కూడా ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ “దేవుడు ఒక్కడే” (గలతి 3:20) అనే వాక్యానికి ప్రత్యేక వివరణ ఇచ్చాడు. “మధ్యవర్తి ఒకరికి మాత్రమే మధ్యవర్తి కాదు” అంటే క్రీస్తు ఒకే ఒక్కడి పక్షాన కాకుండా రెండు వర్గాలైన యూదులు మరియు అన్యజనుల మధ్య మధ్యవర్తిగా ఉన్నాడని అర్థం.

గలతి 3:19లో “ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా మధ్యవర్తి చేత నియమించబడింది” అని చెప్పబడింది. కాల్విన్ అభిప్రాయం ప్రకారం, ఇక్కడ “మధ్యవర్తి” అని చెప్పబడింది మోషే కాదని, యేసు క్రీస్తే అని భావించాలి. ఎందుకంటే “దేవదూతల ద్వారా” అని ఇప్పటికే ఒక మధ్యవర్తిత్వాన్ని సూచించిన తర్వాత, “మధ్యవర్తి చేత” అని మోషేను సూచించడం సరైనది కాదని ఆయన వాదించాడు.

యోహాను 1:17లో “ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది” అని చెప్పబడింది కాని “మోషే చేత” అని చెప్పబడలేదు. అందువల్ల, ధర్మశాస్త్రం యొక్క అంతిమ మూలం మరియు దాని మధ్యవర్తి యేసు క్రీస్తే అని కాల్విన్ నిర్ధారించాడు. ఈవిధంగా యూదులను మరియు అన్యజనులను దేవునితో సమాధానపరిచే ఏకైక మధ్యవర్తి యేసు క్రీస్తు మాత్రమే. ఇది దేవుని నిత్య ప్రణాళిక, దీనిలో మార్పు లేదు. అందుకే “దేవుడు ఒక్కడే” అని చెప్పబడింది అని వివరిస్తారు.

ఈ మధ్యవర్తి మోషే అని చెప్పేవారు, ఈ విధమైన వ్యాఖ్యానాన్ని ఇస్తున్నారు. మధ్యవర్తి (Mediator) ఉంటే దానికి కనీసం ఇద్దరు వ్యక్తులు (రెండు పక్షాలు) అవసరం. ధర్మశాస్త్రం (మోషే ద్వారా ఇవ్వబడింది) దేవుడు మరియు ఇశ్రాయేలీయుల మధ్య ఒక ఒడంబడిక (conditional agreement) లాంటిది. "దేవుడొక్కడే" (God is one) అంటే అబ్రాహాముకు చేసిన వాగ్దానం షరతులు లేనిది (unilateral) మరియు దేవుడు ఒక్కరిపై మాత్రమే ఆధారపడి ఉంది. మనుష్యుల మధ్యవర్తిత్వం లేదా క్రియలతో దానికి సంబంధం లేదు. ఈవిధంగా పౌలు విశ్వాసం ద్వారా రక్షణ అనే వాగ్దానం, క్రియల ద్వారా రక్షణను కోరే ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనదని నొక్కి చెబుతున్నాడు. ఎక్కువ మంది వ్యాఖ్యాన కర్తలు ఈ వచనాలలో పౌలు మాట్లాడే మధ్యవర్తి మోషేనే అని అభిప్రాయపడ్డారు.

“ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడియున్న యెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రమూలముగానే కలుగును గాని" గలతి 3:21

పౌలు ఇప్పటివరకు చెప్పిన విషయాలను బట్టి, ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరోధమైనది అని అనిపించే అవకాశం ఉంది. ఉదాహరణకు: ధర్మశాస్త్రం రక్షణను కలుగచెయ్యలేదు, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, క్రియా సంబంధమైనది. అందుకే పౌలు ఈ విషయాన్ని స్పష్టం చెయ్యడానికి ఈ మాటలు చెబుతున్నాడు. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానాలకు విరోధమైనది కాదు. అదేంటి ధర్మశాస్త్రం మరియు వాగ్దానం చూడడనికి ఒకదానికి ఒకటి విరోధంగానే ఉన్నాయి కదా అని అంటారేమో. ఆలా ఏమీలేవు అనేది పౌలు యొక్క వాదన.

ఎందుకు ధర్మశాస్త్రం దేవుని వాగ్దానానికి విరోధమైనది కాదో ఈ వచనం రెండవ భాగంలో పౌలు చెబుతున్నాడు "జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడియున్న యెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రమూలముగానే కలుగును గాని". అంటే ధర్మశాస్త్రం మనల్ని జీవింపచెయ్యడానికి లేదా రక్షించడానికి దేవుడు ఇవ్వలేదు. ధర్మశాస్త్రం ఇవ్వడంలో దేవుని ఉద్దేశం, "ఆలాగైతే ధర్మశాస్త్రమెందుకు?" అనే ప్రశ్నకు సమాధానంగా మనం 19వ వచనంలో మాట్లాడుకున్నాం.

ధర్మశాస్త్రం మనల్ని రక్షించలేకపోవడానికి కారణం ధర్మశాస్త్రములో ఎదో లోపం ఉండి కాదు. మనలో లోపం ఉంది గనుక, ఆ లోపాన్ని ఎత్తి చూపడం తప్ప ధర్మశాస్త్రం దానిని సరిచెయ్యలేదు గనుక ధర్మశాస్త్రం మనల్ని రక్షించలేదు. ఒకవేళ మనలో ఏ లోపము లేకపోతే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ఆచరించగల సమర్థత మనలో ఉంటే నిజానికి రక్షణ ధర్మశాస్త్రం ద్వారానే వచ్చేది. అయితే అలాంటి సామర్ధ్యం లేదా పరిపూర్ణత మనలో ఏవీలేవు గనుక (మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారైయుండగా - ఎఫెసీ 2:1) మనం ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేము.

దేవుడు తన ధర్మశాస్త్రం ద్వారా మనలో ఉన్న పాపాన్ని చూపించి, మనకు ఒక రక్షకుడు అవసరం అని తెలియచేస్తున్నాడు. అందుకే ధర్మశాస్త్రం మనల్ని దేవుని వాగ్దానం దగ్గరికి తీసుకువస్తుంది, క్రీస్తే రక్షణకు మార్గం అని చూపిస్తుంది. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానానికి విరోధమైనది కాదు, అది దేవుని వాగ్దానం దగ్గరికి మనల్ని నడిపించే ఒక సాధనం.

“యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను." గలతి 3:22

"లేఖనము అందరిని పాపములో బంధించెను" అనే మాటను గమనించండి. ఇక్కడ లేఖనం అనే మాటను వ్యక్తీకరించి ఒక న్యాయవాది లేదా ఒక తీర్పరిగా పౌలు చూపిస్తున్నాడు. ఆ లేఖనము అందరిని పాపంలో బంధించింది అని చెబుతున్నాడు. ఇది అర్ధం చేసుకోవడం అంత కష్టమైన విషయమేమి కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మనం చెబుతూ ఉంటాం. అంటే చట్టం ఏమైనా ఒక వ్యక్తా? పని చెయ్యడానికి? కాదు కదా. అయినప్పటికీ వ్యక్తీకరించి మాట్లాడే భాష మనం సహజంగానే వాడుతూ ఉంటాం, పౌలు కూడా అలానే మాట్లాడుతున్నాడు.

అయితే లేఖనము ఎలా అందరినీ పాపములో బంధించింది అంటే ఆ లేఖనాన్ని ఇచ్చిన దేవుడు అందరిని పాపంలో బంధించాడు గనుక, లేఖనము కూడా అందరిని పాపంలో బంధించింది అని వ్యక్తీకరించి మాట్లాడడంలో సమస్య ఏమీ లేదు అని అర్ధం చేసుకోవాలి. ఈ విషయం అర్ధం కాక కొంతమంది వారి జ్ఞానానికి సరిపోయినట్టు విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంటారు . ఉదాహరణకు : లేఖనము అందరిని పాపంలో బంధించింది గనుక లేఖనమే పాపానికి కారణమని, లేఖనాన్ని వదలకపోతే పాపంలో పడతాం అనే పిచ్చి వాదనలు చేస్తుంటారు. నరహత్య చేసిన ఒక వ్యక్తికి ఆ తప్పుకు తగ్గవిధంగా చట్టం అతనిని మరణ దండనకు అప్పగిస్తే (లేదా మరణ దండనే దీనికి సరైన శిక్ష అనే నియయంలో బంధిస్తే) ఆ వ్యక్తి చేసిన పాపానికి కారణం చట్టం ఔతుంది అనడం ఎంత వెఱ్ఱితనమో లేఖనం అందరిని పాపంలో బంధించింది గనుక లేఖనాన్ని వదలకపోతే పాపంలో పడతాము అనేది కూడా అంతే వెఱ్ఱితనము అని గ్రహించాలి.

లేఖనము న్యాయవాదిగా వ్యక్తీకరించబడింది గనుక, ఆ లేఖనము (న్యాయవాది) మన పాపాలకు వెల చెల్లించబడే వరకు మనల్ని బందించి ఉంచింది అనే సారాంశాన్ని ఈ వచనం నుండి తెలుసుకుంటున్నాం.

యేసు క్రీస్తు ప్రభువు పాపుల పక్షాన ఆ వెలను చెల్లించినప్పుడు, అనగా దేవుని తీర్పును బట్టి మన పక్షాన శిక్ష అనుభవించినప్పుడు, విశ్వసించిన వారిని పాప బంధకం నుండి విడిపించి, దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానానికి వారసులుగా చేసాడు. అబ్రాహాము దేనికోసమైతే నిరీక్షించాడో దానికి మనల్ని కూడా (అంటే యేసు ప్రభువును విశ్వసించిన వారిని) వారసులుగా చేసాడు. (దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను - హెబ్రీ 11 : 10). సులభంగా చెప్పాలంటే నిత్యజీవానికి మనల్ని పాత్రులుగా చేసాడు.

“విశ్వాసము వెల్లడికాకమునుపు, ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైనవారమైతివిు." గలతి 3:23

ఈ వచనంలో పౌలు 22వ వచనంలో చెప్పిన విషయాన్నే మళ్ళీ చెబుతున్నాడు. "మనము ధర్మశాస్త్రమునకు లోనైనవారమైతివిు" అని చెప్పినప్పుడు ఎవరు ఈ "మనము" అనే సందేహం రావొచ్చు? 22వ వచనంలో ఉన్న "అందరు" మరియు ఈ వచనంలో ఉన్న "మనము" ఒకరి గురించే మాట్లాడుతుందా? అనే విషయాన్ని అర్ధం చేసుకుందాం. దీని మీద బైబిల్ వ్యాఖ్యానకర్తల్లో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి:

1. "మనము" అంటే పౌలు మరియు గలతీ సంఘం వారు అని, కొనసాగింపుగా అది అందరికి వర్తిస్తుంది అని కొందరు వ్యాఖ్యానకర్తలు అభిప్రాయపడతారు

2. కొందరు వ్యాఖ్యానకర్తలు, పౌలు ప్రస్తావిస్తుంది ఈ లోకంలో ఉన్న అందరి గురించి కాదు అని, అందరి గురించిన ప్రస్తావన దీని ముందు వచనంలోనే చేసాడు కనుక ఇక్కడ ప్రత్యేకించి యూదుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు అని చెబుతారు. ఈ యూదులు కూడా అందరు యూదులు కాదు, దేవుని యందు విశ్వాసముంచడానికి ఇష్టపడే యూదులు (the Jews whom God had preserved to believe in his name) అని చెబుతారు.

ఈ వచనానికి ఈ రెండు వ్యాఖ్యానాలు సాధ్యమే అని ఒక రకంగా చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంలో చూసినప్పుడు పౌలు యూదుల గురించి మాత్రమే కాదు అందరి గురించి మాట్లాడుతున్నాడు అని స్పష్టంగానే అర్ధమౌతుంది. 22వ వచనంలో "అందరిని" అని సంబోధించిన పౌలు 23-26 వచనాలు వరకు "మనము" అని సంబోధిస్తున్నాడు. తర్వాత 26-29 వచనాల వరకు "మీరందరు" అని మాట్లాడుతున్నాడు. దీనిని బట్టి ఇక్కడ ఒకే గుంపు ప్రజల గురించి మాట్లాడట్లేదు అనే నిర్ధారణకు రాకూడదు. ఈ విధంగా నేను నమ్మడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వీటిని ఈ వచనం యూదుల గురించే మాత్రమే అని వాదించే వారు అడిగే ప్రశ్నలకు జవాబులాగా చెప్పే ప్రయత్నంలో స్పష్టం చేస్తాను.

1. ముందు వచనంలో చెప్పిన విషయాన్నే మళ్ళీ తర్వాత వచనంలోనే పౌలు రెండోసారి ఎందుకు చెప్తాడు?

Ans: పౌలు, తాను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాన్ని రెండుసార్లు నొక్కి చెప్పడం ఈ పత్రికలోనే చాలా సార్లు మనం చూడొచ్చు. ఉదాహరణకు: మొదటి అధ్యాయం 8,9 వచనాలలో వేరొక సువార్తను ప్రకటించే వారు శాపగ్రస్తులు అని ఒకే భావం వచ్చే అదే విషయాన్ని రెండు సార్లు చెప్పడం చూస్తాం. అదేవిధంగా మూడవ అధ్యాయంలో 7 మరియు 9వ వచనాలు పరిశీలించినప్పుడు ఒకే విషయాన్ని చెబుతున్నట్టు తెలుస్తుంది (కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి - గలతి 3:7; కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు - గలతి 3:9). నొక్కి చెప్పాల్సిన విషయాలను రెండుసార్లు చెప్పే పద్దతిని ఇదే పత్రికలో వేరే అధ్యాయాలలో చూసాం గనుక అదే పద్దతిని ఇక్కడ కూడా అమలు చేసాడు అని చెప్పడంలో ఇబ్బంది ఏమీ లేదు.

2. పౌలు ఇంతక ముందు వచనంలోనే "అందరు" అని చెప్పి ఈ వచనం లో "మనము" అని చెప్పడం స్పష్టంగా ఇది అందరి గురించి కాదు అని తెలియచేస్తుంది కదా?

Ans: పౌలు "మనము" అనే పదాన్ని ఈ పత్రికలో వాడిన విధానాన్ని చూద్దాం. నాలుగవ అధ్యాయంలో "మనము" అనే పదాన్ని ఆయన ఈ పత్రిక రాసిన వారందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఉదాహరణకు "మనము దత్తపుత్రులము కావలెనని" అని 4:7లో "సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము" అని 4:28లో మరియు "మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము" అని 4:31లో చూస్తాం. ఈ వచనాలను బట్టి "మనము" అని సంబోధించినప్పుడు ఈ పత్రిక ఉద్దేశించబడిన గలతీయులు అందరు అని అర్ధం ఔతుంది.

3. ధర్మశాస్త్రం క్రింద ఉన్నది యూదులు మాత్రమే కదా అన్యజనులు కాదు కదా? అందుకే పౌలు ఈ వచనంలో "మనము ధర్మశాస్త్రమునకు లోనైనవారమైతివిు" అని అంటున్నాడు. దీనికేం చెబుతారు?

Ans: ఇది కొంచెం ఆలోచించదగిన ప్రశ్న. అన్యులు ధర్మశాస్త్రం యొక్క నియమాల క్రింద లేకపోయినప్పటికీ ధర్మశాస్త్రం యొక్క ప్రభావానికి వెలుపట లేరు అని మనం చెప్పొచ్చు. ఇక్కడ పౌలు అదే మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం ఈ లోకంలో అందరి మీద ప్రభావం చూపిస్తుంది కనుక "మనము" అని చెప్పినప్పుడు ఈ లోకంలో ఉన్న అందరు అని అంటున్నాడు. ఇది నేనేదో సొంతంగా కల్పించి చెప్తున్న మాటలు కాదు. పౌలు మాటల్లోనే చుడండి.

"ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయము లయందు వ్రాయబడి నట్టు చూపుచున్నారు ." (రోమా 2:14,15)

ఇక్కడ పౌలు ఏం చెబుతున్నాడు, అన్యులకు ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ వారు దేవుడిచ్చిన మనసాక్షికి అనుగుణంగా లేదా ప్రతికూలంగా ప్రవర్తించినప్పుడు, దేవుని ధర్మశాస్త్రము యొక్క సారాంశం వారి మనసాక్షిలో వుంది అని చెబుతున్నాడు (ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు). దీనిని బట్టి యూదులకు దేవుడు పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అని వారు దానికి లోనయ్యారు అని, అన్యజనులు ధర్మశాస్త్ర సారమైన మనసాక్షికి లోనయ్యారు అని అర్ధం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నవారు ధర్మశాస్త్రము యొక్క ప్రభావానికి వెలుపట లేరు అని గ్రహించాలి.

ఈ కారణాలను బట్టి పౌలు "మనము" అని చెప్పినప్పుడు అది గలతీ సంఘం గురించి అని నేను నమ్ముతున్నాను.

క్రీస్తు వచ్చే వరకు విశ్వాసము వెల్లడి కాలేదు, అప్పటివరకు ధర్మశాస్త్రమనే బాలశిక్షకుని క్రింద అందరూ ఉన్నారు. ఎందుకు ఆలా ధర్మశాస్త్రానికి లోనయ్యి ఉన్నారు అంటే "ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా" అని పౌలు సమాధానం ఇస్తున్నాడు. అంటే క్రీస్తు వచ్చినప్పుడు విశ్వాసముంచబోయే వారు క్రీస్తు రాకముందు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు అని (యూదులకు దేవుడిచ్చిన రాతపూర్వకంగా ధర్మశాస్త్రం, అన్యులకు మనసాక్షి అనే ధర్మశాస్త్రం), ఆలా ఉండడాన్ని "చెరలో ఉంచబడినట్టు" అని వర్ణించడం జరిగింది. ధర్మశాస్త్రానికి లోనై ఉండడం చెరలో ఉండడం ఐతే క్రీస్తును విశ్వసించడం విడుదల లేదా స్వేచ్ఛ అని పౌలు ఉద్దేశం.

“కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను." గలతి 3:24

ధర్మశాస్త్రం చేసే ఒక పని గురించి ఈ వచనంలో చెప్పబడింది. ఏంటి ఆ పని అంటే " క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు" అని చూస్తున్నాం. ఎలా ధర్మశాస్త్రం క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది అని ఆలోచన చేస్తే ఈ ధర్మశాస్త్రం మనకు "బాలశిక్షకుడాయెను" అని పౌలు చెబుతున్నాడు. బాలశిక్షకుడు అని అనువదించబడిన పదం గ్రీకులో "పెదగొగోస్" (paidagōgos) అని ఉంది. ఈ పదం నుండే "pedagogue" అనే ఇంగ్లీష్ పదం వచ్చింది దీని అర్ధం "కఠినమైన ఉపాధ్యాయుడు లేదా విద్యావేత్త". ఈ పదాన్ని పౌలు ధర్మశాస్త్రం గురించి వాడడం కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది అని చాలామంది బైబిల్ పండితులు అభిప్రాయ పడుతుంటారు. (ఇదే అధ్యాయం 22 వ వచనంలో లేఖనాన్ని న్యాయవాదిగా వ్యక్తీకరించిన పౌలు ఇక్కడ ధర్మశాస్త్రాన్ని బాలశిక్షకుడిగా వ్యక్తీకరిస్తున్నాడు).

"paidagōgos" అంటే ఇంగ్లీష్ బైబిల్ లో "guardian" అని "'schoolmaster" అని అనువదించడం జరిగింది. మనకు విద్య నేర్పించే గురువులు తెలుసు ఎందుకంటే మన సమాజంలో గురువులను మనం చూడొచ్చు. అయితే "paidagōgos" అనే ఒక వ్యవస్థను మనం ఎప్పుడూ చూసి ఉండం ఇది గ్రీకు మరియు రోమా సామ్రాజ్యంలో ఉన్న ఒక వ్యవస్థ. చిన్నపిల్లవాడిని గురువు దగ్గరికి తీసుకెళ్ళి తీసుకురావడానికి, వాడికి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో అని నేర్పించడానికి ఉండేవారిని "paidagōgos" అని అంటారు (సులభంగా చెప్పాలంటే - ఒక పిల్లవాడి దైనందిన జీవితాన్ని పర్యవేక్షించడం, అతని భద్రత మరియు మంచి ప్రవర్తనను నిర్ధారించడం వీరి పని). ఒక కుటుంబానికి పని చేసే నమ్మదగిన ఒక బానిసను ఆ కుటుంబంలో ఉన్న పిల్లల కోసం ఈ పనికి నియమించేవారు. పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే వాడిని చూసుకుంటున్న ఈ paidagōgos (బాలశిక్షకునికి) కూడా శిక్ష పడేది. అందుకే వారు చాలా క్రమశిక్షణగా ఆ పిల్లవాడు ఉండాలి అని కఠినంగా ఉండేవారు.

ధర్మశాస్త్రం ఒక బాలశిక్షకుడిలాగా దాని క్రింద ఉన్న వారిని పర్యవేక్షించి కఠినమైన నిందలు మోపి, దాని క్రింది ఉన్నవారిని క్రీస్తు నొద్దకు నడిపించడంలో దేవుడు ఉద్దేశించిన పాత్రను పోషించింది. This is not a positive effect of the law in driving people to Christ but a negative reproach which it imputes on those who are under it there by driving people from works towards faith for salvation.

ఎలా క్రీస్తు నొద్దకు నడిపించడంలో "ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను" అనే విషయాన్ని ఆలోచిస్తే ఒక మూడు విషయాలు చెప్పుకోవచ్చు

1. నా ద్వారా ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు అని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది

యాకోబు ఏం చెబుతున్నాడో చూడండి (యాకోబు 2:10), "ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును". అంటే ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవ్వాలి అంటే ధర్మశాస్త్రములో చెప్పబడిన ఏ ఆజ్ఞను ఎప్పుడు ఉల్లఘించకూడదు అని వాక్యం చెబుతుంది. మరి ఆదాము పాప స్వభావాన్ని సంతరించుకున్న మనం, పాపానికి బానిసలమైన మనం, పరిశుద్ధమైన దేవుని ఆజ్ఞలకు సంపూర్ణమైన విధేయత చూపించడం సాధ్యమేనా? కానీ కాదు? అందుకే పౌలు ఇదే అధ్యాయం 11వ వచనంలో "ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే" అని చెబుతున్నాడు.

2. నీతిని ఇవ్వలేని ధర్మశాస్త్రం, నిందను మాత్రమే మోపుతుంది

ధర్మశాస్త్రం ఆత్మసంబంధమైనదే కాని మనము పాపంలో బందించబడ్డాము కనుక, ధర్మశాస్త్రం మనకు నీతిని ఇవ్వలేదు. ఇదే పౌలు రోమా 7:14 లో చెబుతున్నాడు, "ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను." మీరు దేవుని ముందు నీతిమంతులుగా ఉండాలి అంటే నా మాట విని విధేయత చూపండి అని ధర్మశాస్త్రం చెబుతుంది, అయితే నేను శరీరాన్ని అనుసరించి నడిచే వాడిని కనుక, అలాంటి శక్తి నాకు లేదు. దేవుని ధర్మశాస్త్రం ఇది దేవుని ఆజ్ఞ అని నాకు చెప్పిన ప్రతి సారి ఆ ఆజ్ఞలను నెరవేర్చలేక, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడిగా కనబడుతున్నాను. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన నాకు, నువ్వు నా మాట వినలేదు గనుక శిక్షకు అర్హుడవు, దేవుని ఉగ్రత నీ మీద ఉంది, నువ్వు పాపానికి బానిసవు అని ధర్మశాస్త్రం నా నేరాన్ని ఎత్తి చూపిస్తూ ఆ నిందను నా మీద మోపుతుందే కాని నన్ను దాని నుండి విడిపించలేదు.

3. నేను చెయ్యలేని దానిని క్రీస్తు చేసాడు అని ధర్మశాస్త్రం చూపిస్తుంది

పౌలు రోమా 8:2 లో ఈ మాటలు చెబుతున్నాడు, "క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను." ధర్మశాస్త్రం నీతిని ఇవ్వలేకపోయింది, అది నా పాప స్వభావాన్ని బట్టే, నా శరీరబలహీనతను బట్టే. అయితే "దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను." (రోమా 8:4) అని చూస్తున్నాం. ఈ విధంగా "క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను" అని అర్ధం చేసుకోగలం.

“అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము." గలతి 3:25

పిల్లవాడు యుక్తవయస్సుకు వచ్చే వరకు మాత్రమే బాలశిక్షకుని (paidagōgos) క్రింద ఉంటాడు, ఆ యుక్తవయస్సు దాటిన తరవాత బాలశిక్షకునితో ఏమీ పనిలేదు. అదేవిధంగా క్రీస్తు వచ్చి క్రొత్తనిబంధనను స్థిరపరిచాడు కనుక ధర్మశాస్త్రాన్ని పాతదిగా చేసియున్నాడు కనుక, ఇక ధర్మశాస్త్రానికి లోనవ్వాల్సిన అవసరం లేదు.

"ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది" (హెబ్రీ 8:13)

"ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడియున్నది; అంత కంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము." (హెబ్రీ 7:19)

"బాలశిక్షకుని క్రింద ఉండము" అని పౌలు చెప్పినప్పుడు అది మోషే ధర్మశాస్త్రం యొక్క తాత్కాలికమైన పరిధిని చూపిస్తుంది. ధర్మశాస్త్రం గురించి హీబ్రూ గ్రంథకర్త మాట్లాడుతూ "ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది" అని అంటున్నాడు. ధర్మశాస్త్రము యొక్క తాత్కాలికమైన పాత్ర పూర్తైన తర్వాత అది క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన చేత భర్తీ చెయ్యబడింది. అందుకే పౌలు "ఇక బాలశిక్షకుని క్రింద ఉండము" అని చెప్పాడు.

“యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులైయున్నారు." గలతి 3:26

ఇంతక ముందు ఉన్న వచనాలలో (V 23-25) "మనము" అని సంబోధించిన పౌలు, ఇక్కడ నుండి ఉన్న వచనాలలో "మీరందరు" అని సంబోధిస్తున్నాడు. "మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులైయున్నారు" అంటున్నాడే కాని "మనము విశ్వాసమువలన దేవుని కుమారులైయున్నాము" అని అనట్లేదు. అంటే పౌలు దేవుని కుమారుడు కాదు అని చెప్పాలా? ఆలా చెప్పకూడదు.

మరి పౌలు "మీరందరు" అనే మాట ఎందుకు వాడుతున్నాడు? తాను వివరించాలనుకున్న విషయాలు అన్ని వివరించిన తర్వాత, తిరిగి తన సారాంశాన్ని 7వ వచనంతో కలుపుతున్నాడు. 7వ వచనంలో "కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి" అని చెప్పాడు. ఇక్కడ గమనించండి. విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని ఎవరు తెలుసుకోవాలంట? "మీరు" తెలుసుకోవాలి అంటున్నాడు (పౌలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అతనికి తెలుసు కనుకనే వీరికి చెబుతున్నాడు). ఈ వచనాన్ని సమర్ధించడానికి కావాల్సిన వివరణ అంతా ఇచ్చిన తర్వాత, 'మీరు ఏమి తెలుసుకున్నారు?' అనే ప్రశ్న అడగకనే వారిని అడిగినట్టు దానికి సమాధానం తానే చెబుతున్నాడు. ఏంటి ఆ సమాధానం "యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులైయున్నారు" అంటున్నాడు. ఈ కారణాన్ని బట్టి పౌలు "మనము" అనే మాట ఉపయోగించకుండా "మీరందరు" అనే మాట ఉపయోగించాడు అని అర్ధం చేసుకోవాలి.

దేవుని కుమారులు అంటే దేవుడు మనకు తండ్రి అని అర్ధం. దేవుడు మనకు తండ్రి ఎలా అయ్యాడు? రోమా పత్రికలో పౌలు ఈ విషయాన్ని వివరించాడు, "ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొంద లేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము" (రోమా 8:15). "దత్తపుత్రాత్మను పొందితిరి" అనే మాటను గమనించారా? ఇది ఇంగ్లీషుకి లో "Spirit of adoption as sons" అని చూస్తాం. అంటే యేసు క్రీస్తును నమ్మడం ద్వారా తండ్రియైన దేవుడు మనలను ఆయన కుటుంబంలోకి పిల్లలుగా దత్తత తీసుకోవడం. మనం ఆయన సొంత పిల్లలం కాదు, ఆయనకు వ్యతిరేకులం, పాపులం, ఆయన ఉగ్రతకు పాత్రులం. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసమును బట్టి కుమారులం. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి దేవుడు చూపిన ప్రేమ గురించి అర్ధమౌతుంది. ఆలా అర్ధం చేసుకున్న అపొస్తలుడైన యోహాను ఇలా అంటున్నాడు, "మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే." (1 యోహాను 3:1). దేవుడు మనలని తన పిల్లలుగా చేసుకోవడంలో ఆయన ప్రేమ, కృప, మరియు ఆయన త్యాగం కనబడుతుంది.

“క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు." గలతి 3:27

"క్రీస్తును ధరించుకొనియున్నారు" అనే మాటకు అర్ధం ఏంటి? పౌలు మనకి ఇప్పటివరకు తెలియని ఏదైనా ఒక క్రొత్త విషయాన్ని చెబుతున్నాడా? కాదు. ఇప్పటి వరకు ఏదైతే చెప్పాడో దానినే ఇంకా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తు నీతిని ధరించుకోవడం. ఆయనను విశ్వసించిన అందరూ నీతిమంతులు ఔతారు అని ఇప్పటివరకు చెప్పిన పౌలు, నీతిమంతులు అవ్వడం అంటే ఏంటో ఇక్కడ వివరిస్తున్నాడు. నీతిమంతులు అవ్వడం అంటే మన పాపం క్రీస్తు మీద మోపబడి క్రీస్తు నీతి మనకు ఆపాదించబడితే మనం నీతిమంతులం ఔతాం. క్రీస్తు నీతి మనకు ఆపాదించబడడాన్నే క్రీస్తును ధరించుకోవడం అని పౌలు సంబోధిస్తున్నాడు.

మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసు పరలోకరాజ్యాన్ని వివరిస్తూ "తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజు" ఉపమానం చెప్పాడు. అక్కడ " పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి", రాజు ఇలా అంటున్నాడు "స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను" అని చూస్తాం. అప్పుడు "అంతట రాజువీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను." (V 11-13). ఇక్కడ పెండ్లి వస్త్రం దేనికి సూచనగా ఉందో మనకు అర్ధమౌతుంది కదా! పెండ్లి వస్త్రం మనకు ఆపాదించబడిన యేసు క్రీస్తు నీతికి సాదృశ్యంగా ఉంది. ఆ నీతి అనే వస్త్రం లేకుండా ఎవరూ పరలోకరాజ్యములో ప్రవేశించలేరు అని చూస్తున్నాం.

క్రీస్తును ధరించుకోవడం అనేది బైబిల్ లో రెండు విధాలుగా చెప్పబడింది. మొదటిది, దినదినము పరిశుద్ధంగా జీవించడానికి (for sanctification) మనం క్రీస్తును ధరించుకోవాలి. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ పౌలు రోమా 13:14లో "మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనినవారై , శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి" అని అంటున్నాడు. రోమా 13వ అధ్యాయంలో పౌలు ఆచరణాత్మకమైన క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతున్నాడు (living a sanctified life). రెండవది (క్రమంలో ఇదే మొదటిది) మనం నీతిమంతులము అవ్వడానికి క్రీస్తును ధరించుకోవాలి. మనం రక్షణ పొందినప్పుడు జరిగిన క్రియ క్రీస్తును ధరించుకోవడం, ఇది ఒక్కసారే జరుగుతుంది, దీనినే నీతిమంతులుగా తీర్చబడడం అని పిలుస్తాము (Justification).

ఇక్కడ ఒక సమస్య ఉంది. "మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు" అని చెప్పిన పౌలు, ఆ ధరించుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుందో కూడా చెబుతున్నాడు, అది ఎప్పుడు? "క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు" అని స్పష్టం చేస్తున్నాడు. దీనిని బట్టి, బాప్తిసమం ద్వారా క్రీస్తు నీతి మనకు వస్తుంది అని పౌలు చెబుతున్నాడా? లేదు ఆలా చెప్పడం లేదు (కొందరు అబద్ద బోధకులు బాప్తిస్మము ద్వారా రక్షణ వస్తుంది అని చెప్పడానికి ఉపయోగించుకునే వచనాలలో ఇదొకటి). ఈ 27వ వచనానికి ముందు 26వ వచనం ఉంది అని మనం మరిచిపోకూడదు. పౌలు 26వ వచనంలో ఏం చెప్పాడు? "యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన" మాత్రమే దేవుని కుమారులు అయ్యారు అంటున్నాడు. విశ్వాసాన్ని బట్టి మాత్రమే ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడతారు, అయితే బైబిల్ ప్రకారం నీతిమంతులుగా తీర్చబడిన ఎవరైనా బాప్తిస్మము తీసుకోవడానికి అస్సలు ఆలస్యం చెయ్యరు అని మనకు తెలుసు (శతాధిపతియైన కొర్నేలీ అతని కుటుంబము రక్షణ పొందినప్పుడు వెంటనే బాప్తిస్మము తీసుకున్నారు - అపో. కార్యములు 10). అందుకే "నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును" అని మార్కు 16:10 లో మనం చూస్తాం. అంతే కాని విశ్వాసము లేని బాప్తిస్మము వ్యర్ధము, అలానే అవకాశం ఉండి బాప్తీస్మాన్ని తృణీకరించే విశ్వాసం ప్రశ్నర్ధకం!

యెషయా దేవుని రక్షణను గురించి మాట్లాడుతూ "శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది" (యెషయా 61:10) అంటున్నాడు. ఇలాంటి రక్షణ అనుభవం నీకు ఉందా?

“ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు." గలతి 3:28

రక్షణ విషయంలో యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఏ బేధము చూపబడదు. యూదులను ఒక రకంగా రక్షిస్తాను అని, అన్యుల పట్ల వేరొక వైఖరి చూపిస్తాను అని చెప్పట్లేదు. యేసు క్రీస్తులో ఏ పక్షపాతం లేదు, అందరిని సమానంగా చూసే దేవుడు, ఆయన దగ్గరికి రావడానికి అందరికి సమానంగా సువార్త ప్రకటించమన్న దేవుడు. అయితే పౌలు ఇక్కడ రక్షింపబడిన వారి గురించి చెబుతున్నాడు.

రక్షింపబడే విషయంలో ఎలాగైతే ఏ వ్యత్యాసము లేదో రక్షింపబడిన వారిలో కూడా ఏ బేధము లేదు. రక్షింపబడిన యూదుడు రక్షింపబడిన అన్యుడుకంటే గోప్పవాడా? కాదు. రక్షింపబడిన యజమానుడు రక్షింపబడిన దాసునికంటే గోప్పవాడా? కాదు. రక్షింపబడిన పురుషుడు రక్షింపబడిన స్త్రీకంటే గోప్పవాడా? కాదు. రక్షింపబడిన ప్రజలందరూ యేసుకు చెందిన వారు, వారిలో ఎలాంటి వ్యత్యాసము లేదు దేవుని దృష్టిలో వారు ఆయన కుమారులు, కుమార్తెలు.

యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు అని పౌలు చెప్పిన మాటలు సందర్భానుసారంగా అర్ధం చేసుకోవాలే గాని అన్నిటికి ఈ నియమం అన్వయించి దేవుడు ఏ విషయంలోనూ ఎవరిమద్య ఏ వ్యత్యాసం చూపట్లేదు అనే సారాంశానికి రాకూడదు. ఉదాహరణకు: "పురుషుడని స్త్రీ అని లేదు" అని చెప్పినంత మాత్రాన సంఘంలో స్త్రీ బోధించవచ్చు అని కాదు ("స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను" 1 తిమోతి 3:12, " స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు" 1 కొరింథీ 14:34). స్త్రీలు స్త్రీలకు బోదించవచ్చు, సంఘంలో పాటలు పాడవచ్చు, ప్రార్ధన చెయ్యవచ్చు, సహాయ కార్యక్రమాలు చెయ్యవచ్చు ఐతే సంఘంగా ఉన్నప్పుడు బోధించొద్దు, ఆలా బోధించడం సంఘ నాయకత్వపు అధికారం అని ఆ పని దేవుడు స్త్రీలకు అప్పగించలేదు అని అర్ధం చేసుకోవాలి.

అలానే "దాసుడని స్వతంత్రుడని లేదు" అని చెప్పినంత మాత్రమే, యజమాని దగ్గర పనిచేసే వారు అందరు మేము నీకు దాసులము కాదు మనందరం ఒక్కటే అనేలాంటి తిరుగుబాటు చెయ్యకూడదు. పౌలు, బానిసా వ్యవస్థను ఏమి ప్రోత్సహించట్లేదు (ఈ విషయం ఫిలేమోనుకు రాసిన పత్రిక చదివితే మనకు అర్ధమౌతుంది - హితబోధ website లో ఉన్న "ఫిలేమోను పత్రిక వ్యాఖ్యానాన్ని చదివి బానిసల పట్ల పౌలు యొక్క వైఖరిని అర్ధం చేసుకోండి) ఆలాగని బానిసా వ్యవస్థ ఉండకూడదు అనే ఒక సామాజిక విప్లవాన్ని ప్రారంభించట్లేదు (పౌలు అందుకు పిలువబడలేదు, అయితే ఆయన చేసిన బోధలు చరిత్రలో బానిసా వ్యవస్థను నిషేధించేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయని మనకు తెలుసు). క్రీస్తులో రక్షణ విషయంలో ఏ వ్యత్యాసం లేకపోయినా సామాజికంగా మన పనిని బట్టి కొందరు యజమానులుగాను కొందరు పనివారిగాను ఉన్నారు.

పౌలు రక్షణ విషయంలో చెప్పిన మాటలను అపార్ధం చేసుకుని సందర్భరహితంగా లేని అర్ధాన్ని ఈ వచనాలలోకి చొప్పించకూడదు అని మనవి చేస్తున్నాను. ఒకవేళ ఈ పత్రిక చదువుతున్న నువ్వు సంఘంలో దేవుని మాటలను బోధించే స్థానంలో ఉంటే వాక్యాన్ని సరిగా విభజించాలని, సందర్భరహితంగా ఏ వచనాన్ని బయటకు తీసి లేని అర్ధాలతో బోధించవద్దు అని వేడుకుంటున్నాను.

“మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు" గలతి 3:29

నిజమైన క్రీస్తు సంబంధులే అబ్రాహాము సంతానము మరియు వాగ్దాన ప్రకారము వారసులు అని పౌలు చెబుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి అబ్రాహాము సంతానము అందరు క్రీస్తు సంబంధులు అని పౌలు చెప్పట్లేదు. మేము అబ్రాహాము సంతానం కాబట్టి మేమందరము దేవుని పిల్లలం, దేవుని వాగ్దానాలకు వారసులం అని చెప్పుకునే పరిసయ్యుల గురించి యేసు ప్రభువు ఏమి చెబుతున్నాడో చుడండి.

"యేసు మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను." (యోహాను 8:39-41)

ప్రభువు పరిసయ్యులతో మాట్లాడుతూ మీరు బాహ్యపరంగా అబ్రాహాము యొక్క సంతానం అనేది నిజమైనప్పటికీ అబ్రాహాము లాగా దేవుని పిల్లలు అనే విషయంలో మీరు అబ్రాహాము సంతానం కాదు, మీరు నిజమైన అబ్రాహాము సంతానమైయుంటే "అబ్రాహాము చేసిన క్రియలు చేతురు" (యోహాను 8:39) అని చెబుతున్నాడు. ఎందుకు వీరు అబ్రాహాము చేసిన క్రియలు చెయ్యట్లేదు అంటే వీరు అబ్రాహాములా దేవుణ్ణి విశ్వసించట్లేదు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నువ్వు ఇశ్రాయేలీయుడవా లేక అన్యుడువా అనేది కాదు సమస్య, నువ్వు అబ్రాహాములా దేవుని వారసుడువా? కాదా?

ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన అబ్రాహాము సంతానము? క్రీస్తు సంబంధులందరు అబ్రాహాము సంతానము అని అర్ధం చేసుకోవాలి. ఎవరు క్రీస్తు సంబంధులు అనే ప్రశ్నకు పౌలు ఇదే అధ్యాయంలో 26వ వచనములో "యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులైయున్నారు." అని సమాధానం చెప్పాడు.