దుర్బోధలకు జవాబు

రచయిత: సి బేసలేల్ బెనడిక్ట్

హమ్మయ్య!! ఇప్పటికి నేను వెలిగించబడి, విమోచించబడ్డాను. ఇప్పటివరకూ అబద్ధబోధల గురించి నా హృదయం చాలా వేదనపడుతూ, దుఃఖపడుతూ ఉండేది. అదో పెద్ద భారము, ఒత్తిడి, తరగని చింతను కలిగించేది కాని నాకిప్పుడు వెలుగు కలిగింది. ఆ భారం నుండి విమోచింపబడ్డాను. ఇంతగా నా హృదయాన్ని వెలిగించి, నా భారమంతటినీ తొలగించిన జాన్ సురేష్ గారికి ఎంత కృతజ్ఞుడనో!

క్రైస్తవ మరియు సామాజిక దృక్పథాన్ని సమన్వయపరిచే ఒక జ్ఞానప్రభోదాన్ని, ప్రత్యేక భక్తిమార్గాన్ని జాన్ సురేష్ గారి ద్వారా నేర్చుకున్నాను. మంచి బోధించినప్పుడు అభినందించడం, అర్థరాహిత్యాలను, అబద్ధాలను ఖండించడం సబబే అనుకునేవాడిని. కాని అబద్ధాలతో, అసంగతాలతో, అసంబద్ధాలతో మాట్లాడేవారిని ఖండించనవసరం లేదని, ఒక వేళ ఖండించవలసి వస్తే ఒక్కసారి మాత్రమే చాలునని ఇప్పుడు తెలుసుకున్నాను.

నేను క్రీస్తుశరీరంలో ఒక అవయవమని, విషాన్ని ఎన్నిసార్లైనా త్రోసివేయాలని, లేకపోతే సంఘమనే ఈ శరీరమంతటికీ హాని అనుకుని పొరపాటుపడ్డాను. ఆ విషాన్ని ఒక్కసారి మాత్రమే త్రోసివేస్తే చాలు అని ఇప్పుడు తెలిసింది. అదే విషం మరిన్నిసార్లు సంఘంపై దాడి చేసినా, 'నాకెందుకు, నా పని నేను చూసుకోవాలి, నాది నేను కడుక్కోవాలని' నాకెందుకు అనిపించలేదో! నా తోటి అవయవం దెబ్బతింటే, నాకు కూడా నష్టమే, బాధే కదా! అనుకుని తెగ బాధపడిపోయి మనస్సు కలవరపడేది. ఇప్పుడు అది నాకక్కరలేదని, నా పాత్ర క్రీస్తు శరీరమంతటిలో ఏమి ఉండదనే తెలివి ఇప్పుడు కలిగింది - జాన్ సురేష్ గారి బోధ వెలుగులో!

ఆదిమసంఘంలో అబద్ధబోధకులను ఒక విశ్వాసి ఇంటిలోనికి కూడా అనుమతించవద్దు అని అపోస్తలులు బోధించినప్పుడు మెలకువగా ఉండాలని తెగ ఆరాటపడేవాడిని. కాని 'వారిని అనుమతించవచ్చు, ఆహ్వానించవచ్చు, వారి పాదధూళిని మాత్రలు చేసుకుని మూడు పూటలా మ్రింగవచ్చు; సంఘానికి ఏ తెగులొస్తే నాకేంటి, నేను ఒక అవయవమన్న స్పృహ నాకక్కరలేదని' ఇప్పుడు అర్థమైంది - జాన్ సురేష్ గారు ఈ సత్యం చెప్పి ఉండకపోతే ఈ భారం నుండి విమోచన కలిగేదే కాదేమో!

ఒక దైవసేవకుడు,'మనం/క్రైస్తవులం కులాన్ని నమ్మము, అంగీకరించమము, అటువంటి దాష్టికాన్ని ఆలోచనలో కూడా సమ్మతించము', అని చెబుతూ, 'BC-C సర్టిఫికెట్ ని తీసుకోవడం చాలా ఉత్తమం' అని ప్రోత్సహిస్తుంటే, నా మట్టుకు నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి.

=> ఎవరో నన్ను ఓ దౌర్భాగ్యపు పేరుతో పిలిచాడు. అలా పిలిపించుకుంటే నీకు సహాయం చేస్తానన్నాడు. ఆ సహాయం కోసం వాడు పిలిచిన పాడుపేరుతో నేను పిలిపించుకోవాలా?

=> భారతదేశంలో ఉన్న భౌతికవాదాలతో నా భక్తికి సంబంధం లేదనుకోవడానికి, నేను కానిమతం పేరున పిలిపించుకోవాలా?

=> నేను నా కులం మార్చుకున్నంత మాత్రాన, వాడు నన్ను గౌరవించడని, వాడి గౌరవం కోసం అందులోనే ఉండాలా? ఒక వేళ అలా ఉంటే వాడి గౌరవానికి నేను పాత్రుడనౌతానా?

=> నేను ఆ కులంలో ఉన్నా, లేకపోయినా గౌరవం లేనప్పుడు ఆ పాడుపేరుతో పిలవబడడం అవసరమా? విశ్వాసాలను బట్టి మతాలుగా భారత రాజ్యాంగం గుర్తించినప్పుడు, నా విశ్వాసాన్ని బహిరంగంగా నేను ప్రకటించుకుని, ఆ విశ్వాసాన్ని ఏ మతంగా గుర్తిస్తారో, ఆ మతంగా కాకుండా నా పూర్వమతంగా నేను మిగిలిపోయి, నాది క్రైస్తవ విశ్వాసం కాదన్నట్టుగా రాజీపడాలా? 

=> చాలామంది అనుకునేటట్టు, శోధకుడు ఎక్కడెక్కడికో క్రీస్తును తీసుకెళ్ళినప్పుడు, క్రీస్తు వాడికి విధేయత చూపుతున్నట్టుగా వెళ్ళాడా లేక వీరుడిగా నీవెక్కడికి తీసుకెళ్ళినా వచ్చి, నీ తలపై పాదం మోపుతానని వెళ్ళాడా?

=> నన్ను క్రైస్తవ్యంలోనికి వెళ్లకుండా BC-C అనే కుట్ర, ప్రెసిడెన్షియల్ రూల్ అనే అన్యాయం, చట్ట విరోధం కలిసి సవాలు చేస్తే, అక్కడికి వెళ్ళి కూడా నేను క్రైస్తవుడిగా నిలబడడం వీరత్వమా లేక వారి కుట్రతో సంఘీభావమా?

=> అసలు వారి మతం పేరున పిలవబడవలసిన అగత్యం నాకెందుకు? 

=> నా కోసం ప్రాణం పెట్టినవాడికి, నా కులాన్ని కూడా వదులుకోలేని కృతఘ్నుడనా? అసలు "కుల గుర్తింపు” అనే కుళ్ళిపోయిన వ్రేళ్ళు/పేర్లు, రిజర్వేషన్ అనే పైపై లేపనాలకు మళ్ళీ బ్రతుకుతాయా? క్రీస్తులో నా మూలాలు మారాయి. నా ఆలోచనాశైలి మారింది. రిజర్వేషన్ అనే ఊతకర్ర జవసత్వాలు ఉడిగిన వృద్ధులకు కావాలి. నవనూతన విధానాలతో, వైఖరితో, శక్తివంచన లేక కష్టపడి క్రీస్తుకృపను బట్టి నన్ను నూతనంగా నిర్మించుకోగలిగినప్పుడు ఆ రిజర్వేషన్ అనే ప్లాస్టిక్ ఉలి నాకెందుకు?

=> ఎవరో ఏదో అనుకుంటారు, గౌరవించరని, నాలోని సృజనాత్మకతకు, ప్రతిభకు రిజర్వేషననే మారుపేరు నా అసలీయతకు అవమానం కాదా?

=> ఎవ్వడూ, ఎన్నడూ మార్చనిది కులం అన్నట్టుగా, మనం మార్చుకున్నా మారలేము, అంతగా మనం కులంలో బంధింపబడి ఉన్నాము, బయటకు రావాలనుకోవడం వ్యర్థ ప్రయత్నం అంటున్న జాన్ సురేష్ గారి బోధ, వివరణ నిజంగా నాకు ఒక గొప్ప ఉపశమనం! ఎందుకంటే అలవాటుగా, అలవోకగా వస్తున్న సంవత్సరాల బానిసత్వ మనస్తత్వాన్ని ఎదిరించడం కష్టం గాని, ఆ కులం పేరును మరో వెయ్యేళ్ళ పాటు మోయడం, దాని తాలూకు అవమానాన్ని అంగీకరించడం పెద్ద కష్టమేమి కాదు! 

=> ఎదిరించడం, అడ్డుకోవడం, నూతనంగా ఆరంభించడం, విశేషంగా జీవించడం - ఇలాంటివన్నీ అసంభవమని, అలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దని, ఉన్న సౌఖ్యాన్ని పాడు చేసుకుని ఎందుకు ఇబ్బందిపడతారు అని జాన్ సురేష్ గారు మనందరి శ్రేయస్సుకు వారిదైన వినూత్న వివరణ ఇస్తుండగా నా భారం తొలిగిపోయింది. జాన్ సురేష్ గారికి కృతజ్ఞతలు!


ఇకపోతే, నాకు జాన్ సురేష్ గారి స్టేట్ మెంట్స్ చాలా బాగా నచ్చుతాయి -

=> ఒకపక్క అబద్ధబోధకులను ఖండించడంలో పరిమితి ఉందని అంటారు. మరెవరినైనా అనడానికి, ఖండించడానికి మాత్రం అపరిమితమైన స్వేచ్ఛ తీసుకుని 'సాతానుబోధ, చెత్తవాగుడు, పనిపాటలేని బోధలు' అంటారు చూడండి, అది చాలా బాగుంటుంది. మరిముఖ్యంగా, ఆయన స్టేట్మెంట్లను ఆయనే వ్యతిరేకిస్తూ, ఒక రకమైన మానసిక అసమతుల్యతతో మాట్లాడుతారు గదా, అది ఇంకా ఇష్టం!

=> కాల్వినిజమే తప్పు అని నిరూపించాలంటే ముందు నిజమేమిటో తెలిసుండాలి గదా? దేవుడే ఆదాము చేత పాపం చేయించాడని ఏ కాల్వినిస్ట్ అన్నాడో ఖచ్చితంగా చెప్పకుండా నిరాధార నిందారోపణ చేస్తుంటారు చూడండి - ఆ పద్ధతిని క్రైస్తవసమాజం మాదిరిగా తీసుకోవాలి. దేవుని సార్వభౌమత్వాన్ని త్రోసిపుచ్చే బలమైన కారణం ఏదీ లేదు గనుక పాపము కూడా ఆయన అనుమతితో రావలసిందేనని,  పాపానికున్న శక్తి కంటే ఆయన శక్తి, అధికారాలు ఎక్కువ కనుకే, దానిని విరిచే యోచన ఆయనకు ఉంది కనుకే పాపాన్ని దేవుడు అనుమతించాడని కాల్వినిస్టులు చెబుతారు. అయితే జాన్ సురేష్ గారి మాటను బట్టి, మానవునిలోనికి పాపం మానవుని అనుమతితోనే, దేవుని సార్వభౌమత్యాన్ని అధిగమించి వచ్చింది అని అర్థమౌతుంది. అంటే దేవునికంటే మానవుని అనుమతి, అంగీకారమే శక్తియుతమైనవి అన్నమాట. పరిమితి గల ఒక ప్రత్యేక సార్వభౌమ తరగతిలో దేవుని సార్వభౌమత్వాన్ని చేర్చిన జాన్ సురేష్ గారి జ్ఞానం ఎందరో నాలాంటి అజ్ఞానుల మనోనేత్రాలను వెలిగిస్తుంది.

=> కాల్వినిస్టులు చెప్పే మరొక విషయం - మానవుని బాధ్యత మరియు స్పందన దేవుని సహాయం చేతనే బలపరచబడి క్రియ చేస్తాయని; ఒక వ్యక్తి తన రక్షణకై ప్రయత్నం మొదలు పెట్టడానికి ముందే, దేవుడే అతని రక్షణకై అన్ని ఏర్పాట్లు చేసి, యుక్త కాలమున నెరవేర్చి, రక్షణలో మొదటి అడుగు ఆయనే వేయడం ద్వారా ప్రారంభించి, దానిని అంతం వరకూ కొనసాగించేది కూడా ఆయనే అని “రక్షణ యెహోవాదే” అన్న లేఖనం వివరిస్తుందని వాళ్ళు చెబుతారు.

=> అందరినీ ఎరిగినవాడే, అందరి గమ్యాలనూ ముందుగా నిర్ణయిస్తే, మానవ పరిమితుల్లో దేవుణ్ణి గ్రహించడానికి ప్రయత్నిస్తూ, 'దేవుడే కొందరిని నిర్ణయిస్తాడా? ఇది వాక్యవిరుద్ధం కాదా అని ప్రశ్నిస్తూ, ఒక వ్యక్తి తన రక్షణ ఆవశ్యకతను గుర్తించి తానే ఆయన యొద్దకు వచ్చేవరకు తనకేమి పట్టనట్టు దేవుడు మిన్నుకుంటాడని, మనమే మన స్వతంత్రచిత్తం, బాధ్యత అనే ములుకొలతో ఆయనను గ్రుచ్చితేగాని ఆయనకు స్పందన రాదన్నట్టు' జాన్ సురేష్ వంటివారు చెప్పడం ఎంత గొప్ప వాక్యమర్మమో?

=> రక్షింపబడినవారి భద్రత దేవుని కృపాకార్యం అని కాల్వినిస్టులు చెబుతున్నప్పుడు - 'కాదు కాదు అతి బరువున్న ఎదిగిన బిడ్డను చంకనెత్తుకోవడం ఎంతకష్టమో, ఎంత త్వరగా అలసిపోయి చెయ్యి వదిలేస్తామో అలాగే బరువెక్కుతున్న విశ్వాసిని అలిసిపోయే దేవుడు విడిచిపెట్టొచ్చు గనుక మనల్ని మనమే పట్టుకుని, మన రక్షణను మనమే కాపాడుకోవాలి' అని చెప్పడం నిజంగా గొప్ప ఆలోచన. లేకపోతే జారిపోయే ప్రమాదముందండోయ్. ఈ ప్రమాదం నుండి క్రైస్తవ సంఘాన్ని రక్షించాలనుకుంటున్న జాన్ సురేష్ వంటివారి ప్రయాస అభినందనీయం! క్లుప్తంగా చెప్పాలంటే కాల్వినిస్టులు చెప్పేది బైబిలు బోధతో  ఎంత సమ్మతించినా అది మనకవసరం లేదు; జాన్ సురేష్ గారిలా సువార్తను మానవకేంద్రితంగా చూడటం నేర్చుకున్నప్పుడే సంఘం ఉద్ధరించడుతుంది. ఇప్పటికే చాలా పొగిడేశాను, పొగడ్తలు మరలా గర్వానికి తావిచ్చి జాన్ సురేష్ గారి పరిచర్యకు ఆటంకమౌతుందని ఇప్పటికి ముగిస్తున్నాను.

వాస్తవానికి, నా రక్షణ విషయంలో నా ప్రభువుని బట్టి సంపూర్ణంగా అతిశయించడం, ఆయనే పూర్తిగా దానిని నెరవేర్చాడని అనుకోవడం తప్పు. అందులో మన బాధ్యత చాలా ముఖ్యమైనది, దానికి మనము కూడా గౌరవింపబడాలని, నా విలువను కూడా గుర్తుచేసే జాన్ సురేష్ వంటివారి గుడ్డి బోధల నాకెంతో నచ్చాయి, నన్నెంతగానో ప్రేరేపిస్తున్నాయి. దేవుడే వారికి తగిన ఫలం అనుగ్రహించి తనను తాను హెచ్చించుకొనును గాక!

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.