ఇతర అంశాలు

రచయిత: స్టీఫెన్ డేవిడ్

ఆడియో

వరకట్నం ఒక సామాజిక దురాచారమని మనలో అనేకమంది ఊరికే పైపైకి ఖండిస్తున్నారు. కాని ఈ ప్రాచీన భారతదేశపు ఆచారం నేటితరములో కూడా అనేక కుటుంబాలను సర్వనాశనం చేస్తూనే ఉన్నది. ఈ అంశాన్ని క్రైస్తవేతర లోకానికి పంచుకొనకముందు, లోకానికి వెలుగుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రజలకు అందించడమే నా ప్రథమకర్తవ్యంగా భావిస్తున్నాను(మత్తయి 5:14). మొట్టమొదటిగా క్రైస్తవులు వరకట్నమనే ఈ సామాజిక దురాచారాన్ని ఎదుర్కోవాలి. అంత మాత్రమే కాకుండా, క్రైస్తవులముగా కట్నమనే ఈ ఆచారాన్ని మనం అంగీకరించాలో లేక తృణీకరించాలో తెలుసుకొనుటకు అధ్యయనం చేయాలి. వరకట్నాన్ని అడగడం ఒక దారుణమైన ఆచారమా? వరకటం అడగడం సమంజసమే అని చెప్పడానికి మనకేమైనా బైబిల్ ఆధారాలు ఉన్నాయా? వివాహబంధములో కట్నాన్నిఅడగడం వాక్యానుసారమైనదా లేక ఇంకా చెప్పాలంటే, ఇది వాక్య విరుద్ధమా? అను ప్రశ్నలను ఈ సందర్భములో మనం కూలంకషంగా చర్చించడం ఉత్తమం.

చదువరులలో ధనాన్ని అమితంగా ప్రేమించే వారికి ఈ సందేశం గాయపరచేదిగాను మరియు అసౌకర్యముగాను ఉండవచ్చును. ఏది ఏమైనప్షటికిని, సత్యము చేదైనది కాని అది మన జీవితాలను శ్రేష్ఠమైనదిగా చేస్తుందన్నది వాస్తవం. కాబట్టి, మీరు ఈ సందేశాన్ని దీనత్వముతోను, పరిశీలనా దృక్పథముతోను చదవాలని నేను మిమ్ములనుప్రోత్సహిస్తున్నాను.

వరకట్నం అనగానేమి?

వివాహ బంధములో పెళ్ళికుమారుని కుటుంబానికి పెళ్ళి కుమార్తెతో పాటుగా ఆమె కుటుంబీకులు ఇచ్చే ఒక రకమైన కానుకలనే 'వరకట్నం' అని చెప్పవచ్చును. తరచుగా ఈ వరకట్నానికి సంబంధించిన షరతులన్నీ వ్యాపారరంగానికి లేక ఆర్థికఒడంబడికకు సంబంధించిన షరతులను పోలి ఉంటాయి. వివాహ శుభఘడియకు ముందు కట్నకానుకల సంప్రదింపులు తప్పనిసరియైన ఒక ప్రాముఖ్యభాగముగా పరిగణించబడుతున్నాయి. కట్నంలో వస్తుసామగ్రి, భూమి, ధనం, పెళ్లికుమారుని విద్యాఫీజులు చెల్లించడం, మరియు పెళ్ళిఖర్చులు మొదలగునవి భాగమే.

ఈ కట్నమనే దురాచారానికి మతపరమైన అనుమతి ఏమీ లేదని సాధారణంగా అందరూ అనుకున్నప్ప్ధటికీ ఇది(కట్నం లేక దహేజ్) భారతదేశంలోని హిందూసమాజములో ఉత్పన్నమైన ఒక ఆచారమే. హిందూ వివాహ కర్మకాండలలో కట్టమనేది ఒక ప్రాముఖ్యమైన భాగము. ఈ ఆచారము ఉన్నత వర్గానికి చెందిన హిందూకుటుంబాలలో ఉత్పన్నమయినదనే భావన కలదు. వారు పలు విధములైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నందున వివాహం చేసుకొంటే తమ భార్యలను పోషించే ఆర్థిక స్తోమత వారికి లేకుండెను. కాబట్టి, వారు వివాహ బంధంలో పెళ్లికుమార్తెతో పాటుగా ఆర్థిక సహాయమును కూడ అంగీకరించేవారు. ప్రాచీన పారంపర్యాచారముసుగులో కాలక్రమేణా ఇది లబ్దిపొందాలనే దురాశకు దారితీసింది.

వరకట్నమనే దురాచారం వలన కలిగే భయంకరమైన ఫలితాలను గుర్తించిన భారతదేశ చట్టం, క్రీ.శ.1961వ సంవత్సరములో వరకట్న వ్యవస్థను చట్ట విరుద్ధమైనదిగా అధికారికంగా ప్రకటించి, నిషేధించింది. అయినప్పటికిని, హిందువులు ఈ దురాచారాన్ని పాటిస్తూనే ఉన్నారు. అంత మాత్రమే గాకుండా, ఈ దురాచారము ఇస్లాము, క్రైస్తవ్యం మొదలగు ఇతరమతాలలోనికి కూడా చొరబడింది. ఈ రోజుల్లో కట్టమనేది పెళ్ళికుమార్తె కుటుంబీకులు స్వఛ్ఛందంగా ఇచ్చే బహుమానంగా కాకుండా తప్పక ఇవ్వవలసిన బాధ్యతగా మారింది. ఈ దురాచారం క్రైస్తవుల మధ్యలో కూడా విస్తృతంగా వ్యాపించడం సిగ్గుచేటు.

వరకట్నం యొక్క దుష్పపరిణామాలు

1. వరకట్న దురాచారం మన సమాజములో స్త్రీ విలువను దిగజార్చినది. కుమార్తె ఉందంటే ధనాన్ని మరియు వస్తుసామగ్రిని కోల్పోవడమని మరియు కుమారుడు ఉంటే వాటినిపొందుకోవడమని అనేకులు భావిస్తారు. ప్రపంచమంతా ఐశ్వర్యమనే కొలమానంతో కొలువబడుతున్నందున తల్లిదండ్రులు కుమార్తెలను తక్కువ విలువైన వారిగాను, కుమారులను ఎక్కువ విలువైన వారిగాను భావిస్తున్నారు. ఆడశిశువు పుట్టిందనగానే తండ్రికి ఆనందము ఉంటుంది. కాని ఆమె  పెళ్లికట్నం కొరకు ధనాన్ని పోగు చేయాలనే బాధ్యత తండ్రి గుర్తించిన క్షణమే ఆ ఆనందం మరుగైపోతుంది.

2. అనేకమంది తల్లిదండ్రులు మగశిశువును కనాలని ఆశపడుతారు. దానికి గల కారణం వారు తమ అబ్బాయి ద్వారా కట్నరూపంలో ధనాన్ని సంపాదించవచ్చని లేదా కట్నభారం నుండి తప్పించబడాలని అయుండవచ్చు. పుట్టినది ఒకవేళ మగశిశువు కాక ఆడశిశువైతే, ఆ శిశువును కన్న స్త్రీని బాధ్యురాలినిగా చేస్తారు. ఆమె తన భర్త మరియు అత్తమామల నుండి అవమానమును మరియు వేధింపును ఎదుర్కొంటుంది. (నిజానికి భర్త నుండి వచ్చే x, y క్రోమోజోములను బట్టే పుట్టబోయేది మగశిశువా లేక ఆడశిశువా అని నిర్ధారించబడుతుంది. కాబట్టి ఒకవేళ ఎవరినైన బాధ్యులనుగా ఎంచవలసివస్తే, భర్తనే బాధ్యునిగా ఎంచాలి)

3. గర్ఖస్రావాలు (అనగా తల్లిగర్బాములో పిండంగానున్న ఆడశిశువును హత్య చేయడం) మరియు శిశుహత్యలు (అనగా పుట్టిన ఆడశిశువులను చంపివేయడం)వరకట్నం వలన ఉగ్ధవించే అతి మౌరఫలితములే. అతిఘోరమైన ఈ నేరాలకు ప్రముఖ కారణము కట్టమేనని ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనలో స్పష్టంగా వెల్లడైనది. ప్రసవానికి ముందే పుట్టబోయేది ఆడశిశువా లేక మగశిశువా అని నిర్ధారణ చేసే పరీక్షలను చట్టం నిషేధించినటికీ, దురాశలు మరియు భయాల చేత ప్రజలు చట్టాన్ని విస్మరించి ఆడశిశువులను చంపడానికి వెనుకాడటం లేదు. కనుగొనబడిన ఆడశిశువుల శవాలతో కూడిన ఫోటోలను చాలా కాలంగా పత్రికలు తమ కవరు పేజీలో కూడా ప్రచురిస్తున్నాయి. ఆ ఫోటోలలో ఆడశిశువుల శవాలన్నీ భూమి మీద విస్తారముగా వ్యాపించియున్నాయి. ‘శిశువులను చంపుట' అనే ముఖ్యాంశముగా కవరు పేజీలో ప్రచురిస్తున్నారు.

4. అనేక మంది స్త్రీలు మానసిక మరియు శారీరక హింసను ఎదుర్కొంటున్నారు. వారిలో కొంతమంది ఆ హింసను భరించలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. మరికొంత మంది స్త్రీలు కట్నకానుకలను ఆశించే తమ భర్తల మరియు ఆత్తమామల చేతిలో భయంకరహత్యలకు గురౌతున్నారు. భారతదేశంలో ప్రతిరోజు 18 మంది స్త్రీలు కేవలం వరకట్నం మూలంగా చంపబడుతున్నారని సర్వేలో తేలింది. ఇది విచారకరం.

5. వివాహబంధాలు మరియు కుటుంబాలు తెగిపోవడమనేది నేటి సమాజములో జరుగుతున్న ఒక దారుణం. ఈ దారుణస్థితికి నీచమైన, చట్టవిరుద్ధమైన వరకట్నపు దురాచారమే మూలకారణం.

6. తల్లిదండ్రులు తమ కుమార్తెల వివాహానికి కావలసిన వరకటాన్ని ఇచ్చుకోలేనందున అనేకమంది స్త్రీల వివాహాలు ఆలస్యం చేయబడుతున్నాయి. మరింత దారుణమైన విషయమేమిటంటే అడిగిన వరకట్నాలను ఇచ్చుకొనే స్తోమత తమకు లేనందున అనేక మంది స్త్రీలు అవివాహితులుగానే మిగిలిపోతున్నారు. కట్నకానుకలను ఇచ్చుకోవడానికి పెళ్లికుమార్తె కుటుంబీకులు పెద్దమొత్తంలో చేసిన అప్పులను తీర్చలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తుదకు వారు జీవితము మీద విరక్తిని కలిగియుంటున్నారు.

7. రెండు కుటుంబాల మధ్య కట్న కానుకల విషయంలో జరిగే సంప్రదింపులలో అంగీకారం కుదరనందున అనేక వివాహ ప్రతిపాదనలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అధికమొత్తంలో కట్నకానుకలను బేరం చేయుటకు వీలు గల సంబంధాల కొరకు పెళ్ళికుమారుని కుటుంబాలు వెదుకుతున్నాయి. ఆశించిన స్థాయికి కట్నకానుకల ప్రతిపాదన లేనందున ఒక పెళ్ళి సంబంధం తెగిపోయిందని నేను ఈ మధ్య విన్నాను. హాస్యాస్పదమైన విషయమేమిటంటే అవి క్రైస్తవ సంబంధాలు మరియు ఆ రెండు కుటుంబాల మధ్యలో మధ్యవర్తిగా పని చేసింది మరెవరో కాదు ఒక సంఘకాపరే.

వరకట్నాన్ని వ్యతిరేకించే లౌకికవాదులు

హిందునెట్ అనే వెబ్ సైట్లో ఒక లౌకిక రచయిత ఇలా వ్రాశాడు, “కట్నమనేది ఒక విచారకరమైన అలవాటు. ఈ అలవాటుకి మతపరమైన అనుమతి ఏమి లేదు గాని ఇది నేడు భారత దేశంలో ఇంకా ప్రాచుర్యాన్ని పొందుకొంటున్నది. వరకట్నం హిందూమత ఆచారముగా ఎంచబడినప్పటికీ, అదే మతానికి చెందిన కొందరు ఈ దురాచారాన్ని ఖండించడం ఆనందదాయకం. ఈ దురాచార నిర్మూలనకు పోరాడుతున్న వీరిని నేనెంతగా అభినందిస్తున్నానో, క్రైస్తవ సమాజములో వరకట్నమును డిమాండ్ చేస్తున్న వారిని బట్టి అంతే సిగ్గుపడుతున్నాను.

ఒక పారిశ్రామికవేత్త చెప్పిన ఈ మాటలను ఒకానొక వార్తాపత్రిక ప్రచురించినది - వరకట్నం వంటి సామాజిక దురాచారములను గూర్చి మాకెంతో పట్టింపు ఉన్నది. అంత మాత్రమే గాకుండా, పెళ్లికుమార్తె తల్లిదండ్రుల నుండి ఎలాంటి కట్నం తీసుకోమని అంగీకరించిన యువకులను తన కంపెనీలో ఉద్యోగానికి తీసుకొంటానని అతడు చెప్పాడు. అదే విధంగా కట్నన్ని ఇవ్వమని అంగీకరించిన యువతీలను కంపెనీలో చేర్చుకొంటానని అతడు చెప్పాడు. ఒక టార్చ్ లైటు ప్రకటనలో నటించే అవకాశం ఒక ప్రఖ్యాత సినీనటునికి వచ్చింది. అయితే ఆ టార్చ్ లైట్ ఒక వరకట్న కానుకగా చిత్రీకరింబడినందున్న అతడు ఆ ప్రకటనలో నటించడానికి నిరాకరించాడని నేను చదివినట్లుగా నాకింకా గుర్తున్నది. మరియొక చోట వరకట్న వ్యతిరేక సదస్సు జరిగింది. అందులో విద్యార్థులుమరియు ఉద్యోగులు కలిసి మొత్తం 200 మంది భారతీయులు “నేను వరకట్నాన్ని పుచ్చుకోను మరియు ఇవ్వను" అని ప్రమాణం చేశారు. అయితే అమానుషమైన ఈ దురాచారాన్ని వ్యతిరేకించు ఇలాంటి నిర్ణయములను క్రైస్తవ యువకులు తీసుకొంటే ఎంత బాగుండును!

అవమానము

లౌకికపరిశోధకులు ఒక ఆశ్చర్యకరమైన సత్యాన్ని కనుగొన్నారు: అదేమనగా “పెద్ద మొత్తంలో 10,000 మందిని ఇంటర్య్వూ తీసుకొనగా ఈ వరకట్నమనే దురాచారం నేడు దళితులు, వెనుకబడిన కులాలు, ముస్లిములు మరియు క్రైస్తవుల సమాజాలలో విస్తృతంగా వ్యాపిస్తున్నదని తేలింది.” నిజానికి వారి మధ్య ఈ ఆచారం ఇంతకు ముందు మనుగడలో లేదు.

మీరు దీనిని గ్రహిస్తున్నారా? గతంలో క్రైస్తవ సంఘంలో లేని వరకట్నం ఈ రోజుల్లో క్రైస్తవుల మధ్య కూడా బాగా విస్తృతంగా వ్యాపించింది. ఈ దురాచారాన్ని పాటించడములో క్రైస్తవులు లోకస్థుల వలె మరారని కనుగొనడం ఎంత విచారకరం? ప్రియమైన చదువరీ! నేడు మీ ఉప్పు సారము (అనగా లోకం ముందు మంచి సాక్ష్యము) ఎక్కడ? “మీరు లోకమునకు ఉప్పుయియున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు”(మత్తయి 5:13) అని యేసు ప్రభువు చెప్పిన మాటలు వినినట్లుగా మీకు జ్ఞాపకమున్నదా? తన రక్తములోను మరియు శరీరములోను పాలుపొందువారందరు, తమ భక్తి ద్వారా లోకాన్ని ప్రభావితం చేసి పరలోకమందున్న తండ్రిని ఘనపరచగలగునట్టి నైతికప్రమాణాలను పాటించాలని యేసు ఆశిస్తున్నారు. క్రైస్తవులముగా మనం అంధకారలోకములో వెలుగుగా ప్రకాశిస్తున్నామా లేక ఆ లోకంలోని అంధకారం (లోక చెడు వ్యవస్థ) మనలో ప్రవేశించులాగున అనుమతిస్తున్నామా? “ మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడి” (జెకర్యా 1:4)అని సైన్యములకు అధిపతియగు యెహెూవా దేవుడు సెలవిచ్చెను.

ప్రత్యేకముగా నుండుట

“కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు”(2కొరింథీ 6:17-18). భిన్నముగా జీవించులాగున ఈ లోకవ్యవస్థ నుండి వేరుపడమని దేవుడు తన ప్రజలను పిలిచాడు. (అయితే లోకములోని వ్యక్తులతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండమని గాని లేక లోక ప్రజలను తృణీకరించమని గాని దీని భావం కాదు. కాని మనల్ని మనం దేవుని కొరకు ప్రత్యేకించుకొని, ఒక రాజీపడని పరిశుద్ధజీవితాన్నిజీవించాలనేదే ఈ మాటల భావం.)

అయితే మన భక్తి ప్రజల మీద ప్రభావాన్ని చూపించే తరహాలో మనం ఈ లోకవ్యవస్థలో భాగమైన వరకట్న దురాచారం నుండి ప్రత్యేకించబడ్డామా? నేను మీ గూర్చి గాని లేక నా గూర్చి గాని మాట్లాడుట లేదు. పాఠకుని విషయంలో ఇది నిజమో కాదో నాకు తెలియదు కాని, అన్యమత ఆచారాల విషయంలో ఏ విధంగానైననూ రాజీపడమని చెప్పుకొనే క్రైస్తవులలో అధికులు వరకట్నం (ఇది నిజానికి హిందూ సామాజిక వర్గం నుండి ఉద్ధవించింది) విషయానికి వచ్చేసరికి పుచ్చుకొని ఆనందించడానికి మాత్రం వెనుకాడరు. ధనాపేక్ష సత్యాన్ని గ్రహించకుండునట్లు ఆత్మీయ నేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తుందనేది ఎంత నిజం! మనము ఈ విషయంలో విరిగినలిగిన హృదయంతో పశ్చాత్తాపము నొంది క్రీస్తు వైపు తిరుగునట్లు దేవుడు మనకు సహాయం చేయును గాక! తద్వారా నిరీక్షణలేని ఈ లోకమునకు దేవుడు మన ద్వారా తనను తాను ప్రతిబింబించుకోనును గాక! ప్రేయర్: “ఓ దేవా నీ నామానికి అవమానం తెచ్చినందుకు మరియు మీ సంఘములో లోకాశలను ప్రవేశపెట్టినందుకు మమ్ములను క్షమించుము. నీ సేవకులలో ఒకడు ప్రార్థించినట్లు, దేవా సంఘాన్ని వంచండి, లోకాన్ని దీవించండి.”

వరకట్నం వాక్య విరుద్ధమా?

“మనం వరకట్నం తీసుకోవద్దని బైబిల్లో స్పష్టంగా ఎక్కడ చెప్పబడింది?” అని కొంత మంది క్రైస్తవులు అమాయకముగానో లేక తమకున్న వరకట్న వాంఛను సమర్థించుకొనేందుకనో ప్రశ్నిస్తుంటారు. నిజానికి బైబిల్ వ్రాయబడిన కాలంలో పెళ్లికుమారుని కుటింబీకులు పెళ్లి కుమార్తెకు మరియు ఆమె కుటుంబీకులకు బహుమానాలను ఇచ్చేవారు. తన కుమారుడైన ఇస్సాకు అంగీకారానికి గుర్తుగా అబ్రహాము రిబ్కాకు మరియు ఆమె కుటుంబీకులకు స్వఛ్ఛందముగా బహుమానాలను పంపించాడు(ఆది. 24:53). రాహేలును భార్యగా పొందడానికి యాకోబు ఏడు సంవత్సరాలు తన మామకు సేవ చేశాడు(ఆది. 29:18-20). పరిశుద్ధ గ్రంథములో పెళ్లికుమార్తెకు అధిక ఘనత ఇవ్వబడింది! పాత నిబంధనలోని వరకట్నసాంప్రదాయాన్ని గూర్చి నా స్నేహితుడైన రస్టీ ఎంట్రీకిస్ ఇలా వ్యాఖ్యానం చేశాడు - "పాత నిబంధనలో కుమార్తెలను తల్లిదండ్రులు భారములుగా కాక ఆస్తిగా భావించేవారు”. కాబట్టి ఒకవేళ ఖచ్చితంగా మనం పాటించాలననుకొంటే, మనం పాటించవలసిన బైబిల్ సాంప్రదాయమేమిటి (ఇది బలవంతముగా పాటించవలసినది కాదని)? బైబిల్ కాలంలో పెళ్లికుమారుని వైపు నుండి స్వఛ్ఛందముగా ఇచ్చిన బహుమానాలకు మరియు నేడు మన దేశములో పెళ్లికుమారుని వైపు నుండి పుచ్చుకోవడానికి డిమాండ్ చేసే వరకట్నానికి మధ్య చాలా వ్యత్యాసమున్నదన్న సత్యాన్ని మనం మరచిపోవద్దు. పెళ్ళికుమార్తెను వివాహం చేసుకోవాలంటే ఆమె తల్లిదండ్రుల నుండి బలవంతముగా కట్నాన్ని వసూలు చేయాలనే హిందూదురాచారాన్ని అనేకమంది పెళ్లికుమారుల కుటుంబీకులు పాటిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథము దీనిని సూటిగా ఖండిస్తుంది. వరకట్నపు వాంఛ దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తుందని తెలియజేసే కొన్ని ఋజువులు క్రింద పేర్కొనబడ్డాయి.

1. వరకట్నం దేవుని పరిశుద్ధ వివాహపు వ్యవస్థను అపవిత్రపరుస్తుంది. ఇది వివాహ వ్యవస్థలోని దేవుని ఉద్దేశాన్ని అతిక్రమిస్తుంది. వాక్యప్రకారం చూస్తే ఎలాంటి షరతులు లేకుండా ఇద్దరూ కూడా ఒకరిపట్ల మరియొకరు ప్రేమ, నమ్మకత్వం, మరియు సమర్పణ అనే లక్షణాలను కలిగియుంటామని వాగ్దానం చేసే దేవుని పరిశుద్ధ వ్యవస్థయే వివాహం. కాని వివాహ వ్యవస్థలో దేవుని చిత్తం మరియు పవిత్రబంధానికి బదులుగా ధనాన్నే ప్రాముఖ్యమైన అంశంగా వరకట్నం మార్చివేస్తుంది. పెళ్లి పత్రికలమీద పరిశుద్ధ వివాహాన్ని ప్రచురించక ముందే తెరవెనుక అపవిత్రమైన వరకట్న దురాచారం ఉండటం విచారకరం.

2. వరకట్నమనే దురాచారం దేవుడనుగ్రహించిన ఆజ్ఞలలో “నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపుము" (మార్కు 12:33 ) అనే అతి ప్రాముఖ్యమైన రెండవ ఆజ్ఞను అతిక్రమిస్తుంది. ప్రేమ అనగా ఏమిటి? 'ప్రేమ' అనే ఈ పదానికి అనేక వివరణలు కలవు. అయినను నిస్వార్థముతో ఇతరులకు ఇచ్చి సహాయం చేసేదే వాక్యానుసారమైన ప్రేమ అని అనేక బైబిల్ బోధకులు అభిప్రాయపడుతారు. మనం ప్రేమతో ఇచ్చే వారిగా ఉండాలని యేసు బోధించారే గాని ధనం పట్ల దురాశగల వారిగా ఉండమని కాదు (మత్తయి 6:3 మత్తయి 6:19-24; లూకా 10:25-37). క్రైస్తవ వివాహ వ్యవస్థలో ఈ ప్రాథమికమైన ప్రేమ సూత్రాన్ని క్రైస్తవులు పాటిస్తున్నారా? మీకు మీరే జవాబు చెప్పుకోండి.

3. వరకట్నపేక్ష మనం ధనాపేక్ష గలవారమని రుజువుపరుస్తుంది. * ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము" (1తిమోతి 6:10) అనే సత్యాన్ని దేవుని వాక్యం బయలుపరుస్తుంది. పెళ్ళి కుమారుని కుటుంబీకులు వరకట్నాన్ని ఆశించడం పొరుగువారి యెడల వారి ప్రేమను కాదు గాని పొరుగువారి సంపదను వారు ఆశించుటను బయలుపరుస్తుంది.

వరకట్నం అనే దురాచారము అనేక మంది విశ్వాసులమని చెప్పుకునే అనేక మంది మధ్య కనుగొనబడింది. నిజమైన క్రీస్తు శిష్యుడు అమ్మాయిని పెళ్ళి చేసుకొనడానికి షరతుగా అమ్మాయి వద్ద నుండి గాని లేక ఆమె తల్లిదండ్రుల వద్ద నుండి గాని వరకట్నాన్ని ఎప్పుడూ అడుగడు. అమ్మాయి వివాహం తరువాత ఆమెకు బహుమానంగా ఆమె తండ్రి ఏమైనా ఇవ్వడం తప్పేమి కాదు. కాని పెళ్ళి నిర్ణయం ఇచ్చి పుచ్చుకొనే వరకట్నం మీద ఆధారపడటం పాపం అని మనం గ్రహించాలి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న వరకట్నవ్యవస్థ సాతాను సంబంధమైనది. అయినను అన్ని శాఖలలోని క్రైస్తవులు వరకట్నాన్ని పుచ్చుకొంటున్నారు. 18వ శతాబ్దములో యూరప్ ఖండములోని క్రైస్తవులను అనేకసంవత్సరాల తరబడిగా గమనించిన వోల్టేర్ అనే ఫ్రెంచ్ నాస్థికుడు ఇలా వాఖ్యానించాడు 'క్రైస్తవ సంస్థల మధ్య పలు విధములైన సిద్ధాంతాలు ఉన్నప్పటికిని ధనం విషయంలో మాత్రం అందరికి ఒకే సిద్ధాంతము కలదు. - వారందరూ ధనాన్ని ప్రేమిస్తారు. అదే విధముగా మన క్రైస్తవ సంఘాల మధ్య ఎన్నో విభేదించే సిద్ధాంతాలు ఉన్నప్పటికిని, వరకట్నవిషయంలో మాత్రం అందరికి ఒకే సిద్ధాంతము కలదు. - వారు వరకటాన్ని ప్రేమిస్తారు.

4. వరకట్నం ఇతరులకు మేలు చేయమనే ఆజ్ఞను (యాకోబు 4:17) మరియు ఇతరుల భారములను భరించాలనే ఆజ్ఞను (గలతీ 6:3) అతిక్రమిస్తుంది. దానికి బదులుగా వరకట్నం పెళ్లికుమార్తె కుటుంబం మీద అధిక భారాన్ని మోపుతుందే గాని అది వారికి ఏ రీతిగానూ మేలు చేయదు.

5. క్రీస్తు ఎలాంటి షరతు లేకుండా సంఘాన్ని (సాదృశ్యరూపకముగా క్రీస్తు భార్యను) ప్రేమించి తన్నుతాను దానికొరకు అప్పగించుకొనిననట్లుగా, భర్త కూడ తన భార్యను ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది (ఎఫెసీ 5:25). అయితే వరకట్నమనే దురాచారం ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించాలనే ఆజ్ఞను కూడా అతిక్రమిస్తుంది. అలాంటి వైవాహిక బంధాలు క్రీస్తును ఘనపరచేవిగా ఉండవు. సమృద్ధియైన దేవుని ఆశీర్వాదాలు ఆ కుటుంబముపైన లేవనుటలో నాకేమీ సందేహం లేదు. తాము ఆశించిన ఆర్థిక మరియు వస్తు సామగ్రిలకు అంగీకారం లేనట్లయితే, తమ కుమారుడిని పెళ్లికి ఇవ్వని తల్లిదండ్రులు అనేకులు. వారు ఆశించిన స్థాయిలో ఇచ్చే పెళ్ళి సంబంధాలు దొరికేంతవరకు తమ కుమారునికి పెళ్ళి చేయరు.

6. అవిశ్వాసులకు అభ్యంతరం కలుగకుండా చూచుకొనమని పరిశుద్ధ గ్రంథం మనలను హెచ్చరిస్తుంది (1కొరింథి 8:9). లోకానికి వెలుగుగాను మరియు ఇతరులకు మాదిరికరముగాను ఉండుటకు క్రైస్తవులు పిలువబడ్డారు. వరకట్నాన్ని డిమాండు చేస్తున్న ఒక క్రైస్తవ కుటుంబాన్ని గూర్చి తెలుసుకొన్న ఒక అవిశ్వాసి, 'మీరందరూ క్రైస్తవులుగా ఉండి కూడా ఎలా వరకట్నాన్ని డిమాండు చేస్తున్నారు'? అని నన్ను అడిగాడు. 'క్రైస్తవ్యానికి ఎంత అవమానము మరియు సిగ్గు? క్రైస్తవ్యాన్ని సమర్థించుటకు ఇది ఎంతటి ఆటంకము! (ఈ అవిశ్వాసి తన ఇద్దరి కుమారుల వివాహ వ్యవహారంలో వరకట్నం తీసుకోనని నిర్ణయించుకోవడం ఆశ్చర్యం. ఈ వ్యక్తిని బట్టి దురాశపరులైన క్రైస్తవులు సిగ్గుపడాలి!)

7. వరకట్నం పది ఆజ్ఞలలో “ నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు” (నిర్గమ 20:17) అను ఒకానొక ఆజ్ఞను అతిక్రమిస్తుంది. వివాహ వ్యవస్థలో వరకట్నాన్ని ఆశించడం ద్వారా ఈ ఆజ్ఞను అనేక మంది క్రైస్తవులు తెలియకనే ధిక్కరించారు. ఇది నిశ్చయముగా దురాశ అనేపాపం.

8. వరకట్నం ఎవరినీ బాధపెట్టకూడదనే దేవుని చిత్తాన్ని కూడా అతిక్రమిస్తుంది. (యెహె18:7). వరకట్నమనే బంధకము క్రింద ఎందరో పెళ్లికుమార్తెల కుటుంబాలు బలికావడం బాధాకరం. బైబిల్ కాలంలో లంచం మరియు అన్యాయం ద్వారా దేవుని బిడ్డలు తమ స్వంత ప్రజల చేత హింసించబడితే నేడు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారి చేత ప్రజలు వరకట్న రూపంలో బాధింపబడుతున్నారు. దీనిని మనస్సులో జాగ్రత్తగా ఉంచుకొనండి: వరకట్నాన్ని డిమాండ్ చేయడం మీరు ఆరాధిస్తున్న సర్వశక్తిమంతుని దృష్టిలో బలాత్కారపు పాపం.

9. వరకట్నం మీ పై అధికారులకు లోబడుమని చెప్పే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తుంది. (రోమా 13:1, 1పేతురు 2:13). భారతదేశపు న్యాయచట్టం "వరకట్న నిషేధం యాక్ట్, 1961” ప్రకారం "వరకట్నాన్ని డిమాండ్ చేయడం, ఇవ్వడం మరియు పుచ్చుకోవడం, చట్టరీత్యా నేరం' వరకట్నమనేది లంచమంత తీవ్రమైనది. అయినను, క్రైస్తవులతో పాటుగా ప్రజలందరూ చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అక్రమంగా ధనాన్ని ఆర్జిస్తున్నారు.

సాకులు:

ఆహా, మనం పరిసయ్యులవలే మరియు సదూకయ్యులవలె మన చెడును సమర్థించుకొనడంలో నిష్ణాతులం కాదా!

1. 'వరకట్నమనేది కేవలం ఒక పెళ్లికానుక - కాబట్టి దానిని తీసుకుంటే తప్పేమిటి?' అని కొందరు వాదిస్తారు. సరే, బహుమానం లేక పెళ్లికానుక అంటే ఏమిటి? బహుమానమనేది స్వఛ్ఛందముగాను మరియు బుద్ధిపూర్వకముగాను ఇతరులకు ఇచ్చేది. ఒకవేళ ఇచ్చేది స్వచ్ఛందముగా కాకుండా బలవంతముగానో లేక వత్తిడి వల్ల అయితే అది ఎంతమాత్రం బహుమానం కానే కాదు. పెళ్లికుమారుని కుటుంబీకులు కట్నం కోసం అడిగినను లేక డిమాండ్ చేసిననూ అది ఒక బహుమానంగా ఎలా ఎంచబడుతుంది? ఒకవేళ వరకట్నం ఇవ్వకపోయినట్లయితే, అత్తమామలు తమ కుమార్తెను సరిగా చూసుకోరేమోనన్న భయంతో పెళ్లికుమార్తె కుటుంబీకులు కట్నాన్ని ఇస్తారు. ఇది విచారకరం. అయితే బహుమానాలు ఇచ్చే బరువు బాధ్యతలు పెళ్లి కుమార్తె కుటుంబీకులే ఎందుకు ధరించాలి? వారికున్న సామర్థ్యం కొలది స్వచ్ఛందముగా ఎంత ఇవ్వాలో నిర్ణయించుకోవలసింది వారే, కాని పెళ్ళికి షరతుగా వరకట్నాన్ని డిమాండ్ చేయడం పాపం. అయితే పెళ్ళికుమార్తె పెళ్ళికుమారుని కుటుంబీకులు కలిసి తమకున్న సామర్థ్యం కొలది నూతన వధూవరులను ఆశీర్వదించటములో తప్పేమీ లేదు.

2. వరకట్నం దురాచారమని తెలిసిప్పటికినీ, తమ తల్లిదండ్రుల ఒత్తిడి వలన వరకట్నం స్వీకరించవలసి వస్తుందని కొంతమంది యవ్వనులు సాకులు చెబుతారు. “మా తల్లిదండ్రులను సన్మానింపవలెనని బైబిల్ బోధించడము లేదా? అని చెప్పి వారు తమ చర్యను సమర్థించుకొంటారు. ఒక దురాచార సమర్థింపునకు వారు ఎంత కుయుక్తితో కూడిన సాకులు చెబుతారు! కొన్ని సందర్భాలలో మనలను పాపములోనికి నెట్టునట్లు అపవాది కూడా కుయుక్తిగా కొన్ని లేఖనాలను వాడుకొంటాడు (మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని యేసుక్రీస్తు శోధనను గూర్చిన సందర్భాన్ని చదవండి) నిజమే, మన తల్లిదండ్రులను సన్మానింపమనీ బైబిల్ బోధిస్తుంది, అయితే దేవుని వాక్యానికీ అవిధేయత చూపించే తరహాలో వారిని సన్మానించమని బైబిల్ ఎక్కడా బోధించుట లేదు. అందుకు భిన్నముగా "తండ్రినైనను తల్లినైనను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; తన నిలువను ఎత్తికొని నన్ను వెంటండింపని వాడు నాకు పాత్రుడు తాడు” (మత్తయి 10:37-38) అని యేసు స్పష్టంగా చెప్పారు. ఈ మాటలను గుర్తుంచు కొనండి: సిలువను మోయువాడు వరకట్నాన్ని అపేక్షించడు..

ఒకవేళ మీ తల్లిదండ్రుల మాట, దేవుని వాక్యముతో విభేదిస్తే, మీరు ఎవరికి లోబడుతారు? ఒకవేళ మీ తల్లిదండ్రులు వరకట్నం తీసుకొమ్మని మిమ్ములను బలవంతం చేసినట్లయితే, ఇది మంచి పనికాదని వారికి నేర్పించండి. అవసరమైతే, ఈ విషయంలో వారిని ప్రేమతో గద్దించండి. ఒకవేళ మనం దేవుని చిత్తానుసారం కాని విషయాలలో లేక దేవుని చిత్తానికి విరుద్ధమైన విషయాలలో తల్లిదండ్రులకు లోబడకపోయినట్లయితే, వారిని అగౌరవపరుస్తున్నామని దాని భావం కాదు. భారతదేశపు ప్రముఖ క్రైస్తవ రచయితలలో ఒకరైన ఆర్. స్టాన్లీ గారు ఈ విషయాన్ని గూర్చి ఇలా వాఖ్యానించారు: 'ఆర్థిక వ్యవహారాలు వైవాహిక బంధంలో ప్రముఖస్థానాన్ని వహించినట్లయితే, అన్ని రకాల పాపాలు లోనికి ప్రవేశిస్తాయి. ధనము ప్రాముఖ్యమైనదే గాని క్రీస్తును ఘనపరచే వివాహంలో మాత్రం కాదు. పెళవ్యవహారం ద్వారా ధనానార్జించాలనే తల్లిదండ్రుల ఒత్తిడికి లోనగుట వలన అనేక మంది క్రైస్తవ యవ్వన పురుషులు తమ జీవితభాగస్వామి విషయంలో దేవుని అతిశ్రేష్ఠమైన దీవెనను కోల్పోయారు. వివాహబంధంలో ధనం గాని, అందం గాని కాదు; సదాకాలం నిలచియుండే గుణమే ప్రాముఖ్యమైనది (సామెత 31:30). తల్లిదండ్రుల ఒత్తిడులను ఎదుర్కొనే సత్తా యవ్వన పురుషులకుండాలి. తల్లిదండ్రుల మీదనే పూర్తిగా నిందను మోపడం మగతనం కాదు.

3. అయినా ఇంకా కొందరు పెళ్లికుమారుని పక్షం నుండి) ఇలా అంటారు: “ఏమండీ మీకు తెలుసా, వరకట్నం రూపంలో మేము పొందిన ధనం మేము చేసిన కొన్ని అప్పులను తీర్చడానికో లేక పెళ్ళి ఖర్చులను భరించడానికో లేక మా వేరే పిల్లల వివాహపు ఖర్చులకో అవసరమౌతాయి. మా కుమారుని విద్య నిమిత్తము మేమెంతో ఖర్చు చేశాము.” ఇది ఎంత గొప్ప భక్తిహీనమైన వ్యవహారమో చూడండి! సరే, తమ కుమార్తెలను పోషించి చదివించడానికి వెచ్చించిన తల్లిదండ్రులనుగూర్చి మీరు ఏమంటారు? వారి ఖర్చులను ఎవరు భరిస్తారు? మన భారాలను తొలగించుకోవడం కోసం వేరే వారిమీద భారాలు మోపడం న్యాయమేనా? ఒకవేళ మీరు శ్రమలో ఉన్నట్లయితే, ఇతరుల మీద భారాలు మోపడం కాదు గాని దేవుని సహాయం కోసం ప్రార్థించమని బైబిల్ తెలియజేస్తుంది. (యాకోబు 5:13). అంత మాత్రమే గాకుండా, ఒకవేళ వివాహవేడుకను ఘనంగా నిర్వహించడానికి కావలసిన ఆర్థికవనరులు లేనట్లయితే, దానిని చిన్నదిగానే జరుపుకోవడం ఉత్తమమన్నది నా సలహా.

తుది పలుకులు

వరకట్నానికి సంబంధించిన ఒక వార్తాపత్రికను నేను ఒకసారి చదివాను. అందులో ఇలా మనవి చేయబడింది. 'ప్రియమైన పరిశుద్దులారా, భారతదేశంలోని అమ్మాయిలు లేక స్త్రీల కొరకు దయచేసి ప్రార్థించండి' భారతదేశపు పరిశుద్ధులు తామే ఈ దురాచారాన్ని ఆచరిస్తున్నపుడు, వారు అమ్మాయిల కొరకు ఎలా ప్రార్థిస్తారు? ఈ దురాచారం చేత అపవిత్రం చేయబడనివారే నిజంగా మొదట ఈ వరకట్నమనే దురాచారాన్ని పాటిస్తున్న తోటి క్రైస్తవుల కొరకు, అటు తరువాత అవిశ్వాసుల కొరకు ప్రార్థించాలి.

ప్రియ యవ్వనపురుషులారా మరియు తల్లిదండ్రులారా, మీరు ఈ వరకట్న దురాచారంలో పాలుపొందవద్దని నేను వినయంగా బతిమాలుకొనుచున్నాను. మీ సంఘస్తులకు వరకట్న దురాచారాన్ని ఖండించమని బోధించాలని నేను ప్రియమైన సంఘకాపురులను బ్రతిమాలుకొంటున్నాను. వరకట్నాన్ని డిమాండ్ చేసే వారికి వివాహాము నిర్వహించబోమని ప్రమాణం చేసుకుంటే, అలాంటి మీ నిర్ణయమును నేను అభినందిస్తాను. కొంతమంది సంఘకాపరులు సహితం తమ సొంత వివాహవ్యవహారంలో వరకటాన్ని డిమాండ్ చేస్తున్నారన్న సంగతి నాకు తెలిసింది.మరోసారి సహోదరుడు ఆర్. స్టాన్లీ గారి వ్యాఖ్యానం గమనిద్దాం:

లేమెన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వ్యవస్థాపకుడు కీ||శే||ఎన్. డానియెల్ గారు. 1950వ దశాబ్ద మధ్యకాలంలో ఆయన ప్రసంగించిన మారుమనస్సును గూర్చిన సందేశాలలో తరచుగా వరకట్న వ్యవస్థను ఖండించేవారు. తత్ఫలితంగా దేవుని మరియు మనుష్యుల దృష్టిలో నిందారహితముగా ఉండునట్లు అనేకమంది భర్తలు తాము పొందిన వరకట్నాన్ని తిరిగి తమ అత్తమామలకివ్వటం గాని లేక వారితో సమాధానపడటం గాని చేశారు. అయితే నేటి బోధకులు ఈ దురాచారాన్ని తమ సందేశాలలో ప్రస్తావించడం ఎంత అరుదు? అంత మాత్రమే గాకుండా, తమకు దశమభాగం వస్తుందన్న దురాశతో వరకట్నధనాన్ని ఆశీర్వదించే సంఘకాపరులు అనేకులు. సిగ్గు సిగ్గు!,

ఓ దేవుని ప్రజలారా, ఈ విషయంలో పశ్చాత్తాపమునొంది మీ మార్గాలను మార్చుకొనుడి!

తుదకు ప్రియమైన సహోదర సహోదరీలారా మరియు పెద్దలారా, హిందూ సామాజిక సంప్రదాయం నుండి ఉత్పన్నమైన వరకట్నం, సతీ సహగమనం (అనగా విధవరాలు తన భర్త చితిలో తనను తాను ఆహుతి చేసుకొనడం) మరియు బాల్యవివాహాల వంటి దురాచారాలు మన దేశంలో అనేక శతాబ్దాలుగా వ్యాపిస్తూనే ఉన్నాయి. నేటి ఆధునిక క్రైస్తవ మిషనుకు పితామహుడుగా పేరునొందిన విలియంకేరి (1760- 1834) కేవలం క్రైస్తవ సేవను మాత్రమే కాకుండా అన్యసమాజాన్ని కూడా ప్రభావితం చేశారు. ఆయన తనకు సమకాలీకుడైన రాజా రామ్మోహన్ రాయ్ తో కలిసి సతీ సహగమనం అనే దురాచార నిర్మూలనకు అహర్నిశలు పోరాడారు. తుదకు తన జీవితకాలంలోనే దాని నిర్మూలనను చూశారు. క్రైస్తవ్యంలోనికి ప్రవేశించిన వరకట్నమనే దురాచారానికి వ్యతిరేకంగా పోరాడే క్రైస్తవులెవరైనా మన దేశములో ఉన్నారా? ఈ విస్తరిస్తున్న దురాచారాన్ని ఖండించే సందేశాలు మన సంఘాలలో మళ్లీ ఎప్పుడైనా వింటామా? దేవుని సేవకులు వరకట్న నిర్మూలనను గూర్చి తమ సంఘస్థులకు బోధించడానికి ఇష్టపడుతున్నారా? క్రైస్తవ సంఘములోను మరియు క్రైస్తవేతర సమాజములోను వరకట్న దురాచారాన్ని సమూలంగా నిర్మూలించడానికి క్రైస్తవులు మరియు దైవసేవకులు ఇష్టపడుతున్నారా? యవ్వన పురుషులారా, నిందారహితమైన మరియు నిస్వార్ధమైన వివాహ వ్యవస్థను నిర్మించుకోవడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారా?

ఓ దేవుని బిడ్డలారా, మేల్కొనండి, ఈ దేశంలో పరిశుద్ధ దేవునికి మహిమ తెచ్చునట్లు ప్రకాశించండి.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.