Hits: 414
Print
రచయిత: డి. యశ్వంత్ కుమార్
  1. భాగం 1: క్రీస్తు దైవత్వం గురించిన ప్రత్యక్ష ప్రకటనలు
  2. భాగం 2: క్రీస్తుకు ఆపాదించబడిన దైవిక నామములు (1యోహాను 5:1):
  3. భాగం 3: క్రీస్తు కలిగియున్న దైవిక గుణలక్షణాలు
  4. భాగం 4: క్రీస్తు చేసిన దైవిక కార్యాలు
  5. భాగం 5: తండ్రితో సమానత్వం
  6. భాగం 6: క్రీస్తు ఆరాధనను స్వీకరించడం
  7. భాగం 7: మెస్సీయను దేవునిగా గుర్తించే పాత నిబంధన ప్రవచనాలు
  8. భాగం 8: క్రీస్తు యొక్క దైవిక అధికారం
  9. భాగం 9: విశ్వాసం, నిరీక్షణ మరియు రక్షణకు కేంద్రంగా క్రీస్తు
  10. భాగం 10: పునరుత్థానం, హెచ్చించబడటం నిత్య పరిపాలన

ముందుమాట

క్రీస్తు దైవత్వం - క్రైస్తవ విశ్వాసానికి ప్రాణవాయువు

క్రైస్తవ విశ్వాసానికి కేంద్రబిందువు, మన రక్షణకు అచంచలమైన పునాది ఒక ముఖ్యమైన ప్రశ్నపై ఆధారపడి ఉంది: "యేసుక్రీస్తు ఎవరు?" పవిత్ర లేఖనాలంతటా యేసుక్రీస్తు స్వయంగా దేవుడనే పరమ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు చాటి చెబుతున్నాడు. అయితే ఈ నవయుగంలో ఈ ప్రాథమిక సత్యం నలుదిశల నుండి విపరీతమైన దాడులను ఎదుర్కొంటోంది. 

ప్రస్తుత పరిస్థితులు మరియు సవాళ్లు 

నేడు, అనేక అవాంతర శాఖలు (cults) మరియు సంశయవాదులు (skeptics) క్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నిస్తూ విశ్వాసులను ఎంతో గందరగోళానికి గురిచేస్తున్నారు. ‘యెహోవా సాక్షుల’ (Jehovah’s Witnesses) వంటి వారు తమ పక్షపాత ధోరణికి అనుగుణంగా గ్రీకు వ్యాకరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ యేసును ఒక "తక్కువ స్థాయి దేవుడు"గా లేదా సృష్టించబడిన ఒక దేవదూతగా చిత్రీకరిస్తున్నారు. మరికొందరు ఆయనను కేవలం ఒక గొప్ప ప్రవక్తగా లేదా సామాజిక సంస్కర్తగా మాత్రమే పరిగణిస్తున్నారు. ముస్లిం మత ప్రచారకులు మరియు లౌకిక తత్వవేత్తలు తరచుగా ఒకే సవాలును విసురుతున్నారు: "యేసు ఎక్కడైనా స్పష్టంగా 'నేను దేవుడిని' అని ప్రకటించాడా?" 

ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత

క్రీస్తు దైవత్వం అనేది కేవలం వాద ప్రతివాదాలకు మాత్రమే పనికొచ్చే సిద్ధాంతం కాదు. ఇది నిత్యజీవము మరియు నిత్య మరణానికి సంబంధించిన జీవన్మరణ సమస్య. ఒకవేళ యేసు క్రీస్తు కేవలం ఒక మానవుడు మాత్రమే అయితే ఆయన రక్తం తన ప్రజల పాపాల నిమిత్తం చెయ్యాల్సిన అనంతమైన ప్రాయశ్చిత్తాన్ని ఎప్పటికీ చెయ్యగలిగి ఉండేది కాదు. ఒకవేళ యేసు క్రీస్తు సృష్టించబడిన దేవదూత ఐతే ఆయనను ఆరాధించడం ఘోరమైన విగ్రహారాధన ఔతుంది. కానీ లేఖనాలు ఏమాత్రం సందేహానికి తావు ఇవ్వకుండా ఆయనను మన "మహా దేవుడును రక్షకుడునైన యేసుక్రీస్తు" (తీతుకు 2:13) అని ఘోషిస్తున్నాయి. విశ్వాసులు తమ విశ్వాసంలో స్థిరంగా నిలబడడానికి మరియు వారిలో ఉన్న నిరీక్షణను ప్రశ్నించే వారికి లేఖనాధారిత సమాధానం ఇవ్వడానికి ఈ పుస్తకం ఒక ఆత్మీయ ఆయుధంగా ఉపయోగపడుతుంది.

ఈ పుస్తకంలో ఏముంది?

ఈ పుస్తకంలో నేను కేవలం యేసు క్రీస్తు దైవత్వానికి సంబంధించిన వచనాలను పోగు చెయ్యడం మాత్రమే కాకుండా 100 శక్తివంతమైన ఆధారాలను ఒక క్రమబద్ధమైన విధానంలో అందించే ప్రయత్నం చేశాను. ప్రతి పాయింట్ లో ఈ కింది మూడు విభాగాలు ఉంటాయి:
a) లేఖనాధారిత సాక్ష్యం (Scriptural Evidence): క్రీస్తు దైవత్వం గురించి పాత మరియు కొత్త నిబంధనల నుండి బలమైన, తిరుగులేని ఆధారాలు.
b) అభ్యంతరాలు (Objections): విమర్శకులు చేసే వాదనలు లేదా వారు వెతుక్కునే "వంకర అర్థాలను" ప్రస్తావించడం.
c) సమాధానాలు (Answers): ఆ అభ్యంతరాలను విశ్లేషించి తార్కికమైన, దైవశాస్త్ర పరమైన మరియు బైబిల్ ఆధారిత సమాధానాలను అందించడం. అవసరమైన చోట్ల మూల గ్రీకు మరియు హెబ్రీ భాషలలోని కీలక పదాలను విశ్లేషించడం (Linguistic Analysis). ఆధునిక అనువాదాలలో తలెత్తే గందరగోళాన్ని తొలగించడం.

అపొస్తలుడైన పేతురు ఇచ్చిన పిలుపును సార్థకం చెయ్యడమే ఈ పుస్తకం యొక్క అంతిమ లక్ష్యం: "నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;" (1 పేతురు 3:15). ఈ 100 ఆధారాలు మీ విశ్వాసాన్ని బలపరిచి, సత్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి మిమ్మల్ని సన్నద్ధం చేయును గాక.


భాగం 1: క్రీస్తు దైవత్వం గురించిన ప్రత్యక్ష ప్రకటనలు


ఈ విభాగంలో లేఖనాలు యేసు క్రీస్తును నేరుగా "దేవుడు" అని సంబోధించిన అత్యంత స్పష్టమైన వచనాలను మనం పరిశీలిస్తాము. వివిధ అనువాదాలలో తలెత్తే చిక్కుముడులను విప్పుతూ మూల గ్రీకు భాషా విశేషాలను గమనిస్తూ అపొస్తలులు మరియు ఆదిమ సంఘం యేసును కేవలం ఒక మనిషిగానో లేదా ఒక సందేశకుడిగానో కాకుండా సాక్షాత్తు శరీరధారిగా వచ్చిన సర్వశక్తిమంతుడైన దేవునిగా ఎలా గుర్తించారో ఈ భాగంలో నిరూపిస్తాను.


1. యోహాను 1:1  “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

అభ్యంతరం: యెహోవా సాక్షులు (Jehovah’s Witnesses) గ్రీకు భాషలో "ఆ వాక్యము ఒక దేవుడై యుండెను" (a god) అని ఉందని, అది తక్కువ స్థాయి దైవత్వాన్ని సూచిస్తుందని వాదిస్తారు.

సమాధానం: గ్రీకులోని థెయోస్ ఎన్ హో లోగోస్ (theos ēn ho logos) అనే వాక్యంలో థెయోస్ (theos) అనే పదానికి ముందు ఆర్టికల్ (article) లేకపోవడానికి కారణం - అది ఒక 'ప్రెడికేట్ నౌన్' (predicate noun). ఇది 'వాక్యము' యొక్క సారాన్ని (Essence) మరియు దైవిక గుణాన్ని వివరిస్తుంది. ఒకవేళ అక్కడ ఆర్టికల్ ఉండి ఉంటే తండ్రి మరియు వాక్యము ఒక్కరే అనే 'సబేలియన్' (Sabellian) అబద్ధ బోధకు తావు ఇచ్చేది. ఆర్టికల్ లేకపోవడం ద్వారా యోహాను ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రకటించాడు: వాక్యము తండ్రికి భిన్నంగా ఉన్న వేరొక వ్యక్తి అయినప్పటికీ తండ్రి ఏ దైవిక స్వభావాన్నైతే కలిగి ఉన్నాడో వాక్యము కూడా అదే సంపూర్ణ దైవత్వాన్ని కలిగి ఉంది. కాబట్టి, వాక్యము 'ఒక దేవుడు' కాదు, ఆయన 'సాక్షాత్తు దేవుడు'.


2. యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.”

అభ్యంతరం: కొందరు దీనిని “దేవుని ప్రణాళిక కార్య రూపం దాల్చిందనే” భావంలో మాత్రమే తీసుకోవాలని, అది ఒక వ్యక్తి శరీరధారి అవ్వడం గురించి కాదని చెబుతారు.

సమాధానం: ఇక్కడ ఉపయోగించిన ఎగెనెటో (egeneto - "ఆయెను" లేదా "అయ్యెను") అనే క్రియ, అప్పటికే ఉనికిలో ఉన్న దైవిక వాక్యము (Logos) మానవ స్వభావాన్ని ధరించినట్టు స్పష్టం చేస్తోంది. ఆయన బెత్లెహేములో పుట్టినప్పుడే ఉనికిలోకి రాలేదు; నిత్యత్వం నుండి ఉన్నవాడే సమయములోనికి ప్రవేశించాడు. యేసుక్రీస్తు ఒక సృష్టించబడిన ప్రాణి కాదు, కానీ సృష్టికర్తయే శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఇది దేవుని ప్రణాళిక నెరవేరడం గురించి కాదు, దేవుడే స్వయంగా శరీరధారిగా ప్రత్యక్షమవ్వడం గురించి మాట్లాడుతుంది.


3. యోహాను 20:28  “అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.”

అభ్యంతరం: తోమా కేవలం ఆశ్చర్యంతో ఆ మాటలు అన్నాడని (Exclamation), అది యేసును ఉద్దేశించింది కాదని విమర్శకులు వాదిస్తారు.

సమాధానం: ఈ అభ్యంతరం భాషాపరంగాను, సంస్కృతిపరంగాను నిలవదు. గ్రీకు మూలభాషలో ఇక్కడ 'హో కురియోస్ మూ కై హో థియోస్ మూ' (ho kurios mou kai ho theos mou) అనే ప్రత్యక్ష సంబోధన ఉపయోగించబడింది. దీని అర్థం తోమా నేరుగా యేసు వైపు తిరిగి, ఆయనను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. పైగా, యూదా సంస్కృతిలో దేవుని నామాన్ని ఆశ్చర్యార్థకంగా లేదా వ్యర్థంగా ఉచ్చరించడం (O My God అన్నట్లుగా) నిషిద్ధం. యూదుడైన తోమా అలాంటి పని చేసే అవకాశమే లేదు.


4. తీతుకు 2:13  “అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.”

అభ్యంతరం: కొందరు వీటిని విడదీసి "మహా దేవుడు" (తండ్రి) మరియు "రక్షకుడు" (యేసు) అని ఇద్దరు వ్యక్తులుగా చదవాలని వాదిస్తారు.

సమాధానం: గ్రీకు వ్యాకరణంలోని ‘గ్రాన్విల్ షార్ప్' (Granville Sharp) నియమం ప్రకారం, ఒకే విభక్తి (case)కి చెందిన రెండు నామవాచకాలు (nouns) కై (kai - "మరియు")తో కలపబడినప్పుడు మరియు మొదటి నామవాచకానికి మాత్రమే ఆర్టికల్ ఉన్నప్పుడు, ఆ రెండు పదాలు ఒకే వ్యక్తిని సూచిస్తాయి. అంటే, అపొస్తలుడైన పౌలు దృష్టిలో మహా దేవుడు ఎవరో మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా ఆయనే. యేసుక్రీస్తు దైవత్వాన్ని ఇంతకంటే స్పష్టంగా ప్రకటించడం సాధ్యం కాదు. ఆయన దేవుని కంటే తక్కువ వాడు కాదు, ఆయనే 'మహా దేవుడు'.


5. రోమా 9:5  “పితరులు వీరి వారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు. ఆమేన్‌.”

అభ్యంతరం: ఈ వచనాన్ని ఆంగ్లంలో ఇలా అనువదించారు - “శరీరమునుబట్టి వీరిలో పుట్టిన క్రీస్తు, సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు”. కానీ కొన్ని ఆంగ్ల అనువాదాలలో క్రీస్తును "దేవుని" నుండి వేరు చెయ్యడం కోసం విరామ చిహ్నాలను (punctuations) మార్చారు. అంటే క్రీస్తు పక్కన కామా పెట్టడానికి బదులు ఫుల్ స్టాప్ పెట్టి ఇలా అనువదించారు - “శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. దేవుడు సర్వాధికారియైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు.” అని అనువదిస్తారు. (తెలుగులో ఫుల్ స్టాప్ పెట్టి చిన్న వాక్యాలుగా విడదీసినా సరిగ్గానే అనువదించారు).

సమాధానం: గ్రీకు వ్యాకరణ నిర్మాణం అలాంటి విభజనకు ఏమాత్రం తావు ఇవ్వదు. పౌలు సాధారణంగా దేవుణ్ణి స్తుతిస్తూ రాసే స్తుతి సూత్రం (doxology formula) ప్రకారం ఎప్పుడూ యులోగెటోస్ (eulogētos - "స్తోత్రార్హుడు") తర్వాతే థెయోస్ (theos - దేవుడు) ఉంటుంది. కానీ ఈ వచనంలో థెయోస్ ముందు ఉండి, తర్వాత యులోగెటోస్ ఉంది. పౌలు సాధారణంగా ఇలా రాయడు. అంటే ఈ మొత్తం పదబందం తండ్రియైన దేవుని గురించి కాదు కానీ క్రీస్తును గురించిన వర్ణన అని గ్రీకు వ్యాకరణం స్పష్టం చేస్తోంది. కాబట్టి ఇక్కడ పౌలు క్రీస్తు యొక్క వంశావళిని ప్రస్తావిస్తూ ఆయన మానవత్వమును (శరీరమును బట్టి పుట్టెను) మరియు ఆయన దైవత్వమును (సర్వాధికారియైన దేవుడు) ఒకే వాక్యంలో జోడించాడు. క్రీస్తు కేవలం ఇశ్రాయేలీయుల వంశంలో పుట్టిన వ్యక్తి మాత్రమే కాదు, సమస్తముపై అధికారం కలిగిన దేవుడు. ఈ సత్యం క్రైస్తవ విశ్వాసానికి అత్యంత కీలకం.


6. హెబ్రీ 1:8  “గాని తన కుమారుని గూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది.”

అభ్యంతరం: ఇక్కడ “దేవా” అని పిలవడం కేవలం ఒక రాజును గౌరవించినట్లు (metaphorical) మాత్రమేనని కొందరు అంటారు.

సమాధానం: కీర్తనలు 45:6-7 వచనాలను ఉటంకిస్తూ గ్రంథకర్త ఇక్కడ స్పష్టంగా “తన కుమారుని గూర్చియైతే” అని పేర్కొన్నాడు. ఈ వచనంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తండ్రియైన దేవుడే స్వయంగా కుమారుని 'దేవుడు' (O God) అని సంబోధిస్తున్నాడు. తండ్రి కంటే కుమారుడు తక్కువ వాడైతే తండ్రి ఆయనను అలా పిలిచేవాడు కాదు. సింహాసనము మరియు రాజదండము అనే పదాలు ఆయన కేవలం భూసంబంధమైన రాజు కాదని, విశ్వమంతటినీ పాలించే నిత్య దేవుడని ధృవీకరిస్తున్నాయి.


7. 1 యోహాను 5:20  “మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతునియందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.

అభ్యంతరం: ఇక్కడ “నిజమైన దేవుడు” అనే పదం కేవలం సత్యవంతునిగా పేర్కొనబడిన తండ్రియైన దేవుడిని మాత్రమే ఉద్దేశించినదని కొందరు వాదిస్తారు.

సమాధానం: వ్యాకరణరీత్యా, గ్రీకులోని హౌటోస్ (houtos - "ఆయనే") అనే సర్వనామం ముందు వాక్యంలో ప్రస్తావించబడిన యేసుక్రీస్తు అనే నామవాచకంతో సంబంధం కలిగి ఉండే విధంగా ప్రయోగించబడింది. పైగా యోహాను తన పత్రిక అంతటా యేసునే 'జీవము' అని, 'నిత్యజీవము' అని వర్ణించాడు (1 యోహాను 1:2). కాబట్టి నిజ దేవుడు, నిత్యజీవము యేసు క్రీస్తే. యేసును విడిచిపెట్టి తండ్రిని 'నిజమైన దేవుడు' అని పిలవడం యోహాను ఉద్దేశ్యం కాదు; క్రీస్తే నిజమైన దేవుడని ప్రకటించడం ఆయన అసలు ఉద్దేశ్యం.


8. 2 పేతురు 1:1  “యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.”

అభ్యంతరం: కొందరు ఇక్కడ వాడిన "దేవుడు” మరియు "రక్షకుడు" అనే పదాలు ఇద్దరు వేరు వేరు వ్యక్తుల గురించి వాడబడ్డాయి అని భావిస్తారు.

సమాధానం: ఇది కూడా తీతుకు 2:13 వంటిదే. ఇక్కడ కూడా అదే 'గ్రాన్విల్ షార్ప్' (Granville Sharp) నియమం వర్తిస్తుంది. ఆ నియమం ప్రకారం 'దేవుడు' మరియు 'రక్షకుడు' అనే రెండు బిరుదులు యేసుక్రీస్తుకే చెందుతాయి. ఇదే అధ్యాయం 11వ వచనంలో పేతురు "మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు" అని తిరిగి ఉపయోగించాడు. అక్కడ కూడా ‘ప్రభువు’ మరియు ‘రక్షకుడు’ యేసుక్రీస్తుకే చెందుతాయి. పేతురు ఈ వచనంలో క్రీస్తును కేవలం రక్షకుడిగా మాత్రమే కాకుండా సమస్త విశ్వానికి దేవుడిగా ప్రకటిస్తున్నాడు. మన విశ్వాసం ఒక మనిషిపై కాదు, దేవుడైన క్రీస్తుపైనే ఆధారపడి ఉందనేది ఈ వచనంలోని మాటల భావం.


9. ఫిలిప్పీ 2:6  “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని.”

అభ్యంతరం: “దేవుని స్వరూపము” అంటే కేవలం పైకి కనిపించే రూపం (appearance) మాత్రమేనని, అంతర్లీనంగా ఉన్న స్వభావం (essence) కాదని విమర్శకులు అంటారు.

సమాధానం: ఇక్కడ వాడబడిన గ్రీకు పదం ‘మోర్ఫే థియో’ (morphē theou), దేవుని యొక్క బాహ్య రూపం కంటే ఆత్మ స్వభావాన్ని (essential nature) ఎక్కువగా సూచిస్తుంది, ఒక వ్యక్తి మనిషిగా ఉండాలంటే మనుష్య స్వభావం ఎలా ఉండాలో దేవుడిగా ఉండాలంటే దైవ స్వభావం ఉండాలి. యేసు దేవుని స్వరూపంలో ఉన్నాడంటే ఆయన దేవునికున్న ప్రతి గుణమును, శక్తిని కలిగి ఉన్నాడని అర్థం. ఆయన దేవునితో సమానత్వం కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆది నుండి ఆయన దేవునితో సమానుడు.


10. కొలస్సీ 2:9  “ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.

అభ్యంతరం: క్రీస్తు కేవలం దేవుని సర్వపరిపూర్ణతకు ప్రతినిధి (representative) మాత్రమే అని, ఆయన దేవుడు కాదని కొందరు వాదిస్తారు.

సమాధానం: పౌలు ఇక్కడ ఉపయోగించిన ‘థియోటెస్’ (theotēs) అనే గ్రీకు పదానికి దైవత్వ స్వభావము లేదా దైవిక సారము (essence) అని అర్థం. దేవుని యొక్క కొన్ని లక్షణాలు మాత్రమే యేసులో లేవు; దేవునిలో ఉన్న సర్వసంపూర్ణత అంతా ఆయనలో నివసిస్తుంది. అది కూడా "శరీరముగా" అంటే యేసు మానవునిగా ఉన్నప్పుడు కూడా ఆయన సంపూర్ణ దేవుడు. దీనిని బట్టి యేసు కేవలం దేవుని ప్రతినిధి మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు దేవుడేనని తిరుగులేని విధంగా నిరూపించబడింది.


భాగం 2: క్రీస్తుకు ఆపాదించబడిన దైవిక నామములు  మరియు బిరుదులు


పాత నిబంధనలో అద్వితీయ దేవుడైన యెహోవాకు మాత్రమే ఉపయోగించబడిన "అల్ఫా మరియు ఓమెగ," "మొదటివాడు మరియు కడపటివాడు," "మహిమ స్వరూపియైన ప్రభువు" వంటి బిరుదులు, కొత్త నిబంధనలో ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తుకు ఎలా ఆపాదించబడ్డాయో ఈ భాగం వివరిస్తుంది. ఈ బిరుదులు ఒక దైవిక "సంతకం" (signature) వలె పనిచేస్తూ ఆయన నిత్యత్వ స్వభావాన్ని మరియు సమస్త సృష్టిపై ఆయనకున్న సర్వోన్నత సార్వభౌమాధికారాన్ని వెల్లడిస్తాయి.


11. మత్తయి 1:23 “అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.”

అభ్యంతరం: కొందరు ఇది ఒక సూచనార్థక లేదా చిహ్నరూపక నామము (symbolic name) మాత్రమే అని వాదిస్తారు.

సమాధానం: యెషయా ప్రవచనం క్రీస్తు నందు నెరవేరినట్లుగా మత్తయి దీనిని వివరించాడు. ఈ పేరు ఆయన అనన్య గుర్తింపును (unique identity) తెలియజేస్తుంది. దీని అర్థం "దేవుడు మన పక్షాన ఉన్నాడు" అని మాత్రమే కాదు, కానీ దేవుడే స్వయంగా యేసు రూపంలో మన మధ్యకు వచ్చాడని అర్థం. యేసుక్రీస్తు కేవలం దేవుని ప్రతినిధి కాదు, దేవుడైన క్రీస్తే నరరూపధారియై మనతో నివసించడానికి దిగివచ్చాడు. కాబట్టి ఇమ్మానుయేలు అను నామము ఆయన దైవత్వానికి ప్రత్యక్ష నిదర్శనం.


12. యెషయా 9:6 “ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.”

అభ్యంతరం: “నిత్యుడగు తండ్రి” అనే బిరుదు కుమారుడికి వర్తింపచెయ్యడం వల్ల త్రిత్వంలోని వ్యక్తుల మధ్య గందరగోళం ఏర్పడుతుందని కొందరు అంటారు.

సమాధానం: హెబ్రీ భావజాలం ప్రకారం “తండ్రి” అంటే సృష్టికర్త, మూలకర్త, అధిపతి అని అర్థం. “నిత్యుడగు తండ్రి” అంటే నిత్యత్వానికి సృష్టికర్త, మూలకర్త, అధిపతి అని అర్థం. అంతేకానీ త్రిత్వంలోని మొదటి వ్యక్తి అని కాదు. పుట్టిన శిశువును "బలవంతుడైన దేవుడు" (El Gibbor) అని పిలవడం ద్వారా ఆయన యెహోవాతో సమానమైన దైవిక స్వభావాన్ని కలిగి ఉన్నాడని ప్రవక్త స్పష్టం చేస్తున్నాడు. సృష్టించబడిన ఏ శిశువు కూడా 'బలవంతుడైన దేవుడు' అని పిలవబడలేడు; ఇది కేవలం దైవ-మానవుడైన క్రీస్తు విషయంలో మాత్రమే సాధ్యపడింది. (యెషయా 10:21).


13. ప్రకటన 1:17 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.”

అభ్యంతరం: ఈ బిరుదు పాత నిబంధన ప్రకారం యెహోవాకు మాత్రమే చెందినది అని కొందరు వాదిస్తారు.

సమాధానం: ఖచ్చితంగా అపొస్తలుడైన యోహాను ఉద్దేశ్యం కూడా అదే. యెషయా 44:6లో యెహోవా తన గురించి వాడుకున్న అదే బిరుదును, ఇక్కడ క్రీస్తు తన కోసం వాడుకుంటున్నాడు. "మొదటివాడు మరియు కడపటివాడు" అనే మాట ఆయన నిత్యత్వానికి, సృష్టికర్తగా ఆయనకున్న సర్వోన్నత స్థితికి చిహ్నం. యెహోవాకు మాత్రమే దక్కాల్సిన ఈ గౌరవాన్ని క్రీస్తు స్వీకరించడం ద్వారా ఆయన యెహోవాతో ఏకత్వము కలిగిన దేవుడని నిరూపించబడింది.


14. 1 కొరింథీ 2:8 “అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు.

అభ్యంతరం: “మహిమాస్వరూపియగు ప్రభువు” (Lord of glory) ఎలా మరణించగలడు? దేవుడు మరణించలేడు కదా!

సమాధానం: ఇక్కడ మనం క్రీస్తులోని దైవిక మరియు మానవ స్వభావాల ఐక్యతను (Hypostatic Union) గమనించాలి. ఆయనలోని మానవ స్వభావం శ్రమపడి మరణించింది, కానీ మరణించిన ఆ వ్యక్తి సాక్షాత్తు "మహిమాస్వరూపియగు ప్రభువు". సిలువపై చిందించబడిన రక్తం సామాన్యమైనది కాదు, అది దేవుని స్వరక్తం (అపో. కార్య. 20:28). ఈ బిరుదు సిలువ వేయబడిన క్రీస్తు యొక్క అనంతమైన విలువను మరియు దైవత్వాన్ని చాటిచెబుతోంది.


15. యిర్మీయా 23:6 “అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.”

అభ్యంతరం: ఇక్కడ “యెహోవా” (LORD) అనేది కేవలం ఒక సాధారణ బిరుదు లేదా గౌరవార్థక పదం మాత్రమే కావచ్చు.

సమాధానం: హెబ్రీ భాషలో ఇక్కడ దైవిక నిబంధన నామమైన యెహోవా సిద్కెను (YHWH Tsidkenu) ఉపయోగించబడింది. రాబోయే మెస్సీయ స్వయంగా దేవుని నిబంధన నామమును కలిగి ఉంటాడని ప్రవక్త ముందే ప్రవచిస్తున్నాడు. యేసుక్రీస్తు కేవలం మనకు నీతిని బోధించేవాడు కాదు, ఆయనే మన ‘నీతి’. సృష్టికర్త నామమును ధరించిన ఈ రాజు, కేవలం మానవ మాత్రుడు కాదని దీని ద్వారా తిరుగులేని విధంగా నిరూపించబడింది.


16. ప్రకటన 19:16 “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.”

అభ్యంతరం: ఈ బిరుదు కేవలం తండ్రియైన దేవునికి మాత్రమే చెందుతుంది కానీ యేసుక్రీస్తుకు కాదు.

సమాధానం: ప్రకటన 17:14లో ఈ బిరుదు "గొర్రెపిల్ల" (యేసుక్రీస్తు) కు ఆపాదించబడింది. లేఖనాలు తండ్రిని ఎలాగైతే ఈ నామంతో పిలుస్తున్నాయో (1 తిమోతి 6:15), గొర్రెపిల్లయైన క్రీస్తును కూడా అదే నామంతో సంబోధిస్తున్నాయి. ఇది ఆయనకు ఉన్న సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని (Absolute Supremacy) చాటి చెబుతుంది. భూమి మీద కానీ పరలోకంలో కానీ ఏ శక్తి ఆయన అధికారాన్ని మించలేదు. ఇలాంటి సర్వాధికారం కేవలం దేవునికి మాత్రమే ఉండే ప్రత్యేక ఆధిక్యత, అది క్రీస్తులో పరిపూర్ణంగా కనిపిస్తుంది.


17. ప్రకటన 22:13నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.”

అభ్యంతరం: ఇక్కడ మాట్లాడుతున్నది తండ్రియైన దేవుడు మాత్రమేనని కొందరు భ్రమపడతారు.

సమాధానం: ‌ఇదే అధ్యాయం 16వ వచనంలో, మాట్లాడుతున్న వ్యక్తి తనను తాను "యేసు"గా పరిచయం చేసుకున్నాడు. అల్ఫా మరియు ఓమెగ అనేవి గ్రీకు అక్షరమాలలో మొదటి మరియు చివరి అక్షరాలు; అంటే సమస్తానికి అది మరియు ముగింపు ఆయనే. యెహోవా దేవునికి మాత్రమే ఉన్న ఈ నిత్యత్వ బిరుదును (యెషయా 44:6, ప్రకటన 1:8) యేసు తనకు ఆపాదించుకోవడం ద్వారా ఆయన తన దైవత్వాన్ని మరియు తండ్రితో ఉన్న ఏకత్వాన్ని స్వయంగా ధృవీకరించాడు.


18. అపో. కార్య 3:14 “మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.”

అభ్యంతరం: “పరిశుద్ధుడు” అనే పదం కేవలం ఒక “నీతిమంతుడైన ప్రవక్త”ను సూచిస్తుందని కొందరు అంటారు.

సమాధానం: గ్రీకులో “పరిశుద్ధుడు” (Qedosh - Holy one) అనే పదానికి ముందు ఆర్టికల్ ఉంది కాబట్టి ఇదొక బిరుదు. ఇది పాత నిబంధనలో కేవలం యెహోవాకు మాత్రమే చెందిన ప్రత్యేకమైన బిరుదు (యెషయా 43:15). పేతురు తన మునుపటి ప్రసంగంలో కీర్తనలు 16:10 ని ఉంటంకించి, పరిశుద్ధుడు అనే బిరుదును యేసుక్రీస్తుకు అపాదించాడు. ఇక్కడ కూడా పేతురు యూదులకు బాగా సుపరిచితమైన అదే బిరుదును యేసుక్రీస్తుకు వాడడం ద్వారా ఆయనను నిబంధన దేవునితో (Covenant God) సమానునిగా పరిగణిస్తున్నట్లు స్పష్టం ఔతోంది. యేసు కేవలం పరిశుద్ధమైన జీవితం జీవించిన వ్యక్తి కాదు, ఆయనే పరిశుద్ధతకు మూలమైన దేవుడు. ఈ బిరుదు ఆయన నైతిక పరిపూర్ణతను మరియు దైవిక స్వభావాన్ని చాటుతోంది.


19. యోహాను 8:58 “యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.”

అభ్యంతరం: దీనికి కేవలం “నేను అప్పటికే ఉనికిలో ఉన్నాను” (I existed) అనే సాధారణ అర్థం మాత్రమే తీసుకోవాలి.

సమాధానం: యేసు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా నిర్గమకాండము 3:14 లోని దైవికనామమైన “నేను ఉన్నవాడను అనువాడను” (I AM WHO I AM - ఎగో ఎయిమి - egō eimi) అనే పదాన్ని ఉపయోగించాడు. ఆయన అబ్రహాము పుట్టక మునుపు "నేను ఉంటిని" (I was) అనలేదు కానీ అబ్రహాము పుట్టకమునుపే "నేను ఉన్నవాడను" అన్నాడు. ఇది ఆయన నిత్య స్వీయ-అస్తిత్వానికి (eternal self-existence) నిదర్శనం. యూదులు దీనిని దైవత్వపు ప్రకటనగా అర్థం చేసుకున్నారు. కాబట్టే ఆయన దేవదూషణ చేశాడని భావించి, కొట్టడానికి రాళ్ళు చేత పట్టుకున్నారు.


20. యోహాను 5:18 “ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.”

అభ్యంతరం: యేసు ఎప్పుడూ దేవునితో సమానత్వాన్ని ప్రత్యక్షంగా ప్రకటించుకోలేదు.

సమాధానం: యేసు చేసిన కార్యాలు మరియు చెప్పిన మాటలు (17 వచనం - యేసు - నాతండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను) దేవునితో సమానత్వాన్ని సూచిస్తున్నాయని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ గ్రంథకర్తే (యోహాను) స్వయంగా తర్వాత వచనంలో ధృవీకరించాడు - (18 వచనం - “తన్ను దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడు”). దేవునిని "సొంత తండ్రి" అని పిలవడం ద్వారా ఆయన స్వభావంలో తండ్రితో సమానుడనని చాటిచెప్పాడు. యూదులు దీనిని సరిగ్గానే అర్థం చేసుకున్నారు, కానీ అంగీకరించలేకపోయారు. యేసు తన దైవిక అధికారాన్ని తండ్రితో సమానంగా ప్రకటించుకోవడం ద్వారా తాను కేవలం ఒక మనిషిని కాదని స్పష్టం చేశాడు.


భాగం 3: క్రీస్తు కలిగియున్న దైవిక గుణలక్షణాలు


ఈ భాగంలో మనం కేవలం దేవునికి మాత్రమే పరిమితమైన ప్రత్యేక లక్షణాలను అధ్యయనం చేస్తాము: సర్వవ్యాపకత్వం (Omnipresence), సర్వజ్ఞత (Omniscience), సర్వశక్తి (Omnipotence) మరియు మార్పులేని తత్వం (Immutability). ఈ గుణగణాలు యేసుక్రీస్తులో ఎలా పరిపూర్ణంగా మరియు సహజసిద్ధంగా నివసించాయో ఈ విభాగం నిరూపిస్తుంది. తద్వారా ఆయనను సృష్టించబడిన వాడిగా పరిగణించడం అసాధ్యమని ఈ భాగంలో స్పష్టమౌతుంది.


21. మీకా 5:2 “బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.

అభ్యంతరం: దేవుడు చాలా కాలం క్రితమే కుమారుడి గురించి ప్రణాళిక వేశాడని మాత్రమే దీని అర్థం అని కొందరు వాదిస్తారు.

సమాధానం: హిబ్రూ మూల భాషలో ఇక్కడ వాడబడిన పదబంధం “మిక్కెడెం మిమే ఓలమ్” (miqqedem, mimei olam) అంటే "నిత్యత్వపు దినముల నుండి" (From the days of eternity) అని అర్థం. ఇది కేవలం దేవుని సంకల్పాన్ని మాత్రమే కాదు, మెస్సీయ యొక్క నిత్య ఉనికిని (Eternal Existence) చాటి చెబుతోంది. సృష్టించబడిన ఏ ప్రాణికి కూడా ఇలాంటి నిత్యత్వం ఉండదు. కాబట్టి మెస్సీయ కేవలం ఒక గొప్ప మనుష్యుడు కాదు, ఆయన అనాది నుండి ఉన్న అద్వితీయ దేవుడు.


22. యోహాను 8:58 యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

అభ్యంతరం: “నేను ఉన్నాను” (egō eimi) అనేది ఒక వ్యక్తి గుర్తింపును తెలిపే సాధారణ మాట అని కొందరు అంటారు.

సమాధానం: సాధారణ మాటగా egō eimi అనే పదాన్ని వాడే పద్దతి ఉన్నప్పటికీ ఇక్కడ దానిని ఉపయోగించిన విధానం చాలా ప్రత్యేకమైనది. ఆయన ఎలాంటి విశేషణం (predicate) లేకుండా (absolutely) మరియు అబ్రాహాము పుట్టుకతో పోలుస్తూ (“అబ్రాహాము పుట్టకముందే”) ఆ మాటలు ఉపయోగించాడు. ఈ విలక్షణమైన ప్రయోగం ఆయన నిత్య ఉనికిని తెలియచేస్తుందే తప్ప, కేవలం ఒక వ్యక్తిగా ఆయన గుర్తింపును కాదు. యేసు ఇక్కడ "నేను ఉంటిని" (I was) అని అనకుండా వర్తమాన కాలంలో "నేను ఉన్నాను" (I AM) అని ప్రకటించడం గమనార్హం. ఇది నిర్గమకాండము 3:14లో యెహోవా తన గురించి బయలుపరచుకున్న దైవిక నామము. అబ్రాహాము పుట్టుక అనేది ఒక సమయంలో జరిగింది (Created), కానీ క్రీస్తు ఉనికి నిత్యమైనది (Uncreated). అక్కడ ఉన్న యూదులు దీనిని దైవత్వపు ప్రకటనగా గ్రహించారు కాబట్టే దేవదూషణ నేరం మోపి ఆయనను చంపడానికి రాళ్లు ఎత్తారు. తన నిత్యత్వ స్వభావాన్ని ప్రకటించుకోవడం ద్వారా క్రీస్తు తన దైవత్వాన్ని ఇక్కడ సుస్థిరపరిచాడు.


23. మత్తయి 18:20 “ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.”

అభ్యంతరం: ఇది కేవలం ఆయనను గుర్తు చేసుకున్నప్పుడు కలిగే ఒక మానసిక భావన (Metaphor) మాత్రమేనని కొందరు అంటారు.

సమాధానం: “నేను వారి మధ్యన ఉందును” (గ్రీకులో: eimi en mesō autōn) అనేది మనకు కలిగే ఒక మానసిక భావనను సూచిస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. అలాగే ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కూడుకునే విశ్వాసుల మధ్య ఉంటానని వాగ్దానం చెయ్యడం ఒక్క సర్వవ్యాపి (Omnipresent) అయిన దేవునికే సాధ్యం. ఏ మానవుడు లేదా దేవదూత ఇలాంటి వాగ్దానం చెయ్యలేరు. ఇది కేవలం జ్ఞాపకం చేసుకోవడం గురించి కాదు, ఆయన వాస్తవికమైన దైవిక ఉనికిని (Divine Presence) తెలియచేస్తోంది. తన ప్రజలతో నిరంతరం ఉండగలిగే ఈ సామర్థ్యం, క్రీస్తు యొక్క దైవత్వానికి మరియు ఆయన సర్వవ్యాపకత్వానికి తిరుగులేని నిదర్శనం.


24. యోహాను 16:30 సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా”

అభ్యంతరం: యేసు ఒక మనిషిగా అన్ని విషయాలు నేర్చుకున్నాడు కాబట్టి ఆయనకు పుట్టుకతోనే అన్నీ తెలియవు అని వాదిస్తారు.

సమాధానం: క్రీస్తు తన మానవత్వంలో జ్ఞానమందు అభివృద్ధి చెందాడు అనేది వాస్తవమే, కానీ ఆయనలోని దైవిక స్వభావం ఎప్పుడూ సర్వజ్ఞతను (Omniscience) కలిగి ఉంది. శిష్యులు ఇక్కడ ఆయన హృదయాంతరాలను ఎరిగే శక్తిని చూసి ఈ ఒప్పుకోలు చేశారు. మనుష్యుల ఆలోచనలను, భవిష్యత్తు మర్మాలను ఎరిగి ఉండడం కేవలం దేవునికి మాత్రమే సాధ్యం (1 రాజులు 8:39). సమస్తమును ఎరిగిన క్రీస్తు, సృష్టించబడిన జ్ఞానము గలవాడు కాదు కానీ జ్ఞానమునకు మూలమైన దేవుడని ఇక్కడ స్పష్టమౌతోంది (యోహాను 21:17).


25. మత్తయి 28:18 “అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.”

అభ్యంతరం: “అధికారము ఇయ్యబడియున్నది” కాబట్టి అంతకుముందు ఆయనకు ఆ అధికారం లేదని, అందుకే ఆయన దేవుడు కాదని అంటారు.

సమాధానం: నిత్యుడైన కుమారుడిగా ఆయనకు ఎప్పుడూ దైవిక అధికారం ఉంది, కానీ నరరూపియైన మధ్యవర్తిగా (Incarnate Mediator) ఆయన తన మరణ పునరుత్థానాల ద్వారా ఈ అధికారిక హోదాను తిరిగి స్వీకరించాడు. పరలోకమందును, భూమిమీదను 'సమస్తాధికారము' కలిగి ఉండడం అంటే ఆయన సర్వశక్తుడు (Omnipotent) అని అర్థం. ఇలాంటి అనంతమైన అధికారాన్ని దేవుడు మరెవ్వరికీ ఇవ్వలేడు (దేవుడైన యేసుకు తప్ప). ఈ విశ్వవ్యాప్త సార్వభౌమాధికారమే యేసుక్రీస్తు సర్వాధికారియైన దేవుడని నిరూపిస్తోంది.


26. హెబ్రీ 13:8 యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.”

అభ్యంతరం: ఇది కేవలం ఆయన బోధనలు మారవని లేదా ఆయన వ్యక్తిత్వం స్థిరంగా ఉంటుందని మాత్రమే సూచిస్తుందని కొందరు అంటారు.

సమాధానం: మార్పులేని తత్వం (Immutability) అనేది కేవలం దేవునికి మాత్రమే ఉండే విశిష్ట లక్షణం (మలాకీ 3:6). సృష్టించబడిన ఏ ప్రాణి అయినా కాలంతో పాటు మార్పుకు లోనౌతుంది, కానీ యేసు నిత్యము ఏకరీతిగా ఉంటాడు. కాలప్రవాహంలో మార్పు చెందని ఈ స్వభావం ఆయన దైవత్వానికి నిలువెత్తు సాక్ష్యం. నిన్నటి నుండి నిరంతరము వరకు ఒక్కటే రీతిగా ఉండగలిగే వాడు కేవలం నిత్యుడైన దేవుడు మాత్రమేనని ఈ లేఖనం నిర్ధారిస్తోంది.


27. యోహాను 14:6 “యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.”

అభ్యంతరం: ప్రవక్తలు కూడా సత్యం మాట్లాడతారు; అంతమాత్రాన వారు దేవుడు కారు కదా అని వాదిస్తారు.

సమాధానం: యేసు తాను సత్యం 'చెబుతానని' అనలేదు, కానీ తానే సత్యమునై (Is Truth) ఉన్నానని ప్రకటించాడు. ప్రవక్తలు సత్యానికి సాక్షులుగా ఉంటారు, కానీ క్రీస్తు సత్యానికి మూలమై ఉన్నాడు. లేఖనాల ప్రకారం, సత్యం మరియు జీవం అనేవి స్వతసిద్ధంగా దేవుని లక్షణాలు (ద్వితీయోపదేశకాండము 32:4). తనను తాను 'సత్యము & జీవము' అని సంబోధించుకోవడం ద్వారా తనలో దైవిక స్వీయ-అస్తిత్వం ఉందని క్రీస్తు చాటిచెప్పాడు. ఆయన దేవుడు కాకపోతే ఇలాంటి ప్రకటన చెయ్యడం అసాధ్యం.


28. యోహాను 5:26 “తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.”

అభ్యంతరం: “అనుగ్రహించెను” (Granted) అనే పదం, కుమారుడు తండ్రి కంటే తక్కువ స్థాయి వాడని (inferiority) సూచిస్తుంది.

సమాధానం: ఇది రక్షణ ప్రణాళికలో తండ్రి కుమారుల మధ్య ఉన్న నిబంధనపూర్వక క్రమాన్ని (Economy of Salvation) సూచిస్తుంది. నిత్యుడైన దేవునిగా కుమారుడు తండ్రి వలె స్వీయ-అస్తిత్వాన్ని (self-existence) కలిగి ఉన్నాడు. అయితే ఒక మధ్యవర్తిగా తన ప్రజలకు నిత్యజీవాన్ని పంచి ఇచ్చే ప్రత్యేక అధికారాన్ని తండ్రి కుమారుడి చేతికి అప్పగించాడు. కాబట్టి ఇది యేసుక్రీస్తు అస్తిత్వానికి సంబంధించిన జీవము కాదు కానీ తాను ఇతరులకు అనుగ్రహించే నిత్యజీవానికి సంబంధించినది. ఆ నిత్యజీవాన్ని ఇతరులకు అనుగ్రహించే విధంగా తండ్రి దాన్ని ఆయన చేతిలో ఉంచాడని దీని భావం (యోహాను 5:17,21,24-26).
తన ప్రజలందరికీ నిత్యజీవాన్ని ఇవ్వగలిగే అధికారం కుమారునికి ఉండటమే, ఆయనను తండ్రితో సమానుడిగా ఆరాధనకు పాత్రునిగా నిలబెడుతోంది.


29. కొలస్సీ 1:17 “ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.”

అభ్యంతరం: “ముందుగా ఉన్నవాడు” అంటే ఆయన అన్నిటికంటే ముందుగా సృష్టించబడినవాడని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు.

సమాధానం: ఇక్కడ ప్రాధాన్యత సమయానిది మాత్రమే కాదు, ఉనికికి సంబంధించింది. ఆయన సృష్టికి ముందే ఉన్నవాడు (Pre-existence) మాత్రమే కాదు, సమస్తమును తన శక్తితో పోషించి సంరక్షించేవాడు (Sustainer). ఈ అనంతమైన విశ్వం కుప్పకూలిపోకుండా ప్రతి క్షణం దానిని కాపాడడం కేవలం సృష్టికర్తకే సాధ్యం. ఆయన సమస్తమునకు 'ఆధారభూతుడు' అయ్యున్నాడంటే ఆయన దైవిక హస్తం సృష్టి అంతటిపై అధికారం కలిగి ఉందని అర్థం. ఇది క్రీస్తు యొక్క దైవత్వానికి మరో బలమైన సాక్ష్యం.


30. మత్తయి 11:27 “సమస్తమును నా తండ్రి చేత నా కప్పగింపబడియున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.”

అభ్యంతరం: ఇది కుమారునికి ఉన్న పరిమితిని (limitation) సూచిస్తుందని కొందరు పొరబడతారు.

సమాధానం: వాస్తవానికి ఇది తండ్రి మరియు కుమారుల మధ్య ఉన్న అనంతమైన మరియు పరస్పర జ్ఞానాన్ని (Mutual Knowledge) వెల్లడిస్తుంది. దేవుని గురించి దేవుడు మాత్రమే పూర్తిగా తెలుసుకోగలడు (1 కొరింథీ 2:11). ఒక మనిషి లేదా దేవదూత దేవుని సంపూర్ణతను ఎప్పటికీ గ్రహించలేరు. తండ్రిని సంపూర్ణంగా ఎరిగే సామర్థ్యం కుమారునికి ఉందంటే ఆయన స్వభావంలో తండ్రితో సమానుడని అర్థం. ఈ అద్భుతమైన ఏకత్వం క్రీస్తు కేవలం ఒక ప్రతినిధి కాదని, ఆయన దైవత్వంలో పాలుపంచుకున్న వాడని నిరూపిస్తోంది.


భాగం 4: క్రీస్తు చేసిన దైవిక కార్యాలు


విశ్వ సృష్టి, పాపాలను క్షమించే అధికారం, తన మాటతో మృతులను లేపడం మరియు ప్రకృతిని శాసించడం వంటి కార్యాలు దైవిక శక్తికి నిదర్శనాలు (hallmarks). యేసు క్రీస్తు ఈ కార్యాలను తన స్వంత అంతర్గత అధికారంతో ఎలా చేశాడో తద్వారా సృష్టికర్తగా ఆయనకున్న గుర్తింపు ఎలా సుస్థిరపరచబడిందో ఈ విభాగం చర్చిస్తుంది.


31. యోహాను 1:3 “కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.”

అభ్యంతరం: యేసుక్రీస్తు సృష్టి చెయ్యబడినప్పుడు దేవుని చేతిలో ఒక సాధనంగా (Instrument) మాత్రమే ఉపయోగించబడ్డాడని కొందరు వాదిస్తారు.

సమాధానం: “కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు” అనే మాట క్రీస్తును సృష్టించబడిన వాటన్నిటి నుండి పూర్తిగా వేరు చేస్తోంది. ఒకవేళ సృష్టించబడిన ప్రతిదీ ఆయన ద్వారానే కలిగినట్లైతే ఆయన 'సృష్టించబడిన వాడు' అయ్యే అవకాశమే లేదు. శూన్యం నుండి సమస్తాన్ని ఉనికిలోకి తెచ్చే శక్తి కేవలం సృష్టికర్తకే ఉంటుంది. ఆయన సృష్టికి వెలుపల ఉండి, సృష్టినంతటినీ కలుగచేసిన స్వయం ఉనికి కలిగిన దేవుడు. కాబట్టి క్రీస్తు సృష్టిలో ఒక భాగం కాదు, ఆయనే సృష్టికి మూలకారకుడైన సర్వేశ్వరుడు.


32. హెబ్రీ 1:3 “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.”

అభ్యంతరం: దేవుడు సమస్త కార్యాలు చెయ్యడానికి అవసరమయ్యే శక్తిని యేసు క్రీస్తుకు అనుగ్రహించాడని (God empowers Him) కొందరు అంటారు.

సమాధానం: ఇక్కడ కుమారుడు వెలుపల నుండి పొందుకున్న శక్తితో కాదు కానీ "తన మహత్తుగల మాటచేత" స్వయంగా ఈ విశ్వాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు (Cosmic Preservation). ఈ అనంతమైన విశ్వం చెల్లాచెదురై నాశనం అయిపోకుండా ప్రతీ క్షణం తన అధికారంతో నిర్వహించడం అనేది ఏ సృష్టించబడిన ప్రాణికీ సాధ్యపడే పని కాదు. విశ్వ నిర్వహణ అనేది ప్రత్యేకంగా దేవునికే చెందిన విధి. సమస్తమును తన నియంత్రణలో ఉంచుకోగలిగే ఈ సామర్థ్యమే, క్రీస్తు సర్వశక్తుడైన దేవుడని నిరూపిస్తోంది.


33. మార్కు 2:5-7 యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి.”

అభ్యంతరం: యేసు క్రీస్తు కేవలం దేవుని ప్రతినిధిగా (representative) పాపాలను క్షమించాడని విమర్శకులు అంటారు.

సమాధానం: “దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడు?” అని శాస్త్రులు చేసిన తర్కం లేఖనాధారితమైనదే. యేసు వారి తర్కాన్ని తప్పు పట్టలేదు, కానీ ఆ క్షమించే అధికారం తనకే ఉందని ఒక అద్భుతం చెయ్యడం ద్వారా నిరూపించాడు. ఆయన దేవునిని వేడుకోలేదు, కానీ తన స్వంత అధికారంతో నేరుగా క్షమించాడు. పాపము అనేది దేవునికి విరుద్ధంగా చేసే తిరుగుబాటు; దానిని క్షమించే హక్కు కేవలం ఆ దేవునికి మాత్రమే ఉంటుంది. ఆ హక్కును యేసు కలిగి ఉండడమే ఆయన దైవత్వానికి తిరుగులేని సాక్ష్యం.


34. యోహాను 11:43 “ఆయన ఆలాగు చెప్పి లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా”

అభ్యంతరం: ప్రవక్తలు కూడా మృతులను లేపారు కదా, మరి ఇది యేసు దైవత్వానికి నిదర్శనం ఎలా అవుతుందని కొందరు అడుగుతారు.

సమాధానం: ప్రవక్తలు దేవునిని ప్రార్థించి, ఆయన శక్తి ద్వారా అద్భుతాలు చేశారు. కానీ యేసు ఇక్కడ "లాజరూ, బయటికి రా" అని స్వయంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన తన సహజమైన అధికారంతో (Intrinsic Authority) మరణంపై జయాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత ఆయనే “పునరుత్థానమును జీవమును నేనే” అని ప్రకటించడం గమనార్హం. మరణాన్ని శాసించగలిగే అధికారం కేవలం జీవాధిపతియైన దేవునికే ఉంటుంది. కాబట్టి, ఈ అద్భుతం క్రీస్తు యొక్క దైవిక సార్వభౌమత్వానికి నిదర్శనం.


35. యోహాను 10:28 “నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.”

అభ్యంతరం: యేసు క్రీస్తు కేవలం జీవ మార్గాన్ని బోధించే గురువు మాత్రమేనని (merely teaches the way) కొందరు అంటారు.

సమాధానం: యేసు తాను జీవమును చూపిస్తున్నానని అనలేదు, కానీ "నేను జీవమును ఇస్తున్నాను" (I give life) అని నొక్కి చెప్పాడు. నిత్యజీవము అనేది ప్రత్యేకంగా దేవుడే అనుగ్రహించే కృపావరము (రోమా 6:23). ఈ అనంతమైన బహుమానాన్ని వ్యక్తిగతంగా ప్రసాదించే సార్వభౌమత్వ అధికారం క్రీస్తుకు ఉందంటే ఆయన దైవత్వంలో తండ్రితో సమానుడని అర్థం. తన ప్రజలను నిత్యత్వం వరకు భద్రపరచగలిగే ఈ సామర్థ్యం కలిగి ఉండడం కేవలం దేవుడైన క్రీస్తుకే సాధ్యం.


36. యోహాను 16:7 “అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.”

అభ్యంతరం: పరిశుద్ధాత్మను పంపేది తండ్రి మాత్రమే కదా, మరి కుమారుడు ఎలా పంపుతాడని కొందరు వాదిస్తారు (యోహాను 14:26 ప్రకారం).

సమాధానం: తండ్రి మరియు కుమారుడు ఇద్దరూ పరిశుద్ధాత్మను పంపిస్తారు. యేసు స్వయంగా పరిశుద్ధాత్మను పంపడం అనేది, ఆయనకు తండ్రితో సమానమైన దైవిక అధికారము (Divine authority) ఉందని నిరూపిస్తుంది. దేవుని ఆత్మను భూమిపైకి పంపగలిగే అధికారం క్రీస్తుకు ఉందంటే ఆయన దైవత్వపు అధికార క్రమంలో (Divine Economy) తండ్రితో ఏకమై ఉన్నాడని స్పష్టమవుతోంది.


37. యోహాను 14:13-14 “మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.”

అభ్యంతరం: మనం యేసు నామములో తండ్రికి ప్రార్థిస్తాం, కాబట్టి యేసు కేవలం ఒక మధ్యవర్తి మాత్రమేనని అంటారు.

సమాధానం: “నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును” అని యేసు తన స్వంత అధికారాన్ని ప్రకటించాడు. ప్రార్థనలకు జవాబివ్వడం అనేది ఆయన సర్వజ్ఞతను (Omniscience) మరియు సర్వశక్తిని (Omnipotence) కలిగి ఉన్నాడని రుజువు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చేసే ప్రార్థనలను ఒకే క్షణంలో ఆలకించి, వాటికి స్పందించడం సామాన్య మానవుడికి లేదా దేవదూతకు అసాధ్యం. ప్రార్థనలు ఆలకించే దేవుడుగా క్రీస్తు ఇక్కడ తన దైవత్వాన్ని ప్రకటించాడు.


38. యోహాను 5:22-23 “తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.”

అభ్యంతరం: ఈ అధికారం అప్పగించబడినది (delegated), కాబట్టి యేసుక్రీస్తుకు స్వతహాగా ఉన్నది కాదని కొందరు భ్రమపడతారు.

సమాధానం: అంతిమ తీర్పు తీర్చే అధికారం కేవలం ‘సర్వలోకమునకు తీర్పు తీర్చే దేవునికే’ ఉంటుంది (ఆదికాండము 18:25). అయితే తండ్రి ఈ తీర్పు భారమంతటినీ కుమారునికి అప్పగించడం ద్వారా కుమారుడు తండ్రికి అందే ఆరాధనకు, ఘనతకు సమానమైన అర్హుత గలవాడని ధృవీకరిస్తున్నాడు. సర్వోన్నత నైతిక న్యాయాధిపతిగా వ్యవహరించడం అనేది దైవికమైన విశేషాధికారం. కాబట్టి, సింహాసనంపై కూర్చుని తీర్పు తీర్చే క్రీస్తు, సాక్షాత్తు సర్వాధికారియైన దేవుడు.


39. మార్కు 4:39 “అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను.”

అభ్యంతరం: ఇది దేవుని ద్వారా పొందిన శక్తితో (empowered by God) చెయ్యబడిన ఒక అద్భుతం మాత్రమేనని కొందరు అంటారు.

సమాధానం: లేఖనాల ప్రకారం సముద్రమును, గాలిని అణచివేయడం కేవలం యెహోవాకే సాధ్యం (కీర్తనలు 107:29). యేసు ఇక్కడ ఏ విధమైన ప్రార్థన చెయ్యకుండా తన స్వంత ఆజ్ఞ ద్వారా ప్రకృతిని శాసిస్తున్నాడు. సృష్టి తన సృష్టికర్త స్వరాన్ని గుర్తుపట్టి తక్షణమే లోబడింది. ప్రకృతిపై క్రీస్తుకు ఉన్న ఈ సార్వభౌమ అధికారం, ఆయన ఈ సమస్త సృష్టిని కలుగచేసిన దేవుడని తిరుగులేని విధంగా చాటి చెబుతోంది.


40. మత్తయి 8:3 “అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధియాయెను.”

అభ్యంతరం: యేసు ఇక్కడ కేవలం ఒక గొప్ప ప్రవక్తలా (prophet) అద్భుతం చేశాడని కొందరు వాదిస్తారు.

సమాధానం: ప్రవక్తలు ఎప్పుడూ "యెహోవా సెలవిచ్చునదేమనగా" అని దేవుని నామమును సాక్ష్యంగా పలుకుతారు. కానీ యేసు ఇక్కడ “నాకిష్టమే” (I will) అని తన స్వంత సంకల్పాన్ని ప్రకటించాడు. అంటే దైవిక సంకల్పం (Divine Will) నేరుగా ఆయన అధికారం ద్వారానే వ్యక్తమౌతోంది. రోగాన్ని నివారించే శక్తి ఆయన స్వతహాగా కలిగి ఉన్నాడు. తన చిత్తం ద్వారా స్వస్థతను కలుగచెయ్యడం అనేది క్రీస్తు దైవిక అధికారానికి మరియు ఆయన దైవత్వానికి నిదర్శనం.


భాగం 5: తండ్రితో సమానత్వం


యేసు క్రీస్తు తన సారములో లేదా స్వభావములో (essence) తండ్రి కంటే తక్కువ స్థాయి వాడని వాదించే వారికి ఈ విభాగం ఒక బలమైన సమాధానాన్ని అందిస్తుంది. "నేనును తండ్రియును ఏకమై యున్నాము" అని యేసు చేసిన ప్రకటన వెనుక ఉన్న లోతైన మర్మాన్ని, మరియు పరిశుద్ధ త్రిత్వంలో ఆయన తండ్రితో సమానంగా కలిగియున్న మహిమను, అధికారిక సమానత్వాన్ని ఈ భాగంలో మనం పరిశీలిస్తాము.


41. యోహాను 10:30 “నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.”

అభ్యంతరం: ఇక్కడ “ఏకమై” (One) అంటే కేవలం వారి ఉద్దేశ్యాలలో లేదా లక్ష్యాలలో ఒకటిగా ఉన్నారని (unity of purpose) అర్థం.

సమాధానం: ఇక్కడ వాడబడిన గ్రీకు పదం 'హెన్' (Hen). ఇది నపుంసక లింగ పదం (neuter gender), దీని అర్థం "ఒకే సారము లేదా స్వభావము" (one essence) అని వస్తుంది. యేసు ఇక్కడ ఒకే వ్యక్తి (Heis) అని అనలేదు, కానీ తండ్రి ఏ దైవిక స్వభావాన్నైతే కలిగి ఉన్నాడో తాను కూడా అదే స్వభావాన్ని కలిగి ఉన్నానని ప్రకటించాడు. దీనిని విన్న యూదులు ఆయన దేవదూషణ చేస్తున్నాడని భావించి రాళ్ళతో కొట్టడానికి సిద్ధపడ్డారు. ఒకే లక్ష్యం కలిగి ఉండడం దేవదూషణ కాదు, కానీ దేవునితో సమానమైన స్వభావం కలిగి ఉండడమే దైవత్వపు ప్రకటన. సంధర్భం కూడా దీన్నే స్పష్టం చేస్తుంది, ఎవ్వరూ తన చేతిలో నుండి తన గొర్రెలను అపహరించలేరు అనేది ఇక్కడ సంధర్భం.(28వ) ఎందుకు అపహరించలేరు? ఎందుకంటే తండ్రి చేతి నుండి వాటిని ఎవ్వరూ అపహరింపలేకపోవడానికి ఏ సర్వశక్తి కారణంగా ఉందో (29వ), ఆ విషయంలో తాను కూడా తండ్రితో ఏకమై ఉన్నాడు కాబట్టే తన చేతిలో నుండి కూడా ఎవ్వరూ వాటిని అపహరింపలేరు అనే భావం వచ్చే విధంగా నేను తండ్రి ఏకమై ఉన్నామని ప్రకటిస్తున్నాడు (30వ). కాబట్టి క్రీస్తు స్వభావములో తండ్రితో ఏకమై ఉన్న దేవుడు.


42. యోహాను 5:23 “తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.”

అభ్యంతరం: ఇక్కడ "ఘనపరచుట" అంటే కేవలం గౌరవించడమే (Respect) కానీ ఆరాధించడం (Worship) కాదు.

సమాధానం: ఇక్కడ వాడబడిన “నట్లుగా” (Kathōs) అనే పదం ‘సమ-సమానమైన రీతిలో’ (equal honor) అని అర్థం ఇస్తుంది. అంటే తండ్రిని ఏ విధంగానైతే ఆరాధిస్తామో కుమారుడిని కూడా అదే విధంగా ఆరాధించాలని దీని సారాంశం. దేవుడు తన మహిమను మరి ఎవరితోనూ పంచుకోడు (యెషయా 42:8). ఒకవేళ క్రీస్తు దేవుడు కాకపోయి ఉంటే తండ్రికి ఇచ్చే అదే స్థాయి ఘనతను కోరడం అపరాధమయ్యేది. తండ్రితో సమానమైన ఆరాధనను పొందడానికి అర్హుడైన క్రీస్తు, నిశ్చయంగా దైవత్వంలో తండ్రితో సమానుడు.


43. మత్తయి 28:19 “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు”

అభ్యంతరం: ఇది ముగ్గురు వేర్వేరు వ్యక్తులను (separate beings) చూపిస్తుంది తప్ప దైవత్వాన్ని కాదు.

సమాధానం: ఇక్కడ గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏంటంటే "నామము" (Name) అనేది ఏకవచనంలో ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు విభిన్న వ్యక్తులు అయినప్పటికీ వారు కలిగియున్న దైవిక స్వభావం మరియు అధికారం ఒక్కటే. దైవిక గుర్తింపు (divine identity) కలిగిన ఈ వ్యక్తుల జాబితాలో ఒక మనిషిని లేదా ఒక శక్తిని ప్రస్తావించడం అసాధ్యం. కానీ దైవిక గుర్తింపు కలిగిన ఈ త్రిత్వంలో కుమారుడు ఉండడం ఆయన దైవత్వానికి మరియు తండ్రితో ఉన్న ఏకత్వానికి తిరుగులేని నిదర్శనం.


44. యోహాను 17:5 “తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.”

అభ్యంతరం: ఇది దేవునికి ముందుగానే తెలిసిన ప్రణాళికాబద్ధమైన మహిమ (foreknown glory) మాత్రమే.

సమాధానం: యేసు ఇక్కడ కేవలం ఒక 'భావన' గురించి మాట్లాడడం లేదు, కానీ సృష్టికి పూర్వమే తండ్రితో తాను కలిగియున్న వాస్తవమైన మహిమ (Actual shared glory) గురించి మాట్లాడుతున్నాడు. యెషయా 42:8 ప్రకారం; దేవుడు తన మహిమను మరి ఎవరికీ ఇవ్వడు. క్రీస్తు తండ్రితో సమానంగా ఆ మహిమను కలిగియున్నాడంటే ఆయన సృష్టించబడిన ప్రాణి కాదని, నిత్యుడైన దేవుడని అర్థం. కాలానికి అతీతమైన అదే మహిమతో తనను మహిమపరచమని అడగడం ఆయన దైవిక పూర్వ దైవిక అస్తిత్వానికి (Pre-existence) నిదర్శనం.


45. యోహాను 5:19 “కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.”

అభ్యంతరం: ఈ వచనం కుమారుడు తండ్రిపై ఆధారపడి ఉన్నాడని (Dependence) సూచిస్తుంది.

సమాధానం: ఇది కేవలం ఆధారపడడం కాదు, ఇది తండ్రి మరియు కుమారుల మధ్య ఉన్న పరిపూర్ణ క్రియాశీలక సమానత్వం (Equality in action) యొక్క ధృవీకరణ. దేవుడు చేసే సృష్టి లేదా సంరక్షణ వంటి కార్యాలను ఏ సృష్టించబడిన ప్రాణి కూడా చెయ్యలేదు. తండ్రి చేసే పనులనే కుమారుడు కూడా 'అదే విధంగా' (Identically) చేస్తున్నాడంటే ఆయనకు తండ్రితో సమానమైన శక్తి మరియు జ్ఞానం ఉన్నాయని అర్థం. ఈ అద్భుతమైన సహకారం వారిద్దరి దైవిక స్వభావం ఒక్కటేనని చాటిచెప్పే ఒక బలమైన ఆధారం.


46. హెబ్రీ 1:3 “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.”

అభ్యంతరం: “మూర్తిమంతము” (Image/Imprint) అంటే అసలు కంటే తక్కువ స్థాయి కలిగిన ఒక నకలు (inferior copy) అని అర్థం.

సమాధానం: ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం 'క్యారెక్టర్' (Charaktēr). దీని అర్థం ఒక ముద్ర యొక్క అసలు రూపం లేదా "అసలు స్వభావము యొక్క ఖచ్చితమైన ముద్ర" (Exact imprint of essence). కుమారుడు దైవిక స్వభావాన్ని పరిపూర్ణంగా మరియు ఖచ్చితంగా వ్యక్తపరుస్తున్నాడు. ఆయన దేవుని మహిమకు ప్రతినిధి మాత్రమే కాదు, ఆ మహిమకు ఆయనే మూలరూపం. క్రీస్తును చూచినప్పుడు మనం చూసేది దేవుని యొక్క మసకబారిన నీడను కాదు, సాక్షాత్తు దేవుణ్ణే.


47. మత్తయి 5:21-22 “నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహా సభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.”

అభ్యంతరం: ఇది యేసు ఒక కొత్త ధర్మశాస్త్రాన్ని ఇచ్చే బోధకుడు అని సూచిస్తుందే తప్ప, ఆయన దైవత్వాన్ని కాదు.

సమాధానం: క్రీస్తు మోషేను వ్యతిరేకించలేదు, కానీ యూదా మత శాస్త్రులు (Rabbis) ఇచ్చిన తప్పుడు వివరణలను (false glosses) ఖండించాడు. వారు నరహత్య అనే ఆజ్ఞను కేవలం బాహ్యమైన హత్యకే పరిమితం చేశారు. యేసు ఒక సార్వభౌమ్య అధికారపూర్వక విధానములో (magisterial and authoritative manner) ఆ ధర్మశాస్త్రం యొక్క నిజమైన ఆధ్యాత్మిక అర్థాన్ని పునరుద్ధరించాడు. ఆయన ఒక సర్వోన్నత బోధకుడిగా దైవిక సత్యాలను వెల్లడించడం, ఆయనలోని దైవిక అధికారాన్ని స్పష్టం చేస్తోంది.


48. మత్తయి 12:8 “కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడనెను.”

అభ్యంతరం: దీని అర్థం ఆయన విశ్రాంతి దినాన్ని వివరించేవాడు (interpreter) అని మాత్రమే.

సమాధానం: లేఖనాల ప్రకారం విశ్రాంతి దినము యెహోవాకు ప్రతిష్ఠితమైనది (నిర్గమ 20:10). దానిపై 'ప్రభుత్వాన్ని' (Lordship) ప్రకటించడం అంటే దేవుని నిబంధన సంస్థ పైన దైవిక అధికారాన్ని కలిగి ఉన్నానని చాటిచెప్పడమే. విశ్రాంతి దినమును నియమించినవాడే దానికి ప్రభువుగా ఉండగలడు. కాబట్టి క్రీస్తు తాను ఆ దినమునకు ప్రభువునని చెప్పుకోవడం ద్వారా తాను ఆ నియమాన్ని స్థాపించిన సృష్టికర్తనని ధృవీకరిస్తున్నాడు.


49. యోహాను 14:9 “యేసు - ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?”

అభ్యంతరం: ఆయన ఇక్కడ దేవుని ప్రతినిధిగా (representative) మాత్రమే మాట్లాడుతున్నాడు.

సమాధానం: యేసు తనను తాను దేవుని ప్రతిబింబంగా మాత్రమే పేర్కొనలేదు, కానీ తనను చూస్తే తండ్రిని చూసినట్లేనని ప్రకటించాడు. తండ్రి ఏ గుణాలను, ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అవే కలిగి ఉన్నాడు. ఏ ప్రవక్త లేదా దూత ఇలాంటి ప్రకటన చెయ్యలేరు. దైవత్వాన్ని పరిపూర్ణంగా బయలుపరచగలిగే ఈ సామర్థ్యం, క్రీస్తు తండ్రి యొక్క అదే దైవిక స్వభావాన్ని (Divine Nature) కలిగియున్నాడని నిరూపిస్తోంది.


50. ప్రకటన 5:13-14 “అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును - సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులుఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి (గొర్రె పిల్లకు) నమస్కారము చేసిరి.”

అభ్యంతరం: ఇక్కడ జరిగే ఆరాధన ఒక సూచనప్రాయమైన గౌరవం (symbolic honor) మాత్రమేనని కొందరు అంటారు.

సమాధానం: ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవునికి మరియు గొర్రెపిల్లకు (క్రీస్తుకు) ఒకే వాక్యంలో ఒకే రకమైన ఆరాధన చెల్లించబడుతోంది. యూదా ఏకేశ్వర వాదం (monothesim) ప్రకారం, ఆరాధన అనేది కేవలం సృష్టికర్తకే చెందాలి. పరలోక సైన్యమంతా క్రీస్తు ముందు సాగిలపడి నమస్కరించడం ద్వారా ఆయన ఆరాధనకు పాత్రుడైన దేవుడని ధృవీకరిస్తున్నారు. సింహాసనంపై ఉన్న తండ్రితో సమానంగా మహిమను పొందుతున్న గొర్రెపిల్ల, నిశ్చయంగా సర్వాధికారియైన దేవుడు.


భాగం 6: క్రీస్తు ఆరాధనను స్వీకరించడం


యూదుల ఏకేశ్వర వాదం (Jewish monotheism) ప్రకారం ఆరాధన అనేది కేవలం దేవునికి మాత్రమే చెందాలి. ఈ విభాగంలో యేసు క్రీస్తు అలాంటి ఆరాధనను స్వీకరించిన సందర్భాలను మనం పరిశీలిస్తాము. తమకు మొక్కాలని చూసిన వారిని గద్దించిన దేవదూతలు లేదా అపొస్తలుల వలె కాకుండా యేసు ఆరాధనను తన హక్కుగా స్వీకరించాడు. తద్వారా ఆయన మన విశ్వాసానికి ఆరాధనకు పాత్రుడు (Object of our faith and worship) అని ఈ భాగంలో ధ్రువీకరించబడింది.


51. మత్తయి 2:11 “(జ్ఞానులు) తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.”

అభ్యంతరం: ఇక్కడ వాడబడిన గ్రీకు పదాన్ని కేవలం ఒక రాజుకు ఇచ్చే గౌరవపూర్వక నమస్కారంగా (Bowing) మాత్రమే చూడాలని కొందరు అంటారు.

సమాధానం: కొత్త నిబంధనలో దైవారాధనను సూచించడానికి వాడే 'ప్రోస్కునెయో' (Proskuneō) అనే పదాన్నే మత్తయి ఇక్కడ వాడాడు. జ్ఞానులు కేవలం గౌరవించడం కోసం ఆ శిశువు వద్దకు వచ్చి సాష్టాంగపడలేదు. వారు ఆయనను ఆరాధించారు. బంగారము, సాంబ్రాణి, బోళము వంటి కానుకలు ఆయన దైవత్వానికి మరియు రాజుల రాజనే హోదాకు చిహ్నాలు. అన్నట్లు ఇది వారు రాజులందరికీ చేసే సామాన్య మర్యాద అయ్యుంటే అలాంటిదేదీ వారు అదివరకే కలిసిన హేరోదుకు అలా చెయ్యలేదు ఎందుకో మరి? కాబట్టి ఆ శిశువు సాక్షాత్తు ఆరాధనకు పాత్రుడైన దేవుడని ఇక్కడ నిరూపించబడింది.


52. మత్తయి 8:2 “ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.”

అభ్యంతరం: ఇక్కడ "మ్రొక్కి" అంటే కేవలం సహాయం కోరే ముందు చేసే ఒక మర్యాదపూర్వక వందనం మాత్రమే.

సమాధానం: ఆ కుష్ఠరోగి కేవలం నమస్కరించలేదు, తన ఆరాధనను క్రీస్తు యొక్క సార్వభౌమత్వ సంకల్పంతో (Sovereign Will) ముడిపెట్టి వేడుకుంటున్నాడు. "నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవు" అనే మాట ద్వారా ప్రకృతిపై మరియు వ్యాధులపై క్రీస్తుకు ఉన్న దైవిక అధికారాన్ని అతడు ఒప్పుకున్నాడు. సృష్టించబడిన ఏ మనిషికీ ఇలాంటి స్వస్థపరిచే అధికారం స్వతహాగా ఉండదు. ఆ రోగి క్రీస్తును దేవునిగా గుర్తించి ఆరాధించాడు మరియు ప్రభువు అతనికి స్వస్థతనిచ్చాడు.


53. మత్తయి 14:33 “అంతట దోనెలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.”

అభ్యంతరం: “దేవుని కుమారుడు” అంటే ఒక ప్రత్యేకమైన ప్రవక్త లేదా మెస్సీయ (Messiah) అని మాత్రమే అర్థం చేసుకోవాలి.

సమాధానం: శిష్యులు యేసు సముద్రాన్ని శాసించడం చూసి నిశ్చేష్టులయ్యారు. లేఖనాల ప్రకారం సముద్రాన్ని అణచివేసే శక్తి కేవలం యెహోవాకు మాత్రమే ఉంటుంది (యోబు 9:8). ఈ అద్భుతం చూసిన తర్వాత వారు ఆయన దైవిక గుర్తింపును (Divine Identity) గ్రహించి ఆరాధించారు. ఇది కేవలం ఒక బిరుదుకు ఇచ్చే గౌరవం కాదు, సృష్టికర్తను గుర్తించి చేసిన ఆరాధన. సముద్రంపై నడచిన దేవుడు తమ మధ్య ఉన్నాడని శిష్యులు ఇక్కడ ధృవీకరించారు.


54. మత్తయి 28:9,17 “యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయనయొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి.”

అభ్యంతరం: ఇది పునరుత్థాన అద్భుతాన్ని చూసినప్పుడు కలిగే ఒక తాత్కాలిక భావోద్వేగ ప్రతిచర్య (Emotional reaction) మాత్రమే.

సమాధానం: పునరుత్థానం తర్వాత యేసు తన శిష్యులకు కనిపించినప్పుడు, ఆరాధన అనేది ఒక సహజ ప్రక్రియగా మారింది. వారు ఆయన పాదములు పట్టుకొని ఆరాధించినప్పుడు ఆయన వారిని వారించలేదు. దేవదూతలు సైతం "నేను నీ తోటి దాసుడను, దేవునికే నమస్కారము చేయుము" అని ఆరాధనను నిరాకరిస్తారు (ప్రకటన 19:10). కానీ యేసు ఆరాధనను స్వీకరించడం ఆయన దైవత్వానికి నిలువెత్తు సాక్ష్యం. మరణాన్ని జయించిన దేవుడు మాత్రమే ఇలాంటి సర్వలోక ఆరాధనకు అర్హుడు.


55. యోహాను 20:28 “అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.”

అభ్యంతరం: తోమా పొరపాటున అలా అని ఉండవచ్చు (Thomas was mistaken) లేదా ఆశ్చర్యంతో అలా అని ఉండవచ్చు తప్ప, ఆయనను నిజంగా దేవుడని నమ్మి అనలేదని కొందరు వాదిస్తారు.

సమాధానం: తోమా ఇక్కడ క్రీస్తును 'నా దేవుడు' (Ho Theos mou) అని నేరుగా సంబోధించాడు. ఒకవేళ అది తప్పు ఐతే సత్యాన్ని బోధించే క్రీస్తు అతనిని వెంటనే సరిదిద్ది ఉండేవాడు. కానీ యేసు ఆ ఒప్పుకోలును ఆశీర్వదించి, తోమా విశ్వాసాన్ని ధృవీకరించాడు. యూదుడైన తోమా దేవుడు తప్ప మరెవరినీ ఇలా పిలవడు. కాబట్టి, క్రీస్తు పునరుత్థానం ఆయన దైవత్వాన్ని (Deity) తిరుగులేని విధంగా నిర్ధారించిందని ఈ ప్రసిద్ధ ఒప్పుకోలు నిరూపిస్తోంది.


56. ప్రకటన 5:12-14 “వారు వధింపబడిన గొఱ్ఱపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును - సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.”

అభ్యంతరం: గొఱ్ఱపిల్ల (క్రీస్తు) తండ్రి కంటే తక్కువ స్థాయి ఘనతను (lesser honor) లేదా ఆరాధనను పొందుతున్నాడని కొందరు భ్రమపడతారు.

సమాధానం: ఇక్కడ పరలోకమంతా దేవునికి మరియు గొఱ్ఱపిల్లకు ఒకే విధమైన ఆరాధనను (Identical Worship) చెల్లిస్తోంది. స్తోత్రము, ఘనత, మహిమ మరియు ప్రభావము ఇద్దరికీ సమానంగా ఆపాదించబడ్డాయి. దేవుడు తన మహిమను ఎవ్వరికీ ఇవ్వడు (యెషయా 42:8). క్రీస్తు ఆ మహిమను తండ్రితో సమానంగా కలిగియున్నాడు అంటే దైవత్వంలో ఆయన తండ్రితో ఏకమై ఉన్నాడని అర్థం. సర్వసృష్టీ ఆ గొఱ్ఱపిల్ల ముందు సాగిలపడడం ఆయన సర్వోన్నత దైవత్వానికి నిదర్శనం.


57. అపో. కార్యములు 7:59 “ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.”

అభ్యంతరం: ఇది మరణ సమయంలో చేసిన ఒక ఆవేదనతో కూడిన ప్రార్థన తప్ప (exceptional) సాధారణంగా చేసే ప్రార్థన కాదు.

సమాధానం: స్తెఫను తన మరణ సమయమందు యేసుక్రీస్తుకు ప్రార్థన చేశాడు; ఇది కీర్తనల గ్రంథం 31:5లో యెహోవాకు చేసిన ప్రార్థనను నేరుగా ప్రతిధ్వనిస్తోంది. తన ఆత్మను భద్రపరిచే అధికారం క్రీస్తుకు ఉందని స్తెఫను నమ్మాడు. ప్రార్థనలను ఆలకించి, ఆత్మలను పరలోకానికి చేర్చుకోగలిగే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంటుంది. క్రీస్తుకు అలా ప్రార్థిండం ద్వారా మొదటి క్రైస్తవ హతసాక్షి అయిన స్తెఫను యేసు ప్రభువు యొక్క దైవత్వాన్ని తన రక్తంతో ధృవీకరించాడు.


58. 1 కొరింథీ 1:2 “కొరింథులో నున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.”

అభ్యంతరం: ఇక్కడ “యేసు క్రీస్తు నామమున ప్రార్థించుట” (Calling upon the name) అనేది అలంకారిక భాష (Figurative language) మాత్రమేనని కొందరు అంటారు

సమాధానం: పాత నిబంధనలో “యెహోవా నామమున మొరపెట్టుట” (Calling upon the name of YHWH) అనేది దేవునికి మాత్రమే చేసే ప్రత్యేక ఆరాధన (యోవేలు 2:32). పౌలు అదే పదజాలాన్ని ఇక్కడ యేసుక్రీస్తుకు అన్వయించాడు. అంటే క్రైస్తవుల ప్రాథమిక గుర్తింపు ఏంటంటే వారు యేసును దేవునిగా ఆరాధించేవారు. మనం ఎవరి నామమున ప్రార్థిస్తామో ఆయనే మన దేవుడు. క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించేవారి గురించి అపొస్తలుడైన పౌలు రాసిన ఈ మాటలు క్రీస్తు యొక్క దైవత్వాన్ని ధృవీకరిస్తున్నాయి.


59. ఫిలిప్పీ 2:9-11 “అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమిక్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.”

అభ్యంతరం: దేవుడు యేసును హెచ్చించాడు కాబట్టి, ఆయన కేవలం దేవుని ప్రతినిధి మాత్రమేనని వాదిస్తారు.

సమాధానం: పౌలు ఇక్కడ యెషయా 45:23లోని తండ్రి మాటలను నేరుగా క్రీస్తుకు అన్వయించాడు. అక్కడ తండ్రి "ప్రతి మోకాలు నా యెదుట వంగును" అని కేవలం తన గురించి మాత్రమే చెప్పుకున్నాడు. తండ్రికి మాత్రమే వర్తించే ఈ సర్వోన్నత ఆరాధనను క్రీస్తుకు ఆపాదించడం ద్వారా పౌలు యేసును తండ్రితో సమానమైన దైవత్వము కలవానిగా ప్రకటించాడు. సమస్త సృష్టి ఆయన ముందు మోకరించడం అంటే ఆయనను అందరికి పైనున్న దేవునిగా అంగీకరించడమే.


60. హెబ్రీ 1:6 “మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు.”

అభ్యంతరం: దేవదూతలు ఆయనను ఒక ఉన్నతమైన సృష్టముగా (superior creature) మాత్రమే గౌరవిస్తున్నారని కొందరు అంటారు.

సమాధానం: దేవుడు స్వయంగా తన దూతలను కుమారుడిని ఆరాధించమని ఆజ్ఞాపిస్తున్నాడు. లేఖనాల ప్రకారం ఆరాధన కేవలం సృష్టికర్తకే చెందాలి, సృష్టించబడిన వారికి కాదు (మత్తయి 4:10). దేవదూతలే సాగిలపడి ఆరాధిస్తున్నారంటే క్రీస్తు దేవుడని అర్థం. దేవదూతల కంటే ఉన్నతమైన స్థానంలో ఉండి, వారి ఆరాధనను అందుకుంటున్న క్రీస్తు, నిశ్చయంగా దైవత్వం కలిగిన సృష్టికర్త.


భాగం 7: మెస్సీయను దేవునిగా గుర్తించే పాత నిబంధన ప్రవచనాలు


ఈ భాగము పాత మరియు కొత్త నిబంధనల మధ్య ఒక వారధిగా నిలుస్తుంది. కేవలం మానవ మాత్రుడైన రాజు కంటే ఎన్నో రేట్లు ఉన్నతుడైన మెస్సీయను ముందుగానే దర్శించిన యెషయా జెకర్యా మరియు కీర్తనాకారుల ప్రవచనాలను ఈ భాగంలో మనం పరిశీలిస్తాము. పాత నిబంధన ఛాయలలో వాగ్దానం చెయ్యబడిన ఆ "బలవంతుడైన దేవుడు" (Mighty God), యేసు క్రీస్తు అనే వ్యక్తిగా ఎలా పరిపూర్ణంగా బయలుపరచబడ్డాడో మనం చూస్తాము.


61. యెషయా 9:6 “ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.”

అభ్యంతరం: “బలవంతుడు” (Mighty) అంటే కేవలం శక్తి గలవాడని అర్థం కానీ, “సర్వశక్తిమంతుడు” (Almighty) అని కాదని కొందరు వాదిస్తారు.

సమాధానం: హెబ్రీ మూలభాషలో ఇక్కడ వాడబడిన 'ఎల్ గిబ్బోర్' (El Gibbor) అనే పదం, సరిగ్గా తర్వాత అధ్యాయం (యెషయా 10:21) లో సాక్షాత్తు యెహోవాను వర్ణించడానికి వాడబడింది. ప్రత్యేకంగా దేవునికే ఉపయోగించే ఈ బిరుదును మెస్సీయకు ఆపాదించడం ఆయన దైవత్వానికి బలమైన నిదర్శనం. ఆయన కేవలం బలవంతుడైన మనిషి కాదు, సృష్టిని శాసించే సర్వశక్తిమంతుడైన దేవుడు. నిత్యుడగు తండ్రిగా సమాధానకర్తగా ఆయనకు ఉన్న పేర్లు ఆయన దైవిక స్వభావాన్ని, నిత్య ఉనికిని సుస్థిరం చేస్తున్నాయి.


62. మీకా 5:2 “బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.”

అభ్యంతరం: ఇది కేవలం మెస్సీయ యొక్క ప్రాచీన వంశావళిని (ancient lineage) మాత్రమే సూచిస్తుందని కొందరు అంటారు.

సమాధానం: ఇక్కడ "శాశ్వత కాలము" (From everlasting) అనే పదబంధం కేవలం వంశావళిని కాదు, కానీ కాలానికి అతీతమైన నిత్య ఉనికిని (Eternal Existence) సూచిస్తుంది. బేత్లెహేములో జన్మించిన శిశువు యొక్క ఉనికి సమయములో ఆరంభం కాలేదు; ఆయన ఆది నుండి ఉన్నవాడు. సృష్టించబడిన ఏ మానవుడికి ఇలాంటి నిత్యత్వం ఉండదు. కాలారంభానికి ముందే ఉనికి కలిగి ఉండి, తర్వాత చరిత్రలోకి ప్రవేశించిన మెస్సీయ నిశ్చయంగా దైవత్వం కలిగిన వాడు. ఈ ప్రవచనం క్రీస్తు యొక్క శరీరధారణను మరియు ఆయన నిత్యత్వాన్ని ఏకకాలంలో ధృవీకరిస్తోంది.


63. కీర్తన 45:6 (హెబ్రీ 1:8) “దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.”

అభ్యంతరం: ఇక్కడ "దేవా" అని సంబోధించడం ఒక భూసంబంధమైన రాజును గౌరవించే అలంకారిక పద్ధతి (metaphorically) మాత్రమేనని అంటారు.

సమాధానం: హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ వచనాన్ని నేరుగా కుమారునికి (యేసుక్రీస్తుకు) అన్వయించి, ఆయనను "దేవుడు" అని తండ్రియే స్వయంగా పిలుస్తున్నట్లుగా స్థిరపరిచింది. ఏ మానవ రాజు సింహాసనం నిరంతరం నిలవదు. కేవలం దేవుని సింహాసనం మాత్రమే శాశ్వతమైనది. క్రీస్తును "దేవా" అని సంబోధించడం ద్వారా ఆయన కేవలం ఒక ప్రతినిధి కాదని, ఆ రాజ్యానికి మూలకర్తయైన దేవుడని లేఖనం స్పష్టం చేస్తోంది. ఆయన రాజదండం న్యాయార్థమైనది మరియు ఆయన పాలన దైవికమైనది.


64. జెకర్యా 12:10 “దావీదు సంతతి వారిమీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు ,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.”

అభ్యంతరం: దేవుడు ఇక్కడ కేవలం ఒక ప్రవక్త లేదా ప్రతినిధి (representative) పడే బాధను తన బాధగా చెబుతున్నాడని కొందరు వాదిస్తారు.

సమాధానం: ఇక్కడ యెహోవా స్వయంగా "నా మీద" (Me) అని మాట్లాడుతున్నాడు. యెహోవా ఆత్మస్వరూపి, ఆయనను ఎవరూ పొడవలేరు. కానీ ఈ ప్రవచనం క్రీస్తు శరీరధారణ (Incarnation) ద్వారా నెరవేరిందని యోహాను ధృవీకరిస్తున్నాడు (యోహాను 19:37). సిలువపై పొడవబడినది క్రీస్తే ఐతే ఆయన స్వభావంలో యెహోవాతో ఏకమై ఉన్నాడు కాబట్టి, ఆ గాయం దేవునికే తగిలినట్టుగా ఇక్కడ ప్రవచించబడింది. దేవుడే నరుడిగా వచ్చి తన ప్రజల కోసం పొడవబడతాడని ఈ వచనం చాటి చెబుతోంది. ఇది క్రీస్తు దైవత్వానికి మరియు ఆయన బలియాగానికి ఉన్న విడదీయలేని బంధాన్ని నిరూపిస్తోంది.


65. యెషయా 40:3 “ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.”

అభ్యంతరం: బాప్తిస్మమిచ్చు యోహాను కేవలం దేవుని ప్రణాళికకు (God’s plan) లేదా ఒక ప్రవక్తకు మార్గం సిద్ధం చేశాడని అంటారు.

సమాధానం: ఈ ప్రవచనం "యెహోవాకు" (Yahweh) మార్గం సిద్ధం చెయ్యమని స్పష్టంగా ఆజ్ఞాపిస్తోంది. సువార్త రచయితలందరూ ఏకగ్రీవంగా ఈ వచనాన్ని యేసుక్రీస్తు రాకకు అన్వయించారు. యోహాను ఎవరికైతే మార్గం సిద్ధం చేశాడో ఆయనే యెహోవా. క్రీస్తు రావడం అంటే సాక్షాత్తు దేవుడే తన ప్రజల మధ్యకు రావడం అని దీని అర్థం. తండ్రికీ యేసుక్రీస్తుకీ ఉన్న ఈ అనన్యమైన గుర్తింపు, క్రీస్తు యొక్క దైవత్వాన్ని తిరిగులేని రీతిలో చాటి చెబుతోంది.


66. మలాకీ 3:1 “ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను ; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.”

అభ్యంతరం: ఇవి కేవలం తండ్రియైన దేవుడు తన మహిమను ఆలయంలో కనబరుస్తాడని చెప్పబడిన మాటలని అంటారు.

సమాధానం: ఇక్కడ ప్రభువును ఉద్దేశించి వాడబడిన 'హా-అదోన్' (ha-Adon) అనే పదం కేవలం దైవత్వానికి మాత్రమే వాడబడుతుంది. ఆలయం అనేది దేవుని ఇల్లు; యేసుక్రీస్తు తన పరిచర్యలో అనేకమార్లు ఆలయాన్ని 'నా తండ్రి ఇల్లు' అని పిలిచి, దానిపై తన అధికారాన్ని కనబరిచాడు. ఈ నిబంధన దూత మరెవరో కాదు, శరీరధారియైన ప్రభువే. ఆయన రాకడ దేవుని ప్రత్యక్షత అని ఈ ప్రవచనం ధృవీకరిస్తోంది.


67. దానియేలు 7:13-14 రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులును రాష్ట్రములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు.”

అభ్యంతరం: క్రీస్తు కేవలం దేవుని ద్వారా అధికారం పొందిన ఒక గొప్ప మానవ పాలకుడు (exalted human ruler) మాత్రమేనని అంటారు.

సమాధానం: ఇక్కడ "సేవించుట" కోసం వాడబడిన అరమిక్ పదం 'పెలాక్' (Pelach). దానియేలు గ్రంథంలో ఈ పదం కేవలం దైవానికి చెల్లించే ఆరాధనను సూచించడానికి మాత్రమే వాడబడింది. సృష్టించబడిన ఏ మానవుడికీ ఇలాంటి దైవిక ఆరాధన చెల్లించబడదు. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది మరియు ఆయన రాజ్యము ఎన్నటికీ లయము కాదు. సమస్త జాతులు ఆరాధించే ఈ మనుష్యకుమారుడు సామాన్య మానవుడు కాదు, ఆయన పరలోక మహిమ కలిగిన దైవకుమారుడు.


68. కీర్తన 2:7 “కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.”

అభ్యంతరం: ప్రాచీన కాలంలో రాజులను కూడా “దేవుని కుమారులు" అని పిలిచేవారు, కాబట్టి ఇది కేవలం ఒక గౌరవార్థక బిరుదు మాత్రమే.

సమాధానం: లేఖనాలు క్రీస్తును "అద్వితీయ కుమారుడు" అని పిలవడం ద్వారా ఆయనను అందరినుండీ వేరు చేస్తున్నాయి. హెబ్రీ 1వ అధ్యాయం ఈ వచనాన్ని ఉటంకిస్తూ క్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడని, ఆయన దైవిక స్వభావం కలవాడని నిరూపించింది. సృష్టికర్తతో సమానమైన స్వభావం కలిగిన ఏకైక కుమారుడు క్రీస్తు మాత్రమే. దైవత్వంలో ఆయన తండ్రికి ప్రతిరూపం.


69. యెషయా 7:14 “కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.”

అభ్యంతరం: “ఇమ్మానుయేలు” అనేది కేవలం దేవుడు మనకు తోడుగా ఉన్నాడని తెలిపే ఒక అలంకారికమైన లేదా సూచనాత్మకమైన (Symbolic) బిరుదు మాత్రమేనని అంటారు.

సమాధానం: మత్తయి సువార్త ఈ పేరుకు "దేవుడు మనకు తోడు" (God with us) అని అర్థం చెప్పి, అది క్రీస్తు పుట్టుకలో నెరవేరిందని ధృవీకరించింది. ఇది కేవలం ఒక భావన కాదు, అక్షరార్థంగా దేవుడే నరుడిగా మన మధ్య నివసించడం (Incarnation). కన్యక గర్భాన జన్మించడం అనేది అద్భుతమైన దైవిక కార్యం. క్రీస్తు కేవలం దేవుని ప్రతినిధి కాదు, ఆయనలో దైవత్వం శరీరధారియై నివసించింది. మన మధ్యకు దిగి వచ్చిన ఆ ఇమ్మానుయేలు సాక్షాత్తు సర్వవ్యాపియైన దేవుడు.


70. కీర్తన 102:25-27 (హెబ్రీ 1:10–12) “ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును. నీవు ఏకరీతిగానుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.”

అభ్యంతరం: ఈ వచనాలు కేవలం సృష్టికర్తయైన తండ్రి గురించి మాత్రమే మాట్లాడుతున్నాయని విమర్శకులు అంటారు.

సమాధానం: హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ వచనాలను నేరుగా కుమారునికి అన్వయించడం ద్వారా గొప్ప సత్యాన్ని వెల్లడించింది. క్రీస్తు భూమ్యాకాశాలకు పునాది వేసిన సృష్టికర్త. సృష్టి అంతా వస్త్రము వలె పాతగిలి నశించినా ఆయన మాత్రం ఏకరీతిగా (Unchanging) ఉంటాడు. మార్పులేని తనం (Immutability) అనేది కేవలం దేవుని లక్షణం. సృష్టికర్తగా శాశ్వతుడిగా క్రీస్తును వర్ణించే ఈ లేఖనం, ఆయన దైవత్వాన్ని మరియు సృష్టిపై ఆయనకు ఉన్న సార్వభౌమాధికారాన్ని సుస్థిరం చేస్తోంది.


భాగం 8: క్రీస్తు యొక్క దైవిక అధికారం


ఈ భాగంలో మనం క్రీస్తు యొక్క సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని పరిశీలిస్తాము. ప్రకృతి శక్తులను శాసించడం నుండి మోషే ధర్మశాస్త్రాన్ని అధికారికంగా పునర్వ్యాఖ్యానించడం వరకు ("అయితే నేను మీతో చెప్పునదేమనగా..."), యేసు కేవలం సృష్టికర్తకు మరియు ధర్మశాస్త్రకర్తకు మాత్రమే ఉండాల్సిన అంతర్గత శక్తి మరియు అధికారంతో వ్యవహరించాడు. భౌతిక మరియు ఆత్మీయ లోకాలపై ఆయనకున్న ఆధిపత్యాన్ని ఈ విభాగం నొక్కి చెబుతుంది.


71. మార్కు 1:27 “అందరును విస్మయమొంది–ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.”

అభ్యంతరం: ఆ కాలంలో దయ్యములను వెళ్లగొట్టే ఇతర భూత వైద్యులు (Exorcists) కూడా ఉండేవారు, ఇది ఆయనకు మాత్రమే ప్రత్యేకమైనది కాదు.

సమాధానం: ఇతర భూత వైద్యులు మంత్రతంత్రాలు లేదా సుదీర్ఘమైన పద్ధతుల ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నించేవారు. కానీ యేసుక్రీస్తు ఎలాంటి బాహ్య సాధనాలు లేకుండా కేవలం తన "సార్వభౌమ అధికారముతో" (Direct Sovereign Authority) శాసించగానే దయ్యములు లోబడ్డాయి. దయ్యములు ఆయనను చూడగానే భయంతో వణకడం, ఆయన దైవిక ఉనికిని గుర్తిస్తున్నాయనడానికి నిదర్శనం. సృష్టికర్త తన తిరుగుబాటుదారులను శాసించినట్టుగా క్రీస్తు వాటిని వెళ్ళగొట్టాడు. ఈ విధమైన తక్షణ విధేయత కేవలం దైవిక అధికారానికే సాధ్యం.


72. లూకా 4:39 “ఆయన (యేసు క్రీస్తు) ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను.”

అభ్యంతరం: యేసు క్రీస్తు అద్భుతాలు చేసే ఒక శక్తివంతమైన ప్రవక్త (Miracle-working prophet) మాత్రమే అని అంటారు.

సమాధానం: యేసుక్రీస్తు ఇక్కడ జ్వరాన్ని ఒక నిర్జీవమైన దానిని గద్దించినట్టుగా కాకుండా ఒక వ్యక్తిగత శక్తిని గద్దించినట్టుగా (Rebukes like a personal force) గద్దించాడు. ప్రవక్తలు లేదా అపొస్తలులు దేవుడు వారికి అనుగ్రహించిన అధికారాన్ని బట్టి, ఆయన నామంలో ప్రార్థించి స్వస్థపరిచేవారు, కానీ క్రీస్తు తన స్వంత అధికారంతో ప్రకృతి శక్తులను శాసిస్తున్నాడు. సృష్టి తన యజమానికి స్పందించినట్టుగా ఆ జ్వరం ఆయన మాటకు లోబడింది. వ్యాధులపై ఇలాంటి వ్యక్తిగత అధికారం కలిగి ఉండడం అనేది ఆయన సృష్టికర్త అనడానికి బలమైన సాక్ష్యం.


73. మత్తయి 8:26 “అందుకాయన – అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను.”

అభ్యంతరం: గాలి, సముద్రం నిమ్మళించడం అనేది ఒక కాకతాళీయమైన (Coincidental) సంఘటన మాత్రమేనని కొందరు వాదిస్తారు.

సమాధానం: గాలి మరియు సముద్రం ఆయన ఆజ్ఞకు వెనువెంటనే లోబడ్డాయి, ఇది కాకతాళీయం కాదు. లేఖనాల ప్రకారం సముద్రపు పొంగును అణచివేసే శక్తి కేవలం యెహోవాకు మాత్రమే ఉంటుంది (కీర్తనలు 89:9). ప్రకృతి శక్తులు క్రీస్తు స్వరానికి లోబడడం ద్వారా ఆయన సృష్టిని కలుగచేసిన దేవుడని ధృవీకరించబడింది. శిష్యులు "ఈయన ఎవరై ఉంటారు?" అని ఆశ్చర్యపోవడం వెనుక ఉన్నది ఇదే. సాక్షాత్తు సృష్టికర్తే తమ దోనెలో ఉన్నాడని వారు గ్రహించారు.


74. మత్తయి 9:6 “అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి–నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా”

అభ్యంతరం: ఇది దేవుడు తన ప్రతినిధికి అప్పగించిన (Delegated authority) అధికారము మాత్రమేనని విమర్శకులు అంటారు.

సమాధానం: యేసుక్రీస్తు ఇక్కడ పాపక్షమాపణను ఒక బాహ్య అద్భుతంతో (స్వస్థత) ముడిపెట్టి తన అధికారాన్ని నిరూపించాడు. దేవాలయ బలులు లేదా యాజకత్వం వంటి పాత నిబంధన పద్ధతులతో నిమిత్తం లేకుండా ఆయన నేరుగా పాపాలను క్షమిస్తున్నాడు. పాపము అనేది దేవునికి విరుద్ధంగా చేసే నేరం; దానిని క్షమించే అధికారం కేవలం ఆ దేవునికే ఉంటుంది. ఈ అధికారాన్ని క్రీస్తు స్వయంగా కలిగియుండడం ఆయనలోని స్వాభావిక దైవిక అధికారాన్ని (Intrinsic authority) చాటిచెబుతోంది.


75. యోహాను 11:25 “అందుకు యేసు - పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;”

అభ్యంతరం: యేసు క్రీస్తు రాబోయే పునరుత్థానము (resurrection) గురించి మాత్రమే చెబుతున్నాడని కొందరు అర్థం చేసుకుంటారు.

సమాధానం: ఆయన “నేను పునరుత్థానాన్ని కలిగిస్తాను” అని అనలేదు, కానీ “నేనే పునరుత్థానమును” అని చెప్పాడు. అంటే పునరుత్థాన శక్తి మరియు జీవము ఆయనలో అంతర్లీనంగా (Inherent) ఉన్నాయి. మరణం ఆయన ఎదుట నిలబడలేదు. జీవానికి మూలమైన దేవుడు తప్ప మరెవరూ ఇలాంటి ప్రకటన చెయ్యలేరు. లాజరును సమాధిలో నుండి రమ్మని పిలవడం ద్వారా తన మాట ఎంత సత్యమో క్రీస్తు నిరూపించాడు. ఆయన కేవలం జీవాన్ని ఇచ్చేవాడు కాదు, ఆయనే జీవమై ఉన్న దేవుడు.


76. మత్తయి 13:41 “మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు.

అభ్యంతరం: దేవదూతలు కేవలం దేవునికి చెందినవారు (Angels belong to God), యేసుకు కాదు అని వాదిస్తారు.

సమాధానం: లేఖనాలన్నీ దేవదూతలను "దేవుని దూతలు" అని పిలుస్తుండగా యేసు ఇక్కడ వారిని "తన (ఆయన) దూతలు" అని సంబోధిస్తున్నాడు. పరలోక సైన్యంపై ఇలాంటి యజమానత్వాన్ని కలిగి ఉండడం సృష్టించబడిన ఏ ప్రాణికి సాధ్యం కాదు. దేవదూతలను ఆజ్ఞాపించి, వారిని తీర్పు కార్యములకు పంపగలిగే ఈ అధికారం, క్రీస్తు సర్వలోక ప్రభువు అని నిరూపిస్తోంది. ఆయన దేవదూతలకు కేవలం నాయకుడు కాదు, వారిని సృష్టించిన సార్వభౌమ దేవుడు.


77. మత్తయి 24:31 “మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.”

అభ్యంతరం: తన ప్రజలను పోగుచేసే పని దేవునిది మాత్రమే కదా మరి యేసు ఎలా చేస్తాడని అడుగుతారు.

సమాధానం: భూదిగంతాల నుండి తన ప్రజలను పోగుచేసే అధికారం (Eschatological authority) పాత నిబంధన ప్రకారం యెహోవాకు మాత్రమే చెందినది (ద్వితీయోపదేశకాండము 30:4). క్రీస్తు ఆ పాత్రను తనదిగా ప్రకటించుకోవడం ద్వారా తన దైవత్వాన్ని స్పష్టం చేస్తున్నాడు. యేసు తానే స్వయంగా పరలోక సైన్యముతో వచ్చి తన ప్రజలను సమకూర్చుకోవడం, ఆయన సర్వోన్నత దైవత్వాన్ని చాటి చెబుతుంది. అంత్యకాలంలో తీర్పు తీర్చేవాడు మరియు రక్షించేవాడు ఆయనేనని ఇక్కడ స్పష్టమవుతోంది.


78. మత్తయి 12:6 “దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను.”

అభ్యంతరం: యేసు క్రీస్తు ఆ భౌతిక కట్టడము (building) కంటే తాను గొప్పవాడినని మాత్రమే చెబుతున్నాడని కొందరు అంటారు.

సమాధానం: ఇశ్రాయేలీయులకు దేవాలయం అనేది దేవుని ప్రత్యక్షత నివసించే అత్యంత పవిత్ర స్థలం. దానికంటే గొప్పవాడినని చెప్పుకోవడం అంటే దేవుని మహిమ నివసించే నిజమైన నివాసస్థలం తానేనని ప్రకటించడమే. ఎందుకంటే ఇశ్రాయేలు పవిత్ర వ్యవస్థలన్నిటి కంటే దేవుని నివాసస్థలమైన ఆలయము కంటే గొప్పవాడు ఆ దేవుడు మాత్రమే. కాబట్టి దేవాలయం కంటే గొప్పవాడిగా తనను తాను ప్రకటించుకోవడం ద్వారా క్రీస్తు తన దైవత్వాన్ని వెల్లడి చేస్తున్నాడు.


79. మత్తయి 5:21-44 “నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా–..”

అభ్యంతరం: యేసు మోషే ధర్మశాస్త్రాన్ని సవరించిన ఒక సంస్కర్త (Reforming teacher) మాత్రమేనని అంటారు.

సమాధానం: క్రీస్తు మోషేను వ్యతిరేకించడం లేదు, కానీ ధర్మశాస్త్రాన్ని బాహ్య క్రియలకు (outward acts) మాత్రమే పరిమితం చేసిన యూదా బోధకుల తప్పు వ్యాఖ్యానాలను ఆయన సరిచేస్తున్నాడు. ఒక గొప్ప అధికారి వలే (magisterial) “అయితే నేను మీతో చెప్పుచున్నదేమనగా...” అని అనడం ద్వారా ఆయన ధర్మశాస్త్రం యొక్క అసలైన ఆధ్యాత్మిక అర్థాన్ని పునరుద్ధరిస్తున్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని రద్దు చేసేవానిగా కాకుండా దైవిక ధర్మశాస్త్రకర్తగా (Divine Lawgiver) మరియు అధికారిక వ్యాఖ్యాతగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు మాత్రమే ఈ విధంగా అధికారికంగా దానికి సరైన వ్యాఖ్యానాన్ని నిర్ధారించగలడు, మనుషుల వ్యాఖ్యానాలలో ఉన్న లోపాలను సరిదిద్దగలడు.


80. యోహాను 17:2 “నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి.”

అభ్యంతరం: యేసు క్రీస్తుకు ఈ అధికారము అనుగ్రహించబడినది/అప్పగించబడినది (Delegated authority). కాబట్టి ఆయన దేవుడు కాదని కొందరు భ్రమపడతారు.


భాగం 9: విశ్వాసం, నిరీక్షణ మరియు రక్షణకు కేంద్రంగా క్రీస్తు


మన నిత్యజీవం (eternal life) అనేది నేరుగా యేసుతో మనకున్న సంబంధంపైనే ఆధారపడి ఉంటుందని ఈ విభాగం నిరూపిస్తుంది. తానే "మార్గము, సత్యము మరియు జీవము" అని, మరియు రక్షణ పొందడానికి తన నామము తప్ప వేరొక నామము లేదని ప్రకటించడం ద్వారా యేసు తనను తాను దైవిక విమోచన ప్రణాళికకు కేంద్రబిందువుగా ప్రకటించుకున్నాడు. సృష్టించబడిన ఏ ప్రాణి కూడా ఈ స్థానాన్ని ఆక్రమించడం అసాధ్యం.


81. యోహాను 14:1 “మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి.”

అభ్యంతరం: యేసుక్రీస్తు మీద ఉంచే విశ్వాసం అనేది దేవుని మీద ఉంచే విశ్వాసం కంటే తక్కువది లేదా ద్వితీయ శ్రేణికి (Secondary) చెందినదని కొందరు వాదిస్తారు.

సమాధానం: యేసుక్రీస్తు ఇక్కడ తనపై ఉంచే విశ్వాసాన్ని, దేవునిపై ఉంచే విశ్వాసంతో సమాంతరంగా (Parallel) ప్రస్తావిస్తున్నాడు. యూదుల ఏకేశ్వర వాదన ప్రకారం, దేవునితో సమానంగా మరొక వ్యక్తిపై విశ్వాసం ఉంచమని చెప్పడం దేవదూషణతో సమానం. కాబట్టి క్రీస్తు తనను తాను దేవునితో సమానుడిగా ప్రకటించుకోవడం, ఆయన దైవత్వానికి నిదర్శనం. దేవునిని నమ్మినట్టే తనను కూడా నమ్మమని కోరడం ద్వారా తాను దైవత్వంలో తండ్రితో ఏకమై ఉన్నానని ఆయన ధృవీకరిస్తున్నాడు.


82. యోహాను 12:44 “అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను–నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.”

అభ్యంతరం: యేసు తనపై ఉన్న విశ్వాసాన్ని తండ్రి వైపుకు మళ్ళిస్తున్నాడు (Redirects faith to the Father), కాబట్టి ఆయన దేవుడు కాదని అంటారు

సమాధానం: క్రీస్తు ఇక్కడ విశ్వాసాన్ని మళ్ళించడం లేదు, కానీ తనపై ఉంచే విశ్వాసం మరియు దేవునిపై ఉంచే విశ్వాసం అవిభాజ్యమైనవని (Inseparable) బోధిస్తున్నాడు. క్రీస్తును అంగీకరించకుండా దేవునిని అంగీకరించడం అసాధ్యం. ఆయనే దేవునిని సంపూర్ణంగా బయలుపరిచే వ్యక్తి కాబట్టి, ఆయనపై ఉంచే విశ్వాసమే దేవునిపై ఉంచే నిజమైన విశ్వాసం. తండ్రికి మరియు కుమారునికి మధ్య ఉన్న ఈ అనన్యమైన ఏకత్వము, క్రీస్తు కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదని, ఆయనే శరీరధారియైన దేవుడని నిరూపిస్తోంది.


83. 1 తిమోతి 1:1 “మన రక్షకుడైన దేవునియొక్కయు మన నిరీక్షణయైన క్రీస్తుయేసు యొక్కయు ఆజ్ఞప్రకారము క్రీస్తుయేసు యొక్క అపొస్తలుడైన పౌలు,”

అభ్యంతరం: ఇక్కడ నిరీక్షణ (Hope) అనేది కేవలం ఒక ప్రేరణ మాత్రమేనని, ఆయన ఒక మంచి మాదిరి మాత్రమేనని కొందరు అంటారు.

సమాధానం: లేఖనాల ప్రకారం, మానవుని అంతిమ నిరీక్షణ కేవలం దేవుడే (కీర్తనలు 39:7). పౌలు క్రీస్తును “మన నిరీక్షణ” అని పిలవడం ద్వారా ఆయనకు దైవిక రక్షణ సామర్థ్యాన్ని (Divine Saving Sufficiency) ఆపాదిస్తున్నాడు. ఒకవేళ క్రీస్తు కేవలం మనిషి మాత్రమే‌ ఐతే ఆయనను నిరీక్షణకు ఆధారంగా చేసుకోవడం వ్యర్థం. కానీ ఒకవేళ ఆయన మన నిరీక్షణ ఐతే ఆయన మనకు నిత్యజీవాన్ని ఇవ్వగలిగే దేవుడని అర్థం. కాబట్టి ఈ వచనంలో మన నిరీక్షణకు ఆధారమైన దేవుడిగా పౌలు క్రీస్తును ప్రకటిస్తున్నాడు అనేది స్పష్టం.


84. ఎఫెసీ 6:24 “మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక.”

అభ్యంతరం: మనం గురువులను కూడా ప్రేమిస్తాము, కాబట్టి క్రీస్తును ప్రేమించడం ఆయన దైవత్వాన్ని నిరూపించదని వాదిస్తారు.

సమాధానం: ఇక్కడ ప్రస్తావించబడింది సామాన్యమైన ప్రేమ కాదు, ఇది నిత్య కృపను (Eternal Grace) ప్రసాదించే దైవిక ప్రేమ. లేఖనాల ప్రకారం, మనిషి తన పూర్ణ హృదయంతో ప్రేమించాల్సింది కేవలం దేవునిని మాత్రమే (ద్వితీయోపదేశకాండము 6:5). క్రీస్తును అలాంటి అత్యున్నతమైన ప్రేమతో ప్రేమించాలని కోరడం ఆయన దైవత్వానికి నిదర్శనం. ఒక సృష్టించబడిన ప్రాణి పట్ల ఇలాంటి నిబంధన సంబంధిత భక్తిని చూపించడం విగ్రహారాధన ఔతుంది. కాబట్టి, క్రీస్తు ఆరాధించబడవలసిన మరియు ప్రేమించబడవలసిన దేవుడు.


85. మార్కు 8:38 “వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నామాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను.

అభ్యంతరం: యేసు క్రీస్తు దేవుని వర్తమానానికి (God’s message) ఒక ప్రతినిధి మాత్రమే కాబట్టి ఆయనను ప్రవక్తగా చూడాలని అంటారు.

సమాధానం: ఒక వ్యక్తి యొక్క అంతిమ గమ్యం (Final Destiny) యేసు పట్ల ఆ వ్యక్తి చూపే వ్యక్తిగత స్పందనపైనే ఆధారపడి ఉంటుందని ఇక్కడ చెప్పబడింది. తీర్పు దినాన ఒక వ్యక్తిని అంగీకరించడం లేదా తిరస్కరించడం అనేది కేవలం దేవునికి మాత్రమే ఉన్న ప్రత్యేక అధికారం (Divine Prerogative). తీర్పు తీర్చే సింహాసనంపై ఉండి, తన పట్ల చూపిన వైఖరిని బట్టి తీర్పు ఇచ్చే అధికారం క్రీస్తుకు ఉందంటే ఆయన నిశ్చయంగా దేవుడే. ఆయన కేవలం వర్తమానాన్ని తెచ్చినవాడు కాదు, ఆ వర్తమానానికి మూలకర్తయైన ప్రభువు.


86. అపో. కార్య. 2:38 “పేతురు - మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.”

అభ్యంతరం: ఇది ఒక సంక్షిప్త సూత్రం (Shorthand formula) మాత్రమేనని, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున అని చెప్పడానికి బదులు క్లుప్తంగా ఇలా చెప్పారని అంటారు.

సమాధానం: బాప్తిస్మము అనేది ఒక వ్యక్తి తన పాత జీవితాన్ని వదిలి దేవునితో నిబంధన గుర్తింపును (Covenant Identity) పొందే పవిత్ర కార్యం. క్రీస్తు నామమున బాప్తిస్మము పొందడం అంటే ఆయనను దైవిక నామంతో సమానం చెయ్యడమే. దేవుని నామమున కాకుండా ఒక మనిషి నామమున బాప్తిస్మము పొందడం లేఖన విరుద్ధం. అపొస్తలులు క్రీస్తు నామానికి ఇచ్చిన ఈ ప్రాధాన్యత, ఆయన దైవత్వాన్ని మరియు రక్షణలో ఆయనకున్న కీలక పాత్రను సుస్థిరం చేస్తోంది. ఆయన నామమే రక్షణకు ఆధారం.


87. అపో. కార్య. 4:12 “మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.”

అభ్యంతరం: దేవుడు యేసును ఒక సాధనం (Agent) వలె వాడుకుంటున్నాడు తప్ప యేసు దేవుడు కాదని అంటారు.

సమాధానం: ఇక్కడ రక్షణ విషయంలో సంపూర్ణమైన ప్రత్యేకత (Absolute Exclusivity) ప్రకటించబడింది. యెషయా 43:11లో తండ్రి "నేను తప్ప వేరొక రక్షకుడు లేడు" అని సెలవిచ్చాడు. ఇప్పుడు అదే రక్షకత్వ లక్షణాన్ని అపొస్తలులు క్రీస్తుకు ఆపాదిస్తున్నారు. ఒకవేళ క్రీస్తు తండ్రితో సమానుడైన దేవుడు కాకపోతే ఆయన ద్వారా మాత్రమే రక్షణ అనడం పాత నిబంధన సత్యానికి విరుద్ధం ఔతుంది. కాబట్టి క్రీస్తే ఆ రక్షకుడైన దేవుడు అని ఈ వచనం నిస్సందేహంగా నిరూపిస్తోంది.


88. మత్తయి 11:28 “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.”

అభ్యంతరం: యేసు కేవలం ఒక బోధకునిగా (Teacher) ప్రజలకు విశ్రాంతికి మార్గం చూపిస్తున్నాడని అంటారు.

సమాధానం: ఆయన ఇక్కడ భౌతిక విశ్రాంతిని కాదు, ఆత్మ సంబంధమైన విశ్రాంతిని (Soul-rest) ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యిర్మీయా 6:16 ప్రకారం ఇలాంటి విశ్రాంతిని ఇచ్చేవాడు కేవలం యెహోవా మాత్రమే. ఒక మనిషి తన బోధల ద్వారా మార్గం చూపగలడు కానీ తానే స్వయంగా ఆత్మకు విశ్రాంతిని ఇవ్వలేడు. ఆ ఆధ్యాత్మిక విశ్రాంతికి దైవిక మూలముగా (Divine Source) యేసు నిలుస్తున్నాడంటే ఆయన మానవ హృదయాలను తృప్తిపరచగల సర్వశక్తిమంతుడైన దేవుడని అర్థం.


89. గలతీ 2:20 “నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.”

అభ్యంతరం: ఇది కేవలం క్రీస్తు బోధలు తనలో ఉన్నాయని పౌలు అలంకారంగా (Metaphorical language) చెప్పిన మాటలని అంటారు.

సమాధానం: విశ్వాసులందరిలోనూ ఏకకాలంలో క్రీస్తు నివసించడం అనేది ఆయన సర్వవ్యాప్తతను (Omnipresence) సూచిస్తుంది. ఇది కేవలం దేవునికి మాత్రమే ఉండే దైవిక లక్షణం. ఒక మనిషి లేదా ఒక ప్రవక్త కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న వేలమంది హృదయాలలో ఏకకాలంలో నివసించడం అసాధ్యం. క్రీస్తు విశ్వాసులందరిలో నివసిస్తున్నాడంటే ఆయన కాలానికి, స్థలానికి అతీతుడైన దేవుడు. ఇది ఒక వ్యక్తిగత సంబంధాన్ని మరియు దైవిక సన్నిహిత్యాన్ని ధృవీకరిస్తోంది.


90. ఎఫెసీ 5:25-27 “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.”

అభ్యంతరం: ఇది కేవలం ఒక నాయకత్వ పాత్రను సూచిస్తుందని (Symbolic leadership role) అంటారు.

సమాధానం: పాత నిబంధనలో యెహోవా ఇశ్రాయేలుకు పెండ్లికుమారుడు (Bridegroom) అని పిలవబడ్డాడు (యెషయా 54:5). క్రీస్తు సంఘముపై అదే నిబంధన సంబంధిత పాత్రను తానే స్వీకరిస్తున్నాడు. సంఘాన్ని పవిత్రపరచడం, నిర్దోషిగా తన ఎదుట నిలువబెట్టుకోవడం అనేది దైవిక అధికారం ఉన్నవాడు మాత్రమే చెయ్యగలడు. క్రీస్తు తన రక్తముతో సంఘాన్ని కొని, దానిని మహిమగలదిగా సిద్ధపరచడం ఆయన దైవిక ప్రేమకు మరియు సార్వభౌమ్య సామర్ధ్యానికి నిదర్శనం. ఆయన సంఘానికి కేవలం నాయకుడు కాదు, దాని ప్రాణదాతయైన దేవుడు.


భాగం 10: పునరుత్థానం, హెచ్చించబడటం & నిత్య పరిపాలన


చివరి విభాగం క్రీస్తు దైవత్వానికి అంతిమ నిదర్శనమైన (ultimate vindication) అంశాలపై దృష్టి సారిస్తుంది: తన స్వంత శక్తితో ఆయన మృత్యుంజయుడై తిరిగి లేవడం మరియు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడవ్వడం. వధింపబడిన ఆ గొర్రెపిల్ల నిజంగానే నిరంతరం పరిపాలించే రాజు అని నిరూపిస్తూ ఆయన నిత్యమైన, మార్పులేని పరిపాలనతో ఈ భాగం ముగుస్తుంది.


91. యోహాను 2:19 & 10:18 “యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.”

అభ్యంతరం: లేఖనాలు దేవుడే ఆయనను పునరుత్థానుడిగా తిరిగి లేపాడని చెబుతున్నాయి (God raised Him), ఆయన అంతట ఆయనే లేవలేదు.

సమాధానం: బైబిల్ తండ్రి ఆయనను లేపాడని, అలాగే క్రీస్తు తన స్వశక్తితో లేచాడని రెండింటినీ ధృవీకరిస్తోంది. ఇవి పరస్పర విరుద్ధ విషయాలు కావు కానీ తండ్రికి ఉన్నటువంటి సమానమైన దైవిక శక్తి (Shared Divine Power) క్రీస్తుకు కూడా ఉందని నిరూపిస్తోంది. తన ప్రాణాన్ని తానే తిరిగి తీసుకోగల అధికారం కేవలం జీవమునకు మూలమైన దేవునికే ఉంటుంది. మరణాన్ని జయించి తిరిగి లేవడంలో క్రీస్తు తన దైవత్వాన్ని అత్యున్నత రీతిలో ప్రదర్శించాడు. ఆయన మరణంపై సంపూర్ణ అధికారం కలిగిన సజీవుడైన దేవుడు.


92. రోమా 1:5 “యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.”

అభ్యంతరం: ఆయన పునరుత్థానము (Resurrection) సమయంలోనే దేవుని కుమారుడు అయ్యాడని, అంతకుముందు ఆయన సాధారణ మనిషి మాత్రమేనని అంటారు.

సమాధానం: పునరుత్థానము యేసును దేవుని కుమారుడిగా మార్చలేదు, కానీ ఆయన అప్పటికే దేవుని కుమారుడనే సత్యాన్ని లోకానికి బహిరంగంగా నిరూపించింది (Publicly Vindicated). శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మహిమ మరుగుపరచబడింది, కానీ మృత్యుంజయత్వము ఆ మహిమను శక్తితో చాటిచెప్పింది. నిత్యత్వము నుండి ఉన్న కుమారుడు, పునరుత్థానము ద్వారా మరణం లేని దేవునిగా ముద్ర వెయ్యబడ్డాడు. ఇది ఆయన కొత్తగా పొందిన హోదా కాదు, ఆయన నిత్య స్వభావానికి దక్కిన దైవిక సాక్ష్యం.


93. హెబ్రీ 1:3 “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.”

అభ్యంతరం: ఇది ఒక గౌరవప్రదమైన స్థానం (Position of honor) మాత్రమే తప్ప, ఆయన దేవుడని నిరూపించదని అంటారు.

సమాధానం: బైబిల్ పరిభాషలో దేవుని కుడిపార్శ్వమున కూర్చోవడం అంటే సమానమైన పరిపాలనను మరియు అధికారాన్ని (Shared Rule and Authority) కలిగి ఉండడం. ఏ సృష్టించబడిన దూత లేదా మనిషి దేవుని సింహాసనాన్ని అధిష్టించలేడు. విశ్వమంతటిపై దేవునితో సమానంగా సార్వభౌమాధికారం కలిగి ఉండడం ఆయన దైవత్వానికి నిదర్శనం. ఆయన కేవలం పక్కన కూర్చున్న అతిథి కాదు, తండ్రితో కలిసి పరిపాలించే ఏకైక ప్రభువు. ఈ స్థానం యేసు యొక్క సర్వోన్నత దైవిక హోదాను స్థిరపరుస్తోంది.


94. ఫిలిప్పీ 2:11 “ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.”

అభ్యంతరం: ఇది ఒక గౌరవప్రదమైన బిరుదు (Honorific title) మాత్రమేనని కొందరు అంటారు.

సమాధానం: ఇక్కడ "నామము" అనేది సామాన్యమైన మాట కాదు, అది యెహోవాకు మాత్రమే సరిపోయే దైవిక నామమును (Yahweh’s Divine Name) సూచిస్తోంది. ఈ వచనం యెషయా 45:23 ను ఉటంకిస్తోంది, అక్కడ తండ్రి తన ఎదుట ప్రతి మోకాలు వంగుతుందని చెప్పాడు. తండ్రికి మాత్రమే చెందాల్సిన ఆ విశ్వవ్యాప్త ఆరాధనను పౌలు క్రీస్తుకు ఆపాదిస్తున్నాడు. యేసును "ప్రభువు" అని పిలవడం అంటే ఆయనను సృష్టికర్తయైన యెహోవాతో సమానంగా గుర్తించడమే. ఇది ఆయన దైవత్వానికి సంబంధించిన అత్యున్నతమైన ప్రకటన.


95. యెషయా 45:23 (ఫిలిప్పీ 2:10) “నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.”

అభ్యంతరం: దేవుడు తన మహిమను (His glory) మరొకరితో పంచుకుంటున్నాడు తప్ప యేసు దేవుడు కాదని వాదిస్తారు.

సమాధానం: యెహోవా తన మహిమను మరెవరికీ ఇవ్వనని ఖచ్చితంగా చెప్పాడు (యెషయా 42:8). అయితే ఇక్కడ ప్రతి మోకాలు యేసు ముందు వంగుతుందని చెప్పబడింది. అంటే యేసు తండ్రికి వేరుగా ఉన్న మరొక దేవుడు కాదు, తండ్రి మరియు కుమారుడు ఒకే స్వభావం లేదా సారం కలిగినవారు. పాత నిబంధనలోని తండ్రి మాటలను క్రీస్తుకు వర్తింపచెయ్యడం ద్వారా అపొస్తలులు యేసును సాక్షాత్తు దేవునిగా గుర్తించారు. ఆయన ఎదుట మోకరించడం అంటే సృష్టికర్త ఎదుట మోకరించడమే.


96. ఎఫెసీ 1:22 – “మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.”

అభ్యంతరం: ఇది ఒక పరిపాలనా సంబంధిత పాత్ర (Administrative role) మాత్రమేనని కొందరు అంటారు.

సమాధానం: "సమస్తమును" ఆయన పాదాల కింద ఉంచడం అంటే అది కేవలం ఒక కార్యాలయ అధికారం కాదు, కానీ విశ్వవ్యాప్త సార్వభౌమాధికారము (Universal Sovereignty). ప్రకృతి, దేవదూతలు, మనుష్యులు మరియు అపవిత్రాత్మలపై ఆయనకు సంపూర్ణ అధికారం ఉంది. విశ్వమంతటినీ తన పాదాల కింద ఉంచుకోగలిగే శక్తి కేవలం సర్వశక్తిమంతుడైన దేవునికే ఉంటుంది. సంఘానికి శిరస్సుగా ఉంటూనే ఆయన సమస్త సృష్టిని పరిపాలించే విశ్వనాథుడిగా (Cosmic Lord) విరాజిల్లుతున్నాడు.


97. ప్రకటన 11:15 “ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు - ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.”

అభ్యంతరం: రాజ్యము ఆయనకు అప్పగించబడినది (Delegated kingdom) కాబట్టి ఆయన దేవుడు కాదని అంటారు.

సమాధానం: ఈ లోక రాజ్యాలన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ క్రీస్తు రాజ్యము నిత్యమైనది మరియు అంతము లేనిది (Eternal, Unending Reign). ఇలాంటి శాశ్వతమైన అధికారం కేవలం దేవునికి మాత్రమే సాధ్యం (దానియేలు 4:34). రక్షణ ప్రణాళికలో రాజ్యము అప్పగించబడడం అనేది ఆయన మధ్యవర్తిత్వ పాత్రను సూచిస్తుందే తప్ప, ఆయన దైవత్వాన్ని తక్కువ చెయ్యదు. యుగయుగములు ఏలే ఏకైక రాజుగా క్రీస్తు తండ్రితో కలిసి పరిపాలించబోతున్నాడు.


98. ప్రకటన 21:23 “ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.

అభ్యంతరం: యేసు క్రీస్తు కేవలం అద్దం వలె దేవుని మహిమను ప్రతిబింబిస్తున్నాడని (Reflects God’s glory) కొందరు వాదిస్తారు.

సమాధానం: పరలోక పట్టణంలో సూర్యచంద్రుల అవసరం లేదు, ఎందుకంటే గొర్రెపిల్లయే (క్రీస్తు) దాని ప్రకాశానికి మూలంగా (Direct Source of Illumination) ఉంటాడు. దేవుడే వెలుగై ఉన్నాడని లేఖనాలు చెబుతుండగా క్రీస్తు ఆ వెలుగును ఇస్తున్నాడంటే ఆయన దైవత్వంలో దేవునితో ఏకమై ఉన్నాడని అర్థం. ఆయన ప్రతిబింబం కాదు, ఆయనే స్వయం ప్రకాశవంతుడైన దేవుడు. నిత్యత్వంలో క్రీస్తు వెలుగులోనే నీతిమంతులు నడుస్తారు.


99. రోమా 8:9 “దేవుని ఆత్మ మీ లో నివసించియున్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు . ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు .”

అభ్యంతరం: ఇది క్రీస్తుకు చెందిన (Belonging to Christ) ఆలోచన లేదా స్వభావం గురించి మాత్రమే చెబుతోందని కొందరు అంటారు.

సమాధానం: లేఖనాల్లో పరిశుద్ధాత్మను "దేవుని ఆత్మ" అని ,"క్రీస్తు ఆత్మ" అని మార్చి మార్చి (Interchangeably) ప్రస్తావించడం మనం చూస్తాము. దేవుని ఆత్మయే క్రీస్తు ఆత్మగా పిలవబడడం ఆయన దైవిక గుర్తింపులో ఉన్న సంపూర్ణ భాగస్వామ్యాన్ని చాటి చెబుతోంది. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయనవాడు కాదని చెప్పడం ద్వారా ఒక వ్యక్తి యొక్క రక్షణలో మరియు ఆత్మను పొందుకునే విషయంలో క్రీస్తు పాత్ర దైవికమైనదని స్పష్టమౌతోంది. ఇది క్రీస్తు మరియు తండ్రి స్వభావరీత్యా ఏకమైయున్నారనడానికి ఒక బలమైన సాక్ష్యం.


100. ప్రకటన 22:20-21 “ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్‌.”

అభ్యంతరం: ఇది మెస్సీయ తిరిగి రావాలని కోరుకునే ఒక ప్రార్థన మాత్రమే తప్ప ఇది ఆయన దేవుడని నిరూపించదని విమర్శకులు అంటారు.

సమాధానం: బైబిల్ గ్రంథం క్రీస్తుకు చేసే ప్రత్యక్ష ప్రార్థనతో (Direct Invocation) మరియు ఆయన అనుగ్రహించే కృప కోసం వేడుకోవడంతో ముగుస్తుంది. దేవుని వాక్యం మొత్తం ఒక మనిషికి చేసే ప్రార్థనతో ముగియడం అసంభవం; అది కేవలం దేవునికి మాత్రమే చెందాలి. క్రైస్తవుల నిరీక్షణ, ప్రార్థన మరియు ఆరాధన క్రీస్తు వైపుకే మళ్ళించబడ్డాయి. ఆయన రాకడ కోసం వేచి చూడడం అంటే దేవుని ప్రత్యక్షత కోసం వేచి చూడటమే. "ప్రభువైన యేసూ, రమ్ము" అనే పిలుపు ఆయన దైవత్వానికి బైబిల్ ఇస్తున్న ఆఖరిదైన అత్యున్నత సాక్ష్యం.


ముగింపు


మనం వంద లేఖనాధారిత సాక్ష్యాలను పరిశీలించాము; వీటిలో ప్రతి ఒక్కటి కూడా యేసు క్రీస్తు కేవలం ఒక మనవుడు మాత్రమే కాదని, ఆయన ఒక తక్కువ స్థాయి దేవదూత కాదని, మరియు ఖచ్చితంగా అనేకమంది దేవుళ్ళలో ఒక "తక్కువ స్థాయి దేవుడు" అంతకంటే కాదని నిరూపించే సజీవ సాక్షాలు. ఆయనే అల్ఫా మరియు ఓమెగ, ఆయనే దావీదు వేరు చిగురు మరియు సంతానము, ఆయనే ప్రకాశమానమైన వేకువ చుక్క. మనం ఈ పుస్తకాన్ని ముగించే ముందు, ఈ ఆధారాలన్నీ మన నుండి ఒక స్పందనను కోరుతున్నాయి. క్రీస్తు దైవత్వాన్ని అశ్రద్ధ చెయ్యడం అంటే నిత్యత్వపు ముంగిట నిలబడి నిత్యజీవాన్ని తృణీకరించడమే. మానవ సంప్రదాయాలు కానీ భాషా పరమైన గారడీలు (linguistic gymnastics) కానీ మరుగు పరచలేనంత స్పష్టతతో లేఖనాలు ఈ సత్యాన్ని చాటుతున్నాయి. వివిధ అవాంతర శాఖలకు (cults) చెందిన వారలారా, "వాక్యము దేవుడై యుండెను" అనే లేఖన సత్యాన్ని కాదని, గ్రీకు మూలపాఠాలకు వంకర అర్థాలు చెప్పుకుంటూ ఏళ్ళ తరబడి విశ్వాసులను భ్రమకు గురిచేస్తున్న మిమ్మల్ని నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను. మీరు క్రీస్తు గురించిన ఒక భయంకరమైన ‘అబద్ధ బోధ’ అనే ఎడారిలోకి నడిపించబడ్డారు; మీరు అనుసరిస్తున్న ఆ "యేసు"కు రక్షించే శక్తి లేదు, ఎందుకంటే ఆయన బైబిల్ ప్రకటిస్తున్న "దైవ-మానవుడు" (God-Man) కాడు. ఒకవేళ మీ "యేసు" మీ ఊహాలలో నుండి పుట్టిన వాడు అయితే, అతను కేవలం ఒక విగ్రహం మాత్రమే. సృష్టించబడిన దానిని ఆరాధించడం విగ్రహారాధన అనే భయంకరమైన పాపము. ఈ పాపమును బట్టే లోకము తీర్పు తీర్చబడబోతోంది. మీరు మారుమనస్సు పొందకపోతే ఆ తీర్పులో మీరు పాలుపొందుతారు.

 

"యేసుక్రీస్తు ముఖమందున్న దేవుని మహిమను గూర్చిన జ్ఞానమను వెలుగు"ను చూడనివ్వకుండా మీ కన్నులకు గంతలు కట్టిన ఆ వంచన ఆత్మ (spirit of deception) నుండి క్రీస్తు కృప ద్వారా మీరు విడుదల పొందాలి. లేఖనాలను మరొక్కసారి నిష్పక్షపాతంగా పరిశీలించండి! దేవుని వాక్యానికి విరుద్ధంగా బోధించే వాచ్ టవర్ సంస్థను (watchtowers) కానీ ఆధునిక కాలపు "ప్రవక్తలను" కానీ నమ్మకండి. యేసు నిజంగా దేవుడు కాకపోతే సిలువపై ఆయన మరణం కేవలం ఒక మంచి వ్యక్తి చేసిన ప్రాణత్యాగం మాత్రమే ఔతుంది; ఆనంతుడైన దేవుని యొక్క అనంతమైన న్యాయాన్ని తృప్తి పరచడానికి అది ఏమాత్రం సరిపోదు. ఆయన ఘనతను తగ్గించడం ద్వారా మీ రక్షణ నిరీక్షణను మీరే మీ చేతులరా నష్టపరచుకుంటున్నారు. నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను: మీ గర్వాన్ని విడిచిపెట్టండి, మనుషులు మీకు నేర్పిన కుతర్కాలను ప్రక్కన పెట్టండి మరియు జీవముగల క్రీస్తు పాదాలపై పడండి. కుమారుని నిజమైన గుర్తింపును తిరస్కరించడం అంటే మీ పాపములలో ఉండిపోవడమే. ఎందుకంటే ఆయనే స్వయంగా ఇలా సెలవిచ్చాడు: "నేనే ఆయననని (I AM) మీరు విశ్వసింపని యెడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదురు." ఛాయల నుండి అబద్ధ బోధలను విడిచిపెట్టి, నిజస్వరూపియైన (Substance) క్రీస్తును చేరుకోవడానికి మీకు ఇంకా సమయం ఉంది.

కుతూహలంతోనో లేదా సందేహాలతోనో ఈ పుస్తకాన్ని చదువుతున్న అన్వేషకులారా: మీరు ఇప్పుడు ఈ విశ్వంలోనే అత్యంత ముఖ్యమైన చారిత్రక మరియు ఆత్మీయ సత్యం ఎదుట నిలబడి ఉన్నారు. యేసుక్రీస్తు చేసిన ప్రకటనలు కేవలం ఒక నీతి బోధకుడి సూచనలు కావు; అవి ఒక సర్వాధికారియైన రాజు యొక్క ఆజ్ఞలు. మరణము యొక్కయు, పాతాళము యొక్కయు తాళపు చెవులు తన వద్ద ఉన్నాయని ప్రకటించిన యేసును, మీరు కేవలం "గొప్ప తత్వవేత్తల" జాబితాలో చేర్చి విడిచిపెట్టడం తగదు.

ఈ వంద ఆధారాలు సత్యమైతే మీరు పరిణామ క్రమం చెబుతున్నవిధంగా యాదృచ్ఛికంగా పుట్టేసినవారు కాదు; 2000 సంవత్సరాల క్రితం కల్వరి సిలువకు మేకులతో బిగించబడిన ఆ హస్తాలే మిమ్మల్ని సృష్టించాయి. నక్షత్రాలను సృష్టించి వాటిని పేర్లు పెట్టిన ఆయనే మీ హృదయ అంతరంగాలను కూడా ఎరిగినవాడు. పరిశుద్ధుడైన దేవునికి, మీకు మధ్య మీ పాపం వల్ల ఏర్పడిన ఆ అగాధాన్ని పూడ్చడానికే యేసు శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చాడు. ఈ జ్ఞానం మేధస్సును తృప్తిపరచడానికి (academic) ఉద్దేశించబడినది కాదు; ఇది మీ జీవితాన్ని మార్చడానికి (transformational) ఉద్దేశించబడింది.‌ క్రీస్తు గురించి తెలుసుకోవడం మాత్రమే సరిపోదు; మీరు ఆయనను వ్యక్తిగతంగా ఎరగాలి. ఈ సత్యాలను కేవలం మేధస్సుతో అంగీకరించి ఆగిపోకుండా ఈ ఆధారాలన్నీ ఎవరి గురించి చెబుతున్నాయో ఆ క్రీస్తుకే మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలని నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. క్రీస్తు దైవత్వాన్ని నిర్లక్ష్యం చెయ్యడం అంటే నశించిపోతున్న ఈ లోకం నుండి మిమ్మల్ని రక్షించడానికి చాచిన ఏకైక హస్తాన్ని కాదనుకోవడమే. సత్య స్వరూపిని తెలుసుకుని రక్షణ పొందండి, ఎందుకంటే మనం రక్షణ పొందడానికి ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ ఇతర నామము లేదు.

చివరిగా నా తోటి విశ్వాస సహోదర సహోదరీలకు: ఈ సత్యాలు మీ ఆత్మకు సుస్థిరమైన పునాదిగా ఉండనివ్వండి. అనేకులు దైవశాస్త్రపరంగా రాజీపడిపోతున్న కాలంలో మనం జీవిస్తున్నాము; మన ప్రభువును ఈ లోకానికి నచ్చేలా చూపించడం కోసం, ఆయన సంపూర్ణ దైవత్వాన్ని నీరు గార్చి వేరొక సువార్తను ప్రకటిస్తున్నారు. మీరు భయపడకండి! మనకు మరింత నిశ్చయమైన ప్రవచన వాక్యం ఉంది. ఈ వంద ఆధారాలు మిమ్మల్ని సత్యంలో ఎంత లోతుగా స్థిరపరచాలంటే ఏ అబద్ధ బోధ కూడా మిమ్మల్ని కదిలించలేనంత పటిష్టంగా స్థిరపరచాలి.‌ మీలో ఉన్న నిరీక్షణను గురించి ఎవరైనా కారణం అడిగినప్పుడు, దేవుని వాక్య అధికారంతో సమాధానం చెప్పండి. ఈ అధ్యయనం మీ ప్రార్థన జీవితంలో ఒక నూతన ఉత్తేజాన్ని (fire) రగిలించనివ్వండి. మీరు "ప్రభువైన యేసు" అని ప్రార్థించినప్పుడు, సృష్టి ఆరంభం కంటే ముందు నుండి ఉన్నవాడు మరియు నూతన యెరూషలేముకు వెలుగై ఉండబోయేవాడు ఆయనేనని గుర్తు చేసుకోండి. ఇది మీ సువార్త పరిచర్యకు మరింత ధైర్యాన్ని చేకూర్చాలి; మనం కేవలం ఒక మతాన్ని ప్రచారం చెయ్యడం లేదు కానీ "నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్న" వానిని ప్రకటిస్తున్నాము. స్థిరంగా నిలబడండి, మీ విశ్వాస ప్రమాణాన్ని గట్టిగా చేత పట్టుకుని ఆనందభరితమైన నిరీక్షణతో పైనున్న వాటిపైనే దృష్టి నిలపండి.
ఈ పుస్తకపు పేజీలలో మనం ఎవరి గురించి ఐతే అధ్యయనం చేశామో ఆయన మళ్ళీ రాబోతున్నాడు; ఈసారి ఆయన ఒక సామాన్యమైన వడ్రంగిగా కాకుండా ఆకాశమును తన మహిమతో నింపేసే రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఇప్పుడును నిత్యత్వము వరకును ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్