విమర్శలకు జవాబు

రచయిత: Marie Prasanth Perikala

Article Release long jesuscomingonsky min

ఒకానొక సందర్భంలో శివశక్తి అనే సంస్థ అధ్యక్షుడు కరుణాకర్ సుగ్గున గారు మాట్లాడుతూ, "యేసు రెండవ రాకడలో మేఘం మీద కూర్చుని వస్తాడు అని ఉంది, కానీ మేఘం నీటి ఆవిరి కదా, మేఘాల మీద ప్రయాణం చేయడం కుదురుతుందా?" అని ప్రశ్నించారు. అలాగే మరొక సందర్భంలో మాట్లాడుతూ "యేసు తాను దేవుడిని అని ఎక్కడైనా చెప్పుకున్నాడా? లేదా నాతో పాటు ఇంకో దేవుడు ఉన్నాడని యెహోవా ఎక్కడైనా చెప్పాడా?" అని ప్రశ్నించారు. నిజానికి ఈ రెండు ప్రశ్నలకి కూడా మనం ఒక్కటే సమాధానం చెప్పొచ్చు. అదేమిటో ఇప్పుడు చూద్దాం.

అసలు బైబుల్లో మేఘారూఢుడు అనే పదం ఎందుకు వాడబడింది? ఆ పదాన్ని లిటరల్ గా తీసుకుని దేవుడు మేఘాల మీద ప్రయాణం చేస్తాడు అని… లేదా దేవుడు కిందకి దిగి వచ్చేటప్పుడు ఆయన కాళ్ళ కింద మేఘాలు ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలా? లేక ఈ పదం వాడడం వెనుక వేరే ఉద్దేశం ఏదైనా ఉందా? ఈ విషయం తెలియాలంటే, ముందుగా మనకి మేఘారూఢుడు అనే పదం వెనుక ఉన్న Ancient Cultural Context గురించి తెలియాలి. ఇశ్రాయేలు దేశానికి పొరుగున, ఉత్తర దిక్కులో సిరియా దేశంలో Ugarit అనే ఒక పట్టణం ఉంది. అక్కడ 1928వ సంవత్సరంలో జరిపిన పురావస్తు తవ్వకాలలో, Ancient Inscriptions ఉన్న సుమారు 1500 ప్రాచీన శిలా ఫలకాలు, మరియు fragments దొరికాయి. వాటి ద్వారా, మనకి అప్పటి ఇశ్రాయేలు దేశం చుట్టుపక్కల ఉన్న ఇతర సంస్కృతులలోని ప్రజల గురించి, వాళ్ళ ఆచారాల గురించి, వాళ్ళ నమ్మకాల గురించి చాలా విషయాలు తెలిశాయి. ఈ ఉగారిటిక్ లిటరేచర్లో Ba’al అనే కనానీయుల దేవుడిని, అంటే మనం తెలుగులో “బయలు” దేవత అంటాం కదా, అతనిని “The One who rides the Clouds”, “మేఘాలను రథంలా చేసుకుని వాటి మీద ప్రయాణం చేసేవాడు”, “మేఘారూఢుడు” అని పిలిచేవారు. “మేఘారూఢుడు” అనే ఈ వర్ణన, Ba’al కి official title. ఆ కాలంలో “Ancient Near East” లో ఉన్న ప్రజలందరూ కూడా Ba’al ని చాలా శక్తిమంతమైన దేవునిగా పరిగణించేవారు. ప్రాచీన మధ్యధరా సముద్ర ప్రాంతంలో జీవించిన ప్రజలందరూ కూడా, “మేఘారూఢుడు” అనగానే నిస్సందేహంగా దేవుడు అనే అభిప్రాయం కలిగి ఉండేవారు. ఈ విషయాలన్నీ “DDD - Dictionary Of Deities And Demons in Bible” అనే పుస్తకంలో మనం చూడొచ్చు.

Biblical Writers కి ఈ Ba’al గురించి బాగా తెలుసు. ఇశ్రాయేలీయులు అనేక సార్లు విగ్రహారాధనకు ఆకర్షితులు అవ్వడానికి ప్రధాన కారణం Ba’al. ఈ Context లో, యెహోవాయే ఆరాధనకు అర్హుడు, Ba’al కి ఆ అర్హత లేదు అనే థియోలాజికల్ మెసేజ్ ని convey చేయడానికి Biblical Writers ఏమి చేసేవారంటే, కొన్ని సార్లు “మేఘారూఢుడు” అని Ba’al కి ఉన్న టైటిల్ ని తీసుకుని, యెహోవాకి ఆపాదించేవారు.

ఇలా చేశారంటే దాని అర్ధం, Biblical Writers, Ba’al ని కాపీ కొట్టి బైబిల్ రాశారు అని కాదు. యెహోవా మరియు Ba’al ఇద్దరూ ఒక్కటే అని చెప్పడం కూడా వారి ఉద్దేశం కాదు. గొప్ప దేవుడిగా Ba’al కి ఉన్న గుర్తింపును తిరస్కరిస్తూ, యెహోవాయే నిజమైన దేవుడు… ఆకాశములను మేఘములను సృష్టించి వాటిని నియంత్రిస్తూ వాటిని పరిపాలిస్తున్నవాడు యెహోవాయే… “మేఘారూఢుడు” అని ఎవరినైనా పిలవాలంటే, దానికి యెహోవాయే అర్హుడు కానీ, Ba’al కి అంత సీన్ లేదు, అనే థియోలాజికల్ మెసేజ్ ని convey చేయాలనే ఉద్దేశంతో బైబిల్ రచయితలు అటువంటి పదప్రయోగం చేశారు. ఇలా చేయడంలో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. దేవునిగా Ba’al కి ఉన్న గుర్తింపును తిరస్కరించడం, Ba’al ని తక్కువ చేసి చూపడం, యెహోవాయే దేవుడు అని చెప్పడం, ఇశ్రాయేలీయులు అలాగే అన్యులు అందరికీ స్పష్టంగా అర్ధం అయ్యేలా వారి భాషలోనే వారికి తెలిసిన టెర్మినాలజీని ఉపయోగించి, యెహోవాయే దేవుడు అనే “Truth Claim” ని స్థాపించడం. కాబట్టి, యెహోవాయే దేవుడు అని చెప్పడానికి బైబిల్ లో “మేఘారూఢుడు” అనే పదం వాడారు కానీ, యెహోవా మేఘాల మీద ప్రయాణం చేస్తాడు అని చెప్పడానికి కాదు.

ఇకపోతే, మేఘారూఢుడు అనే టైటిల్ ని బైబిల్ మొత్తంలో ఐదు సార్లు వాడారు.

దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును. (ద్వితీయోపదేశకాండం 33:26)

ఆకాశవాహనుడు, మేఘవాహనుడు అని యెహోవాని గురించి చెబుతూ అన్న మాటలివి.

భూరాజ్యములారా, దేవునిగూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశావాహన మెక్కువానిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము. (కీర్తనల గ్రంథం 68:32-33)

ఇక్కడ అనాదిగా ఉన్న యెహోవాని గురించి చెబుతూ ఆకాశవాహనమెక్కువాడు అని సంబోధించడం జరిగింది.

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు. వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసి కొనియున్నాడు. (కీర్తనల గ్రంథం 104:1-4)

ఇక్కడ కూడా యెహోవా గురించి చెబుతూ మేఘములను తనకు వాహనంగా చేసుకున్నాడు అని రాశారు. వెలుగు, ఆకాశములు, జలములు, మేఘములు, వాయువు, అగ్ని మొదలైన వాటన్నిటి మీద అధికారం కలిగినవాడిగా యెహోవాను ఇక్కడ వర్ణించడం జరిగింది.

యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది (యెషయా 19:1)

ఇక్కడ కూడా వేగముగల మేఘము ఎక్కి వచ్చుచున్నాడు అని యెహోవాను గురించి చెప్పడం జరిగింది. ఇప్పటివరకు చూసిన ఈ నాలుగు వచనాలలో కూడా యెహోవాను గురించి చెబుతూ - Ancient Cultural Context ప్రకారం దైవత్వాన్ని సూచించే “మేఘారూఢుడు” అనే విశేషణాన్ని యెహోవాకు ఆపాదించడం చూశాం.

అయితే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలు కొన్ని దర్శనములను చూస్తాడు. 9, 10 వచనాలలో దేవుడైన యెహోవా సింహాసనం మీద కూర్చుని ఉండటాన్ని మనం చూస్తాం. 13వ వచనంలో -

“ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.” (దానియేలు 7:13)

అని ఉంటుంది. అదేంటి మేఘారూఢుడు అంటే యెహోవా కదా. మరి ఇక్కడేంటీ, ఇంకొకరిని ఎవరినో ఆకాశ మేఘారూఢుడు అని అంటున్నారు… అనే సందేహం మీకు వచ్చిందా? ఇందులో confusion ఏమీ లేదు. అవును, మేఘారూఢుడు అంటే యెహోవానే. ఇక్కడ డివైన్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. సింహాసనం మీద ఆల్రెడీ యెహోవా కూర్చుని ఉన్నాడు. ఆకాశ మేఘారూఢుడు అయ్యి మనుష్యకుమారుడు అక్కడికి వచ్చాడు. ఈ సీన్ లో దానియేలు ఇద్దరు యెహోవాలను గురించి వర్ణిస్తున్నాడు. సింహాసనం మీద ఉన్నది తండ్రి అయిన యెహోవా. మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన వాడు, కుమారుడైన యెహోవా. బైబిల్ లో చాలా చోట్ల ఇద్దరు యెహోవాలను గురించి ఉన్న వర్ణనలను మనం చూడొచ్చు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం చుసిన ఈ ఐదు వచనాలు కూడా హీబ్రూ తనాక్, అంటే పాత నిబంధన లోనివి. క్రెస్తవులు రాసినది కాదు.

ఇక యేసు ప్రభువు, తాను దేవుడిని అని ఎక్కడ చెప్పారో చూద్దాం. యేసు ప్రభువుని సిలువ వేయడానికి ముందు విచారణ నిమిత్తం ప్రధాన యాజకుడి ముందు నిలబెడతారు. మార్కు సువార్త 14:61-64 వచనాలు చూసినట్లయితే, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ప్రధాన యాజకుడు యేసు క్రీస్తును అడుగుతాడు. అప్పుడు యేసు క్రీస్తు సమాధానమిస్తూ, “అవును నేనే; మీరు… మనుష్యకుమారుడు, సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరు” అని చెప్పెను. అప్పుడు ప్రధానయాజకుడు, తన వస్త్రములు చింపుకొని, “మనకు ఇక సాక్షులతో పని యేమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా” అని అంటాడు.

యేసు ప్రభువు, తాను ఆకాశమేఘారూఢుడై రావడం మీరు చూస్తారు అని అన్నప్పుడు, 21వ శతాబ్దంలో Non-Israelite Culture లో జీవిస్తున్న మనం, యేసు ప్రభువు ఏమి చెబుతున్నాడు అనేది గ్రహించలేకపోవచ్చు కానీ, రెండు వేల సంవత్సరాల క్రితం, ఇశ్రాయేలులో జీవించిన ప్రజలు మాత్రం ఠక్కున అర్ధం చేసుకోగలరు. “మేఘారూఢుడు” అంటే దేవుడు అని వాళ్లందరికీ తెలుసు. బైబిల్ లో “మేఘారూఢుడు” అనే టైటిల్ ని యెహోవాని ఉద్దేశించి రాశారు అని కూడా వాళ్లందరికీ బాగా తెలుసు. కాబట్టి, ఇక్కడ యేసు ప్రభువు తాను దేవుడిని అని చెప్పడం మాత్రమే కాకుండా, తాను యెహోవాని అని కూడా చెబుతున్నాడు అనే విషయం వాళ్ళకి చాలా బాగా అర్ధం అయ్యింది. అందుకే ప్రధాన యాజకుడు గుడ్డలు చింపుకొని మరీ, దైవదూషణ అంటూ కేకలు వేశాడు. కరుణాకర్ గారు ఈ విషయం గమనించాలి. యేసు క్రీస్తుకి తాను దేవుడిని అని చెప్పుకునే ఉద్దేశం ఉంటే, ప్రకటన గ్రంథం వరకు ఎందుకు ఆగాడు? తాను భూమి మీద ఉన్నప్పుడు ఏందుకు చెప్పలేదు అని అడిగారు కదా… చూడండి, యేసు ప్రభువు తాను భూమి మీద ఉన్నప్పుడే మార్కు సువార్తలోనే తాను దేవుడిని అని చెప్పుకున్నాడు.

కాబట్టి, నా conclusion ఏంటంటే, Ancient Near Eastern Cultures కి సంబంధించిన ప్రజలందరికి స్పష్టంగా అర్ధం అయ్యేలా వారి భాషలోనే వారికి తెలిసిన టెర్మినాలజీని ఉపయోగించి, యెహోవాయే దేవుడు అనే Truth Claim ని establish చేయడం కోసం బైబిల్ లో “మేఘారూఢుడు” అనే పదం వాడారు కానీ, యెహోవా మేఘాల మీద ప్రయాణం చేస్తాడు అని చెప్పడానికి కాదు. అలాగే, అప్పటి Cultural Context ప్రకారం, “మేఘారూఢుడు” అంటే దేవుడు. బైబిల్ లో యెహోవాను ఉద్దేశించి మేఘారూఢుడు అనే పదం వాడారు. యేసు ప్రభువు తాను ఆకాశ మేఘారూఢుడై రావడం మీరు చూస్తారు అని చెప్పాడు. అంటే యేసు ప్రభువు తాను దేవుడిని అని, యెహోవాని అని స్పష్టంగా చెప్పాడు.

Add comment

Security code
Refresh

Comments  

# RE: మేఘం అంటే నీటి ఆవిరి. మేఘాల మీద కూర్చుని ఎవరైనా ప్రయాణం చేస్తారా? యేసు ఎక్కడైనా నేను దేవుడ్ని అని చెప్పుకున్నాడా?Kishore 2020-10-03 13:40
Wonderful explanation Bro
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.