రచయిత: పి. సురేష్ బాబు

ఉపదేశకునిగాను బోధకునిగాను ఉండే వ్యక్తి దేవుని యెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను (2 తిమోతి2:15), మరియు హితబోధ విషయమై హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగల వాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను (తీతు 1:9).

అది డిశంబరు 4వ తేది, 2010వ సంవత్సరము జగిత్యాల, కరీంనగర్, దేవిశ్రీ ఫంక్షన్ హాల్నందు యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ( U.I.R.C) వారు నిర్వహించిన “యేసు బోధనలో దేవుడెవరు? అను అంశముపై ఏర్పాటు చేసిన మహాసభకు ముస్లిములు, హైందవులు, క్రైస్తవులు పెద్దయెత్తున తరలి వచ్చారు.

ఆ మహాసభకు హైందవమతము నుండి ఒక వక్తను, క్రైస్తవ్యం తరుపు నుండి సి.ఎస్.ఐ సంఘ కాపరియైన రెవ. కె.ఎస్. ఎడ్వర్డ్ జయకుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది. 

సభ ప్రారంభమైనది; U.I.R.C వ్యవస్థాపకులైన షఫీగారు లేచి 'లేడికి లేచిందే పరుగు' అన్నట్లు దాదాపు 45 నిమిషాల పాటు ఊకదంపుడు ఉపన్యాసమును అందుకున్నారు.

యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వమును మరియు ఆయన జీవనశైలిని గూర్చి మాట్లాడుతూ, ఆయన దేవుడు కాడని, తాను ఎప్పుడు ఎక్కడా కూడా దేవుడనని చెప్పుకోలేదని షఫీ గారు చెప్పుకొచ్చారు. ఐతే ప్రియ పాఠకులారా, ఇక్కడ గమనించదగిన సంగతి ఏమిటనగా, క్రీస్తు ప్రవక్త, మనుష్యకుమారుడు, మధ్యవర్తి అనబడే ఈ సంగతులు యేసుక్రీస్తును ఒక కోణము నుండి తెలియజేయు సంగతులే. ఐతే అది మాత్రమే చాలు అని సరిపెట్టుకుంటే పొరబడినట్లే, ఎందుకంటే, తనుకు తానుగా తాను దేవుడనని చెప్పుకున్నట్లు మనం తెలుసుకోవాలంటే ఆయనను మనం రెండవ కోణములో చూడక తప్పదు. దీనిని గూర్చి మరింత వివరముగా తెలుసుకోవాలనుకున్నట్లయితే మేము ప్రచురించిన “యేసుక్రీస్తు దైవత్వం” అనే వ్యాసమును సమగ్రముగా చదవగలరు.

ఇక అసలు విషయానికొస్తే, ఆ మహాసభలో షఫీగారు ఎన్నో సంగతులు తప్పుగా మాట్లాడారు. బైబిలు లేఖనములను తనకు అనుకూలంగా మలచుకుని ప్రసంగించారు. యేసును కేవలం ఒక మానవరూపిగా చిత్రీకరించారు. ఆయనగారు ప్రసంగించిన తప్పులలో కొన్ని తప్పులను నేనిక్కడ ఉటంకిస్తున్నాను, జాగ్రత్తగా గమనించి చదవండి.

• యేసు తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా నేను దేవుడను, నన్ను ఆరాధించండి అని చెప్పుకోలేదు, బైబిలు మొత్తం పరిశీలించి చదవండి.

• తాను ప్రవక్తగా మాత్రమే చెప్పుకున్నాడు, పైగా నీవు నీ ప్రభువైన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే ఆరాధించవలెను అని అపవాదితో చెప్పాడు. తాను దేవుడైతే తనను ఆరాధించమని అపవాదితో చెప్పియుండెడివాడు. కనుక ఆయన కేవలం ప్రవక్త.

• యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాడు అని చెప్పవచ్చు, ఎందుకంటే తండ్రి నాకంటే గొప్పవాడు అని స్వయంగా క్రీస్తే అన్నాడు.

• అద్వితీయ సత్యదేవుడవైన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. క్రీస్తు కాలానికి క్రీస్తు మార్గము, సత్యము, జీవమైయున్నాడు, కానీ నేటి కాలమునకు చిట్టచివరి దైవప్రవక్తయైన మహ్మదు మార్గము, సత్యము, జీవమైయున్నాడు. కనుక ఈనాడు మనకు నిత్యజీవము కావలెనంటే దేవునిని మరియు మహ్మదు ప్రవక్తను ఎరిగియుండాలి.

ప్రియ పాఠకులారా!

గమనించారు కదా! షఫీగారు తన ప్రనంగమునకు బలము చేకూర్చుకొనుటకు, అనేకమంది క్రైస్తవ విశ్వాసులను తన దారికి మళ్లించుకొనుటకు ఎలాంటి తప్పుడు మాటలు పలికారో! ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువ అన్నట్లు చమత్కారమైన మాటలతోను విషపూరితమైన సంగతులతోను ప్రజలందరినీ అబ్బురపరిచారు. 

ఆయనగారు ప్రసంగించిన ఎన్నో తప్పులలో అతి భయంకరమైన తప్పు ఏమిటనగా, మహమ్మదు మార్గము సత్యము జీవము అని చెప్పడం. ఒక సామాన్య క్రైస్తవుడు కూడా అంగీకరించని ఈ పచ్చి అబద్దాన్ని షఫీ గారు ఎలా పలికారో ఆయనగారికే తెలియాలి. యేసుక్రీస్తును కేవలం ప్రవక్తగా మాత్రమే తెలియజేస్తూ, ఆ యేసుక్రీస్తు కూడా దేవుడు ఒక్కడేనని అంగీకరించినట్లు తెలియజేస్తూ, షఫీ గారు తన ప్రసంగాన్ని ముగించారు. తదుపరి ఉపన్యాస సమయం రెవ.పాస్టర్ ఎడ్వర్డ్ జయకుమార్ గారిదే. అప్పటికే షఫీగారు వెలిబుచ్చిన ఊహాజనితమైన ప్రసంగానికి అనేకమంది క్రైస్తవ విశ్వానులు తికమకకు గురైయుండవచ్చు. కనుక షఫీగారి ప్రసంగాన్ని ఖండించి బుద్ధిచెప్పి సత్యవాక్యమునకు న్యాయం చేకూర్చే బాధ్యత ఎడ్వర్డ్ జయకుమార్ గారిదే కనుక, క్రైస్తవ విశ్వాసులు ఆయన ప్రసంగమునకై ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. క్రీస్తును గూర్చి తప్పుగా మాట్లాడిన షఫీగారికి జయకుమార్ గారి శక్తికలిగిన లేఖనానుసారమైన ప్రసంగం తిరుగులేని జవాబుగానే వుంటుందని భావించారు. సరే, చివరికి ఆయనగారికి ప్రసంగసమయం రానే వచ్చింది, మైకు అందుకున్నారు. క్రీస్తుకు మరియు లేఖనానికి కట్టుబడివుండే ఒక దైవజనుడు చేయాల్సిన పని ఏమిటంటే - యేసు కేవలం ప్రవక్త మాత్రమే కాదు ఆయన దైవత్వపు రెండవ కోణము నుండి కనీసం కొన్ని లేఖనములనైనా చూపించి ప్రసంగించాలి. మరియు యేసే మార్గము సత్యము జీవము తప్ప మహమ్మదు కానేకాదు. మహమ్మదు మార్గమని సత్యమని జీవమని అసలు బైబిలులో ఎక్కడా -వ్రాయబడలేదు అని బహిరంగంగా ప్రజల సమక్షములో ఎలుగెత్తి చెప్పాలి. కానీ అక్కడ కూడియున్న క్రైస్తవ విశ్వాసులందరికీ ఊహించని పరిణామం ఎదురైంది, ఆ ఊహించని పరిణామము వారిని తీవ్ర దిగ్ర్భాంతికి నిరాశ, నిస్పహలకు గురిచేసింది. అదేమిటో తెలుసా? మైకు చేతికొచ్చిన మొదటి ఏడునిమిషాలలోనే అక్కడకు వచ్చిన క్రైస్తవవిశ్వాసులను కలవరపరిచేలా వారి నమ్మకాన్ని గలిబిలి చేసేలా షఫీగారు చేసిన ప్రసంగాన్ని మనసారా మెచ్చుకుంటూ “ఆయన చెప్పిన సత్యాలు ఎంతో అమూల్యమైన సత్యాలు” అంటూమెరుగులు దిద్ది వత్తాసు పలికారు. అంతేకాదు జయకుమార్ గారు పట్టుమని 30 నిమిషాలైనా మాట్లాడకపోతే పద్దతిగా వుండదని భావించి ప్రారంభించిన ఆయనగారు, బైబిలులోనుండి కనీసం మూడు లేఖనములైనా చదవలేదు, చూపించలేదు, పైగా జయకుమారుగారు మాట్లాడిన తెలుగు భాష కూడా అసలు ప్రసంగ పటిమ లేనిదిగా వున్నది. జయకుమారుగారు షఫీ మాటలను ఖండించకపోతే ముస్లిములందరి మధ్యా పిరికితనంతో వ్యవహరించాడులే అని మనం సమర్ధించుకోవచ్చు. కానీ జయకుమార్ గారి ప్రసంగంలో లేఖనవిరుద్ధమైన మాటలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.

అవేమిటనగా:

•సర్వమతాలు మంచినే బోధిస్తున్నాయి కాని చెడును కాదు, కనుక అన్ని మతాల్లో వున్న మంచినే తీసుకోవాలి తప్ప చెడును కాదు.

• మనం ప్రయాణించే మార్గాలు వేర్వేరు కావచ్చు కానీ గమ్యం మాత్రము ఒక్కటే కనుక ఏ మార్గంలోనైనా వెళ్లవచ్చు, ఎందుకంటే All Roads lead to Rome.

అసలు ఒక లేఖనానుసారమైన క్రైస్తవునిగా బైబిలులోని మంచిని మంచిగా తీసుకోవాలే తప్ప అసలు ఇతర మతాలలోని మంచిని తీసుకోవాల్సిన అవసరత మనకేమిటి? బైబిలులో చెప్పబడిన మంచికి మించిన మంచి మరేయితర గ్రంథములోనైనా వుందా? ఒకవేళ వుంది అని నీవు అంగీకరించినట్లైతే ఆ గ్రంథాన్ని బైబిలుతో సమానంగా చేసినట్లవుతుంది. అప్పుడు ఆ యితర మత గ్రంథం మరియు బైబిలు గ్రంథం ఒకే నిష్పత్తిలో వుంటాయి గనుక బైబిలు యొక్క మంచిని గూర్చి గానీ మరియు దాని ఔన్నత్యమును గూర్చి గానీ నీవు సమగ్రముగా విశదీకరించలేవు. కనుక ఇతర మతాలలో కూడా మంచిని మనం తీసుకోవచ్చు అని నీవు చెప్పినట్లయితే నీకు తెలియకుండానే క్రైస్తవ్యంలో లేదా బైబిలులో లోటు, వెలితి వున్నట్లు చెప్పినట్లవుతుంది. కనుక జయకుమారుగారు మాట్లాడినది పచ్చి మోసపూరితమైన విషయం. ఇక రెండవ విషయము ఏమిటనగా కేవలం యేసే మార్గము, సత్యము, జీవము తప్ప మహమ్మదు కానేకాదు అని బహిరంగంగా చెప్పియుండాలి. అలా చెప్పకపోవడం వలన ప్రభువును నూతనంగా అంగీకరించిన విశ్వాసులు అయోమయంలో పడే అవకాశముంది. ఇంతవరకూ క్రీస్తు మాత్రమే మార్గము సత్యము జీవము అని భావించాము కానీ మహమ్మదు కూడా మార్గము సత్యము జీవమే అనే తప్పుడు అలోచనలో పడే అవకాశం వుంది.

 'పాదిరి విశ్వాసికి మాదిరి' అనీ పెద్దలు అంటుంటారు. మరి జయకుమార్ పాదిరిగారు ఎవరికి మాదిరిగా వున్నారు- విశ్వాసికా? అవిశ్వాసికా సమయాన్ని సద్వినియోగం చేనుకుని దుర్బోధను ఖండించు ఏ క్రైస్తవ ప్రసంగికుడు బహుశా జయకుమారుగారిలా పిరికితనంతో వ్యవహరించడు. షఫీగారి విషగుళిక లాంటి ఉపన్యాసమును ఖండించకపోగా, ఆయన గారి ఉపన్యాసాన్ని సమర్థించడం చూస్తుంటే “ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లున్నది". పొంతనలేని మాటలతో సారహీనమైన పలుకులతో చివరికి జయకుమార్ గారు తన ప్రసంగాన్ని ముగించారు.

ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం

అనేకమంది క్రైస్తవ విశ్వాసులు షఫీగారిని ప్రశ్నించటానికి బారులు తీరి నిలబడివున్నారు. ఆ సమయంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకున్నది. అదేమిటనగా - వినయకుమార్ అనే ఒక క్రైస్తవ యవ్వనస్థుడు “మీకు బైబిలుపై సరైన అవగాహన లేదు” అని తన అభిప్రాయాన్ని ధైర్యంగా షఫీగారికి వెలిబుచ్చాడు. దానికి సమాధానముగా షఫీగారు లేచి నిలబడి “నేను చెప్పిన విషయాలు అమూల్య సత్యాలు” అని మీ పాస్టరుగారే గొప్ప స్టేట్ మెంటు ఇచ్చారు కదా! అలాంటిది నాకు బైబిలుపై సరైన అవగాహన లేదని మీరెలా అనగలరు? అని తిరిగి ప్రశ్నించాడు. అనగా షఫీగారి ప్రసంగాన్ని ఘనపరుస్తూ జయకుమారుగారు ఇచ్చిన స్టేట్ మెంట్ ఒక పెద్ద అడ్డుగోడగా నిలిచి ఆటంకపరిచింది. అలాంటి ధైర్యంతో ముందుకు వచ్చిన ఎందరో వినయ్ కుమార్లు జయకుమార్ గారి కారణంగా వెనుదిరిగి వెళ్ళిపోయుండవచ్చు. చూశారా! పాస్టర్ జయకుమార్ గారి మాటలు ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయో! ఆయనగారు ఏమీ ప్రసంగించకపోతే అక్కడి పరిస్థితి మరోలా వుండేదిగాని ఇంత దుస్థితికి దిగజారేది కాదు. వినయ్ కుమార్ లాంటి సామాన్యమైన విశ్వాసికి వున్న తెగువ, దమ్ము లేని పాస్టర్ జయకుమార్ నిజంగా అసలు సిసలైన దైవజనుడేనా? ముందుగా మనం ప్రస్తావించుకున్నట్లు ఎదురాడు వారి మాటలను ఖండించుటకు శక్తి లేనివాడిని బోధకునిగా పరిగణించగలమా మీరే చెప్పండి! “బరితెగించిన కోడి బజారులో గుడ్డు పెట్టిందని' అన్న విధంగా ఎక్కడ ఏది మాట్లాడినా చెల్లు బాటవుతుందనుకునే ఇలాంటి లేఖన పరిజ్ఞానం లేని మిడిమిడి జ్ఞానం కలిగినవారిని ఛైర్మన్ గా పెట్టుకున్న సి. ఎస్. ఐ వారిని ఏమనాలి?

 ఆ మహాసభలో అనేకమంది క్రైస్తవేతరులు వున్నారు. వారికి క్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించే మహాసదవకాశం జయకుమార్ గారికి లభించింది, మరియు దైవఖడ్గంతో తప్పుడుబోధను ఖండించే మహాభాగ్యం కూడా లభించింది. కానీ ఈ రెంటిలో ఏది చేయకపోగా షఫీగారి ప్రసంగాన్ని నిస్సిగ్గుగా సమర్థించడం క్షమించరాని ఆత్మీయనేరం. ప్రజల మెప్పును పొందడానికి ప్రయత్నంలో చివరికి తమకుతాముగా భ్రష్టత్వానికి అప్పగించుకోవడమంటే ఇదే.

 యూదులలో అనేకులు క్రీస్తును విశ్వసించినప్పటికీ పరిసయ్యుల చేత వెలివేయబడుదుమేమోనని భయపడి వారు క్రీస్తును బహిరంగంగా అంగీకరించలేదు. కారణమేమిటనగా దేవుని మెప్పుకంటే వారు మనుషుల మెప్పుకై ఆరాటపడ్డారు. ఆ కారణంగా యూదులలో కొందరు రహస్య విశ్వాసులుగానే మిగిలిపోయారు (యోహాను 12: 41-43 ). కానీ ఇలాంటివారిని గూర్చి లేఖనము ఏమి సెలవిస్తున్నదో తెలుసా? “నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యుల యెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్యకుమారుడు దేవుని యెదుట వానిని ఒప్పుకొనును” (లూకా 12:8). ఐతే క్రీస్తును పాస్టర్ జయకుమార్ గారు నిరాకరించలేదు కదా అని అనవచ్చు. కానీ క్రీస్తు స్థానములో మహమ్మదును ఇరికించి మహమ్మద్ కూడా మార్గము సత్యము జీవము అని బహిరంగముగా ప్రసంగించినప్పుడు, దానిని ఖండించి క్రీస్తు ఔన్నత్యానికి సరైన న్యాయమును చేకూర్చాల్సింది పోయి షఫీగారి మాటలను సమర్థించి ప్రత్యక్షముగా పరోక్షముగా మద్దతు పలకడముకంటే మించిన అన్యాయం మరొకటి వుంటుందా? వాస్తవముగా చెప్పాలంటే ఇది క్రీస్తును నిరాకరించుట కంటే మహా గొప్ప దోషము. మేలయినది చేయనెరిగియుండియు ఆలాగు చేయనివారికి పాపము కలుగును. అందుకారణంగానే “నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును అని పౌలు సెలవిచ్చాడు (గలతీ. 1:10).

అసత్యముతో రాజీకుదుర్చుకుని వంకర వ్యాఖ్యలు చేసిన రెవ. పాస్టర్ కె.ఎస్. ఎడ్వర్డ్ జయకుమార్ గారిని, కాపరిగా నియమించిన సి.ఎస్.ఐ. శాఖవారు అతనిపై ఎలాంటి చర్య తీసుకోకపోగా అతనిని ఇంకా అదే కాపరి పదవిలో కొనసాగింపచేయడం ప్రభువుపట్ల మరియు ఆయన సువార్త పట్ల సి.ఎస్.ఐ. శాఖవారి విశ్వాస్యత మీద పలు అనుమానాలకు తావిస్తున్నది. "సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడతురా?” అని లేఖనము ప్రశ్నిస్తున్నది.

ఏది ఏమైనా జారత్వము చేసిన ఒక సామాన్య విశ్వాసి విషయములోనే “ఆ దుర్మార్గుని మీలో నుండివెలివేయ”మని (1కొరింథీ 5:13) వాక్యము సెలవియ్యగా, సువార్తకు ద్రోహము చేయునంతగా ఒక అన్యునితో స్వరము కలిపి ఆత్మీయ జారత్వమునకు పాల్పడిన ఒక పాదిరికి ఎలాంటి శిక్ష వేయడము ఉచితము కాదన్నట్లు సి.ఎస్.ఐ. శాఖవారు వ్యవహరించడం మిగుల శోచనీయం.

 “క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొనిపోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు” (అపో.కా. 20:29-30). తస్మాత్ జాగ్రత్త!

గమనిక: ఈ వ్యాసంలో బహిర్గతం చేయబడిన విషయాల వాస్తవికతను నిర్ధారించుకొనగోరువారు “యేసు బోధనలలో దేవుడెవరు?” అను వీడియోను వీక్షించగలరు. ఈ వీడియో హైదరాబాదులోని అంబరుపేటలో వున్న యు.ఐ.ఆర్.సి. కార్యాలయమునందు లభ్యమవును.