ఈ వ్యాసంలో నేను రెండు విషయాల గురించి వివరించాలని ఇష్టపడుతున్నాను. అవే;
1. దేవుని స్వభావము.
2. విశ్వసికి ఉన్నటువంటి రక్షణ నిశ్చయత.
మొదటిగా దేవుని స్వభావము గురించి వివరించడానికి ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాను.
ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? సమాధానం చాలా సులభం. అదే
“పాపులను రక్షించడానికి.”
ఔను. ఆయన ఈ లోకానికి రావడంలో అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైన కారణం మాత్రం పాపులను రక్షించడమే. ఈ విషయాన్ని బైబిల్ లోని అనేక వాక్యభాగాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ఉదాహరణకు; “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు” (మత్తయి 1:21), “నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను.” (లూకా 19:10), “లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, మరియు మూడవ దినమున లేపబడెను.” (1 కొరింథీ 15:3-4), “పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది.” (1 తిమోతి 1:15).
ఈ వాక్యభాగాల ప్రకారం పాపులను రక్షించడానికి దేవాది దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది నిజంగా ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఇక్కడ చాలామందికి "దేవుడు మనిషిగా రాకుండానే మనుష్యుల పాపాలను క్షమించలేడా? మనుష్యులను రక్షించలేడా? దేవుడు మనిషిని రక్షించడానికి ఇంత శ్రమపడాల్సిన అవసరం ఏంటి?" అనే ప్రశ్నలు ఉత్పన్నం ఔతాయి. ఒక్క మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవుడు, “నీ పాపములు క్షమించబడినవి” అని చెప్పి అందర్నీ రక్షించలేడా? అలా చెయ్యగలిగితే ఆయన అంత బాధ, అవమానం, సిలువ మరణం వంటి కఠినమైన మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడు?
ఒకవేళ పాపులను రక్షించడానికి వేరే సులభమైన మార్గం ఉండి కూడా ఆయన అంత కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నాడంటే సిలువ మరణం దేవుడు చేసిన బుద్ది హీనమైన పని ఔతుంది. దీనిని బట్టి దేవుడు చెయ్యలేనిది ఏదో ఉంది అని అర్థమౌతుంది.
ఏంటి దేవుడు చెయ్యలేనివి కూడా ఉన్నాయా? ఔను కచ్చితంగా ఉన్నాయి. అవేంటో ఈ వాక్యభాగాలు చూడండి;
"దేవుడు అన్యాయము చేయుట అసంభవము; సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము." (యోబు 34:10)
"అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను." (తీతుకు 1:3).
ఈ వాక్యభాగాల ప్రకారం దేవుడు అన్యాయం చెయ్యలేడు. దుష్కార్యం చెయ్యలేడు. అబద్ధం చెప్పలేడు. మరి బైబిల్ దేవునికి సమస్తము సాధ్యము అని కూడా చెబుతుంది కదా! (ఆదికాండము 18:14, మార్కు 14:36). అంటే వాక్యం ఒకవైపు “దేవునికి సమస్తము సాధ్యము” అని చెబుతూ మరోవైపు “దేవుడు కొన్ని పనులు చెయ్యలేడు” అని కూడా చెబుతుంది. ఇవి పరస్పర విరుద్ధమైన వాక్యాలా? కాదు. బైబిలులో వైరుధ్యాలు లేవు.
ఈ రెండు సత్యాలను సమన్వయపరిచే వాక్యం 2 తిమోతి 2:13లో ఉంది, అదే "ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు."
ఔను. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చెయ్యడు. దేవుడు చేసే ప్రతి కార్యమూ ఆయన స్వభావానికి అనుగుణంగానే ఉంటుంది. కాబట్టి వాక్యం “దేవునికి సమస్తమూ సాధ్యము” అని చెప్పినప్పుడు, ఆయన స్వభావాన్ని ప్రక్కన పెట్టి మాట్లాడడం లేదు. ఆ మాటలకు ఆయన పరిశుద్ధమైన స్వభావానికి అనుగుణంగా సమస్తము సాధ్యము అని అర్థం.
ఇప్పుడు మొదట అడిగిన ప్రశ్నకు తిరిగి వెళ్దాం.
దేవుడు మనిషిగా రాకుండానే పాపానికి న్యాయమైన శిక్ష విధించకుండానే ఒక పాపిని క్షమించగలడా?
సమాధానం - లేదు.
ఎందుకంటే అది ఆయన పరిశుద్ధమైన స్వభావానికి విరుద్ధం. ఒకవేళ అలా ఆయన పాపానికి న్యాయమైన శిక్ష విధించకుండా క్షమించేస్తే అన్యాయస్తుడు ఔతాడు. అందుకే దేవుడు మానవునిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. ఈ పరిశుద్ధమైన స్వభావమే ఆయనను నకిలీ దేవుళ్ళ నుండి వేరు చేస్తుంది. నిజమైన దేవుణ్ణి మనం గుర్తించేలా చేస్తుంది. ఈ లోకంలో దేవుళ్ళు అని పిలువబడే వారు అనేకులు ఉన్నారు. కానీ బైబిల్ దేవునికి మాత్రమే ఈ పరిశుద్ధమైన స్వభావం ఉన్నట్లుగా మనం చూస్తాము. ఈ పరిశుద్ధమైన స్వభావాన్ని మరింత వివరంగా చూద్దాం.
కృపా సత్యము
“నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసియున్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు.” (కీర్తనలు 40:10).
“కృపాసత్యములు కలిసికొనినవి; నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.” (కీర్తనలు 85:10).
ఈ వాక్యభాగం చాలా ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే “కృప” మరియు “సత్యం” సాధారణంగా కలవవు. కానీ అవి కలుసుకున్నాయని కీర్తనకారుడు చెబుతున్నాడు. అది ఎలా సాధ్యమైందో అర్థం చేసుకోవడానికి ఈ రెండు ఉదాహరణలు చూద్దాం.
మొదటిది; ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి పరీక్షా పత్రాన్ని దిద్దుతున్నాడు. మొత్తం మార్కులు 100. సాధారణంగా ఆ విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణుడవ్వాలంటే 35 మార్కులు రావాలి. కానీ అతనికి 34 మార్కులు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అతను ఉత్తీర్ణుడు కావాలంటే ఇంకెన్ని మార్కులు కావాలి? కేవలం ఒక మార్కు. ఆ ఉపాధ్యాయుడు ఒక గ్రేస్ మార్కు కలిపితే ఆ విద్యార్థి ఉత్తీర్ణుడు ఔతాడు. కానీ అప్పుడు ప్రశ్న ఏంటంటే ఉపాధ్యాయుడు న్యాయంగా వ్యవహరించినట్లా?
లేదు.
ఎందుకంటే నిజానికి ఆ విద్యార్థికి వచ్చిన మార్కులు 34 మాత్రమే. మరి న్యాయంగా మార్కులు వేస్తే? అప్పుడు అతను ఉత్తీర్ణుడు కాలేడు. అంటే ఉపాధ్యాయుడు కృప చూపిస్తే సంపూర్ణ సత్యాన్ని నిలబెట్టలేడు. సత్యాన్ని నిలబెడితే కృప చూపించలేడు. ఒకటి చెయ్యాలంటే మరోటి కోల్పోవలసి వస్తుంది. అయితే కృప కూడా చూపించాలి, సత్యం కూడా నిలబెట్టాలి, అదే సమయంలో ఆ విద్యార్థి కూడా ఉత్తీర్ణుడు కావాలి. ఇది సాధ్యమా?
సాధారణ పరిస్థితుల్లో అసాధ్యమే. ఇదే ఆ ఉపాధ్యాయుడికి వచ్చిన సమస్య.
రెండవ ఉదాహరణ; ఒక రాజు ఉన్నాడు. అతడు తన రాజ్యాన్ని న్యాయంగా పరిపాలించేవాడు. తన ప్రజలను ప్రేమగా చూసుకునేవాడు. అతని రాజ్యంలో దొంగతనం, నరహత్య, వ్యభిచారం వంటి దుష్కార్యాలు జరగకుండా కఠినమైన నియమాలు పెట్టాడు. అతడు అనేక రాజ్యాలను జయించాడు. అయినప్పటికీ అతనికి ఒక సమస్య ఉండేది. అదే తన రాజ్యంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్ల దొంగతనం చేసిన వారికి మొదట 10 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. ఐనా దొంగతనాలు పూర్తిగా తగ్గలేదు. అందుకే శిక్షను 20 కొరడా దెబ్బలకు పెంచాడు. తర్వాత 30కి. చివరకు 40 కొరడా దెబ్బలకు పెంచాడు. ఆ 40 దెబ్బలు మరణశిక్షతో సమానం. ఆ శిక్షను తట్టుకుని బ్రతకగలిగిన వ్యక్తి ఆ రాజ్యంలో ఎవరూ లేరు "ఆ రాజు తప్ప".
ఇప్పుడు రాజ్యంలో ఎవరు దొంగతనం చెయ్యడానికి సాహసిస్తారు? ఎవ్వరూ చెయ్యరని అందరూ అనుకున్నారు. కానీ ఒక రోజు దొంగతనం జరిగింది. ఈ వార్త రాజ్యమంతా వ్యాపించింది. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దొంగతనం చేసింది ఒక సాధారణ వ్యక్తి కాదు. అది ఆ రాజు తల్లే.
ఇప్పుడు రాజు ఏం చేస్తాడు?
ప్రజలందరూ రాజు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిలో వారే చర్చించుకుంటున్నారు. “రాజు తన తల్లిని శిక్షిస్తాడా?” “లేక క్షమించి వదిలేస్తాడా?” చివరకు తీర్పు చెప్పే రోజు వచ్చింది. రాజసభలో అందరూ సమకూరారు. దోషి స్థానంలో రాజు తల్లి నిలబడి ఉంది. ఆమెకు ఇరువైపులా శిక్షను అమలు చెయ్యడానికి ఇద్దరు సైనికులు కొరడాలు పట్టుకొని నిలబడి ఉన్నారు. రాజు తన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు రాజు ముందున్న సమస్య ఏంటంటే;
ఒకవేళ అతను తన తల్లికి శిక్ష విధిస్తే ప్రజలు "తన తల్లినే క్షమించలేని వాడు, మమ్మల్ని ఎలా ప్రేమిస్తాడు?” అని అనుకుంటారు. అలా కాకుండా ఆమెను క్షమించి వదిలేస్తే అదే ప్రజలు "వాళ్ళ అమ్మకొక న్యాయం, మాకొక న్యాయమా?” అనుకుంటారు. ఏం చేసినా సమస్యే.
ప్రేమ చూపిస్తే న్యాయం దెబ్బతింటుంది.
న్యాయం చేస్తే ప్రేమ కనిపించదు.
మరి తన న్యాయాన్ని కూడా కాపాడుకుంటూ తన ప్రేమను కూడా చూపిస్తూ తన తల్లిని క్షమించే మార్గం ఏదైనా ఉందా?
రాజు అలాంటి సమయంలో ఏం చేసాడంటే మొదటిగా అతని అమ్మ చేసిన నేరానికి తీర్పు తీర్చి 40 కొరడా దెబ్బలు కొట్టమని ఇరు వైపులా నిలువబడి ఉన్న తన ఇద్దరు సైనికులకు అజ్ఞాపించాడు. తర్వాత ఆ రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని అమ్మని కౌగిలించుకున్నాడు. ఆ 40 కొరడా దెబ్బలు అతనే తిన్నాడు. ఈ విధంగా రాజు న్యాయం చేసాడు. అదేవిధంగా క్షమించి ప్రేమను కూడా చూపగలిగాడు. బైబిల్ లో ఉన్న దేవుని కృప, సత్యం అనే గుణాలను అర్థం చేసుకోవడానికి ఈ రెండు ఉదాహరణలు చెప్పాను. ఇప్పుడు బైబిల్ లో దేవుడు ఏ విధంగా మనుష్యుల పట్ల తన న్యాయాన్ని, కృపను కనుపరిచాడో ఇప్పుడు చూద్దాం.
దేవుడు పరిశుద్ధుడు. ఆయన న్యాయం చెయ్యడంలో ఏ విధంగానూ రాజీ పడడు.
“ఆయన కార్యము సంపూర్ణము; ఆయన చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు; ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు.” (ద్వితీయోపదేశకాండము 32:4).
కానీ మరోవైపు మనిషి పరిస్థితి ఎలా ఉంది?
“నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను.” (ఆదికాండము 6:5).
“లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును.” (మార్కు 7:21-22)
“నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడెవడును లేడు. దేవుని వెదకువాడెవడును లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినవారైరి.” (రోమా 3:10-12).
అంటే ఒకవైపు దేవుడు సంపూర్ణ న్యాయవంతుడు. మరోవైపు మనుష్యులందరూ పాపులు.
ఇప్పుడు దేవుడు తాను నీతిమంతుడిగా ఉండాలి. అదే సమయంలో తమ పాపాలను ఒప్పుకొని, పశ్చాత్తాపపడి, క్షమాపణ కోసం ఆయన యందు విశ్వాసముంచే వారిని కూడా క్షమించాలి, నీతిమంతులుగా తీర్చాలి.
ఈ రెండూ ఎలా సాధ్యమౌతాయి?
అదే సువార్తకు ఆధారం.
మనం సువార్త చెబుతున్నప్పుడు కొందరు మాకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు మీ దేవుడు మాకు అవసరం లేదు అని అంటారు. కానీ ఆ దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కారు. ఎందుకంటే వారిలో ఏ ఒక్కరిలో కూడా ఈ సత్యం కృప అనే గుణాలు సంపూర్ణంగా లేవు. కానీ బైబిలులోని దేవుని ప్రత్యేకత ఏంటంటే ఆయనలో సంపూర్ణ ప్రేమ కూడా ఉంది, సంపూర్ణ న్యాయం కూడా ఉంది.
సాధారణంగా ప్రేమను చూపించాలంటే న్యాయంతో రాజీ పడాల్సి వస్తుంది. న్యాయాన్ని నిలబెట్టాలంటే ప్రేమను త్యాగం చెయ్యాల్సి వస్తుంది. కానీ బైబిల్ దేవుడు ఈ రెండింటినీ సంపూర్ణంగా నిలబెట్టాడు. అది ఎలాగంటే? ఈ వాక్యభాగాలు చదవండి.
“పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.” (రోమా 3:25-26).
ఈ వాక్యభాగం ప్రకారం దేవుడు రెండు విషయాలను ఒకేసారి చేశాడు.
మొదటిది - తాను నీతిమంతుడిగా నిలిచాడు.
రెండవది - యేసునందు విశ్వాసముంచిన పాపిని నీతిమంతునిగా తీర్చాడు.
అందుకే దేవుడు యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడు.
అంటే; దేవుడు తన న్యాయంలో రాజీ పడలేదు. అలాగే తన ప్రేమలో కూడా రాజీ పడలేదు. ఈ రెండింటినీ నెరవేర్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
“కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును.” (సామెతలు 16:6).
పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే కృప మరియు సత్యం రెండూ ఉండాలి. కృప మరియు సత్యం రెండూ కలిసినప్పుడే ప్రాయశ్చిత్తం కలుగుతుంది.
కీర్తన 85:10లో చెప్పబడిన “కృపాసత్యములు కలిసికొనినవి” అనే మాటకు పూర్తి అర్థం సిలువ దగ్గర కనిపిస్తుంది.
“మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను; మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను; మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను; అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.” (యెషయా 53:5).
“నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి, తన జ్ఞానముచేత అనేకులను నిర్దోషులుగా చేయును.” (యెషయా 53:11).
“ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.” (యోహాను 1:14).
“ధర్మశాస్త్రము మోషేద్వారా అనుగ్రహింపబడెను; కృపయు సత్యమును యేసుక్రీస్తుద్వారా కలిగెను.” (యోహాను 1:17)
ఈవిధంగా కృప మరియు సత్యం యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణంగా వ్యక్తమయ్యాయి.
మనం పాపం చేశాము. శిక్షను అనుభవించవలసింది మనమే. కానీ దేవుడు మనిషిగా వచ్చి, మన స్థానంలో నిలబడి, మన పాపాలకు తగిన న్యాయమైన శిక్షను సిలువపై భరించాడు. అందువల్ల పాపానికి తగిన శిక్ష విధించబడింది - కాబట్టి దేవుని న్యాయం నెరవేరింది. అదే సమయంలో పాపికి క్షమాపణ లభించింది - కాబట్టి దేవుని కృప కూడా నెరవేరింది.
ఇదే సువార్త యొక్క గొప్పతనం.
దేవుడు కేవలం నోటి మాటతో పాపాలను క్షమించి ఉంటే ఆయన న్యాయవంతుడు కాడు. అందుకే ఆయన మనిషిగా వచ్చి సిలువపై మరణించవలసి వచ్చింది. ఇదే బైబిల్ దేవుని ప్రత్యేకత. ఇదే నిజమైన దేవుణ్ణి ఇతర దేవుళ్ళుగా పిలవబడే వారితో వేరు చేసే లక్షణం. మనం సువార్త ప్రకటించినప్పుడు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. యేసుక్రీస్తు అందరిలో ఒక దేవుడు కాదు. ఆయనే నిజమైన దేవుడు. ఎందుకంటే ఆయనలో మాత్రమే సంపూర్ణ ప్రేమ మరియు సంపూర్ణ న్యాయం ఉన్నాయి.
2. విశ్వాసికి ఉన్నటువంటి రక్షణ నిశ్చయత
మన పాపాలు నిజంగా క్షమించబడ్డాయని మనకు ఎలా తెలుసు? దేవుడు ఏదైనా కలలో వచ్చి చెప్పాడా? లేదా చెవిలో ఏదైనా రహస్యంగా చెప్పాడా? ఒకవేళ అలాంటి అనుభవాల మీద ఎవరైనా తమ రక్షణను ఆధారపెడితే వారు తమ రక్షణ గురించి మరలా పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు రక్షణ నిశ్చయతను అనుభవాల ద్వారా కాకుండా తన వాక్యం ద్వారా ఇచ్చాడు.
ఒకసారి నేను యెహోవా సాక్షుల గుంపుకు చెందిన ఒక వ్యక్తిని కలిశాను. అతణ్ణి "నీ పాపాలు క్షమించబడ్డాయని నీవు కచ్చితంగా ఎలా చెప్పగలవు?” అని ఇదే ప్రశ్న అడిగాను. దానికి అతను మొదట “నేను బాప్తిస్మము తీసుకున్నాను” అని చెప్పాడు. అప్పుడు నేను మళ్ళీ "అది కాదు. నీ పాపాలు క్షమించబడ్డాయని నీకు నిశ్చయంగా ఎలా తెలుసు?” అని అడిగాను. అప్పుడతను "ఇప్పుడెలా తెలుస్తుంది? చనిపోయిన తర్వాతే తెలుస్తుంది.” అని బదులిచ్చాడు.
బహుశా ఇది చదువుతున్న మీరు కూడా అదేవిధంగా ఆలోచిస్తూ ఉండవచ్చు. అందుకే ఇప్పుడు మీ అందరినీ కూడా అదే ప్రశ్న అడుగుతున్నాను.
మీ పాపాలను దేవుడు క్షమించాడా?
బహుశా మీలో చాలామంది వెంటనే “ఔను” అని చెబుతారు. కానీ మీ మనస్సాక్షి కూడా అదే చెబుతోందా? లేక లోపల ఎక్కడో “ఏమో!” అనే సందేహం ఉందా? ఒకవేళ అలాంటి సందేహం ఉంటే ఈ వాక్యాలు మీ కోసమే.
ముందుగా ఒక విషయం ఆలోచించండి. దేవుడు ఎప్పుడూ సత్యమే మాట్లాడతాడా? లేక అప్పుడప్పుడు అబద్ధం కూడా చెబుతాడా?
మనం ఇప్పటికే వాక్యంలో "దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చెయ్యలేడని, ఆయన అబద్ధం చెప్పలేడని, అన్యాయం చెయ్యలేడని, తన మాటను మార్చలేడని, అందుకే మనిషిగా వచ్చి సిలువ మరణం భరించాడని చూసాము. ఆయన తన స్వభావంలో రాజీ పడలేడు.
ఇప్పుడు ఈ వాక్యభాగం చూడండి;
“నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.” (1 యోహాను 2:25)
ఇక్కడ ఒక విషయం గమనించండి.
మనం ఎప్పుడైనా దేవుని దగ్గరకు వెళ్ళి “నాకు నిత్యజీవం ఇవ్వు” అని అడిగామా? అడగలేదు. నిజానికి మనకు నిత్యజీవం అవసరమని కూడా గుర్తించలేదు. కానీ దేవుడే తనకు తానుగా మనకు నిత్యజీవాన్ని వాగ్దానం చేశాడు. అది ఆయన వాగ్దానం. మన వాగ్దానం కాదు.
"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16).
"కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును" (యోహాను 6:41)
ఈ వాక్యభాగాల ప్రకారం; విశ్వాసముంచే ప్రతీవ్యక్తీ కూడా నిత్య జీవాన్ని పొందుతాడు. వారిలో ఏ ఒక్కరూ నశించరు. ఇదే విశ్వాసుల పట్ల దేవుని చిత్తం.
“తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను.” (యోహాను 6:37).
“అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు; వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.” (సామెతలు 28:13).
“మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.” (1 యోహాను 1:9).
ఇప్పుడు ఆలోచించండి. మనం నిజంగా యథార్థ హృదయంతో ఆయన దగ్గరకు వస్తే ఆయన మనలను తిరస్కరిస్తాడా?
లేదు.
ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చెయ్యలేడు.
మనం నిజంగా పశ్చాత్తాపపడి ఆయనను ఆశ్రయిస్తే ఆయన క్షమించకుండా ఉండగలడా?
లేదు.
ఎందుకంటే ఆయన అలా చేస్తే తన స్వంత వాగ్దానాన్ని ఉల్లంఘించినవాడౌతాడు.
అసలు మనకు ఈ సందేహం ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఈ లోకసంబంధమైన అనేక విషయాల కోసం మనం ప్రార్థిస్తాము. కానీ వాటిలో చాలా నెరవేరవు. అప్పుడు క్షమాపణ విషయంలో కూడా అలానే అనిపించే అవకాశం ఉంది. “బహుశా దేవుడు క్షమించి ఉండవచ్చు… లేకపోవచ్చు…” అని మనం పొరపడే అవకాశం ఉంది. కానీ క్షమాపణ విషయంలో పరిస్థితి వేరు. జ్వరం తగ్గాలని ప్రార్థిస్తే దేవుడు స్వస్థత ఇవ్వవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. ఉద్యోగం కోసం ప్రార్థిస్తే ఇవ్వవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. ఇల్లు కోసం ప్రార్థిస్తే ఇవ్వవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అవన్నీ దేవుని సార్వభౌమ చిత్తానికి సంబంధించిన విషయాలు. ఆయన వాటిని తప్పకుండా మనకు ఇస్తానని వాగ్దానం చెయ్యలేదు. కానీ నిత్యజీవం విషయంలో
"కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును" (యోహాను 6:41), "నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము" (1యోహాను 2:25) అని కచ్చితంగా రాయబడింది. పాపక్షమాపణ విషయంలో “నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను” అని యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా వాగ్దానం చేసాడు. అందువల్ల ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడి, క్రీస్తునందు విశ్వాసముంచి దేవుని దగ్గరకు వస్తే దేవుడు అతన్ని తిరస్కరించడు. ఒకవేళ తిరస్కరిస్తే ఆయన అబద్ధం చెప్పినవాడౌతాడు. కానీ అది అసాధ్యం. ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పలేడు.
కాబట్టి మన రక్షణ నిశ్చయత చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే కలుగుతుంది. మన పాపాలు క్షమించబడ్డాయని ఇప్పుడే తెలుసుకోవచ్చు. ఈ నిశ్చయత మనకు ఎలా వచ్చింది? ఏదైనా అద్భుతం చూసినందువల్లనా? కాదు. ఏదైనా కల వచ్చినందువల్లనా? కాదు. ఏదైనా ప్రత్యేక అనుభవం కలిగినందువల్లనా? కాదు. దేవుని వాక్యం ద్వారా.
దేవుడు తన స్వభావాన్ని తన వాక్యంలో బయలుపరిచాడు. ఆయన ఎవరో మనకు తెలియచేశాడు. ఆయన మాట మారదు. ఆయన వాగ్దానాలు విఫలమవ్వవు. ఆయన అబద్ధం చెప్పడు. అందుకే ఆయన వాగ్దానాల మీద మనకు సంపూర్ణ నమ్మకం ఉంటుంది.
“ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.” (రోమా 5:5).
ఔను. మనం ఇంకా సజీవంగా ఉన్నప్పుడే మన రక్షణను నిశ్చయపరచుకోవచ్చు. ఎందుకంటే మన రక్షణకు ఆధారం మన భావోద్వేగాలు కావు. మన అనుభవాలు కావు. మన పనులు కావు. మన మంచితనం కాదు. దేవుని స్వభావమే. ఆయన పరిశుద్ధుడు. ఆయన న్యాయవంతుడు. ఆయన ప్రేమగలవాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చెయ్యలేడు. అందుకే క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి రక్షణ నిశ్చయత ఉంది.
ఈ నిరీక్షణ మనలను ఎప్పటికీ సిగ్గుపరచదు.
ఆమెన్.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.