దుర్బోధలకు జవాబు
రచయిత: జి.బిబు

‘జయశాలి' అని స్వయం బిరుదు పెట్టుకున్న శ్రీ పి.డి.సుందరరావుగారు, గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అనే ధోరణిలో పుస్తకాల వెంబడి పుస్తకాలను, ప్రసంగాల వెంబడి ప్రసంగాలను ప్రచురిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన ముద్రించిన 'విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు' అనే పుస్తకాన్ని ఇటీవలే నేను చదివాను. ఆయన రచనలన్నీ క్షుణ్ణంగా పరిశీలిద్దామనే ఉద్దేశ్యముతోనే నేను ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభించినప్పటికీ, ఈ ఒక్క పుస్తకంతోనే నా పరిశీలన ముగియడంతో నా ఉద్దేశ్యము ఎంతో సులువుగా నెరవేరింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈ ఒక్క పుస్తకంలోనే ఆయన చేసిన దుర్బోధలు, ఆయన రచనలన్నిటిని గూర్చి అంచనా వేయగలిగే పరిమాణంలో ఉన్నందున, ఇంకా ఎక్కువగా ఆయన రచనలను చదివి 'సమయాన్ని సద్వినియోగం చేయమనే' ఆజ్ఞకు అవిధేయత చూపడం కంటే, నేను వెలికితీసిన విషయాలను అందరు చూసేలా బహిర్గతం చేయడమే శ్రేయస్కరమని భావించాను. లేఖనాలకు విశ్వాస్యత చూపడంలో మాత్రమేకాక, ఇతరులపై తాను విధించే నియమాలను సహితం తనకు తాను అన్వయించుకోవడంలో విఫలం అయినట్లు నేను కనుగొన్న నేపధ్యంలో, దీనిని 'జయశాలి పరాజయం' అని కాక ఇంకేమని పిలవాలి?

'జయశాలి దుర్బోధలను బహిర్గతం చేసే ఈ నా వ్యాసంలో, పైన పేర్కొన్న ఆయన పుస్తకంలోని ప్రశ్నోత్తరాలను ఆయన పొందుపరచిన క్రమంలోకాక, ప్రశ్నలు ప్రాధాన్యతను బట్టి నేను వ్రాసే శైలికి అనుగుణంగా, నేను నా స్వంత క్రమాన్ని పాటించాను. ఐతే దీనిని బట్టి ఆయన చెప్పిన విషయాలు తారుమారు కాకుండా తగిన జాగ్రత్త వహించాను.

 

ముఖ్యగమనిక :

ఈ వ్యాసంలో ప్రయోగించిన కఠిన పదజాలములు మరియు విమర్శనా శైలీ, శ్రీ పి.డి. సుందరరావుగారిని వ్యక్తిగతంగా అవమానించటానికిగాని, కించపరచటానికి గాని ఉద్దేశించినవి కావని, ఆయన ప్రబోధించే తప్పుడు బోధల తీవ్రతను నొక్కిచెప్పేందుకే అవి ప్రయోగించబడ్డాయని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. శ్రీ పి.డి. సుందరరావుగారు తమ తప్పిదాలను బహిరంగంగా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి, వాటిపై జయము పొంది, యదార్ధంగా తమను తాము జయశాలిగా నిరూపించుకోవాలన్నదే మా ఆకాంక్ష; అందుకు కావలసిన కృప దేవుడు ఆయనకు అనుగ్రహించును గాక! ఇక వివరాల్లోకి వెళదాము. 

 

1.దేవుని గూర్చిన దుర్బోధ

త్రియేకదేవుడు', 'త్రిత్వము' మున్నగు పదాలు బైబిల్లో లేని పదాలనీ, ఇవి కేవలం నామకార్థ క్రైస్తవబజారులో వాడుకలోనికి వచ్చిన పదాలనీ, ఇవి సాతాను బోధలనీ సులభంగా కొట్టిపారేశారు 'జయశాలి.” (విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు 10వ ప్రశ్న, పేజి 32). అయితే, తాను సత్యాలని బైబిల్ నుండి గ్రహించినవాటికి విస్తారమైన తన స్వంతమాటలలో వివరణ ఇవ్వడం తప్పు కానప్పుడు, ఇతరులు తాము బైబిల్ నుండి సత్యాలని గ్రహించినవాటిని ఒక్క మాటలో (త్రిత్వము) సమర్థవంతంగా వ్యక్తపరిస్తే, ఆయనకు వచ్చిన సమస్య ఏమిటో నాకు అంతుపట్టడంలేదు. ఈ నా ప్రశ్న విప్లవాత్మకమైనది కాకపోయినా, దీనికి సంచలనాత్మకమైన సమాధానమేమైనను ఆయన చెప్పగలిగితే హర్షిస్తాను.

ఈ మాట అలా ఉంచితే, ఇక అసలు సమస్య ఏమిటంటే, దైవత్వంలోని త్రియేకత విషయమై ఒకే వ్యక్తి మూడు పాత్రలు వహించాడు అని చెప్పుకునే ఏకపాత్రాభినయవాదులకు సరిగ్గానే బుద్ధిచెప్పుతూ, ముగ్గురు వేరువేరు వ్యక్తులని విస్పష్టంగా లేఖనాల వెలుగులో ఋజువుపరిచినప్పటికీ, ఈ సత్యంతో నేను సంపూర్ణముగా ఏకీభవించినప్పటికీ, సత్యాన్ని చెప్పినట్లే చెప్పి ఒక సరికొత్త దుర్భోదకు తెరలేపారు 'జయశాలి'. ఇంతకీ ఆ దుర్బోధ ఏమిటో ఆ దైవజ్ఞాని మాటలలోనే చదవండి.

'సంకల్పంలో జరిగింపబడిన ఈ కార్యక్రమాలలో ఆలోచనలో ఏకమై ఏకకార్యాన్ని ముగ్గురుదేవుళ్ళై, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా బైబిలునందు కనబడుచున్నారు........... ముగ్గురూ ఒక్కటేననుటకు మానవుని రక్షణ, పరలోక రాజ్య ప్రాప్తి వరకూ ఒక్క పనినే కలిగి ఉన్న ముగ్గురు దేవుళ్ళుగా కొట్టొచ్చినట్లు వాక్యమందు చూడగలము' (విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు 10వ ప్రశ్న, పేజి 32).

దీన్నిబట్టి చూస్తే దేవుడు ఒక్కడే అని స్పష్టంగా బోధించే బైబిల్ వచనాలన్నిటినీ దేవుళ్ళు ముగ్గురు అని తిరిగి వ్రాయవలసిన అవసరత కనిపిస్తుంది. సత్యమేమిటంటే ఏ బైబిలైతే తండ్రి, కుమార, పరిశుద్దాత్మలు ముగ్గురు వేర్వేరు వ్యక్తులని, ముగ్గురు ఒకే వ్యక్తికాడని, ఒకే వ్యక్తి మూడు పాత్రలను పోషించటంలేదని బహుస్పష్టంగా బోధిస్తుందో, అదే బైబిల్ దేవుడొక్కడే అని కూడా అంతే స్పష్టంగా ప్రబోధిస్తుంది. ఉదాహరణకు వీటిని చూడండి. “నేను తప్ప (మేము తప్ప కాదు) వేరొక దేవుడు నీకు ఉండకూడదు”. (నిర్గమ 20:3). "... దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు” (యెషయా 45:22బి). “దేవుడొక్కడే, ....” 1తిమోతి 2:5). “దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే ....” యాకోబు 2:19). దేవుడొక్కడే అను పై వచనాలలోని బోధను పట్టుకొని తండ్రి ఒక్కడే దేవుడనీ, ఆ దైవత్వాన్ని కుమార, పరిశుద్ధాత్మలకు అన్వయించరాదనీ బొంకూరి జాన్ వంటి జయశాలిగారి ఒకప్పటి శిష్యులు పొరబడితే, ముగ్గురూ వేర్వేరు వ్యక్తులనీ, ముగ్గురికీ దైవత్వం ఆపాదించబడిందనీ సూచించే వచననాలను పట్టుకుని, ముగ్గురు దేవుళ్ళున్నారని గురువుగారు పొరబడ్డారు. అయితే ఈ రెంటిలో ఏది నిజం? వాస్తవానికి ఈ అంశంపై బైబిల్ బోధను సమగ్రంగా అర్థం చేసుకుంటే ఈ రెండూ నిజము కాదని స్పష్టంగా గుర్తెరుగగలము. మరేది నిజం?

బైబిల్లో ఒకే దేవుడున్నాడు. ఆ దైవత్వం సమానంగా ఒకే పరిమాణంలో ఒకే అర్థంతో ముగ్గురు వేర్వేరు వ్యక్తులకు ఆపాదించబడింది. పరస్పర వైరుధ్యాలుగా కనిపించే పై రెండు కోవలకు చెందిన వాక్యభాగాలను, 'ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా అస్థిత్వాన్ని కలిగివున్నాడనే' వివరణ మాత్రమే సమన్వయపరచగలుగుతుంది. కాబట్టి, బైబిల్లో బయలుపరచబడిన దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఉనికిని కలిగి ఉన్న ఒకే దేవుడు. ఈ భావననే ఒక్కమాటలో సమర్ధవతవంగా వ్యక్తపరుస్తూ సాంప్రదాయ క్రైస్తవ్యం 'త్రియేకదేవుడ'నే పదాన్ని ప్రయోగించింది. కాని తరాలతరబడి ఆయా ఆవాంతరశాఖలకు చెందిన దుర్బోధకులు, తమ స్వయంకల్పిత సిద్దాంతాలను సమర్థించుకోవడానికి ఆ పదం బైబిల్లో లేదనే నెపంతో ఆ పదం వ్యక్తపరిచే సత్యాన్ని కూడా తృణీకరిస్తున్నారు. అయితే సత్యం తెలియును గాక. ఆ పదం బైబిల్లో లేకున్నా ఆ భావన అందులో స్పష్టంగా వ్యక్తపరచబడింది. కాని కనీసం వారు వ్యక్తపరిచే భావన కూడా బైబిల్లో లేకపోగా బైబిలుకు వ్యతిరేకమైన దైవశాస్త్రాన్ని, బైబిల్లో లేని మరొక దేవుడిని వారు ప్రకటిస్తున్నారు.

తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్దాత్ముడు దేవుడు. ఈ ముగ్గురు వేర్వేరు వ్యక్తులు. ఐతే ఈ ముగ్గురూ ఒకే దేవుడు. ఇది హేతుబద్దంగా అనిపించకపోవచ్చు. కాని ఇదే బైబిల్ బోధించే సత్యం. ఇది దేవుని గూర్చిన గొప్ప మర్మం కాబట్టి సంకుచిత మానవమేథస్సుకు అందని గొప్పసత్యం. దేవుడు ఏకాకి అనే భావన కానీ, ముగ్గురు దేవుళ్లన్నారు అనే భావన కానీ, అనేకమంది దేవుళ్ళు ఉన్నారనే భావన కాని, ఇతర మతాలలో కూడా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి మానవసహజబుద్దీ నుండి ఉద్భవించే భావనలు. వీటిలో మర్మయుతమైనదేదీ లేదు. కాబట్టి ఇవి శరీరసంబంధమైన మనస్సుల్లో చక్కగా ఒదుగుతాయి. కానీ ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిని కలిగుండటం అనేది మానవాతీతమైన సిద్దాంతం. ఇది దేవుడు తానే స్వయంగా బయలుపరిచి ఉండకపోతే ఎవ్వరూ గుర్తెరిగి వుండేవారు కాదు. ఎందుకంటే మానవులు కల్పించుకునే సిద్ధాంతాలు, అందరికీ అర్థం అయ్యేవిధంగా, అందరికీ హేతుబద్దంగా తోచే విధంగా, అందరికీ అమోదీతంగా ఉండేలా రూపొందించ బడతాయి. కానీ త్రిత్వము వంటి మానవాతీత మర్మాలు దేవుడే స్వయంగా బయలుపరిస్తే తప్ప ఎవ్వరూ కనుగొనలేరు.

కాబట్టి “జయశాలి' దైవశాస్త్రం, అన్యమత దైవశాస్త్రం. అది బహుదేవతారాధనకు సమానం. అది బైబిలేతరమైనది. లేఖనబద్దంగా త్రియేక దేవునిని గుర్తెరుగకపోవడం, జయశాలి మొదటి పరాజయం. 

2.రక్షణను గూర్చిన దుర్బోధ

“మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమీది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక” (గలతీ 1:8-9). 'జయశాలి' ప్రకటించే సువార్త అపోస్తలులు ప్రకటించిన సువార్తకు భిన్నమైనది. ఇలా భిన్నమైన సువార్తను బోధించేవాడు విశ్వవిజ్ఞానసార్వభౌమయైనా, ఆత్మజ్ఞానియైనా, దైవజ్ఞానియైనా, జయశాలియైనా, (ఇవన్నీ పి. డి సుందరరావు గారు తనకు తగిలించుకున్న బిరుదులు) చివరికి పరలోకం నుండి దిగివచ్చిన దూతయేయైనా, వాడు శాపగ్రస్తుడని పై వచనాలు స్పష్టపరుస్తున్నాయి. ఇంతకూ 'జయశాలి' ప్రకటించిన “మరియొక సువార్త ఏమిటి? మనం ప్రస్తుతం పరిగణించే ఆయన పుస్తకంలో బాప్తీస్మమనగానేమి? దానిని ఎందుకు, ఏలాగు, ఎప్పుడు తీసుకొనవలెను?' అనే ప్రశ్నకు ఆయన సెలవిచ్చిన సమాధానాన్ని చదివి, దానిని బైబిల్ బోధించే రక్షణ సువార్తతో పోల్చి చూస్తే మీకే తెలుస్తుంది (విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు 21వ ప్రశ్న పేజీ నం. 59–63).

ఆయా లేఖనభాగాలను వక్రీకరిస్తూ, రక్షణ, పాపక్షమాపణ మరియు పరిశుద్దాత్మను పొందుటకు బాప్తీస్మమే ఏకైక మార్గమని పైన సూచించిన పుటలలో జయశాలి బోధించినట్లు మనం చూస్తాము. ఇది, రక్షణ కృపచేత, విశ్వాసము ద్వారా మాత్రమే అని బోధించిన అపోస్తలుల సువార్తకు భిన్నముగా రక్షణ, క్రియ ద్వారా అనగా బాప్తిస్మమనే క్రియ ద్వారా లభిస్తుందని బోధిస్తున్నందున దీనిని "మరియొక సువార్త అని కాక మరేమనీ పిలవాలి? క్రింది వచనాలను జాగ్రత్తగా పరిశీలించండి. “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.” (రోమా 10:9,10). హృదయమందు విశ్వసించి, దానిని నోటితో ఒప్పుకొనుట వలన ఒక వ్యక్తికి నీతి మరియు రక్షణ లబిస్తుందని పై వాక్యభాగం స్పష్టంగా బోధిస్తుంది. జయశాలి' కూడా ఈ సత్యాన్ని ఒప్పుకున్నట్లే మాట్లాడుతూ, తెలివిగా, రక్షణకు విశ్వాసం ఎంత అవసరమో బాప్తిస్మము కూడా అంతే అవసరమని వాదించారు. ఆయన మాటల్లోనే చదవండి, 'మానవునిలో జరిగే రక్షణ కార్యక్రమమునకు ముందుగా వినవలెను, విశ్వసించవలెను, మారుమనస్సు పొందవలెను, ఒప్పుకొనవలెను, ప్రార్థించవలేను, పిమ్మట బాప్తీస్మంపొంది పాపక్షమాపణ , రక్షణ పొందవలెను. సత్యవాక్యమును సరిగా విభజించుట వలన రక్షణకు ఇవన్నీ అవసరమని మనకు తోచుచున్నది.' (విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు 22వ ప్రశ్న , పేజీ నం. 67). పై మాటల్లో, వినుటవలన ప్రారంభమయ్యే పాపక్షమాపణ మరియు రక్షణ పొందే ప్రక్రియ, బాప్తీస్మం పొందేవరకు పూర్తికాదు అని స్పష్టంగా జయశాలి బోధిస్తున్నారు. ఇక్కడ 'వినుట', 'విశ్వసించుట ‘ఒప్పుకొనుట' 'ప్రార్థించుట' తదితర అంశాలను రక్షణ సాధననాలుగా ఒప్పుకుంటునట్లు కనిపించినా మరోచోట తన మాటతో తానే విభేదిస్తూ, వీటిని స్పష్టంగా కొట్టిపారేశారు జయశాలి. అదేలాగో మీరే చదవండి, “దేవుని వాక్యమునకు విధేయులగుటకు ఇష్టపడినవారికి నిత్యజీవానికి నడిపే ఏకైక వాక్యసాధనమే బాప్తీస్మము.” (విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానాలు 21ప్రశ్న, పేజినం 61) అయితే ఇది వాక్యవిరుద్దమైన రక్షణ సిద్దాంతమని, బైబిల్ బోధించని "మరియొక సువార్త” అని, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవారికి తెలుసు.

“మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడవీలు లేదు. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్దపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము” (ఎఫెసీ 2:8-10). పై వచనాలను బట్టి చూస్తే, ఏ సత్ క్రియను బట్టి మనము రక్షింపబడమని అయితే రక్షింపబడేది దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్ క్రియలు చేయటం కొరకే అని మనం చదువుతాము కాబట్టి బాప్తీస్మమనే సత్ క్రియ ద్వారా రక్షింపబడము కానీ రక్షణ పొందిన పిదప బాప్తీస్మమనే సత్ క్రియలో ఖచ్చితంగా పాల్గొనాలి. అయితే రక్షణ మాత్రము కృపచేత విశ్వాసము ద్వారా మాత్రమే కలుగుతుందని, బాప్తీస్మం వలన గాని, మరే ఇతర సత్ క్రియల వలనగాని కలుగదు. సున్నతివలన రక్షణ కలుగుతుందని ఆదిమసంఘంలో కలవరం సృష్టించిన 'యూదా క్రైస్తవు'లవలె బాప్తిస్మము వలన రక్షణ కలుగుతుందని నేటి సంఘాన్ని కలవరపరుస్తున్నారు జయశాలి.

మరి, రక్షణ మరియు పాపక్షమాపణ పొందటానికి బాప్తిస్మము అవసరమనే తన బోధకు జయశాలి ఆధారము చేసుకొన్న లేఖనభాగాల మాటేమిటి? ఆ లేఖనాలు బాప్తీస్మము వలననే రక్షణ కలుగుతందని చెప్పేమాట వాస్తవం కాదా? కాదు! సందర్భసహితంగా బైబిల్ సమగ్ర బోధ వెలుగులో ఆ లేఖనభాగాలను చదివినప్పుడు, అసలు బాప్తిస్మము ద్వారా రక్షణ మొదలైనవి కలుగుతాయని బోధించే ఒక్క వాక్యం కూడా బైబిల్లో లేదనే నిర్ధారణకు ఖచ్చితంగా రాగలము. ఇప్పుడు 'జయశాలి' ఉదాహరించిన లేదా వక్రీకరించిన లేఖనభాగాలను ఒక్కొక్కటిగా పరిశీలించి చూద్దాం.

1. “ఒకడు నీటిమూలముగానూ, ఆత్మ మూలముగానూ జన్మించితేనే గాని దేవుని రాజ్యములోప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” (యోహను 3:5) ఇక్కడ 'నీటిమూలముగా' అనే మాట చూసిన వెంటనే ఇది నీటిబాప్తిస్మము గురించి మాట్లాడుతుందనీ, తిరిగి జన్మించడానికి ఈ నీటి బాప్తిస్మము అవసరమనీ సులువుగా తేల్చేశారు జయశాలి. అయితే ఇదే సువార్తలో“ నీరు జలము” అనే మాట అనేక పర్యాయాలు (యోహాను 4:14; 7:37,38) సాదృశ్యరీతిగా వాడబడిందనే సాధారణ విషయాన్ని కూడా ఆయన గ్రహించలేకపోవడం బహుశోచనీయం. యేసు ఈ సువార్తలో ఉన్న తన బోధలలో నీటిని సాదృశ్యరీతిగా వాడిన దరిమీల, ప్రస్తుత సందర్భంలో కూడా అది సాదృశ్యరీతిగానే వాడబడిందనటంలో ఏ మాత్రమూ సందేహం లేదు.

 అయితే ఇక్కడ 'నీరు' దేనికి సాదృశ్యంగా వాడబడింది? బైబిల్ జాగ్రతగా చదివితే దీనికి జవాబు కనుగొనడం అంత కష్టతరమేమీ కాదు. ఇక్కడ “నీరు” తిరిగి జన్మింపజేసే సాధనానికి సాదృశ్యంగావాడబడిందనేది విదితమే. ఇంతకు ఏమీటా సాధనం? నీటి బాప్తిస్మమా ? ఆ విధంగా అనుకోవడానికి బైబిల్లో ఒక్క వచనం కూడా సమ్మతించదు. అందుకు భిన్నంగా నూతనజన్మ కలిగించే సాధనం గురించి ప్రస్తావించబడిన ప్రతి ఇతర లేఖనభాగాలు దేవుని వాక్యమే ఆ సాధనమని స్పష్టంగా రూఢిపరుస్తున్నాయి. ఈ క్రింది వచనాలను జాగ్రత్తగా గమనించండి. “నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది” (కీర్తన 119:50). “యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని....” (1 కొరింథీ 4:16). ".... సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను” (యాకోబు 1:18). “మీరు క్షయబీజమునుండికాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు ....” (1పేతురు 1:23). పై వచనములలో నూతనజన్మకు సాధనంగా పేర్కొనబడిన 'వాక్యానికి ప్రత్యామ్నాయంగా మరే సాధనము లేఖనాలలో ఎక్కడా పేర్కొనబడలేదు. కాబట్టి మన ప్రస్తుత సందర్భంలో కూడా నూతన జన్మకుసాధనంగా పేర్కొనబడిన 'నీరు', 'వాక్యా'న్నే సాదృశ్యపరుస్తుందని నిస్సందేహంగా తేల్చిచెప్పవచ్చు. వాక్యము చేసే ఆయా కార్యాలకు తగిన సాదృశ్యాలతో, బైబిల్లో అది అభివర్ణించబడింది. మనము నడవవలసిన మార్గాన్ని నిర్దేశిస్తుంది గనుక వాక్యం 'వెలుగు'గా అభివర్ణించబడింది. (కీర్తనలు 119:105). [/simple_tool] రాతి హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది కాబట్టి వాక్యం 'సుత్తి'గా అభివర్ణించబడింది [simple_tooltip content='29 నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా? '](యిర్మీయా 23:29). అదే విధముగా వాక్యము శుద్దీకరించి, పవిత్రపరచి, నూతనపరుస్తుంది కనుక 'నీరు'గా అభివర్ణించబడింది. (కీర్తనలు 119:9, యోహాను 15:3; యోహాను 17:17; ఎఫెస్సి 5:26). “పరిశుద్దాత్మ నూతన జన్మకు కారకం; నీరు(వాక్యం) అందుకు సాధనము. కాబట్టి, 'నీటి బాప్తిస్మము ద్వారా రక్షణ' అనే తన తప్పుడు సిద్ధాంతాన్ని సమర్థించుకోవడానికి ‘జయశాలి' ప్రయోగించిన మొట్టమొదటి వాక్యమే ఎంత అసందర్భంగా వాడబడిందో తేటతెల్లమవుతుంది.

2. “నమ్మీ బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును;నమ్మనివానికి శిక్ష విధింపబడును.”(మార్కు 16:16). ఇది 'బాప్తిస్మము ద్వారా రక్షణ' అను తన తప్పుడు సువార్తను బలపరచుకోవడానికి జయశాలి దుర్వినియోగపరచిన మరొక లేఖనభాగం. కానీ అటువంటి సువార్తను ఈ వచనం ఏ మాత్రం సమర్థించదు. ఈ వచనం యొక్క తరువాయి భాగములో “నమ్మనివానికి శిక్ష విధింపబడును" అని ఉంది కానీ 'నమ్మని, బాప్తిస్మము పొందని వానికి శిక్ష విధింపబడును' అని లేదు. అనగా ఒక వ్యక్తి బాప్తీస్మము పొందినా సరే అతడు యథార్టమైన విశ్వాసి కాకపోతే బాప్తీస్మం వలన అతనికి ఏ ప్రయోజనమూ ఉండదు. కాబట్టి రక్షించేది కృప ఉత్పన్నం చేసే విశ్వాసం మాత్రమే. ఈ విధంగా అంతరంగంలో జరిగే మార్పుకు బాప్తిస్మము ఒక బహిరంగ సాక్ష్యము (రోమా 6:4-5).కాబట్టి యథార్థంగా నమ్మిన ప్రతివాడు బాప్తిస్మము ఖచ్చితంగా పొందుతాడు. ప్రభువు అనుగ్రహించిన రక్షణను బహిరంగంగా, ఆయన ఆజ్ఞాపించిన విధానంలో (అనగా బాప్తీస్మం ద్వారా), సాక్షీకరించేందుకు విధేయతచూపని వ్యక్తి యథార్థంగా నమ్మాడని అనుకోవటానికి ఏ ఆస్కారమూ లేదు. ఐతే అలా నమ్మీ బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు; అంత మాత్రాన బాప్తీస్మమే రక్షణకు కారకమని, లేక ఏకైక మార్గమని బోధించడం బైబిల్ లోని సువార్తకు వ్యతిరేకం.

ఆ మాటకొస్తే యేసుతో సిలువ వేయబడి, విశ్వాసంతో మారుమనస్సు పొందిన దొంగ బాప్తీస్మం లేకుండానే పరదైసులో ఆయన ఆనందంలో పాలివాడు కాలేదా? ఇందుకు భిన్నంగా బాప్తీస్మం పొందినప్పటికీ తన విశ్వాసము యథార్థమైనది కానందున గారడీ సీమోను “నీ వెండి నీతో కూడా నశించును గాక” అనే శాపానికి గురికాలేదా? రక్షణననుగ్రహించేది బాప్తీస్మము అనే బాహ్య ఆచారమైన కర్మకాండ కాదని ఋజువు పరచటానికి ఈ నిదర్శనాలు చాలినవి కావా? అవును, నపుంసకునిలా (అపో 8:36-38),చెరసాల అధికారి యొక్క ఇంటివారిలా (అపో 16:31-33)ఏ మాత్రమూ తడవు చేయకుండా నమ్మిన వెంటనే బాప్తీస్మం పొందాలనే ఆజ్ఞకు మనం విధేయత చూపించాలి. అయితే క్రైస్తవుడు ఏ సత్కీయ చేసినా (అది బాప్తీస్మమైనా సరే, ప్రభుబల్ల ఆచరించడం అయినా సరే, ఇంకేదైనా సరే) దానిని రక్షణ పొందటానికి చేయడు కానీ, రక్షణ పొందాడు కాబట్టి చేస్తాడు. “అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును” (రోమా 11:6) అందుకే 'నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును' అనే మాటలో బాప్తిస్మము అతని రక్షణకు రుజువనే తప్ప కారకం అనే అర్థాన్ని ఇవ్వదు.

3. “దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది: అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదుగాని యేసు క్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.” (1 పేతురు 3:21) ఇది తన తప్పుడు సువార్తను సమర్థించుకోవడానికి జయశాలి దుర్వినియోగపరిచిన మరొక లేఖనభాగం. ఈవచనంలోకూడా, దాని తరువాయిభాగాన్నీ శ్రద్దగా చదివితే అక్కడ బాప్తిస్మమని పేర్కొనబడినదేంటో స్పష్టంగా నిర్వచించబడిందీ “అదేదనగా (బాప్తీస్మమని పేర్కొనబడినది) శరీరమాలిన్యము తీసివేయుట కాదుగాని (ఇదీ నీటిలో మునిగి లేచుట వలన కలగవచ్చేమో గాని) యేసు క్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే (ఇది అంతరంగంలో కలుగే మార్పు వలన మాత్రమే సాధ్యపడుతుంది). కాబట్టి కాస్త లోతుగా ఆలోచించినప్పుడు రక్షించేది నీటిలో మునిగి లేచే కర్మకాండ కాదు కానీ అది సాదృశ్యపరిచే అంతరంగిక మార్పు మాత్రమేనని స్పష్టమవుతుంది. కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడా పాతిపెట్టబడితిమీ. మరియు ఆయన మరణముయొక్కసాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైనయెడల, ఆయన పునరుత్థానము యొక్కసాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.” (రోమా 6:4-5) యేసుక్రీస్తు మరణపునరుత్థానాలలో ఐక్యం చేయబడే రక్షణ అనుభవానికి బాప్తీస్మం కేవలం ఒక సాదృశ్యం మాత్రమే. ఈ అంతరంగిక రక్షణానుభవమే 1పేతురు 3:21లో ప్రస్తావించబడిన బాప్తిస్మము. ఇది అంతరంగంలో జరిగిన పిదప అవకాశం ఉన్న ప్రతి వ్యక్తి ఏ మాత్రమూ జాప్యం చేయకుండా ఇందుకు సాదృశ్యమైన నీటి బాప్తీస్మం తప్పక తీసుకోవాలి. అయితే అటువంటి రక్షణ అనుభవమేదీ లేకుండా నీటిబాప్తీస్మం తీసుకుంటే అది కేవలం “శరీర మాలిన్యమును తీసివేయుట” మాత్రమే అవుతుంది కాని “యేసు క్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమ'ని ఎలా అనబడుతుంది? అందుకే బాప్తిస్మము వలన రక్షణ కలుగుతుందనే జయశాలి దుర్బోధకు ఈ వచనంలో కూడా తావులేదు.

4. “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు” (అపొ. 2:38) ఈ వచనాన్ని మరియు అపో 22:16ను ఆధారం చేసుకుని బాప్తిస్మము వలన మాత్రమే పాపక్షమాపణ లభిస్తుందనీ, మరేవిధంగానైనా పాపక్షమాపణ లభిస్తుందని చెప్పటం, భిన్నమైన బోధ అనీ జయశాలి వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లోనే చదవండి – ‘బాప్తీస్మం పొందిన వారికి రక్షణ భాగ్యమేలాగ కలుగుచున్నదో, అలాగే పాపక్షమాపణ కూడా వచ్చుచున్నది. పాపక్షమాపణ బాప్తిస్మమునకు ముందు జరుగదు గానీ కేవలం బాప్తీస్మమందు మాత్రమే జరుగుచున్నదని పాఠకులు గమనించవలసిన ముఖ్యాంశము ....... క్రొత్త నిబంధనలోని వ్రాయబడిన ఎన్నో వచనములు దీనిని బలపరుస్తుండగా సోదర క్రైస్తవులకు బాప్తిస్మమునకు ముందుగానే పాపములేలాగు కడుగబడుచున్నవో అర్థమగుట లేదు. భిన్నమైన బోధకీదొకమచ్చుతునక.' (విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు ప్రశ్న 21. పేజీ నం 60). తాను దుర్బోధ చేస్తూ, ఇతరులు చేసేది భిన్న బోధ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పైగా తన దుర్బోధను సమర్థించేలా క్రొత్తనిబంధనలో అనేక వచనాలున్నాయి అని చెబుతూ, తనకు అక్కరకు రాని రెండు వచనాలను మాత్రమే ఉదహరించడం మరింత విడ్డూరం.

అన్నట్టు బాప్తీస్మం వలన కాక మరేవిధంగా పాపములు కడగబడతాయో అయ్యగారికి బోధపడలేదట. ".... యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును” (1యోహను 1:7) అనే సత్యాన్నీ జయశాలి ఎప్పుడూ చదవనట్టున్నారు. నీటిలో మునిగి లేవటం, పాపాలని కడిగివేయటానికి చాలినదైతే, యేసు క్రీస్తు సిలువలో మరణించటం వ్యర్థం. దేవుడు తన కుమారునిని ఈ లోకానికి పంపటం మాని కేవలం బాప్తీస్మమిచ్చే యోహానుతోనే ఆ పనిని జరిగించి ఉండేవాడు. ఎంతటి 'ఆత్మజ్ఞానీ' ఐనా దేవునికి మించిన జ్ఞానం ఉన్నట్లు మాట్లాడడం పాపం.

మరి జయశాలి ఉదహరించిన అపోస్తలుల కార్యము 2:38వ లేఖనము మాటేమిటి? ఈ వచనములో “నిమిత్తము' అనే మాట ‘ఎయిస్' అనే గ్రీకుపదము నుండి అనువదించబడినది. 'ఎయిస్' అనే ఈ పదాన్ని సందర్భాన్ని అనుసరించి 'నిమిత్తము', 'లోనికి', ‘ఆధారముగా', ఇలా అనేక విధాలుగా అనువదించవచ్చు. కాబట్టి “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి” అనే మాటను 'మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ ఆధారముగా ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని కూడా అనువదించవచ్చును. ఈ విధముగా అనువదిస్తే ఈ వచనానికి ఒక సరికొత్త అర్థము వస్తుంది. కాబట్టి “ఎయిస్” అనే మాటకు “నిమిత్తము” అనే సంశయాస్పద అనువాదాన్ని ఆధారం చేసుకుని పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం అవసరమని తీర్మానించి, క్రియల ద్వారా రక్షణ కలగదనే స్పష్టమైన లేఖనసత్యాన్ని కూలద్రోయటం సమంజసం కాదు. అదేవిధంగా, జయశాలి ఉదహరించిన అపోస్తలుల కార్యములు 22:16లోని“నీ పాపములను కడిగివేసికొన”మనే మాటను ‘బాప్తీస్మము పొందీ' అనే ధాతువుతో కాక ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి' అనే ధాతువుతో జోడించి అర్థము చేసుకోవాలనీ, కాబట్టి 'బాప్తిస్మము వలన పాపములు కడిగివేయబడుట' అనే బోధకు ఇక్కడ ఏమాత్రం తావులేదని ఇంగ్లీషు కింగ్ జేమ్స్ అనువాదంలో ఈ వచనాన్ని చదివిన ఎవరైనా సులభంగా గ్రహించగలరు.

కాబట్టి బైబిల్లోని రక్షణ సిద్ధాంతాన్ని తారుమారు చేసి బాప్తీస్మం వలన రక్షణ అనే భిన్నబోధను చేస్తున్న జయశాలి "మరియొక సువార్త'ను బోధిస్తున్నాడు. లేఖనాధారమైన రక్షణసువార్తను అర్థం చేసుకోలేకపోవడం, “జయశాలి రెండవ పరాజయం. 

3. ప్రార్థనను గూర్చిన దుర్బోధ

1. “ప్రార్థన ఎవరికి చేయవలెను? తండ్రికా? క్రీస్తుకా? పరిశుద్దాత్మునికా? అను ప్రశ్నతో వ్యవహరిస్తూ, తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు చేయబడిన ఓ పది వాక్యభాగములను ఉదహరిస్తూ, 'బైబిలంతటినీ పరిశోధిస్తే తండ్రియైన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మాత్రమే ప్రార్థనలు చేయవలెనని బహిర్గతమగుచున్నది? అని తెల్చేశారు జయశాలి. (విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు ప్రశ్న 14, పేజీనం 39.) యేసు నామమున యేసుకే ప్రార్థన చేయటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించటం మాత్రమే కాక తండ్రి చేత పంపబడిన యేసుక్రీస్తు మరియు పరిశుద్దాత్మకు ప్రార్థన చేయటం వలన 'ప్రార్థనాపరులై ప్రార్థనలు తెలియనివారుగా ఉండునట్లు అపవాది తన కుయుక్తిచేత అమాయకులను మోసగించుచున్నాడు' (విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు ప్రశ్న నెం 14, పేజి 40) అనీ వ్యంగ్యమాడటానికి కూడా వెనుకాడలేదు 'జయశాలి.

జయశాలి చెప్పిందే నిజమైతే “నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును” (యోహాను 14:14) అని ప్రకటించిన యేసు మాటలు అనగా యేసునామమున యేసుకే ప్రార్థన చేయమనీ యేసు స్వయంగా ప్రకటించిన మాటలు హాస్యాస్పద మన్నమాట!!! యేసు మాటలు హాస్యాస్పదమైనవో లేక 'జయశాలి' మాటలు హాస్యాస్పదమైనవో పాఠకులే నిర్ణయించుకోగలరు.

అంతేకాదు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని” (అపో 7:59) యేసుకే నేరుగా ప్రార్థించిన స్తెఫను 'జయశాలి ప్రకారం అపవాది కుయుక్తి చేత మోసగింపబడ్డాడన్న మాట!!! అపవాది చేత మోసగించబడింది, జయశాలా, లేక స్తెఫనా అనేది పాఠకులే నిర్ణయించుకోవాలి.

2. 'ఇద్దరు, ముగ్గురు ఆయన నామమున కూడుకొనినచో దేవుడున్నపుడు, ఒక్కరుంటే ఉండరా?' అనే ప్రశ్నతో వ్యవహరిస్తూ, 'ఇద్దరు, ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ యుందునని చెప్పిన దేవా, మా ప్రార్థనలో ఉండుమని ప్రార్థన చేయునప్పుడు అనేకమంది చెప్పుట వాక్యవిరుద్దం' (విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు ప్రశ్న27, పేజినం 74) అని తేల్చేశారు 'జయశాలి'. ఈ వాక్యం ప్రార్థనకు వర్తించదని, ఒకవేళ వర్తిస్తే ఒంటరిగా ఉన్నపుడు చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరించడనీ, ప్రార్థన అంగీకరించబడటానికి తప్పనిసరిగా ఇద్దరు, ముగ్గురు ఉండవలసి వస్తుందనేది జయశాలి వాదన. అదే నిజమైతే “నీవు ప్రార్థనచేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును” (మత్తయి 6:6) అనే మాటను జయశాలి ఏ విధంగా వివరిస్తారో మరి! ఒక్కరుంటేనే ప్రార్ధన అంగీకరించబడుతుంది; ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తే అది రహస్యమందు చేసే ప్రార్థన కాదు కాబట్టి, రహస్యమందు చూచు తండ్రి దానిని ఆమోదించడని వ్యాఖ్యానిస్తారా?

అదలా ఉంచితే, సందర్భాన్ననుసరించి చూసినప్పుడు మత్తయి 18:20 అసలు ప్రార్థనకే వర్తించదని చెబుతూ, సందర్భాన్ని నిర్ధారించటానికి కేవలం 15 నుండి 18 వచనాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకుని, 20వ వచనాన్ని ఆ పరిధిలోనే వివరించాలని వాదించారు జయశాలి. మరి 19వ వచనాన్ని ఎవరు చదవాలటా? వాస్తవానికి 19 మరియు 20 వచనాలు కలిపి చదివితే 20వ వచనం ప్రార్థనకు కూడా ఖచ్చితంగా వర్తిస్తుందని నిర్దారణమవుతుంది. “మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నానామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.” (మత్తయి 18:19,20) ప్రార్థనను గూర్చి దేవుని వాక్యంలో స్పష్టంగా బోధించే విషయాలను సహితం వక్రంగా బోధించడం, వాటిని సరిగా అర్థం చేసుకోవటానికి విఫలమవడం, 'జయశాలి'మూడవ పరాజయం. 

4. ఇష్టానుసారమైన బోధ

బైబిల్ ని ఆధారం చేసుకోకుండా తమ ఇష్టానుసారమైన కల్పనాబోధలను చేసేవారిని విమర్శిస్తూ ‘జయశాలి' ఇలా అన్నారు 'విచిత్రమేమంటే బైబిలు చెప్పని వాటికి ప్రత్యేకతనిచ్చి లేనివి ఉన్నట్లుగా చిత్రీకరించీ, ఉ న్నవి బ్రతుకులో చేయకుండా క్రైస్తవులను దిగజార్చుటయే సాతాను తంత్రములోని ప్రధానాంశములు....... బైబిల్లో వ్రాయబడినది అర్థం చేసుకోలేని వీరు బైబిలు చెప్పని వాటికి ప్రాధాన్యతనిచ్చి అమాయకప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.' (విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు ప్రశ్న 26. పేజి 72) ఇదంతా బాగానే ఉంది. నేను కూడా దీనితో ఏకీభవిస్తున్నాను. లేఖనానుసారంగా కాక కల్పనాకథలు బోధించేవాడు దేవునిచేత వాడబడటంలేదు కాని, సాతాను కుతంత్రాలని కొనసాగించడంలో తన వంతు పాత్ర వహిస్తున్నాడు. అయితే, “మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును” (మత్తయి 7:2) అను సత్యాన్ని 'ఆత్మజ్ఞాని జ్ఞప్తికి తేవాలని ఆశిస్తున్నాను.

ఈ పుస్తకంలోని (విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు) 'కయీనుకు భార్య ఎక్కడ నుండి వచ్చినది? అనే తన మొట్టమొదటి ప్రశ్నే 'జయశాలి' ఇక్కడ ఇతరులకు తీర్చిన తీర్పును ఆయనపై తిప్పికొట్టేలా చేసింది. ఆ ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానానికి బైబిల్లో సరైన ఆధారాలు చూపించకుండానే కయీను తన సోదరిని వివాహమాడాడని గుడ్డిగా తేల్చేశారు. ఒకవేళ కయీనుకు భార్య ఎక్కడ నుండి వచ్చిందని నన్నెవరైనా ప్రశ్నిస్తే జయశాలి మరోచోట హితవు పలికినట్లు 'బైబిల్లో వ్రాయబడని వాటి విషయం మనం పట్టించుకోనవసరం లేదు మనకవసరమైన వాటినే దేవుడు ఇందు వ్రాయించియున్నాడు' (విప్లవాత్మక ప్రశ్నలకుసంచలనాత్మక సమాధానములు ప్రశ్న 26, పేజినం 73) అని బదులిచ్చి ఉండేవాడిని. ఐతే విచారకరంగా తన సొంత హెచ్చరికలను సహితం బేఖాతరు చేసి, అవి కేవలం ఇతరులకే గాని తమకు వర్తించవన్నట్లు కయీనుకు భార్య ఎక్కడనుండి వచ్చిందో బైబిలు సెలవియ్యని మర్మాన్నీ, అయ్యగారు వెల్లడించబూనుకున్నారు. సోదరిని వివాహమాడరాదన్నది దేవుని చిత్తమునందలి మార్పులేని నీయమము(లేవీ 18అధ్యాయము ద్వీతి 27:22)అది ఉల్లంఘించబడకుండా కయీను వివాహమాడేలా దేవుడు ఎలాంటి ఏర్పాటు చేసాడో మనకు బయలుపరచలేదు. అంతమాత్రాన సొంత విశ్లేషణలు చేసి తన నియమం ఉల్లంఘించబడే పరిస్థితిని దేవుడే ఆదియందు కలగజేసాడనే అర్థం వచ్చేలా ఇష్టానుసారమైన వ్యాఖ్యానాలు చేయడం వాక్యవిరుద్దం.

కయీను భార్య విషయంలో దేవుడు మరో ఏర్పాటు చేసియుండిన అది జయశాలి ఉదహరించినఅపో. కా. 17:26,ఆది 3:26లోని సత్యాన్నిఉల్లంఘించకుండా, అదే సమయంలో నేను ఉదహరించిన లేవి 18వ అధ్యాయం మరియు ద్వీతి 27:22 నియమాన్ని భంగపరచకుండా దానిని చేయగల సమర్థుడని నమ్మగలము. అదీ ఎలా సాధ్యపడుతుందని గ్రహించడం మనకు అసాధ్యమైనా, దేవునికి సమస్తము సాధ్యము అని విశ్వసించాలి. అంతే కానీ జయశాలి చేసినట్లు బైబిల్ సెలవియ్యని విషయాలను బైబిల్ పక్షంగా ప్రకటించడం నేరం.

అయితే మలాకీ 2:10లో “మనందరికి తండ్రి ఒక్కడు కాదా?” అని చెప్పబడింది దేవుని గురించిన సందర్భం నుండి అని స్పష్టమగుచుండగా అది ఆదాము గురించిన ప్రస్తావన అన్నట్లు మాట్లాడడం, జయశాలి తన అభిప్రాయాలను సమర్థించుకోవటానికి లేఖనాలను సహితం దుర్వినియోగపరిచేందుకు వెనుకాడరనటానికి నిదర్శనం.

లేఖనాలను ఆధారం చేసుకోలేకపోయినా, సొంత ఉదహరణలను చొప్పించి, అమాయకులను ఒప్పించగలరనుకున్నట్టున్నారు 'జయశాలి'. కయీను తన సహెూదరిని వివాహమాడాడనే తన అపోహను సమర్థించుకోవడానికి 'దైవజ్ఞాని' ప్రయోగించిన ఉ దాహరణను గమనించండి. “మన వివాహ ఆహ్వన పత్రికలపై పెండ్లి కుమారుడు, పెండ్లికుమార్తె అని ముద్రించటం సహజం. వారిరువురికి పెండ్లి చేయుచున్నాం గనుక పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తె అని వ్రాయించుచున్నాము. ఇరువురి ముందువున్న పెండ్లి అనేది తీసేసి చదవితే కుమారుడు, కుమార్తెగా మీగులుదురు. వీరు అన్నాచెల్లెలుకారా? అలాగే ఆదాము సంతతిలోని ఒక స్త్రీ కయీనుకు భార్యయైనదని ఘంటాపథంగా చెప్పవచ్చు” (విప్లవాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక సమాధానములు 1 పేజి 4, 5) ఇతరులు ఇష్టానుసారంగా బోధిస్తే, బైబిలను ఆధారం చేసుకోకుండా నూతన సిద్ధాంతాలు కల్పిస్తే అది నేరమట! ఐతే తనకు మాత్రం తన సొంతబుద్ది నుండి పుట్టిన సిద్ధాంతాలను పొంతనలేని ఉదహరణలతో సమర్థించుకొనే లైసెన్సువుందట!

ఇది ‘జయశాలి రెండు నాలుకల ధోరణికి ఒక మచ్చుతునక. తన స్వంత బోధకు సహితం కట్టుబడి ఉండలేకపోవడం 'జయశాలి' నాలుగవ పరాజయం. 

ముగింపు

ఈ వ్యాసంలో మేము బహిర్గతం చేసిన నాలుగు విషయాల్లో మాత్రమే జయశాలి పరాజయపడ్డాడని భావించకూడదు. తాను చేసిన మరిన్ని దుర్బోధలను పరిశోధించి వెలికితీసే భాగ్యాన్ని, తీరిక మరియు ఓపిక ఉన్న పాఠకులకు విడిచిపెడుతున్నాము. మీ విమర్శలు మాతో కూడా పంచుకోగలరు. అవి లేఖనానుసారమైనవైతే ఈ వెబ్ సైట్ ద్వారా అందరికి అందజేయగలము. అయితే, జయశాలి దేవునికి నమ్మకమైన బోధకుడు కాదని, దేవుడంటే, రక్షణంటే, ప్రార్థన అంటే, చివరికి తన స్వంత బోధలను ఆచరించడమంటే కూడా ఆయనకు తెలియదని, ఏన్నో బిరుదులు తగిలించుకొని, అందరిని దుయ్యబట్టేలా మైకు పట్టుకొని కేకలు వేసినంత మాత్రాన, పెన్నుపట్టుకొని ప్రఖ్యాతిగాంచినవారికి సవాళ్ళు విసిరినంత మాత్రాన దేవుని ప్రతినిధి అయిపోలేదని, ఆయన చాటి చెప్పినవి అబద్దబోధలని నిరూపించడానికి ఇక్కడ ఉదహరించిననాలుగు విషయములు చాలినవి. దేవుడు పాఠకులకు లేఖనానుసారమైన వివేచనననుగ్రహించి ఇట్టి దుర్బోధకుల నుండి విడుదల దయచేసి, తన సన్మార్గములో నడుచే కృపను దయచేయునుగాక.

 

 

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.