నిజ క్రైస్తవ జీవితం

రచయిత: ఆర్థర్. డబ్లు. పింక్
అనువాదం: ఉషశ్రీ పోలవరపు

ఆడియో

తన ప్రజలను 'ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని' (గలతీ 1:4),వారి రక్షణ సంపాదించటం కొరకు పరలోక మహిమను వదిలి పాప-శాపగ్రస్తమైన భూమికి వచ్చి, సిలువను సహించి భయంకరమైన మరణాన్ని పొంది నిత్యరక్షణతో తనను రక్షించిన ఆ స్తుతిపాత్రునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కొనియాడుతూ ఉండటమే క్రైస్తవుని ముఖ్యకార్యము మరియు ప్రధానకోరికై ఉండాలి. ''స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము''(కీర్తన 33:1). అయితే యథార్థవంతులు దేవుని స్తుతించడం సాతాను సహించడు. క్రైస్తవునిని ఆ దీవెనకరమైన కార్యం నుండి పక్కకు తిప్పటానికి అవసరమైన ప్రతి యుక్తిని, ప్రతి సాధనాన్ని వాడు ఉపయోగిస్తూ ఉంటాడు.

మన గొప్ప శత్రువైన అతడు ప్రతి విధానాన్ని మరియు సాధనాన్ని యుక్తిగా ప్రయోగిస్తాడు. విశ్వాసిని దేనితోనైనా నిమగ్నం చేసి, క్రీస్తుకు ఇవ్వవలసిన ప్రాధాన్యత (హెబ్రి 3:1) మరియు ఆరాధన నుండి (ప్రకటన 5:12) అతనిని ఆటంకపరచడానికి దోహదపడే ఏ సాధనాన్నైనా వాడటానికి వెనుకాడడు. మహిమాస్వరూపియైన ప్రభువు కన్నా నశించే పాపులతో విశ్వాసిని ఆక్రమితునిగా చేస్తే సాతాను తన లక్ష్యాన్ని సాధించినట్లే. రక్షణ పొందనివారి వద్ద విజయవంతంగా ప్రయోగించే ఎత్తుగడలే పరిశుద్ధుల విషయంలో కూడా సాతాను ఉపయోగిస్తాడు. నశించిపోయేవారి దృష్టి నుండి క్రీస్తును మరుగు చేయటానికి అతను ఉపయోగించే ముఖ్యమైన సాధనం ఏది?  (II కొరింథీ 4:4). వారి స్వంత పనులలో వారిని తలమునకలై ఉండేలా చేయటం కాదా? నిశ్చయంగా అదే. అదే విధంగా అతను దేవుని ప్రజలతో కూడా వ్యవహరిస్తాడు. క్రీస్తుతో ఉన్న అన్యోన్యసహవాసానికి బదులుగా పరిచర్య అనే ప్రత్యామ్నాయాన్ని ఉపయోగిస్తాడు.

ఈ విధంగా దేవునిని తృప్తిపరిచేలా కనిపించే ఏదో ఒక కార్యంలో నిమగ్నమైయుండి, నిలకడలేని ఉద్రేకమైన శరీరస్వభావాన్ని రేకెత్తించేది వెలుగుదూతలా మోసపరిచే ఆ ఘటసర్పమే. మనం పైన చెప్పుకున్న విధంగా స్తుతిపాత్రుడును,ఆశ్చర్యకరుడునైన రక్షకుని ఆరాధిస్తూ కొనియాడుతూ ఉండటమే క్రైస్తవుని శ్రేష్ఠమైన లక్ష్యమై ఉండాలి. నిజానికి ఇది పరలోక ధన్యత భూమిపై ప్రారంభమవటమే. అయితే, ఇది పెదాలకి మాత్రమే పరిమితం కాక మన జీవితమే ఆయన గుణాతిశయాలను ప్రచురపరిచేలా ఉండాలి. మన అనుదిన నడత ఆయనకు ప్రీతికరంగా, మహిమకరంగా ఉండాలి (I కొరింథి 10:31), మన ప్రతీ చర్య ఆయన పరిశుద్ధ చిత్తానికి లోబడేలా చేయాలి (సామెత 3:6). ఈ మాటలతో బహుశా క్రైస్తవులందరూ సమ్మతిస్తారు. కాని అందుకు ఏమి అవసరమో వారు గ్రహిస్తున్నారా? నేను నిర్భయంగా చెప్తున్నాను ఒక జీవిత కాలపు ప్రయాస అందుకు అవసరం. ఏంటి ఆ ప్రయాస? ఆయనకు ప్రీతికరమైనదేంటో ప్రార్థనాపూర్వకంగా తెలుసుకోటానికి నిత్యం లేఖనాలను వెతకటం మరియు బయలుపరచబడిన ఆయన చిత్తాన్ని వివరంగా కనుగొనటానికి పరిశుద్ధమైన సంకల్పం కలిగుండటమే. తన ప్రతీబిడ్డను ఈ పని కోరకే అనగా ఆయనను సేవించటానికి, ఆయన కాడిని మోయటానికి, ఆయన పరిపాలనకు లోబడటానికి మరియు ప్రతి విషయములో ఆయన పరిశుద్ధ చిత్తానికి విధేయులైయుండటానికే ఆయన పిలిచాడు. కానీ, నేను మరలా చెప్తున్నాను, సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని  తెలుసుకోవటం ఒక జీవితకాలపు ప్రయాస; మన ఆత్మ అనే తోటను పండించేటప్పుడు ఎంతో శ్రద్ధ అవసరం ''దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము''  (1 తిమోతి 4:7), ''నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము (1 తిమోతి 4:16). ''నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము'' (1 తిమోతి 5:22). ''నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్తపడుము'' (2 తిమోతి 2:15). గలిబిలితో కూడిన ఈ రోజుల్లో దేవుని బిడ్డలు పరిశుద్ధలేఖనంలోని ఈ హెచ్చరికలను తమ హృదయాలకు హత్తుకోవాలి.అయినా, అయ్యో! ఎంతమంది వీటిని నిర్లక్ష్యపెట్టటం మనం చూస్తున్నాము.

అయితే వారిని ముఖ్యంగా అభ్యంతరపెట్టేది ఏంటి? తనకు తాను ''జాగ్రత్తపడుటకు'' ఈ కాలంలో దేవునిబిడ్డను అనేకమార్లు ఆటంకపరిచేది ఏంటి? ఇతరుల విషయమై శ్రద్ధవహించటంలో అతను అతిగా నిమగ్నుడై ఉండటమే. దినమంతా ఎక్కువ సమయం గృహకార్యాలకు కేటాయించిన ఒక స్త్రీ, తన అనుదిన ఆహారం కొరకు కష్టపడుతున్న ఒక పురుషుడు, సాయంకాలం ఆత్మీయ ఆరాధనలో నిమ్మళంగా సమయం గడపకుండా, ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ''చదువుటయందు'' (1 తిమోతి 4:13) జాగ్రత వహించకుండా, తమ కుటుంబంతో దేవుని విషయాలు సంభాషించకుండా, అనేక కూడికలకు హాజరు అవటంతో, మరెన్నో సంఘబాధ్యతలను నిర్వర్తించటంలో తలమునకలైయుంటారు.పరిశుద్ధ ప్రభువుదినమందు సహితం, అనేకుల పరిస్థితి ఇదే. దేవుడు ఉద్దేశించినట్లుగా అది విశ్రాంతి దినంకాక, వారమంతటిలో అదే అత్యంత నిర్విరామమైన రోజుగా మారుతుంది. నేడు అనేకులు ఎంతో బలహీనులుగా ఉండటంలో బట్టి ఆశ్చర్యమేమీ లేదు. దేవుడు ఏర్పాటు చేసిన నియమాల నుండి వైదొలగడమే ఇదంతటికీ కారణం.

తాము జరిగించిన క్రియల చొప్పున, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు అందరును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమైనప్పుడు (2 కొరింథీ 5:10) విమోచింపబడిన వారిలో అనేకులు ''నా సహోదరులు నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని'' (పరమ 1:6) అని విలపించాల్సి వస్తుందని గమనించండి! ''ఆయన'' కాదు ''నా సహోదరులు'' ''నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచిరి'' (ఎందుకంటే ఆయన కాడి సులువుగా మరియు ఆయన భారము తేలికగా ఉంటుంది) అయ్యో! దేవుని ప్రజలను ఆయన పిలవని పనులలో నిమగ్నపరచేవారు ఐగుప్తు కార్యనియామకులై ఉన్నారు. అనేక పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నది మార్త ఒక్కతే కాదు (లూకా 10:40)

మన జీవితసాక్ష్యం మన పెదవుల సాక్ష్యం కన్నా బలమైనది. మనము యేసుతో రహస్యంగా సన్నిహిత సహవాసం కలిగి ఉన్నట్లైతే, మనము యేసుతో కూడా ఉండినవారమని మనుష్యులు గుర్తించగలరు. (అపో.కా. 4:13). ప్రశస్తమైన క్రీస్తువాక్యాలను కేవలం పెదాలతో విచక్షణారహితంగా ఎవరికి పడితే వారికి ప్రకటిస్తూ, '' పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి'' (మత్తయి 7:6)అనే క్రీస్తు ఆజ్ఞకు అవిధేయత చూపించటం కంటే మన జీవితాలను క్రమబద్దీకరించుకోవటానికి ప్రభువు నిక్షిప్తపరచిన ఆజ్ఞలను, ఆదేశాలను సాధన చేయటానికి శ్రద్ధతో ప్రయాసపడితే, తద్వారా మనము ఆయనతో నడచువారమై యుండి, సమస్తజ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనలో నిండియుండుట వలన, మనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించువారమైతే కనీసం కొందరైనా మన వద్దకు వచ్చి మనలో ఉన్న నిరీక్షణకు హేతువు అడుగుతారు.(1 పేతురు 3:15)

కానీ, పైన చెప్పిన విధంగా నిలకడలేని శరీరస్వభావం, ఏదో ఒక కార్యంలో నిమగ్నమైయుండాలని చూస్తుంది. ప్రభువు సన్నిధిలో మనం ఆతృతతో సమయం గడుపటంలో కాక ఇతరుల కొరకు పనిచేయటానికి మన హృదయం మొగ్గుచూపుతూ ఉంటుంది. మనలను మనము వాక్యపు వెలుగులో సరిచూసుకుని, బాధాకరమైన మన వైఫల్యాల్ని ఒప్పుకొని, ఆయన వాక్యం మన హృదయాల మీద రాయమని దేవునిని బతిమాలటంకంటే, ఇతరులకు చెప్పటానికి కొన్ని వాక్యభాగాలను కంఠస్థము చేయటం ఎంతో సులభం. మన నడక, ఉండాల్సిన విధంగా లేకపోయినా, దుష్టులను హెచ్చరించటంలో మన ''బాధ్యత నిర్వహించవచ్చు''; లేదా వేరే ఏదైనా 'క్రైస్తవ పనిలో నిమగ్నులవ్వొచ్చని' అనుకుంటూ మనస్సాక్షిని తృప్తిపరుచుకోవచ్చు. అవును, సాతాను మన చెవులలో 'ఇక్కడ నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా' అని గుసగుసలాడతాడు. క్రీస్తు కొరకు జీవించటంలో మన వైఫల్యాల్ని బట్టి దేవుని ఎదుట నమ్రత కలిగి, మనల్ని మనం క్రమశిక్షణ పరచుకోక, కనీసం క్రీస్తును ప్రకటించటంలో నమ్మకంగా ఉన్నాము అనే సాతాను పొగడ్తలను బట్టి ఉప్పొంగిపోతాము.

పైన చెప్పబడిన దానిని బట్టి నేను, బహిరంగ ఆరాధనను లేదా ఇతరులు లాభపడటానికి క్రైస్తవులు చేసే మంచి పనులను ఎదిరిస్తున్నానని ఆపార్థం చేసుకోవద్దు. దేవునితో నడవనివారితో ఆరాధన చేయవద్దని, దేవునిని మహిమపరచని పనులలో నిమగ్నమైయుండవద్దని హెచ్చరిస్తున్నాను. మొదట చెయ్యాల్సినవి మొదట చేయమని నొక్కిచెప్పడమే నా ముఖ్య ఉద్దేశం.

ముఖ్యమైన మన మొదటి అవసరత ఇతరులకు పరిచర్య చేయటం కాదు కానీ, మనమే ప్రభువు వలన పరిచారమునొందటం. మన అత్యున్నతమైన ఆధిక్యత క్రీస్తుసేవలో నిమగ్నమై ఉండటం కాదు కానీ, ప్రతి రోజు ఆయనతో సన్నిహిత సహవాసంలో ఆనందించటమే. మన మొదటి బాధ్యత మన పొరుగువారి శ్రేయస్సు కొరకు పాటుపడటం కాదు కానీ, మన పిలుపు మరియు ఏర్పాటును నిశ్చయం చేసుకోటానికి జాగ్రతపడటమే. మన మొదటి గొప్ప కార్యం మన సహవాసులకు పరిచర్య చేయటం కాదు కానీ, దేవుని వాక్యం చదువుతూ ఆయన చిత్తాన్ని గ్రహిస్తూ, దాని ప్రకారం చేయటం ఆయనకు పరిచర్య చేయడమే! మన ప్రథమ బాధ్యత అన్యుల పట్ల, దూరపు పరిచయస్థుల పట్ల కాదు కాని మన ఇంటివారిపట్ల అయ్యుండాలి. మన ముఖ్య ఆశయం క్రీస్తును మన పెదాలతో మాత్రమే బోధించడం కాదు కానీ, మన జీవితాల ద్వారా ఆయనను ప్రకటించడమే.

ఒక వేళ మనము రహస్యమందు క్రీస్తును ఆరాధించడం నేర్చుకోకపోతే బహిరంగ కూడికలో కూడా యథార్థతతో ఆరాధించలేము. మనం నిజంగా క్రీస్తును వెంబడించకపోతే, ఆయనతో నడుస్తూ, ఆయనతో అన్యోన్యసంబంధం కలిగుండకపోతే, ఆయనను గురించి ఇతరులతో మాట్లాడటం ఆయనను అవమానపరచడమే. మన మాటలలో ఆయనను బోధిస్తూ మన క్రియలలో ఆయనను తిరస్కరించినట్లైతే, మన మాటలు వినేవారికి మనమే ఆటంకంగాను అభ్యంతరహేతువులుగాను ఉంటాము.

క్రీస్తు కొరకైన మన ''సేవ'' మన స్వకీయ ''ద్రాక్షతోటను'' సాగు చేసుకోవడానికి అడ్డు అయ్యేలా ఉంటే అది మనకొక ఉచ్చుగా మారుతుంది. కాగా ''నిన్ను గురించి నీవు జాగ్రత్తపడు''. దేవుడు నీ ముందుంచిన పందెములో పరుగెత్తనీయకుండా చేసే ప్రతి బరువును ప్రక్కన పెట్టు. 'దేవుని రాజ్యము నీతియు, సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునైయున్నది. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు' (రోమా14:17,18)

ఈ మాటలు మనస్కరించటానికి మనకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.