రచయిత: ప్రవీణ్ పగడాల

క్రైస్తవలోకం మొదటి శతాబ్దము నుండి ఎన్నో తప్పుడుబోధలను ఎదుర్కొని ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని సువార్త మరియు ఆయన బోధను కాపాడుకుంటూ వస్తున్నా, అపోస్తలుల కాలము నుండే సాతానువశులైన తప్పుడు బోధకులు ఎంతోమంది సత్యబోధను వంచించే ప్రయత్నం చేయడం మానలేదు.

వక్రబోధ, వంచన బోధ, నమ్మించి మోసం చేసి సాతాను అడుగులకు మడుగులొత్తే బోధ ఆనాటి నుండి ఈనాటి వరకు మనకు వినిపిస్తూనే ఉంది. 'చెరపకురా చెడేవు' అన్న సామెత మనందరికి బాగా తెలిసిందే. కాకపోతే తానే చెడి, అలా చేయడం మంచి అని నమ్మి, మంచిని కూడా చెరచాలని ఆశించేవళ్ళూ ఈ లోకంలో ఉన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం తప్పు అని ప్రపంచం అంతా చెప్పినా వినకుండా, దానికి ఆధారాలు చూపిస్తున్నా, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ అది చాలక ఇంకొకరిని తన మార్గంలో లాక్కోవాలని పరితపించేవాళ్ళను ఏమనాలి? ఇలాంటి వాళ్ళ క్రైస్తవసమాజంలో, మరి ముఖ్యంగా 'క్రైస్తవ నాయకులం' అని చెప్పుకునే వాళ్లలో ఉండటం సాతాను క్రియ అనే చెప్పాలి. తప్పుడు బోధలలో కొన్ని సిద్ధాంతపరమైనవి అయితే మరికొన్ని సిద్ధాంతపరమైనవి కావు. సిద్ధాంతపరమైనవి కాని తప్పుడు బోధలు క్రైస్తవులను కొద్దిగా కలవరపెట్టినప్పటికీ, అవి వారి ఆత్మల రక్షణకు ఆటంకాలు కావు కానీ, సిద్ధాంతపరమైన తప్పుడు బోధలు క్రైస్తవుల ఉనికికే ప్రమాదం మరియు దేవుడు తలపెట్టిన మహాకార్యం అయిన మానవాళి రక్షణను ఆటంకపరిచేవి. క్రైస్తవ మూలసిద్ధాంతాలైన త్రిత్వం, యేసుక్రీస్తు, దేవుని కృప, పాపక్షమాపణ, ప్రాయశ్చిత్తం వంటి సిద్ధాంతాలు ఎంతో అమూల్యములైనవి, వాటిని వక్రీకరించి బోధిస్తే క్రైస్తవ్యానికి తీరని నష్టం చేకూరటమే కాక దేవుని అనాదికాల ప్రణాళిక అయిన మానవుల రక్షణకు ఆటంకం కలుగచేసినవారు ఔతారు. మనదేశములో ఇలాంటి అబద్దప్రవక్తలకు లోటేమీ లేదు. ఈ వ్యాసంలో అటువంటి తప్పుడు బోధకులలో ఒకరైన బోంకూరి జాన్ గారిచే వ్రాయబడిన ఒక కరపత్రంపై లేఖనాధారమైన ఈ విమర్శ మీరు చదువగలరు.

'యేసుక్రీస్తు ఎవరు?' అనే కరపత్రికలో బొంకూరిజాన్ గారు 'యేసు క్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు మాత్రమే' అన్న తన ఆవేదనను ప్రజల వద్దకు చేర్చాలన్న ఆతృతలో తనకిష్టం వచ్చినట్టు దేవుని వాక్యాన్ని చీల్చి, వక్రీకరించి తాను చెప్పాలనుకున్న విషయాన్ని నిష్కర్షగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. అయ్యా జాన్ గారు, మీ ప్రయత్నంలో ఎవరినో ఉద్ధరించాలన్న తపన కన్నా లేఖనాలపై మీకున్న అవగాహనారాహిత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. అపోస్తలులకాలం దాటిన కొన్ని సంవత్సరాలకే మీరు చెసిన ఈ దుర్బోధ క్రైస్తవసంఘంలో వెలుగు చూసేలా సాతాను జాగ్రత్త తీసుకున్నాడు. వాని కుయుక్తులలో మీరు పాలుపంచుకోవడం, లేఖనాలపై మీకున్న అవగాహనను వక్రీకరించి వాడు వాడుకోవడం చాలా శోచనీయం. మీ ప్రయత్నం క్రైస్తవలోకానికి స్ఫూర్తినిచ్చేదిగా కాకుండా క్రైస్తవుల మూలాలను చెదరగొట్టేదిగా ఉంది. పోనీ అదేమన్నా సంస్కరణ మార్గంలో ఉందా అంటే అలాగూ లేదు.

జాన్ గారు వ్రాసిన కరపత్రికలోని రెండవపేజిలో 'ఇప్పటి బోధకులలో అనేకులు యేసు నిజమైన దేవుడని, యేసే యెహోవా అని నిర్లక్ష్యంగా రొమ్ము విరుచుకొని ప్రకటిస్తూ...' అని వ్రాశారు. ఆయన వ్రాయడంలోని ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే ఆయన ఉద్దేశ్యంలో యేసు నిజమైన దేవుడు కాదా? అన్న ఆలోచన వస్తుంది. క్రైస్తవ మూలసిద్ధాంతాలలో ఒకటైన త్రిత్వమును గ్రహించినవారెవరైనా, యేసు మరియు తండ్రి ఒకటి కాదని సులువుగా చెప్పగలరు. దానికి జాన్ గారి సంజాయిషీ అవసరం లేదు కానీ, యేసు నిజమైన దేవుడు కాదు అన్న ప్రచారణ ఆయన చేయదలుచుకొని ఉంటే, అది ఆయన అవివేకం ఔతుంది. 'తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి' అని వాదించే గుంపులు లేవని నేను అనటం లేదు కానీ, 95 శాతం క్రైస్తవులు మరియు క్రైస్తవనాయకులు, పండితులు ఇదే నిజమని నమ్ముతున్నారనుకోవడం పెద్ద పొరపాటు. సాంప్రదాయ క్రైస్తవ్యం(orthodox)లో కూడా ఎక్కడా "తండ్రి కుమారుడు" అని లేక "కుమారుడే తండ్రి" అని చెప్పబడలేదు. ఇలా చేయటం క్రైస్తవసంఘం చేయని పాపాన్ని దానికి అంటగట్టటమే. అంతేకాక సంఘం యొక్క సిద్ధాంతపరమైన విలువలను తప్పుగా వర్ణించటమే. అయ్యా, మీరు తెలుగు పదజాల వాడుకలో నిష్ణాతులై ఉండొచ్చు కానీ ఆ భాషాప్రావీణ్యంతో ఒకరు చెయ్యని పనిని, నమ్మని సిద్ధాంతాన్ని వారికి అంటగట్టే ప్రయత్నం చేయడం మాత్రం పాండిత్యం అనిపించుకోదు. ఇది మీ కరపత్రంలోని మీ బోధలో మొదటి తప్పు. మీరు మరో కరపత్రంలో చెప్పిన విధంగా మీరు మంచివారు అని చెప్పుకోవడానికి పక్కవాడు దొంగ అని నేరారోపణ చేయవలసిన అవసరం లేదు.

ఇలాగే జాన్ గారు, 'యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు మాత్రమే' అన్న ఏకైకబోధ (లేక బాధ) ఈ కరపత్రం ద్వారా వ్యక్తపరచడం జరిగింది. ఇది ఆయన చేసిన రెండవ తప్పు. జాన్ గారు, క్రైస్తవలోకం అంతా మీ వెంట గొంతెత్తి 'యేసు సజీవుడైన దేవుని కుమారడైన క్రీస్తు' అని చెప్పడానికి సిద్ధం, కాకపోతే మీరు చేర్చిన ‘మాత్రమే' అన్న పదం అభ్యంతరకరమైనది. ఎందుకంటే 'యేసు దేవుని కుమారుడు మాత్రమే కాదు, దేవుడు కూడా' అని లేఖనాలు ప్రస్ఫుటంగా నొక్కి వక్కాణిస్తున్నాయి.

"దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును...." (అపో.కా.20:28) “అనగా మహా దేవుడును మనరక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు..." (తీతు 2:13) ( ఈ వాక్య వివరణ కొరకు మరియు జాన్ గారు చేసే ఈ వాక్య వక్రీకరణను వివేచించటం కోసం ఈ వెబ్ సైట్లోని 'యేసుక్రీస్తు దైవత్వం' అను వ్యాసాన్ని చదవండి.); “జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనైయుందును అతడు నాకు కుమారుడై యుండును." (ప్రకటన 21:7).

పై లేఖనాలు యేసు దేవుడని స్పష్టంగా తాటికాయలంత అక్షరాలతో చెబుతూ ఉంటే మీరు మాత్రం ఆయన దేవుడు కాదు, కేవలం దేవుని కుమారుడు మాత్రమే అని వింతగా మాట్లాడితే హాస్యాస్పదం కాక ఇంకేమౌతుంది.

అసలు ఈ బుద్ధి మొదట పుట్టింది మీకు కాదు, ఏరియస్ అనేవాడు రెండవ శతాబ్దంలోనే ఈ దుర్ఘాతం చేయడం, అతనిని సంఘం నుండి వెలివేయడం జరిగింది. నేను యెహోవాసాక్షిని కాదని మీరు చెప్పుకొని తిరిగినా, నిజానికి వారి బోధ బాగా వంటపట్టించుకున్నారని మీ కరపత్రిక చదివినవారెవరికైనా అర్థం అవుతుంది. మీరు మరియు మీలాంటి వారు  చెప్పే మాటలలో తర్కం లేదని ఈ వ్యాసంలో రుజువు చేయడం మీరు గమనించగలరని మా ఆశ.

జాన్ గారి వాదన ప్రకారం,

1. వాక్యం దేవుడై ఉండెను కానీ ఆ వాక్యం యేసు క్రీస్తు రూపంలో మనుష్యుడై భూలోక ప్రవేశం చేసినప్పుడు కేవలం నరమాత్రుడుగా మాత్రమే ప్రకటింపబడెను. అనగా యేసుక్రీస్తు కేవలం నరుడు, దేవుడు కాదు.

2. యేసుక్రీస్తు దేవుని మొదటి సృష్ఠి

3. యేసును ఆరాధించరాదు

4. యేసు దేవుడు మరియు దేవుని కుమారుడు అనటం అసాధ్యం. ఆయన కేవలం దేవుని కుమారుడైన క్రీస్తు.

యోహాను 1:1-4, 10 ,11 ,14 ; మత్తయి 1:23, రోమా 9:4,5 వచనాలు చదవండి

ఈ వచనములు జాన్ బొంకూరిగారి విశ్లేషణ అవసరము లేకుండానే స్పష్టంగా యేసుక్రీస్తు సృష్ఠికర్త అని నొక్కి వక్కాణిస్తున్నాయి. కాకపోతే వచ్చిన చిక్కేమిటంటే ఆయనగారు, 'ఇల్లు కట్టించిన యజమాని ఇల్లు కట్టాను అని చెప్పుకుంటాడు కదా' అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యేసును దేవుడు అని చెప్పినవారు పరిశుద్ధాత్ముడిని దూషించినవారంట!! అయ్యా, మీ పేరుకు తగ్గట్టుగా బాగానే బొంకు నేర్చారు. ఇశ్రాయేలీయులు ఎదురుచూసిన మెస్సీయ, దేవుని కుమారుడని ఆయన రాజ్యం నిత్యం నిలుచునని యెషయా గ్రంథంలో వివరించినట్టుగా ఆయన "శక్తిమంతుడైన దేవుడు" అని క్రైస్తవులు రెండువేల సంవత్సరాలుగా లేఖనాల నుండి నేర్చుకొన్నది సత్యం. ఒకవేళ మీకు ఆయన దేవుడని నమ్మటానికి రుజువులు అవసరం అయితే సహాయాన్ని కోరండి కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు. హేతువాదులు, ముస్లిములు చేతిలో క్రైస్తవులు చిత్తుగా ఓడిపోతున్నారని- ఒకటి రెండు మీకు తెలిసిన సన్నివేశాలను గుర్తుంచుకొని వాటి ఆధారంగా కామెంట్లు చేయడం మీకు బాగా అలవాటైంది. ఒక్కసారి www.abnsat.com లేదా www.trinitychannel.com అనే వెబ్సైట్ ను చూడండి. ఇందులోని వీడియోలను చూసి ఎవరు ఎవరి చేతిలో చిత్తవుతున్నారో మీ అంతట మీరే నిర్ణయించుకోండి.

కనుక మీరు తెలుసుకోవలసింది:

మీరు చేసే బోధ "మీ బోధే" కానీ బైబిలు బోధ కాదు. తండ్రియైన దేవుడే నరరూపంలో యేసులా ఈ లోకంలో జన్మించాడు అని బైబిల్ బోధించదు. అలాగే క్రైస్తవులు అలాంటి బోధను నమ్మరు కూడా. కేవలం మీకు క్రైస్తవబోధ అర్థం కాలేదు కనుక బహుశా క్రైస్తవులు తండ్రినే యేసు అనుకుంటున్నారని మీరు ఊహించుకొని ఏదో ఉద్దరిద్దాం అనుకున్నారు. క్రైస్తవులు బైబిల్ ఆధారంగా, సృష్టికి ముందు నుండీ ఉన్న సృష్టింపబడని (సదాకాలము నుండి అస్థిత్వంలో ఉన్న) దేవునిగా యేసును ఆరాధిస్తారు. ఆయనను వాక్యంగా చూస్తారు. ఆయనను సృష్టికర్తగా కొనియాడతారు.

మీరన్నట్టు యేసుక్రీస్తు మొదటి సృష్టికాదు. కొలస్సీయులకు వ్రాసిన పత్రికలో పౌలు అన్న మాటలను దాని సందర్భానికి భిన్నంగా తీసుకుంటే ఇలాంటి విపరీతార్థాలే వస్తాయి. అయినా ఇది మీకు పుట్టిన బుద్ధి కాదులే. యెహోవాసాక్షులు ఎప్పటినుండో చెప్పుకొస్తున్నారు. వాళ్లకంటే ముందు ఏరియన్లు కూడా ఈ తప్పుడు సిద్ధాంతాన్ని ప్రచురించినట్లు చరిత్ర చెబుతోంది. వారి పలుకులను మీ పలుకులుగా చెప్పుకోవటం వలన మీకు కలిగేది నష్టమే కానీ లాభం కాదు అని మీరు గ్రహించాలి. మీరు యేసు మొదటి సృష్టి అనటానికి వాడుకున్న వాక్యభాగాన్ని పరిశీలిద్దాం - "ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు." (కొలస్సీ 1:15-17)

“అదృశ్య దేవుని స్వరూపియై సర్వసృష్టికీ ఆదిసంభూతుడై ఉన్నాడు” అన్న మాటకు మీ వక్ర విమర్శననుసరించి యేసు సర్వసృష్టికి మొదటివాడు అని అర్థం అని మీ వాదన, కాకపోతే ఇదే వచనాన్ని సంపూర్ణంగా దాని సందర్భంలో చదివితే తెలిసేది ఇది -

1. యేసు అదృశ్యదేవుని స్వరూపి

2. ఆయన సృష్టికి ఆదిసంభూతుడు ( గ్రీకులో 'ప్రథమకారణభూతుడు' అని అర్థమిచ్చే 'ప్రోటోకాజ్' అనే పదాన్ని ఆదిసంభూతుడని అనువదించారు)

3. సర్వము ఆయనయందు సృజింపబడెను

4. సర్వము ఆయన ద్వారా సృజింపబడెను.

5. సర్వము ఆయనను బట్టి సృజింపబడెను

6. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు (సృజింపబడిన వాడు కాదు, గమనించాలి!)

7. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.

పై 7 విషయాలలో ఏ ఒక్కటీ మీరు అర్థం చేసుకున్నా యేసు దేవుడని మీ నోటితో ఒప్పుకుంటారు. ఒక రకమైన “క్రిస్లాం” లో జీవించటానికి ప్రయత్నించరు.

ఇక్కడ "క్రిస్లాం” అని ఎందుకన్నానంటే మీ వాదన ఇస్లాం మతానికీ క్రైస్తవ దృక్పథానికీ మధ్యలో వేలాడుతున్నట్టుగా ఉంది. అది రెండు వ్యతిరేక దిశా, దశలను కలిపే ప్రయత్నం మాత్రమేనని మీరు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.

ఇక మీ మూడవ వాదన అయిన 'యేసును ఆరాధించరాదు' అనే మాటను చూస్తే దీనికి బదులు యేసే చెబుతాడు. ఆయనను ఆరాధించిన తోమాను ఆయన త్రోసిపుచ్చలేదు కానీ, ఆయన విశ్వాసాన్ని ఆమోదించాడు. చూడకనే నమ్మిన నన్ను, నిన్ను కూడా ఇంకా ఎక్కువగా అభినందిస్తాడు అంటే అతిశయం కాదు. ఆయనను తన శిష్యులు ఆరాధించారు, ఆ శిష్యుల వాక్యబోధపై కట్టబడిన సంఘం, ఆ సంఘపెద్దలు ఆరాధించారు. ఇదంతా సత్యగ్రంథం అయిన బైబిల్లో స్పష్టంగా చెప్పబడి ఉంది. కనుక మీ వాదనలో విషయం లేదు అన్నది విదితం.

చివరిగా 'యేసు దేవుని కుమారుడైన క్రీస్తు' అనే మీ బోధ ప్రజలను తికమకపెట్టి, మభ్యపెట్టే ప్రయత్నం తప్ప ఇంకేమీ కాదు. బైబిల్ ప్రకటించే త్రిత్వంలో కుమారుని కార్యకలాపాలను స్వచ్ఛందంగా ఎన్నుకున్న వ్యక్తి యేసు అనే నామంతో మనుష్యజాతి కొరకు 2000 సంవత్సరాల క్రిందట భూమిపై ఉదయించటం ఆయన దేవుని అధికారాన్ని తన మాటలలో, చేతలలో, మౌనంలో, నడత నడవడికలలో చూపించటం, అన్నిటికీ మించి మృత్యువుపై జయమొంది మనుష్యజాతికి రక్షణ సౌభాగ్యత కలిగించటం వలన ఆయనే దేవుడని, కార్యకలాపాలలో దేవుని కుమారుడని, రక్షణ కార్యంలో క్రీస్తు అని నమ్మటానికి క్రైస్తవులకు ఏ అభ్యంతరమూ లేదు. మీరు ఇంతటి మహత్తరమైన సత్యాన్ని గ్రహించి ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుని కృప వలన మీకు, మిమ్ముల్ని అభిమానించి వెంబడించే ప్రజలకు యేసు చేసిన బలియాగం ఇంకా అందుబాటులోనే ఉంది. నమ్మి హృదయంలో విశ్వసించి నోటితో యేసు దేవుడని ఒప్పుకుంటే రక్షణ మీ కొరకు బహుమానంగా వేచి ఉంది అన్న సంగతి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను.