నిజ క్రైస్తవ జీవితం

రచయిత: ఆర్థర్. డబ్ల్యు. పింక్
అనువాదం: జి. బిబు
చదవడానికి పట్టే సమయం: 8 నిమిషాలు
చదివిన వారు: పి. రజిని
ఆడియో

"నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము ఆయనే నా నిరీక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను”(కీర్తన 42:5).

కీర్తనాకారుడు ఈ మాటలు పలికినప్పుడు అతని ప్రాణం నిరాశతో కృంగి అతని హృదయం భారభరితంగా ఉంది. దావీదు జీవితంలో నిరాశ,దుఃఖం కలగజేసినవి ఎన్నో చోటుచేసుకున్నట్లు మనం చూస్తాము. ఒకడు పర్వతాల మీద కౌజుపిట్టను తరిమినట్లు తనను వెంటాడిన సౌలు వలన కలిగిన కఠినశ్రమలు, తన మిత్రుడైన అహీతోపేలు నమ్మకద్రోహం, అబ్షాలోము పన్నిన పన్నాగం, తన స్వీయపాపాల జ్ఞాపకం, ఇవన్నీ ఎంతో ధైర్యవంతుల్ని సైతం కృంగదీయగలిగిన శ్రమలు. దావీదు కూడా మనవంటి స్వభావంగలవాడే. అతడు ఎల్లప్పుడూ ఆనందశిఖరాలపై నివసించలేదు. అనేకసార్లు విషాదపు బురదలోను, దు:ఖపు అగాధంలోను, దీర్ఘకాలం పడి ఉన్న అనుభవాలు కూడా అతనికి ఉన్నాయి.

అయినా దావీదు నిరాశకు తావు ఇవ్వలేదు; తన బాధలకు లొంగిపోనూ లేదు. ఏళ్ళు చెల్లిన గొడ్డువలె మూల్గుతూ నేలకొరిగి నిస్సహయునిగా ఉండిపోలేదు. లేదు; అతడు సుబుద్ధిగలవానిగా పౌరుషముగలవానిగా వ్యవహరిస్తూ, తనకు కలిగిన శ్రమలతో ముఖాముఖిగా పోరాడటానికి పూనుకున్నాడు. అతడు శ్రద్దగా స్వపరిశీలన చేసుకుంటూ తనను తాను సవాళ్ళు చేసుకుంటూ, తన కృంగుదలకు గల అసలు కారణాన్ని కనుగొనే ప్రయత్నం చేశాడు. “నా ప్రాణమా, నీవు ఏల కృంగివున్నావు?”అని అతడు ప్రశ్నించుకున్నాడు. తన కృంగుదలకు గల కారణం ఏమిటో తెల్సుకోవాలనుకున్నాడు. నిరాశ నిస్పృహలలో నుండి కోలుకోవటానికి ఇదే మొదటిమెట్టు. విచారపడటం, చిరాకుపడటం, సణగటం వలన పరిష్కారమేమీ లభించదు. వ్యసనపడుతూ, చేతులు నులుముకోవటం వలన ఆత్మీయంగానైనా, మరే విధంగానైనా, ఎటువంటి ఉపశమనమూ కలగదు. తనను తాను ప్రశ్నించుకోవాలి, స్వపరిశీలన చేసుకోవాలి, తనకు తాను తీర్పు తీర్చుకోవాలి.

“నా ప్రాణమా, నీవు ఏల కృంగివున్నావు?” మనల్ని మనమే మందలించుకోవటం అవసరం. కొన్ని ప్రశ్నలను ధైర్యంగా ఎదుర్కోవటం కూడా అవసరం. కృంగుదలకు చోటివ్వటం వలన కలిగే ప్రయోజనమేముంది? అది నాకు ఏ విధంగా సహయపడగలదు? ముఖం మాడ్చుకుని కూర్చోవటం సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం కాదు కదా! (ఎఫెసీ 5:16) కలత చెందటం, కన్నీళ్ళు కార్చటం వలన పరిస్థితులేమీ మెరుగుపడవు. కాబట్టి నిరాశలో ఉన్న ప్రతివాడూ తన కృంగుదలకు, అసంతృప్తికీ గల కారణాన్ని గురించి తన ప్రాణాన్ని ప్రశ్నించటం యుక్తం.

“పాపం విషయమై దు:ఖించటానికి,మనలను లొంగదీసే అపవిత్రతలకు వ్యతిరేకంగా భారంతో ప్రార్థన చేయటానికి మనకు చాలా కారణాలు ఉండి ఉండొచ్చు. ఐనా, వెలుపల నుండి వచ్చే శ్రమల వలనైతే ఏంటి, అంతరంగంలో కలిగే శోధనల వలనైతే ఏంటి, కృంగుదల కేవలం అవిశ్వాసం మరియు తిరుగుబాటు చేసే మన స్వచిత్తం నుండే పుడుతుంది. కనుక మనం దానికి వ్యతిరేకంగా పోరాడాలి, ప్రార్థన చేయాలి.”-(థామస్ స్కాట్).

“నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు?” ఇతరుల్ని సంప్రదించకుండానే ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం కనుక్కోలేవా? లోలోపల నీకే నీ శ్రమల మూలము తెలుసన్నది లేక కనీసం అనుమానించవచ్చన్నది వాస్తవం కాదా? నీ అవివేకం వలన స్వయంగా కొనితెచ్చుకున్న బాధాకరమైన పరిస్థితులే నీ కృంగుదలకు కారణమా? అయితే, “యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును”(కీర్తన 119:75) అని కీర్తనాకారునితో కలిసి ఒప్పుకో. ఏదైనా పాపంలో పడటం ఏ విషయలోనైనా నీ స్వచిత్తాన్ని అనుసరించటం లేక ఏ విధంగానైనా శరీరేచ్ఛలను బట్టి విత్తటం వలన ఇప్పుడు నీ శరీరము నుండి క్షయమను పంటను కోస్తున్నావా? అయితే దేవుని ఎదుట దానిని ఒప్పుకొని, “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును”అని సామెతలు 28:13లో ఉన్న వాగ్దానాన్ని నెరవేర్చమని వేడుకో. లేదా ఇతరులు లాగ నువ్వు కూడా వర్థిల్లేలా దేవుని ఏర్పాటు నిన్ను కనికరించలేదు అన్నదే నీ కృంగుదలకు కారణమా? అయితే కీర్తన 37:1లో ఉన్న హెచ్చరికను జ్ఞాపకం చేసుకో - “చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యము చేయు వారిని చూచి మత్సరపడకుము”

పైన ఉదహరించిన పరిస్థితులు బహుశా పాఠకులలో కొందరికి వర్తించకపోవచ్చు. కొందరు, 'నేను ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాను; నిస్సహాయతే నా కళ్ళ ఎదుట ఉంది; కాబట్టి, నా ప్రాణము కృంగి ఉంది; నా హృదయం భారభరితంగా ఉందని' అనవచ్చు. వాస్తవమే, ఇది బాధాకరమైన శోధనే; ఇది కలిగించే నిస్పృహకు లొంగటం సహజమే. అయితే ప్రియస్నేహితుడా! ఇటువంటి పరిస్థితిలో కూడా నిరాశకు చికిత్స లేకపోలేదు. “వేయి కొండల మీది పశువులన్నియు నావే గదా?”అని సెలవిచ్చినవాడు నేడు కూడా సజీవుడై సార్వభౌమునిగా ఏలుతున్నాడు. సుమారు 20 లక్షల ఇశ్రాయేలీయుల్ని నలబై ఏళ్ళు ఏడారిలో పోషించినవాడు నేడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించలేడా? ఏలియాను క్షామంలో పోషించినవాడు నువ్వు ఆకలిగొనకుండా సహాయం చేయలేడా? "నేడుండి రేపు పొయిలో వేయబడు అడవిగడ్డిని దేవుడీలాగు అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా”(మత్తయి 6:30)

శీర్షిక వచనాన్ని మళ్ళీ చూస్తే దావీదు కృంగుదలకు లొంగకపోవటం, తన ప్రాణాన్ని ప్రశ్నించుకోవటం,తన అవిశ్వాసాన్ని గద్దించుకోవటమే కాక తనకు తాను ఉపదేశించుకున్నట్లు కూడా చూడగలం. ''దేవునియందు నిరీక్షణయుంచుము.'' నిరాశకు లోనైయున్నవారు చెయ్యాల్సింది ఇదే.మరేదీ నిజమైన ఊరటను అందించజాలదు. ప్రస్తుత పరిస్థితి అంధకారమయంగా కనిపించవచ్చు, కానీ దేవుని వాగ్దానాలు వెలుగునిచ్చేవి. నీకు సహాయపడటంలో సృష్ఠి విఫలం కావచ్చేమో కాని సృష్ఠికర్త ఎన్నడూ విఫలం కానేరడు; అయితే నీ విశ్వాసం యథార్థమైనదిగా ఉండాలి. లోకమంతా నిస్సహాయతలో ఉన్నప్పుడు సైతం క్రైస్తవుడు నిరాశ చెందక్కరలేదు. మన దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు(కీర్తన 46:1). ఆయనను తమ ఆశ్రయదుర్గముగా చేసుకున్నవారిని ఆయన ఎన్నడూ విడువడు. ఈ రచయిత జీవితంలో ఇది పదేపదే రుజువు చేయబడింది. పాఠకులు కూడా దీనిని రుచిచూచి ఉంటారు. వాస్తవమేమిటంటే మన క్లిష్టపరిస్థితులన్నీ దేవుని కృప యొక్క సామర్థ్యాన్ని గ్రహించటానికి చక్కటి అవకాశాలు. అవసరమైనవన్నీ అందుబాటులో ఉన్నప్పుడు విశ్వాసంతో పని లేదు కదా!

“దేవునియందు నిరీక్షణ యుంచుము”

'ఆయన కనికరమునందు నిరీక్షణయుంచుము.' నువ్వు పాపం చేసుండవచ్చు. నీ పాపదోషం బహుఘోరమైనదై ఉండవచ్చు. దాని యొక్క దుష్పరిణామమే నువ్వు ఇప్పుడు అనుభవిస్తూ ఉండవచ్చు, అయినా పశ్చాత్తాపంతో నీ పాపాల్ని ఒప్పుకుంటే నీ ప్రతిపాపాన్ని ఆయన తుడిచివేసే కనికరముగలవాడు.

'ఆయన శక్తియందు నిరీక్షణయుంచుము.' ప్రతీ ద్వారం మూయబడి ఉండవచ్చు. సహాయం వచ్చే ప్రతిమార్గంలో అడ్డంకులు ఉండవచ్చు. అయినా సర్వశక్తిమంతునికి ఏదీ అసాధ్యం కాదు

'ఆయన విశ్వాస్యతయందు నిరీక్షణయుంచుము.' మనుష్యులు నిన్ను మోసగించి ఉండవచ్చు. లేక మాటతప్పి ఉండవచ్చు. సంకటసమయంలో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి ఉండవచ్చు. అయితే అబద్దమాడజాలని దేవునిని ఆశ్రయించు. ఆయన వాగ్దానాలను శంఖించకు.

'ఆయన ప్రేమయందు నిరీక్షణ యుంచుము.' “...లోకములోనున్న తనవారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను." (యోహాను 13:1)

“ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.”( కీర్తన 42:5).ఇది దేవునియందు నిరీక్షించువారు ఎల్లప్పుడూ కలిగుండే దీవెనకరమైన నిశ్చయత ; “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును”(కీర్తన 34:19) అని వారికి తెలుసు. "సాయంకాలమున ఏడ్పువచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును” (కీర్తన 30:5) అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు కాబట్టి ఓ క్రైస్తవ చదువరీ, అగ్నికొలిమి దాని పనిని సంపూర్ణం చేసి నీ బంధకాలను కాల్చివేసిన తర్వాత, ఇప్పుడు ఎంతో అయిష్టంగా  కనిపించే శ్రమల్ని బట్టి నువ్వు ఆయనను స్తుతిస్తావు. అందుకే నిరీక్షణతో రాబోవుకాలమును ఎదురుచూడు. దేవునిపై విశ్వాసం ఉంచు. ఆయన నిన్నెడూ విడువడు.

ఓ క్రైస్తవ చదవరీ, అగాధజలములగుండా ప్రస్తుతం నువ్వు సంచరించకపోయినా, దేవుని ప్రజలు అనుభవిస్తున్న 'ఇప్పటి ఇబ్బందుల్ని' వారి ఆత్మీయమేలుకు దోహదపడేలా కృప చూపమని, వారి తాత్కాలిక అవసరాల విషయమై కనికరం చూపమని  రచయితతో కలిసి మనఃపూర్వకంగా దేవునిని వేడుకో.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.