ఇతర అంశాలు

రచయిత: కె విద్యా సాగర్

                   final m

ప్రపంచవ్యాప్తంగా కరోనా(COVID-19) విజృంభించి నాశనాన్ని సృష్టిస్తున్న సమయంలో,  కొన్ని మతాలవారు ఈ వైరస్ పరిష్కారం గురించి తమ మతగ్రంథాలలో ముందే వ్రాయబడి ఉందని చెపుతూ కొన్ని మూఢనమ్మకాలనూ, అబద్ధప్రచారాలనూ వ్యాప్తిచేయడం ప్రారంభించారు. హిందువులైతే ఆవు మూత్రం, పేడ కరోనాకు విరుగుడంటూ విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలలో దేవునివాక్యం పైన అవగాహన లేని క్రైస్తవులు కూడా తక్కువేమీ కాదు‌. వీరు కూడా మిగిలిన మతాలతో కలసి, బైబిల్ లో‌ కొన్ని వచనాలు రాయబడిన సమయం, సందర్భం పక్కనపెట్టేసి, ఆ వచనాలు కరోనా కోసమే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా చేసేవారు, బహుశా బైబిల్ దేవునికి‌ తమ ప్రచారంతో మహిమ తీసుకొస్తున్నామనే భ్రమలోనే ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నాము. లేదా తామేదో బైబిల్ జ్ఞానులైనట్టుగా కనబరుచుకోవాలి అనే ప్రయాసలో కూడా ఇది భాగమై ఉండవచ్చు.అసత్య ప్రచారాలతో తనకు మహిమ తీసుకురావాలని దేవుడు ఏనాడూ ఆజ్ఞాపించలేదు, ఆయన అటువంటి నీఛమైన ప్రచారాలను ఏనాడూ సమర్థించడు.

నిర్గమకాండము 23:1- లేనివార్తను పుట్టింపకూడదు.

ఈ విధంగా దేవుని వాక్యంలో లేని భావాన్ని ఆ వాక్యానికి ఆపాదించి ప్రచారం చేసేవారికి తీర్పు తీర్చడం(బుద్ధి చెప్పడం) వాక్యమెరిగినవారందరి బాధ్యతగా మనం గుర్తించాలి.

మొదటి కొరింథీయులకు 5:12,13- వెలుపలివారికి తీర్పు తీర్చుట నాకేల? వెలుపలివారికి దేవుడే తీర్పు తీర్చునుగాని మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు.

ఈ ప్రకారం, కరోనా గురించి బైబిల్ లో ముందే రాయబడిందని కొందరు వక్రీకరిస్తున్న వచనాలకు వారు చెపుతున్న అర్థం వస్తుందా అనేదాన్ని వరుసగా పరిశీలిద్దాం. దానికంటే ముందుగా, మనం మరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథం, దేవుని ఆత్మతో రాయబడి, వర్తమాన భూతభవిష్యత్తు కాలాలలో ఏం జరిగిందో, జరగబోతుందో తెలియచేస్తుంది అనేది ఖచ్చితం. బైబిల్ లో రాయబడిన విషయాలన్నీ చరిత్రలో ఖచ్చితంగా జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా జరగవలసినవి ఉన్నాయి.

ఈ ఆర్టికల్ ఆ సత్యానికి ఏ మాత్రమూ వ్యతిరేకం కాదు కానీ, ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్ గురించి బైబిల్ లో ముందే రాయబడిందని కొందరు చూపిస్తున్న వచనాలు ఆ వైరస్ కోసం తెలియచేయడం లేదని వివరించడానికి మరియు వారు చూపించిన ఆ వచనాల అసలు భావాల్ని తెలియచేయడానికి మాత్రమే ఇది రాయడం జరుగుతుంది. మా వాదన బైబిల్ చెప్పనిదాన్ని బైబిల్ కి ఆపాదించి ప్రకటించడం సరైన పద్ధతి కాదని మాత్రమే. ఈ ప్రయత్నంలో భాగంగానే కొందరు కరోనా కోసం బైబిల్ లో రాయబడ్డాయంటూ వక్రీకరించి చూపిస్తున్న వాక్యభాగాలను వరుసగా మీ ముందు ఉంచి, వాటి సందర్భాన్ని తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాము.

మొదటిది:

ప్రకటన గ్రంథము 13:18- బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య "ఆరువందల అరువది యారు" ఇందులో జ్ఞానము కలదు.

ఈ వచనంలో మనకి 666 అనే ముద్ర గురించి కనిపిస్తుంది. సార్వత్రిక క్రైస్తవసంఘంలో ఈ సంఖ్యపైన ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. ఈ సంఖ్య నీరో‌ కైసర్ పేరని‌ కొందరు, మరికొందరు మరో రాజు పేరని, ఇంకొందరైతే ఈ ముద్ర భవిష్యత్తులో రాబోతుందని నమ్ముతుంటారు. వారి వాదనల్లో ఏది సత్యం అనేది ప్రస్తుతం పక్కనపెడితే, కరోనా కోసం బైబిల్‌లో ముందే రాయబడిందని అబద్ధాలు చెప్పుతున్న మన మహాజ్ఞానులు, ఈ 666 సంఖ్యను కరోనా అనే పేరులో చూపించి, కరోనా అంటే 666 ముద్రేనని ప్రకటిస్తున్నారు. అసలు ఈ 666 అనేది ఏమిటో ఆ అధ్యాయం మొదటి నుంచి పరిశీలిస్తే దీనికీ కరోనాకీ ఏ సంబంధం లేదని‌ అర్ధమౌతుంది.

ప్రకటన గ్రంథము 13:15-18- మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయనివారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని, దరిద్రులుగాని, స్వతంత్రులుగాని, దాసులుగాని, అందరును తమ కుడిచేతి మీదనైనను తమ నొసటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయవిక్రయములు చేయుటకు మరియెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువదియారు ఇందులో జ్ఞానము కలదు.

ఈ అధ్యాయంలో 666 కోసం రాయబడిన రెండు మాటలు చూద్దాం.

1) అది ఒక మృగము సంఖ్య, మనుష్యుని సంఖ్య.

దానియేలు గ్రంథంలోనూ, ప్రకటన గ్రంథంలోనూ కొన్ని రాజ్యాలను సూచించడానికి అలంకారప్రాయంగా మృగము అని రాశారు. దీని ఆధారంగా మనం పరిశీలిస్తే కరోనా అనేది ఒక రాజ్యానికి సంబంధించినది కాదు. అదేవిధంగా 666 అనేది ఒక మనుష్యుని సంఖ్య అని కూడా పైన చూసిన లేఖనంలో రాయబడింది. కరోనా అనేది ఒక వైరస్, COVID-19 అనేది ఒక వ్యాధి, అది ఏ మనుష్యుని సంఖ్యాకాదు, ఏ మనిషి అధికారాన్నీ ఇది ప్రకటించడం లేదు.

2) ఈ 666 సంఖ్యకు, మానవులు చేసే క్రయవిక్రయాలకు సంబంధం ఉంది.కరోనాకి క్రయవిక్రయాలకీ ఏ సంబంధమూ లేదు, కరోనా ఎవరికీ కూడా క్రయవిక్రయాలు చేసే అనుమతిని‌ ఇవ్వదు.

3) 666 సంఖ్యలో జ్ఞానము కలదు.మరి కరోనాలో ఏమి కలదు? చావు కలదు.ఈ విధంగా మనం ఈ అధ్యాయాన్ని సందర్భానుసారంగా, అర్థం చేసుకుంటే కరోనాకూ 666కు ఏ సంబంధం లేదని అర్థమౌతుంది.

రెండవది:

యిర్మీయా 7:32- కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టుటకు స్థలము లేకపోవు వరకు తోఫెతులో శవములు పాతిపెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.

కొందరు ఈ వచనాన్ని చూపించి, ఇది ప్రస్తుత ఇటలీయనీ, ఇటలీలో ప్రస్తుతం వైరస్ కోసం‌ మరణిస్తున్న వారికోసమే ఈ ప్రవచనమని ప్రకటిస్తున్నారు. అసలు ఈ తోపెతులో వధ జరగడానికి కారణమేంటో, అది ఎవరికి జరిగే వధో ప్రవక్త స్పష్టంగా తెలియచేస్తున్నాడు.

యిర్మీయా 7:30-34- యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యూదా వారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు, నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లు వారు దానిలో హేయవస్తువులను ఉంచియున్నారు. నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు. కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టుటకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును; ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని తోలివేయువాడు లేకపోవును. ఉల్లాసధ్వనియు ఆనందధ్వనియు పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండ చేసెదను; ఈ దేశము తప్పక పాడైపోవును.

ఈ అధ్యాయం అంతా యూదులు దేవుని పట్ల చేసిన హేయమైన కార్యాల నిమిత్తం వారికి రాబోయే శిక్ష గురించి యిర్మియా ప్రవచిస్తున్నాడు. యూదులు బెన్ హిన్నోము లోయలో దక్షిణ భూభాగమైన తోఫెతులోని జనులు మొలెకు దేవతకు బలిపీఠాలు కట్టి తమ‌ కుమారులను కుమార్తెలను బలిగా అర్పించారు, అందుకోసం దేవుడు ఈ తీర్పును వారి మీదకు పంపుతున్నాడు.

యెషయా 30:33- పూర్వమునుండి తోపెతు సిద్ధపరచబడియున్నది అది మొలెకు దేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసియున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.

తోపెతులోయ వధలోయగా మార్చబడుతుందని ప్రవచించిన యిర్మియా, అది ఏ విధంగా వధలోయగా మార్చబడుతుందో కూడా ప్రవచించాడు.

యిర్మీయా 8:1,2- యెహోవా వాక్కు ఆ కాలమున శత్రువులు యూదారాజుల యెముకలను అధిపతుల యెముకలను యాజకుల యెముకలను ప్రవక్తల యెముకలను యెరూషలేము నివాసుల యెముకలను సమాధుల లోనుండి వెలుపలికి తీసి వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్రనక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంటవలె పడియుండును.

ఈ వచనాల ఆధారంగా తోపెతు లోయలో వధ జరిగేది కరోనా వైరస్ వల్ల కాదు, శత్రురాజుల‌వల్ల. ఆ వధ జరిగేది యూదులకు మాత్రమే, మిగిలిన జాతులవారికి కాదు. ప్రవక్త చెప్పినట్టుగానే యూదా పట్టణమైన యెరుషలేము క్రీస్తుపూర్వం 586వ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు చేత నాశనం చేయబడింది. యిర్మియా చెప్పిన ప్రవచనం నెరవేరింది. ప్రస్తుతం ఇటలీలో వైరస్ వల్ల చనిపోతున్నవాళ్లకీ, ఈ ప్రవచనానికీ ఏ సంబంధమూ లేదు. ఎందుకంటే -

1)ఈ ప్రవచనం తమపిల్లలను మొలెకు దేవతకు బలి అర్పించిన యూదుల కోసం, యూదా దేశం కోసం మాత్రమే చెప్పబడింది; కరోనా కేవలం ప్రపంచంలో ఒక దేశాన్ని కానీ, ఒక జాతిని కానీ నాశనం చేయడం లేదు, అన్నిచోట్లకూ విస్తరించి అన్నిదేశాలనూ నాశనం చేస్తూ ఉంది. కరోనా విస్తరించే దేశాలలో పిల్లలను బలిగా అర్పించే సంస్కృతి ఈనాడు లేదు.

2)ముఖ్యంగా ప్రవక్త చెపుతున్న ఈ తోపెతు అనేది ఇటలీలో లేదు, తోపెతు అనేది ఇటలీలో ఉందంటూ సోషల్ నెట్వర్క్స్ లో జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధం. తోపెతు అనేది ఇశ్రాయేలులో ఉంది. ఆ కాలంలోనే యోషియా రాజు ఈ ప్రాంతాన్ని నాశనం చేసి చెత్త వేసే ప్రాంతంగా మార్చేశాడు.

రెండవ రాజులు 23:10- మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు  బెన్‌ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను.

3) వైరస్ (వ్యాధి) వల్ల తోపెతు లోయలో వధ జరుగుతుందని ప్రవక్త చెప్పడం లేదు, శత్రురాజుల వల్ల జరుగుతుందని చెప్పాడు.

మూడవది:

కొందరు స్వస్థత బోధకులు(ఫేక్) వీరులు బయలుదేరి యేసురక్తం కరోనా నుండి‌ మనల్ని కాపాడుతుందంటూ ప్రకటిస్తున్నారు.దేవుడు తన చిత్తమైతే కరోనా నుంచే కాదు దేనినుంచైనా కాపాడగలిగే సమర్థుడని, సర్వశక్తిమంతుడనీ, ఆయన చిత్తం లేనిదే ఆయన పిల్లలకు ఏ హానీ సంభవించదని మేము మనస్పూర్తిగా నమ్ముతాము. దీన్ని నమ్మని క్రైస్తవులు ఎవరూ ప్రపంచంలో ఉండరు, ఉంటే వారు క్రైస్తవులే కాదు. అయితే ఈ యేసురక్తంతో కరోనాకు స్వస్థత కలుగుతుందనే మాటలు వాక్యానుసారమేనా అనేదాన్ని ఇక్కడ చూద్దాం. బైబిల్ గ్రంథం యేసురక్తం గురించి ఏమని చెబుతుందో చూడండి –1 యోహాను 1:7- అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

యేసుక్రీస్తు రక్తాన్ని చిందించింది మనల్ని కరోనా నుంచి కాపాడడానికో, జలుబు దగ్గుల నుండి‌ కాపాడడానికో కాదు; మనల్ని పాపం నుండి పవిత్రులుగా చేయడానికే ఆయన రక్తాన్ని కార్చాడు. దీని గురించి చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, యేసురక్తంతో శరీరరోగాలకు స్వస్థత కలుగుతుందనే మాయమాటల‌ వల్ల నేడు క్రైస్తవ్యంలో యేసుక్రీస్తును నమ్మినవారికి ఏ రోగమూ రాదు అనే మూఢనమ్మకం ఏర్పడింది. యేసుక్రీస్తును నమ్మినవారికి కూడా రోగాలు వస్తాయి, కరోనా కూడా వస్తుంది. మన జాగ్రతలు మనం తీసుకోవాలి, ఆయన చిత్తమైనపుడు మనల్ని కాపాడతాడు.ఎఫెసు పట్టణంలో పౌలు బోధించినదాన్ని విశ్వసించి, కొలస్సీ సంఘాన్ని స్థాపించిన ఎఫప్రొదితు గురించి పౌలుగారు రాసిన ఒకమాట చూడండి

ఫిలిప్పీయులకు 2:25,26,27- మరియు నా సహోదరుడును, జతపనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి యాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమైయుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను.

చరిత్రప్రకారం, ఎఫప్రొదుతుకు సంక్రమించింది మామూలు జ్వరం కాదు, రోమా పట్టణంలో ఆ సమయంలో ప్రాణాంతకరమైన జ్వరం ఒకటి విజృంభించింది, పౌలుకోసం రోమాకు వెళ్లిన ఎఫప్రొదితుకు ఆ వ్యాధి సంక్రమించింది. యేసురక్తం ఎఫప్రొదితును ఆ వ్యాధి సంక్రమించకుండా కాపాడలేదు కానీ, పౌలుబోధల ద్వారా ఎఫప్రొదితు పాపాన్ని కడిగి గొప్ప సువార్తికునిగా మార్చి కొలస్సీ సంఘాన్ని స్థాపించేలా చేసింది. తనకు ఆ వ్యాధి నుంచి కాపాడడం దేవుని చిత్తం‌ కనుక తన ప్రాణం పోకుండా ఆయన కాపాడాడు.

సాధారణంగా యేసురక్తంలో స్వస్థత అంటూ అసలు యేసుక్రీస్తు రక్తాన్ని ఎందుకు చిందించాడో తెలియకుండా మాట్లాడే ఈ స్వస్థతవీరులు(ఫేక్) యేసుక్రీస్తు గురించి యెషయా రాసిన ప్రవచనాలను వక్రీకరించి బోధిస్తుంటారు. అవేంటో చూడండి -యెషయా గ్రంథము 53:4- నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను

మన స్వస్థతవీరులు ఈ వచనాన్ని చూపించే, యేసుక్రీస్తు శిలువలో చిందించిన రక్తం‌వల్ల మనకి స్వస్థత అని వక్రీకరిస్తుంటారు. ఎందుకంటే యెషయా 53 అధ్యాయం అంతా యేసుక్రీస్తు బలియాగం గురించే ప్రాముఖ్యంగా బోధిస్తుంది. అయితే ఆ అధ్యాయం ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు శిలువమరణం గురించి బోధిస్తున్నప్పటికీ, ఆయన పరిచర్య గురించి కూడా ఆ అందులో రాయబడి ఉంది. ఉదాహరణకు మనం పైన చూసిన ప్రవచనం యేసుక్రీస్తు శిలువలో చిందించిన రక్తానికి సంబంధించినది కాదు‌. ఆ ప్రవచనం యేసుక్రీస్తు పరిచర్య కాలంలో చేసిన స్వస్థతల గురించి రాయబడింది మాత్రమే.

మత్తయి 8: 17- ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయా ద్వార చెప్పబడినది నెరవేరెను.

అదే యెషయా 53లో మరొక వచనాన్ని చూడండి.

యెషయా గ్రంథము 53:5- మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.

ఈ వచనంలో మాత్రం ఆయన శిలువ వేయబడే సమయంలో పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుందని రాయబడింది. అయితే ఇది పై సందర్భంలో మనం చూసినట్లుగా శరీరానికి సంబంధించిన స్వస్థత కానే కాదు. అది ఆత్మీయ స్వస్థత(పాపం నుండి విడుదల) గురించి రాయబడింది. ఇది మేమేదో మా వాదనను నిరూపించుకోవడానికి చెబుతున్నమాట కాదు కానీ, దీని గురించి పేతురుగారే మనకి ఆధారాన్ని ఇస్తున్నారు.

1 పేతురు 2:23,24,25- ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థతనొందితిరి. మీరు గొఱ్ఱెలవలె దారి తప్పిపోతిరిగాని యిప్పుడు మీ ఆత్మలకాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.

ఈ విధంగా యేసురక్తం వల్ల మనకి కరోనా రాదని చెప్పే మరో మూఢనమ్మకపు బోధకు కూడా వాక్యం నుండి సమాధానం చూశాము. మా మాటల్ని వక్రీకరించేవారు ఎక్కువగా ఉండడంతో పైన చెప్పిన మాటను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మేము యేసుక్రీస్తు స్వస్థత చేయడని కానీ, మనల్ని వైరస్ నుండి ప్రమాదాల నుండి కాపాడడని కానీ చెప్పడం లేదు; కానీ యేసురక్తం వల్ల మనకి వైరస్ రాదనేది మాత్రం ఒక మూఢబోధ అని తెలియచేసేందుకే దీన్ని రాస్తున్నాము.

నాలుగవది:

నిర్గమకాండము 30:21- తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును.

 

కొందరు ఈ వచనాన్ని కూడా చూపించి, కరోనా వల్ల చేతులు కడుక్కోవాలి అనేదాన్ని బైబిల్‌ ముందే ప్రవచించిందని చెపుతున్నారు. అసలు దీనికీ సామాన్య మనుషులకీ అసలు సంబంధమే లేదు, ఎందుకంటే ఈ మాటలు ఎవరి కోసమో చూడండి -నిర్గమకాండము 30:17-20- మరియు యెహోవా మోషేతో ఇట్లనెను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటనుచేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులును తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను.

ఈ సందర్భం అంతా ఇశ్రాయేలీయులను దేవుడు కానానుకు నడిపిస్తున్న సమయంలో, దేవునికి నిర్మించబడిన ప్రత్యక్షగుడారంలో, సేవ చేసేందుకు‌ ఎన్నుకోబడిన యాజకులు, అహరోను‌ మరియు అతనికుమారుల కోసం చెప్పబడుతున్న మాటలు. ఆమాటలు కరోనా కోసం చెప్పబడలేదు, యాజకత్వం చేయవలసిన క్రమంలో భాగంగా చెప్పబడ్డాయి‌. ఇప్పుడు ఈ మాట తీసుకొని మనందరికీ ఇది వర్తిస్తుంది అంటే, మనం కూడా ఇత్తడి గంగాళాలు చేయించుకోవాలి. ఎందుకంటే ఆ సందర్భంలో కాళ్లు చేతులు కడుక్కోమనే కాదు, ఎందులోని నీళ్లతో కడుక్కోవాలో కూడా రాసి ఉంది. ఒకసారి ఇటువంటి అజ్ఞానపు ప్రచారాలను చేసేవారికోసం బైబిల్ ఏమని ఆజ్ఞాపిస్తుందో చూడండి.

కీర్తనలు 32: 9- బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి.

వాక్యాన్ని సందర్భానుసారంగా మనం అర్థం చేసుకున్నపుడే ఆ వాక్యం చెప్పే సారాంశం మనకి అర్థమౌతుంది. సందర్భాన్ని విడిచిపెట్టి మనకి అనుకూలంగా ఉన్న ముక్కలు తీసుకొని ఒక సిద్ధాంతాన్ని ప్రకటిస్తే, తద్వారా మనం కలిపి చెరిపినవారము అవుతాం. దేవుని నామానికి దూషణలు తీసుకొచ్చిన పాపులుగా మిగిలిపోతాం.

ఇప్పటివరకూ మనం చూసిన నాలుగు వాక్యాన్ని వక్రీకరించి చేస్తున్న అబద్ధప్రచారాలైతే వీటన్నిటినీ మించేట్టుగా ప్రచారం చేయబడే అబద్ధప్రచారం మరొకటి ఉంది. మన తెలుగు క్రైస్తవ్యంలో పీడీ సుందరరావు అనే ఒకాయన ఉన్నాడు, ఆయన ప్రపంచంలో జరిగే ప్రతీదాన్నీ ఆయనకు అనుకూలంగా‌ మార్చేసుకొని, లేనిపోని చాలెంజులు చేస్తూ వాడిని ఓడించేశాను వీడిని నేలకరిపించేశానంటూ అబద్ధప్రచారాలు చేసుకుంటూ ఉంటాడు. ఈయన కరోనా విషయంలో కూడా ప్రపంచ దేశాల అధ్యక్షులందరూ ఆయన కంపెనీ(సంస్థ) దగ్గరకు వచ్చి ఆయన ముందు నిలబడితే ఆయన దేవునితో మాట్లాడి కరోనాను ఎలా నిర్మూలించాలో పరిష్కారం చెబుతానంటూ అబద్ధప్రచారాన్ని చేస్తున్నాడు. ఆయన భక్తులందరూ ఆ అబద్ధప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు.

ఇది ఎంత హాస్యాస్పదమంటే, ప్రస్తుతం కరోనా వైరస్ విస్తారంగా వ్యాపించిన ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో వాక్యజ్ఞానం తెలిసిన సేవకులు, దేవుని అడుగుజాడల్లో నడిచే భక్తులు ఎందరో ఉన్నారు. వారెవరికీ దేవుడు చెప్పని పరిష్కారం ఈయన అడిగితే మాత్రం చెబుతాడా? ఈ ప్రచారం మరీ చండాలంగా అనిపించడం లేదూ? ఎలాగూ ప్రపంచ దేశ అధ్యక్షులెవ్వరూ ఈయన దగ్గరకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఈయనెవరో వాళ్లకే కాదు తెలుగు ప్రజల్లో కూడా చాలామందికి తెలీదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈయనేదో మహాభక్తుడైనట్టుగా దేవునితో మాట్లాడి కరోనాకు పరిష్కారం చెప్పేవాడిగా కనపరచబడాలనే ఉద్దేశంతోనే అనుకుంటా, ఈ విధంగా ఆ అబద్ధప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడని మనమంతా గ్రహించాలి.

ప్రస్తుతం ప్రపంచంలో వాక్యజ్ఞానం కలిగిన భక్తులందరూ, ఈ కరోనా గురించి సాధ్యమైనంత మట్టుకు అవగాహన కలిగించేలా ప్రయాసపడుతున్నారు. పాపాలను ఒప్పుకొని ప్రభువు వైపు తిరగమని ప్రకటిస్తున్నారు, మరికొందరు అనుది‌నమూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. వారితో పోల్చుకుంటే మన పీడీ సుందరరావుగారు అసలు లిస్ట్ లోకే తీసుకోడానికి అర్హత ఉన్నవాడిగా అనిపించడు. కేవలం‌ ఈయన‌ మాత్రమే కాదు ప్రస్తుతం ఏ బోధకుడు స్క్రీన్ మీదకు వచ్చి కరోనా కోసం దేవుడు తనకేదో పరిష్కారం చెప్పాడని చెప్పినప్పటికీ క్రైస్తవులమైన మనమంతా వివేకంతో దాన్ని గుర్తించాలని తెలియచేస్తున్నాము.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.