Hits: 8734
Print
రచయిత: ఆర్థర్. డబ్ల్యు. పింక్
అనువాదం: జి. అరుణా అబ్బులు
చదవడానికి పట్టే సమయం: 20 నిమిషాలు

''అప్పుడు యేసు తన శిష్యులను చూచి ''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ నెత్తుకొని నన్ను వెంబడింపవలెను'' (మత్తయి 16:24).

అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ''ఎవడైనను'' నన్ను వెంబడింపగోరిన యెడల, ఇక్కడ ''గోరిన'' అనే పదము తీర్మానానికి గుర్తు. ''ఎవడైననూ నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ నెత్తుకొని ('సిలువ' కాదు 'తన సిలువ') నన్ను వెంబడింపవలెను.
అలాగే ''ఎవడైననూ తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు'' అని లూకా 14:17లో క్రీస్తు సెలవిచ్చాడు.కాబట్టి ఇది మన ఇష్టానికి విడిచిపెట్టబడిన విషయం  కాదు. క్రీస్తు శిష్యత్వానికి ఇది తప్పనిసరి. క్రైస్తవ్యమనేది ఒక సత్యాన్ని అంగీకరించడం లేదా కొన్ని నియమాలను పాటించడం లేదా ఒక మతాన్ని అనుసరించడం లాంటివాటికి ఎంతో అతీతమైంది. ప్రథమంగా, ఒక వ్యక్తికి క్రీస్తుతో ఉన్న సహవాసమే క్రైస్తవజీవితం. కనుక ఎంత వరకూ నువ్వు క్రీస్తుతో సన్నిహితసంబంధం కలిగున్నావో, అంత వరకు మాత్రమే నువ్వు క్రైస్తవుడివి!

యేసును అనుసరించే జీవితమే క్రైస్తవజీవితము. ''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ నెత్తుకొని నన్ను వెంబడింపవలెను.'' మనం క్రీస్తుకు దగ్గరగా నడవటంలో ఎదుగుతూ ఉందుము గాక. ''గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు'' అని లేఖనాలు (ప్రకటన 14:4) వర్ణించే కొందరు ఉన్నారు, కాని అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రభువును అప్పుడప్పుడు, అక్కడక్కడా అనాలోచితంగా, అసంపూర్ణ హృదయంతో దూరంగా వెంబడించే ఇంకొందరు కూడా ఉన్నారు. వీరు ప్రభువును అనుసరిస్తూ ఉన్నట్టే కనిపిస్తారు.ఐనా వారి జీవితాల్లో స్వీయానికి, లోకానికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చి క్రీస్తుకు తక్కువ స్థానాన్ని కల్పిస్తారు. కాని ఎవరైతే కాలేబులాగ ప్రభువును ''పూర్ణమనస్సుతో'' (సంఖ్యా. 14:24) అనుసరిస్తారో వారు పూర్ణసంతోషం పొందుతారు.

కాబట్టి ప్రియులారా! క్రీస్తును వెంబడించటమే మన ప్రధాన లక్ష్యం అయ్యుండాలి. కాని ఈ మార్గంలో శ్రమలున్నాయి, ఈ మార్గంలో ఆటంకాలున్నాయి. మనం ప్రారంభంలో చదివిన వాక్యంలోని మొదటిభాగం ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. ''నన్ను అనుసరించు'' అనే పదం ఆ వచనంలో చివరిగా ఉండటం గమనించండి. 'స్వయం' ఆయనను వెంబడించటంలో ఆటంకంగా నిలుస్తుంది. లోకము లెక్కలేనన్ని ఆకర్షణలతో, అవరోధాలతో బలంగా అడ్డగిస్తుంది. అందుకే క్రీస్తు ఇలా అంటున్నాడు- ''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల - (మొదటిగా) తన్ను తాను ఉపేక్షించుకొని, (రెండవదిగా) తన సిలువనెత్తుకొని, (మూడవదిగా) నన్ను వెంబడింపవలెను''. క్రైస్తవులుగా పిలవబడుతున్నవారిలో కేవలం కొందరు మాత్రమే ఆయనకు సన్నిహితంగా, తేటగా, ఏకమనస్కులై వెంబడించటానికి కారణమేంటో ఇక్కడ మనం తెలుసుకోగలము. క్రీస్తును వెంబడించటంలో ప్రతీరోజూ తన్ను తాను (స్వయాన్ని, స్వార్ధాన్ని) ఉపేక్షించుకోవటమే మొదటిమెట్టు.

'స్వీయ ఉపేక్ష'కి,'తనను తాను ఉపేక్షించుకోవటానికీ' ఎంతో తేడా ఉంది. స్వయాన్ని ఉపేక్షించటం అంటే 'తమకిష్టమైనవాటిని విడిచిపెట్టడం' అని లోకంలోను మరియు క్రైస్తవులలో కూడా సాధారణంగా అనుకుంటారు. కాని ఏమి వదిలిపెట్టాలి అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ 'వదలివేయటా'న్ని లోకసంబంధమైనవాటికి అంటే సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, జూదం మొదలైనవాటికి పరిమితం చేస్తారు. మరికొందరు, సంవత్సరంలో ఏదో ఒక ప్రత్యేక సమయంలో (ఉదాః శ్రమ దినాలు) ఆయా వినోదవిలాసాల విషయమై నిర్భంధాలు విధించుకోవడాన్ని 'స్వయాన్ని ఉపేక్షించటమ'ని భావిస్తారు. కాని ఈ పద్ధతులు, ఆంక్షలు, కేవలం ఆత్మీయగర్వాన్ని పెంచి పోషిస్తాయి.'ఇంత అధికముగా ఉపేక్షించినందుకు కొంత గుర్తింపుకు నేనర్హుడనే కదా!' అనే వైఖరిని ఇవి కలిగిస్తాయి. అయితే, తనను వెంబడించటానికి క్రీస్తు విధించిన మొట్టమొదటి నియమం ఏంటంటే, ఒక వ్యక్తి
కేవలం తనకిష్టమైనవాటిని వదిలివేయటం కాదు గాని తనను తాను ఉపేక్షించుకోవటం, అంటే స్వంతకోరికలనే కాదు గాని స్వయాన్నే ఉపేక్షించడం. ''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించవలెను'' అనే ఈ మాటకు అర్థమేంటి? మొదటిగా దీని అర్థం ఒక వ్యక్తి తన స్వనీతిని త్యజించటం. కాని ఈ మాటలు కేవలం ఈ అర్థానికే పరిమితం కావు. దీనికి మించిన గూఢార్థము ఇందులో ఇమిడుంది. ఇది కేవలము దీని ప్రాథమిక ఉద్ధేశము మాత్రమే. నా స్వంతజ్ఞానంపై ఆధారపడటాన్ని నిరాకరించమని దీని అర్థం. నా స్వంతహక్కులపై పంతాన్ని విడిచిపెట్టమని దీని అర్థం. స్వయంగా స్వయాన్నే పరిత్యజించమని దీని అర్థం. మన సౌకర్యాలు, మన సుఖాలు, మన ఇష్టాలు, మన హోదా, మన స్వలాభాలు మొదలైనవాటి గురించి ఆలోచించటం మానివేయమని దీని అర్థం. క్లుప్తంగా చెప్పాలంటే స్వయాన్ని పూర్తిగా త్యజించమని దీని అర్థం.

అంటే ప్రియులారా! మనం కూడా అపొస్తలునితో కలిసి ''నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము'' (ఫిలిప్పీ 1:21) అని చెప్పటమే. ''నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే'' అంటే విధేయత చూపించడం, క్రీస్తుని సేవించటం, క్రీస్తును ఘనపరచటం, నన్ను నేనే క్రీస్తుకు అర్పించుకోవటం;ఇదే దాని భావం. అంతేకాకుండా ''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకోవాలని'' ప్రభువు చెబుతున్నాడు. స్వయాన్ని పరిత్యజించి దానిని సంపూర్ణంగా వదిలివేయాలి. ఇదే రోమా 12:1లో మరొక విధంగా చెప్పబడింది: ''పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి'' అని అక్కడ మనం చదువుతాం.

రెండవదిగా, క్రీస్తుని వెంబడించటంలో ''సిలువ నెత్తుకోవడం''అన్నది ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితమంటే బాధ్యాతారహితమైన విలాసవంత జీవితం కాదు. అది ఎంతో గంభీరమైన తీర్మానం. అది క్రమశిక్షణ మరియు త్యాగంతో కూడిన జీవితం. శిష్యరికపు జీవితం స్వయాన్ని ఉపేక్షించడంతో ప్రారంభమై స్వార్థాన్ని అంతమొందించే దిశగా కొనసాగుతుంది. మరోమాటలో ఈ వచనం సిలువను ఒక విగ్రహరూపంగా కాక జీవితమూలతత్వంగాను, శిష్యరికపు చిహ్నంగాను, ఒక ఆత్మీయ అనుభవంగాను చిత్రీకరిస్తుంది. గమనించండి, క్రీస్తు, తండ్రి సింహాసనానికి సిలువమార్గం ద్వారానే చేరాడు అనడం ఎంత వాస్తవమో, క్రైస్తవుడు కూడ దేవునితో సహవాసం కలిగుండటానికి, చివరికి కిరీటము పొందుకోవడానికి సిలువే మార్గమనడం కూడా అంతే వాస్తవం.విశ్వాసం ద్వారా, క్రీస్తు బలియాగం యొక్క చట్టపరమైన ప్రయోజనాలు పాపం క్షమించబడినపుడు మనకు లభ్యమైనప్పటికీ, సిలువ మన అనుదినజీవితాలలో అనుభవంగా మారినపుడే అది పాపస్వభావంపై విజయం సాధిస్తుంది.

ఈ వాక్యసందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ఒకసారి మత్తయి 16:21-22 చదువుదాం: ''అప్పటి నుండి తాను యోరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని - ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.'' పేతురు తత్తరపడుతూ నిన్ను నువ్వు కనికరించుకో ప్రభువా అనేలా మాట్లాడసాగాడు. కాని అది లోకసంబంధమైన ఆలోచన. ఇహలోక తత్త్వము యొక్క సారాంశమంతా స్వీయరక్షణ మరియు స్వీయతృప్తే.కానీ స్వీయరక్షణ కాదు, త్యాగశీలమే క్రీస్తు సందేశసారాంశం. పేతురు ఇచ్చిన ఈ సలహాలో క్రీస్తు సాతానుశోధనను స్పష్టంగా చూశాడు కాబట్టి అతన్ని గద్దించాడు. ఆ తర్వాత తన శిష్యుల వైపు తిరిగి - ''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను'' అన్నాడు. మరో విధంగా చెప్పాలంటే ఈ మాటల సారాంశం ఇదే: నేను యెరూషలేముకు సిలువ వేయబడటానికి వెళ్తున్నాను. నన్ను వెంబడించేవానికి కూడ ఒక సిలువ ఉంది. గనుక లూకా 14:27లో చెప్పబడిన విధంగా ''ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.'' క్రీస్తు యెరూషలేముకు వెళ్ళి మరణించాలన్నది ఎంత అగత్యమో, ఆయనను వెంబడించాలనుకునేవారు తమ సిలువనెత్తుకోవడం కూడా అంతే అగత్యం(ఈ 'అగత్యం' మొదటి విషయంలో ఎంత అనివార్యమో,తర్వాతి విషయంలో కూడా అంతే అనివార్యం). మధ్యవర్తిత్వపరంగా సిలువని అనుభవించింది క్రీస్తు మాత్రమే ఐనప్పటికీ, నిత్యజీవంలోనికి ప్రవేశించేవారందరూ అందులో అనుభవాత్మకంగా పాలిభాగస్థులౌతారు. అలాగైతే ఇప్పుడు సిలువ దేనికి నిదర్శనం? ''ఎవడైనను తన సిలువను మోసుకొని'' అని క్రీస్తు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? ప్రియులారా! ఈ రోజు ఈ ప్రశ్నను అడగాల్సిరావడం ఎంత విచారకరం! దేవునిబిడ్డలలో చాలామందికి ''సిలువ'' దేనికి నిదర్శనం అనే విషయంపై లేఖనబద్ధమైన అవగాహన లేకపోవడం మరింత విచారకరం. ఒక సాధారణ క్రైస్తవుడు ఈ వచనంలోని ''సిలువ'', తాను ఎదుర్కొనే ప్రతి విధమైన శ్రమలను,శోధనలను సూచిస్తుందని భావిస్తాడు. సమాధానాన్ని భంగపరచే, శరీరానికి అయిష్టము పుట్టించే, మనస్సుని కలవరపెట్టే ప్రతీది మనం సిలువగా భావిస్తాం. అదిగో అది నా సిలువని కొందరు, ఇదిగో ఇది నా సిలువని ఇంకొందరు, మరేదో తమ సిలువని మరికొందరు చెప్పుకోవడం మనం తరచుగా వింటుంటాం. కాని స్నేహితులారా,ఇలాంటి అర్థాన్నిచ్చే విధంగా ఈ పదం క్రొత్త నిబంధనలో ఏ సందర్భంలోను వాడబడలేదు.

ఈ పదం బహువచనరూపంలో అంటే ''సిలువలు'' అని కూడా ఏ సందర్భంలోను ప్రయోగింపబడలేదు. అలాగే ''ఒక సిలువ'' అనే ప్రయోగం కూడా మనకు ఎక్కడా కనిపించదు; పైగా ''సిలువనెత్తుకొని'' అనే క్రియా పదం (Verb), కర్తరి ప్రయోగానికి (Active Voice) సంబంధించిందే కాని కర్మణ్యర్థకానికి (Passive Voice) సంబంధించింది కాదు. అంటే సిలువ మనపై మోపబడదు కాని మనమే దానిని ఎత్తుకోవాలి. క్రీస్తు ఎదుర్కున్న శ్రమలను వివరించి వ్యక్తపరిచే ఖచ్చితమైన వాస్తవాలకు సాదృశ్యంగా నిలిచేదే సిలువ.

తాము అయిష్టంగా నిర్వర్తించే కొన్ని అసమ్మతమైన బాధ్యతల్ని లేదా తాము అతి కష్టంగా ఉపేక్షించే కొన్ని శారీరక వాంఛల్ని సిలువ సూచిస్తుందని మరికొందరు భావిస్తారు. ఇలాంటివారు తరచుగా తమ ''సిలువ''ను ఇతరులపై దాడి చేయటానికి ఒక ఆయుధంగా మలుచుకుంటారు. అంటే, తాము చేసిన త్యాగాలను ఆడంబరంగా ప్రదర్శిస్తూ ఇతరులు కూడ తమననుసరించాలని ఒత్తిడి తెస్తుంటారు. సిలువ గురించి ఇలాంటి అభూతకల్పనలు  పరిసయ్యుల ఆసక్తిలాగ కపటమైన, హానికరమైన పొరపాట్లే.

ఇప్పుడు నేను ప్రభువు సహాయంతో సిలువ సాదృశ్యపరిచే మూడు విషయాలను మీ ముందు ఉంచదలచుకున్నాను. మొదటిగా, సిలువ ఈ లోకము వ్యక్తపరిచే ద్వేషాన్ని సూచిస్తుంది. లోకము దేవునిని, క్రీస్తును ద్వేషించి, ఆయనను సిలువ వేయటం ద్వారా ఆ ద్వేషాన్ని వ్యక్తపరిచింది. యోహాను 15వ అధ్యాయంలో లోకం తనను, తన వారిని ద్వేషించటం గురించి క్రీస్తు కనీసం ఏడుసార్లు ప్రస్తావించాడు. కనుక ఎంతమేరకు మనం ఆయన జీవించినట్లు జీవిస్తామో,ఎంత మేరకు మనం ఆయన అడుగుజాడలలో నడుస్తామో, ఎంత మేరకు మనం ఈ లోకం నుండి వేరుపరచబడి ఆయనతో సహవాసాన్ని కలిగుంటామో, అంతగా ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది.

ఒక వ్యక్తి క్రీస్తు శిష్యునిగా ఉండగోరి ఆయన దగ్గరకు వచ్చిన సందర్భాన్ని మనం సువార్తల్లో చదువుతాము. కాని అతడు ''ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మ''ని విన్నవించినట్లు చూస్తాము.  ఈ కోరిక సహజమైనదే కదా? ఎంతో ప్రసంశనీయమైనది కూడా! కాని ఇందుకు మన ప్రభువు ఇచ్చిన జవాబు అందర్నీ విస్మయపరిచేదిగా ఉంది . ఆయన అతనితో ''నన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతిపెట్టుకోనిమ్ము'' అని సెలవిచ్చాడు. ఒకవేళ ఆ యవ్వనుడు ఆ మాటలకు విధేయత చూపించుంటే ఏమై ఉండేది? అతడలా చేశాడో  లేదో నాకు తెలియదు కాని ఒకవేళ చేసుంటే ఏమై ఉండేది? తన బంధువులు, పొరుగువారు అతని గురించి ఏమనుకుని  ఉండేవారు?  కొడుకు చేయ్యాల్సిన బాధ్యత అని ఈ లోకం ఎంచేదానిని నిర్లక్ష్యపెట్టి, క్రీస్తును ఆ విధంగా వెంబడించాలనే అతని సదుద్దేశాన్ని, భక్తిభావాన్ని మెచ్చుకుని ఉండేవారా? ఆహా, స్నేహితుడా, నువ్వు క్రీస్తును వెంబడిస్తే ఈ లోకం నిన్ను పిచ్చివానిగా చూస్తుంది. కొన్ని వ్యక్తిత్వాలకు మనస్తత్వాలకు ఇందులోని వివేకం అంతుపట్టదు. ఈ లోకం మోపే అపనిందల్ని ఎదుర్కోవడం కొందరికి అతి గొప్ప శోధన.

మరో యవ్వనస్థుడు క్రీస్తు శిష్యరికం కోరి ఆయన వద్దకు వచ్చి 'ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని' అడిగినట్లు చూస్తాము. ఈ  కోరిక కూడా సహజమైనదే కదా?  కాని  ఆయనను వెంబడించటానికి మోయవలసిన సిలువను ఇక్కడ  కూడా  ప్రభువు అతనికి జ్ఞాపకము చేస్తూ ''నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో అనెను''(లూకా 9:62). ప్రేమపూరిత స్వభావంగలవారికి బాంధవ్యాలను తెంచుకోవడం బహు క్లిష్టమైన సమస్య. తమను లెక్కచేయటం లేదని బంధుమిత్రులతో అనిపించుకోవడం మరింత బాధాకరమైన విషయం. అవును, క్రీస్తును అతి సమీపంగా మనం వెంబడించినపుడు ఈ లోకం యొక్క ద్వేషం ఎంత వాస్తవమైనదో చూడగలం. ఎవరైనా లోకంతో స్నేహం చేస్తూ ఆయనకు సన్నిహితంగా ఉండలేరు .

ఇంకొక యవ్వనస్థుడు క్రీస్తు వద్దకు వచ్చి ఆయన పాదాల పైబడి నమస్కరించి ''ప్రభువా నిత్య జీవము పొందుటకు నేనే మంచి కార్యము చేయవలెనని'' అడిగినట్లు చూడగలము. అతనికి కూడా క్రీస్తు, సిలువను జ్ఞాపకము చేశాడు. ''..... పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని'' చెప్పినట్లు చదవగలం. "అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను." ఇప్పుడు కూడా క్రీస్తు నీతోను నాతోను మాట్లాడుతున్నాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించనివాడు నా శిష్యుడు కానేరడని స్పష్టంగా చెబుతున్నాడు. సిలువ, లోకం వ్యక్తపరిచే ద్వేషాన్ని, మోపే నిందల్ని సూచిస్తుంది. అయితే క్రీస్తువలె ఆయన శిష్యులు కూడా ఈ సిలువను స్వచ్ఛందంగానే మోయాలి. మరి నువ్వేమి చేస్తావు? ఈ సిలువను ఉపేక్షిస్తావా లేక అంగీకరిస్తావా? నిర్లక్ష్యం చేస్తావా లేక దానిని ఎత్తుకొని ఆయనను వెంబడిస్తావా?

రెండవదిగా,  దేవుని చిత్తానికి స్వచ్ఛందంగా లోబడిన జీవితాన్ని సిలువ  సూచిస్తుంది. క్రీస్తు సిలువమరణము దీన్ని స్పష్టం చేస్తుంది. యోహాను 10:17లో, ''నేను దాని మరల తీసుకొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసికొనడు. నా అంతట నేనే దాని పెట్టుచున్నాను.'' క్రీస్తు ఈ విధంగా ఎందుకు తన ప్రాణాన్ని పెడుతున్నాడు? దీనికి జవాబు 18వ వచనంలోని చివరి భాగంలో ఉంది. ''నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిననెను.'' తన కుమారుని విధేయతను కడముట్టించిన తండ్రి చివరి ఆజ్ఞ సిలువే. అందుకే ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతాము, ''ఆయన దేవుని స్వరూపము కలిగినవాడై యుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను'' (ఫిలిప్పీ 2:6-8). ఇదే క్రీస్తు నడిచిన విధేయమార్గంలోని తుది అడుగు.

తన అడుగుజాడలలో మనము నడిచేలా క్రీస్తు మనకొక మాదిరి ఉంచి వెళ్ళాడు. క్రీస్తు విధేయతవలె ఒక క్రైస్తవుని విధేయత కూడ బలవంతపెట్టబడినది కాక స్వచ్ఛందమైనదై, ఎడతెగనిదై ఎలాంటి మినహాయింపులు లేకుండా మరణం పొందవలసివచ్చినా విశ్వాస్యతను కనపరిచేదిగా ఉండాలి. అలాగైతే విధేయతకి, సమర్పణకి, దేవుని కొరకు ప్రత్యేకింపబడి ఆయన చిత్తానుసారంగా వ్యవహరించబడటానికి సిద్ధపాటు కలిగిన జీవితానికి సిలువ సాదృశ్యము. ''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల.... తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను.'' ''మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.'' మరోమాటలో చెప్పాలంటే  శిష్యరికపు నియమానికి అంటే క్రీస్తు ఎలా నడుచుకున్నాడో అదే నియమానికి కట్టుబడి జీవించటానికి సిలువ చిహ్నము. క్రీస్తు భూమిపై జీవించినప్పుడు తన్ను తాను సంతోషపరచుకోలేదు. కాబట్టి నేనెన్నడూ అలా చేయకూడదు. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నట్లే నన్ను నేను రిక్తునిగా చేసుకోవాలి. ఆయన మేలు చేస్తూ సంచరించినట్లే నేను కూడా చేయాలి. క్రీస్తు పరిచర్య చేయటానికే గాని పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. మనము కూడా అలాగే జీవించాలి. క్రీస్తు మరణం పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయుడయ్యాడు. దీనినే సిలువ సాదృశ్యపరుస్తుంది.

మనము ముందు చూసినట్లే మొదటిగా లోకము చేత దూషింపబడటాన్ని సిలువ సూచిస్తుంది. లోకము నుండి మనల్ని మనం వేరుపరుచుకుని, దాని మార్గాలను విడిచిపెట్టి అది నడిచే నియమం చొప్పున కాక మరొక నియమం చొప్పున మనం నిర్దేశించబడటాన్ని బట్టి, వ్యతిరేకతతో, కోపోద్రేకంతో లోకం మనల్ని దూషిస్తుంది. రెండవదిగా, దేవునికి సమర్పించుకోబడిన జీవితానికి సిలువ చిహ్నం.

మూడవదిగా, ఇతరుల కొరకు త్యాగం చేయటానికి, వారి కొరకు శ్రమనొందటానికి సిలువ చిహ్నము. 1 యోహాను 3:16 చూడండి. ''ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై యున్నాము.'' ఇదే కల్వరిలోని తర్కం. మనం క్రీస్తుతో సహవాసం కలిగుండి, ఆయన జీవిత నియమానుసారంగా జీవించటానికి అంటే దేవునికి విధేయులుగా ఇతరుల కొరకు త్యాగము చేసేవారిగా జీవించటానికి పిలవబడ్డాము. మనము జీవించాలని ఆయన మరణించాడు. కాబట్టి  స్నేహితులారా, మనము జీవించటానికి మనం మరణించాలి. మత్తయి 16:25లోని మాటలను గమనించండి, ''తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును''; ప్రభువు ఈ మాటలు తన శిష్యులను సంబోధించి పలికాడు గనుక ప్రతి క్రైస్తవునికీ ఇవి వర్తిస్తాయి. స్వార్థపూరితంగా తన స్వీయసుఖాన్నే, తన మనశ్శాంతినే, తన సంక్షేమాన్నే, తన స్వప్రయోజనాలనే పరిగణలోనికి తీసుకొని జీవించే ప్రతి క్రైస్తవుడు తన ప్రాణాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటాడు. నిత్యత్వానికి సంబంధించినంతవరకూ అదంతా వ్యర్థమే;కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె అదంతా కాలిపోతుంది. కాని, ''..... నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును.'' అంటే తన సంక్షేమాన్ని, తన ప్రయోజనాలను, తన అభివృద్ధిని, తన అభిమతాన్ని ఖాతరు చేయక, నిస్వార్థంగా తన జీవితాన్ని క్రీస్తు నిమిత్తము ఇతరుల కొరకై త్యాగము చేసే ప్రతిక్రైస్తవుడు ''దానిని'' దక్కించుకుంటాడు. దేనిని దక్కించుకుంటాడు? ''దానినే'', మరిదేనినో కాదు. ''దానినే'', వేరొక దానిని కాదు. అంటే ఏ జీవితమైతే క్రీస్తు కొరకు వెచ్చించాడో అదే జీవితం అక్షయమైనదై, అగ్నిపరీక్షకి తాళుకొనువాటితో కట్టబడినదై, శాశ్వతమైనదిగా తీర్చిదిద్దబడినదై అది అతనికి అనుగ్రహింపబడుతుంది. దానిని అతడు దక్కించుకుంటాడు. మనము జీవించాలని ఆయన మరణించాడు. అలాగే మనం  జీవించటానికి మనం మరణించాలి.

''. . . నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.'' యోహాను 20:21లోని మాటలను కూడా గమనించండి. ''..... తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.''

ఏమి చేయటానికి క్రీస్తు ఇక్కడికి పంపబడ్డాడు? తండ్రిని మహిమపరచటానికి, దేవుని ప్రేమను కనపరచటానికి, దేవుని కీర్తిని ప్రచురపరచటానికి, యెరూషలేము విషయమై విలపించటానికి, భుజించటానికి కూడ తీరిక లేనంతగా ప్రయాసపడటానికి, తన యింటివారు సైతం ''ఆయన మతి చలించియున్నదని'' (మార్కు 3:21) చెప్పుకునేంత త్యాగపూరితజీవితాన్ని జీవించటానికి పంపబడ్డాడు. ఇప్పుడు ''తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని" క్రీస్తు సెలవిస్తున్నాడు. అంటే ఏ లోకం నుండి నేను నిన్ను విడిపించి రక్షించానో ఆ లోకానికే తిరిగి పంపుతున్నాను. సిలువ ముద్ర కలిగి జీవించటానికి నిన్ను తిరిగి ఆ లోకానికి పంపుతున్నాను అని ఆర్థం. ప్రియసహోదరీ సహోదరుడా, క్రీస్తు యొక్క మరణానుభవము (2కొరింథీ 4:10) మన జీవితాలలో ఎంతగా కొరవడింది!

మనము సిలువను మోయటం కనీసం ప్రారంభించామా? లేకపోతే మనము ఆయనను వెంబడించట్లేదనడంలో ఆశ్చర్యమేమీ లేదు. పాపాన్ని జయించే విషయమై మనము ఓడిపోవడంలో వింతేమీ లేదు. దీనికొక కారణముంది. మధ్యవర్తిత్వంలో క్రీస్తు సిలువ ఒంటరిగా నిలిచినా అనుభవాత్మకంగా తన శిష్యులందరూ దానిలో పాలుపంపులు పొందవల్సిందే. కల్వరిసిలువ పాపపు శిక్షావిధి నుండి సంపూర్ణ విడుదలను అనుగ్రహించింది. అయినా పాపపు శక్తి నుండి విడుదల పొంది, ప్రాచీన పురుషునిపై విజయము పొందటానికి, సిలువ మనజీవితాలలోకి అనుభవాత్మకంగా చేర్చుకోబడటమే ఏకైక మార్గం. చట్టబద్ధంగాను, న్యాయబద్ధంగాను సిలువపై పాపము అంతమొందించబడింది. అయినా అనుభవాత్మకంగా ఒక శిష్యుడు ఆ సిలువను మోయటం ప్రారంభించినప్పుడు మాత్రమే పాపపు ఏలుబడిని, కల్మషాన్ని రూపుమాపగలడు.

''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను'' (మత్తయి 16:24).

ఈ మాటలను బట్టి ఆత్మపరిశీలన చేసుకుని ప్రభువుకు తన జీవితాన్ని పున:సమర్పించుకోవడం ప్రతి క్రైస్తవుని బాధ్యత.