విమర్శలకు జవాబు
రచయిత: Marie Prasanth Perikala

కొద్ది రోజుల క్రితం Nationalist Hub అనే ఛానల్ లో సాయి కృష్ణ అనే వ్యక్తి చారిత్రిక నవలా చక్రవర్తి, బ్రహ్మర్షి ముదిగొండ శివప్రసాద్ గారిని ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముదిగొండ శివప్రసాద్ గారు బైబిల్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి సంభాషణ ఈ విధంగా సాగింది.

 

సాయి కృష్ణ: మీ పుస్తకం నేను... ఈ మధ్య రాసిన పుస్తకం చదివాను... ఈ కల్పన బాగుంది. జీసస్ క్రైష్ట్ కి సంబంధించిన అంశాలకు సంబంధించి... మీరు హిస్టరీ అఫ్ చర్చ్ పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తి, బైబిల్ ని అవపోశాన పట్టారు... Almost బైబిల్ లో ఉండే ప్రతి verse ని మీరు చెబుతారు. దాని గురించిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కదా! కల్పన అని అనుకోవచ్చా ఖచ్చితంగా, జీసస్ క్రైష్ట్ కి సంబంధించి?
ముదిగొండ శివప్రసాద్: మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను, నేను... ఒక క్రిస్టియన్ ఫాదరీ, ఒక బిషప్పు... ఒక రివరెండు... వాళ్ళు చదివినదానికన్నా ఇంకా శ్రద్ధగా... Historical Perspective తో బైబిల్ ని లైన్ బై లైన్ చదివానండి. I am speaking with full authenticity, I am an authority on Bible... బైబిల్ మీద హిందూ మత ప్రభావం ఎక్కువగా ఉందండి.
సాయి కృష్ణ: బైబిల్ పైన!?
ముదిగొండ శివప్రసాద్: బైబిల్ పైన...
సాయి కృష్ణ: ఓకే...
ముదిగొండ శివప్రసాద్: ఓల్డ్ టెస్టమెంట్ మీద... ఇప్పుడు ఫస్ట్ అబ్రహాం అని ఒకడు వస్తాడు వాళ్లకి. అబ్రాహాము... భార్య పేరు శారా... బ్రహ్మ దేవుడి భార్య పేరు శారద.
సాయి కృష్ణ: కరెక్టే...
ముదిగొండ శివప్రసాద్: కదా... అబ్రహాం... బ్రహ్మం... వాడి పేరు బ్రహ్మం అన్నమాట. బ్రహ్మ దేవుడు అనే పేరుని అబ్రహాము అని పెట్టుకున్నారు వాళ్ళు.
సాయి కృష్ణ: ఓకే...!
ముదిగొండ శివప్రసాద్: అబ్రహాం భార్య గారి పేరు శారద. వీళ్ళతో అసలు స్టార్ట్ అవుతుంది బైబిల్. వీళ్ళు ఫస్ట్ జనరేషన్ అన్న మాట...

 

చూశారు కదా మన చారిత్రిక నవలా చక్రవర్తి బ్రహ్మర్షి ముదిగొండ శివప్రసాద్ గారు ఏమంటున్నారో. బ్రహ్మ దేవుడు అనే పేరుని బైబిల్ లో అబ్రహాము అని పెట్టుకున్నారట. అలాగే బ్రహ్మ దేవుడి భార్య పేరు శారద కాబట్టి బైబిల్ లో అబ్రహాము భార్య పేరు శారా అని పెట్టుకున్నారట. బేసిక్ గా ఈయన చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు ప్రపంచమంతా హిందూ మతమే ఉండేదనీ, హిందూ మత గ్రంథాల ప్రభావంతో హిందూ దేవీ దేవతల పేర్లను తీసుకుని యూదులు బైబిల్ అనే ఒక కల్పిత గ్రంథాన్ని రాసుకున్నారు అనేది ఈయన గారి అభియోగం. మరి ఈయన గారు చెబుతున్నది వాస్తవమా కాదా అనేది ఈ రోజు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ మొదటి భాగంలో మనం అబ్రహాము మరియు శారా అనే పదాలను విశ్లేషిద్దాం.

ఏ భాషలో అయినా సరే కొన్ని మూల పదాలు అంటే root words అనేవి ఉంటాయి. ఈ మూల పదాలను ఆధారం చేసుకునే ఇతర పదాలనేవి అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు తెలుగులో "అమ్మ", "అన్న" అనేవి మూల పదాలు. ఈ పదాలకు ముందు "ఆ" అనే అక్షరం చేర్చడంతో "ఆమె" (ఆ + అమ్మ), "ఆయన" (ఆ + అన్న) అనే కొత్త compound words అనేవి వచ్చాయి. అలాగే ప్రతీ భాషలో కూడా వేరే భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు కాఫీ అనే పదం తెలుగు పదం కాదు. దానికి సమానమైన అర్ధాన్నిచ్చే మరొక పదం తెలుగులో లేదు. అందువలన మనం తెలుగులో కూడా కాఫీ అనే అంటాం. ఇలా ఏదైనా ఒక పదాన్ని భాషా పరంగా పరిశీలించినప్పుడు దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి, అది ఈ భాషలోనిదేనా లేక ఇతర భాషల నుండి తీసుకున్నారా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.

ఇక హీబ్రూ భాష విషయానికి వస్తే ఇది మిగిలిన భాషలతో పోలిస్తే చాలా భిన్నమైనది. అన్ని భాషల్లోనూ పదాలనేవి "arbitrary words". కానీ హీబ్రూ భాషలో పదాలకు "intrinsic meaning" ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే హీబ్రూ భాష "chemical language" లాంటిది. ఉదాహరణకు నీటిని కెమికల్ భాషలో H2O అని అంటారు. అంటే water అనే molecule లో one oxygen and two hydrogen atoms ఉంటాయి అనే విషయాన్ని ఇది మనకు తెలియజేస్తుంది. అంటే water ని chemical language లో H2O అని అనడానికి ఒక కారణం ఉంది. కానీ నీటిని తెలుగులో నీరు అనడానికి నాకు తెలిసి ఎలాంటి కారణమూ లేదు. ఒకవేళ ఏమైనా ఉండి ఉంటే దయచేసి నాకు తెలియజేయండి నేను సరి చేసుకుంటాను. మనం అందరం మొదటి నుండి నీరు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ పదం యొక్క అర్ధం ఏమిటి అనేది మనకు తెలుసు. కానీ ఇది ఒక arbitrary word. నీరు అనే పదంలో నీటికి సంబంధించిన intrinsic meaning ఏమీ లేదు. కానీ హీబ్రూ భాషలో పదాలు అలా ఉండవు. మనం అబ్రహాము మరియు శారా అనే పదాలను విశ్లేషించేటప్పుడు ఆ విషయం మీకే అర్ధం అవుతుంది.

అబ్రహాము గారి అసలు పేరు అబ్రాము. అబ్రాముతో నిబంధన చేసుకున్న తరువాత దేవుడైన యెహోవా అతని పేరు మార్చి అబ్రహాము అనే పేరు పెట్టాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. నిజానికి హీబ్రూ భాషలో అబ్రాము అనే పదాన్ని అవ్రామ్ (אברם) అని పలుకుతారు. ఇది నాలుగు అక్షరాల పదం - ఆలెఫ్(א), బెట్(ב), రెష్(ר), మెమ్(ם) అనే అక్షరాలు ఉంటాయి. Modern Hebrew Square Script లో "బెట్(ב)" అనే అక్షరాన్ని Dagesh (మధ్యలో చుక్క) లేకుండా రాసినట్లయితే "బ" అనే శబ్దానికి బదులుగా "వ" అని పలుకుతారు.

 

בּ - "బ" అని పలుకుతారు
ב - "వ" అని పలుకుతారు

 

అందుకే ఇక్కడ  "బెట్(ב)" అనే అక్షరం ఉన్నప్పటికీ "అబ్రామ్" అని కాదు కానీ "అవ్రామ్" అని పలకాలి. అలాగే "మెమ్(ם)" అనే అక్షరం  పదానికి చివరిలో వచ్చింది కాబట్టి దీనిని final form లో రాస్తారు. 

 

מ - Regular MEM
ם - Final Form MEM

 

అవ్రామ్ అనే పదాన్ని Ancient Hebrew Pictographs ప్రకారం ఎలా రాస్తారు అనేది మీరు ఇక్కడ క్రింద ఉన్న చిత్రంలో చూడొచ్చు. "ఆవ్" మరియు "రామ్" అనే రెండు parent root words నుండి అవ్రామ్ అనే పదం వచ్చింది.

Avram Pictograph

Avram Pictograph2

ఆలెఫ్(א) అనే అక్షరాన్ని ప్రాచీన కాలంలో ఎద్దు తల ఆకారంలో రాసేవారు. ఎద్దు తల అనేది బలాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆలెఫ్ అనే అక్షరానికి బలము, నాయకుడు మొదలయిన అర్ధాలు వస్తాయి.

Alef

బెట్(ב) అనే అక్షరాన్ని ప్రాచీన కాలంలో tent లేదా ఒక ఇంటి ఆకారంలో రాసేవారు. కాబట్టి బెట్ అనే అక్షరానికి ఇల్లు, కుటుంబము, లోపల ఉన్నది, అంతరంగము మొదలయిన అర్ధాలు వస్తాయి.

Bet

ఆలెఫ్ మరియు బెట్ అనే ఈ రెండు అక్షరాలను కలిపితే ఆబ్ లేదా ఆవ్ అనే two letter parent root word వస్తుంది. కాబట్టి ఆబ్అనే పదానికి literal meaning ఏంటంటే Tent Pole. మనం ఒక టెంట్ వేయాలంటే Tent Pole అనేది  తప్పనిసరి. Tent Pole లేకపోతే Tent మొత్తం కుప్పకూలిపోతుంది. మనకి అర్ధం అయ్యే భాషలో చెప్పాలంటే, ఇంటిని నిర్మించడానికి స్తంభాలు తప్పనిసరిగా కావాలి. ఈ స్తంభాలు ఇంటికి బలాన్నిస్తాయి. స్తంభాలు లేకపోతే ఇల్లు కుప్పకూలిపోతుంది. దీన్ని కుటుంబ వ్యవస్థకు అన్వయిస్తే, కుటుంబానికి నాయకుడు (leader of the family), లేదా కుటుంబానికి బలం (strength of the family), కుటుంబానికి ఆధారమైనవాడు, కుటుంబాన్ని ముందుండి నడిపించేవాడు. ఎవరు అంటే, తండ్రి! కాబట్టి ఆబ్ అనే పదానికి అర్ధం తండ్రి - Father.

Ab2 

ఇక రెష్(ר) అనే అక్షరాన్ని ప్రాచీన కాలంలో మనిషి తల ఆకారంలో రాసేవారు. మనం సాధారణంగా ఏదైనా ఆఖరున ఉన్న దాన్ని లేదా చివర్లో ఉన్నదాన్ని లేదా వెనుక ఉన్న వారిని వర్ణిస్తూ "తోక" అని అంటాం. అలాగే మొదలు లేదా ఆరంభాన్ని సూచించడానికి "తల" అని అంటారు. మన శరీరంలో పాదాలు అట్టడుగున ఉంటే తల "పైన" ఉంటుంది. పాదాలు హీన స్థితిని సూచిస్తే, తల ఉచ్ఛ స్థితిని సూచిస్తుంది. కాబట్టి రెష్ అనే అక్షరానికి తల, ఆరంభం, మొదలు, ఉన్నతమైన, ఎత్తయిన మొదలయిన అర్ధాలు వస్తాయి.

 Resh

మెమ్(מ) అనే అక్షరాన్ని నీటి అలల ఆకారంలో రాసేవారు. కాబట్టి మెమ్ అనే అక్షరం నీటిని సూచిస్తుంది.

Mem

రెష్ మరియు మెమ్ అనే అక్షరాలను కలిపితే రామ్ అనే two letter parent root word వస్తుంది. నీటి ప్రవాహం ఎప్పుడూ కూడా ఎత్తయిన ప్రదేశాల నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి రామ్ అనే పదానికి అర్ధం ఏమిటంటే high place - ఎత్తయిన ప్రదేశం. దీనిని క్రియా పదంలాగా వాడినప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉంచబడటం లేదా హెచ్చింపబడటం - Lifted up in position or Exalted అనే అర్ధం వస్తుంది.

 Ram

కాబట్టి అవ్రామ్ అనే పదానికి అర్ధం ఏంటంటే, Exalted Father - హెచ్చింపబడిన తండ్రి లేదా ఉన్నతమైన స్థానంలో ఉంచబడిన తండ్రి. అవ్రహామ్ అన్నా కూడా ఇదే అర్ధం వస్తుంది. ఎందుకంటే "రామ్" అనే పదం నుండే "రాహమ్" అనే పదం కూడా వచ్చింది. ఈ రెండు పదాలకి కూడా "పైకి ఎత్తబడటం" అనే అర్ధమే వస్తుంది. ఆదికాండము 17వ అధ్యాయం 5వ వచనాన్ని ఆధారం చేసుకుని అబ్రహాము అంటే "అనేక జనములకు తండ్రి" అని కొంత మంది అర్ధం చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు. కావాలంటే ఈ వచనాన్ని మీరు ఒకసారి హీబ్రూలో చదివి చూడండి మీకే అర్ధం అవుతుంది. "అవ్ హమోన్ గోయీమ్" అనే వాక్యానికి "అబ్రహాము" అనే పదానికి అసలు సంబంధమే లేదు.

 

నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. (ఆదికాండము 17:5)
ולא יקרא עוד את שמך אברם והיה שמך אברהם כי אב המון גוים נתתיך

 

అబ్రహాము అనేక జనములకు తండ్రి అని, శారా అనేక జనములకు తల్లి అని దేవుడైన యెహోవా చెప్పినప్పుడు, ఆయన వారికి ఇవ్వబడిన ఆధిక్యతను ఆశీర్వాదాన్ని గురించి చెబుతున్నాడే కానీ వారికి పెట్టిన పేర్ల యొక్క అర్ధాన్ని గురించి కాదు. అవ్రామ్ అన్నా అవ్రహామ్ అన్నా రెండూ ఒకటే అయినప్పుడు మరి దేవుడు అతని పేరు ఎందుకు మార్చాడు అనే సందేహం మీకు రావొచ్చు. మీరు ఆదికాండము మొదటి రెండు అధ్యాయాలను చూసినట్లయితే, ఆదాము తన భార్యకు, తన పిల్లలకు, అలాగే జంతువులన్నిటికీ కూడా పేర్లు పెట్టాడు. కానీ వెలుగు, చీకటి, భూమి, ఆకాశము మొదలయిన వాటికి దేవుడు పేర్లు పెట్టాడు. తన భార్యాపిల్లలు అలాగే జంతువులన్నిటి మీద కూడా ఆదాముకి అధికారం ఇవ్వబడింది. వెలుగు, చీకటి, భూమి, ఆకాశము మొదలయిన వాటి మీద దేవునికి అధికారం ఉంది. దేని మీద అయితే మనకు అధికారం ఉందో వాటికి పేర్లు పెట్టే హక్కు బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. అబ్రహాము మరియు శారా యొక్క బాధ్యత అలాగే వారి మీద అధికారం కూడా కలిగి ఉన్నాను అని చెప్పడం కోసం దేవుడు వారి పేర్లను మార్చాడు. యాకోబు పేరుని ఇశ్రాయేలు గా మార్చడం వెనుక కూడా ఇదే కారణం ఉంది.

ఇలా ప్రతి అక్షరాన్ని వివరిస్తూ అవ్రహామ్ అనే పేరుకి అర్ధం Exalted Father అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఇతర భాషల నుండి తీసుకున్న పేరు కాదు. దీని మూలాలు హీబ్రూ భాషలోనే ఉన్నాయి. మరి ఇదే విధంగా ప్రతి అక్షరాన్ని, దాని అర్ధాన్ని వివరిస్తూ బ్రహ్మ అనే పేరుకి అర్ధం ఏమిటో చెప్పగలరా ముదిగొండ శివప్రసాద్ గారు? దానితో బ్రహ్మ అనే పేరుని కాపీ కొట్టి అబ్రహాము అని రాశారా లేక అబ్రహాము అనే పేరుని కాపీ కొట్టి బ్రహ్మ అని రాసుకున్నారా అనే విషయం స్పష్టమవుతుంది. బైబిల్ నిన్న కాక మొన్న వచ్చింది కానీ మా గ్రంథాలు లక్షల సంవత్సరాల క్రితమే రాశారు, కాబట్టి అబ్రహాము అనే పేరుని కాపీ కొట్టి బ్రహ్మ అనే పేరుని రాసే అవకాశమే లేదు అంటారా? సరే, లక్షల సంవత్సరాల క్రితమే మీ గ్రంథాలు ఉన్నయ్యా లేదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, అబ్రహాము క్రీస్తు పూర్వం 21వ శతాబ్దంలో జీవించినవాడు. క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో మోషే ఆదికాండాన్ని రాశారు. రెహబాము యూదా దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో అంటే క్రీస్తు పూర్వం పదవ శతాబ్దంలో ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చినట్లు మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. ఈ దండయాత్రకు సంబంధించిన విషయాలను ఐగుప్తు రాజైన షీషకు కూడా నమోదు చేయించాడు. ఐగుప్తు దేశంలో The Great Karnak Temple అని ఒక దేవాలయం ఉండేది. అక్కడ Ammon అనే ఒక దేవుడు, అతని భార్య Mut, వారి కొడుకు Khons - ఈ ముగ్గురు దేవుళ్లను ఆ దేవాలయంలో ప్రతిష్టించి ఆరాధిస్తూ ఉండేవారు.

karnak 

శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయపు గోడల మీద షీషకు నమోదు చేయించిన వివరాలు ఉన్నాయి. వాటి ప్రకారం ఇశ్రాయేలు మరియు యూదా దేశాలలోని మొత్తం 156 ప్రాంతాలను షీషకు ఆక్రమించాడు. ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక్కొక్క మనిషి చొప్పున మొత్తం 156 మందిని షీషకు అక్కడ బలి ఇచ్చాడు. వారి ప్రతిమలు అలాగే దాని కింద వారు ఏయే ప్రాంతాలకు చెందినవారు అనే వివరాలు కూడా ఆ దేవాలయపు గోడల మీద షీషకు చెక్కించాడు. వీటిలో కొన్ని పూర్తిగా పాడైపోగా మిగిలినవి దాదాపు 75 ప్రాంతాల పేర్లను శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. ఇందులో ఒక ప్రాంతం పేరు "The Field of Abram" అని ఉంది.

karnak_2

Field_of_Abram

కాబట్టి క్రీస్తు పూర్వం పదవ శతాబ్దం నాటికి ఇశ్రాయేలు దేశంలో అబ్రాము అనే పేరు వాడుకలో ఉంది అని నిరూపించడానికి షీషకు వేయించిన ఈ శాసనాన్ని ఆధారంగా తీసుకోవచ్చు. దీనికంటే ముందు అంటే, క్రీస్తు పూర్వం పదవ శతాబ్దానికంటే ముందు బ్రహ్మ అనే సంస్కృత నామధేయం ఉంది అనడానికి మీ దగ్గర ఏదయినా epigraphical evidence, అంటే శిలాశాసనాల ఆధారాలు కానీ లేకపోతే manuscript evidence కానీ ఏమైనా ఉందా? ఉంటే చూపించండి. అంతే కానీ ఎలాంటి literary evidences లేకుండా ఊరికే మావి లక్షల సంవత్సరాల క్రితమే రాశారు అని మాత్రం ప్రచారం చేసుకోకండి. అంతే కాకుండా బ్రహ్మ అనే హిందూ దేవుడి గురించి మనకి వేదాలలో ఎక్కడా కనిపించదు. మైత్రాయణీయ ఉపనిషత్తులో మొదటిసారిగా బ్రహ్మ దేవుడి గురించిన ప్రస్తావన ఉంటుంది. ఈ ఉపనిషత్తుని ఎప్పుడు రాశారు అనే దాని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అధిక శాతం మంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఇది క్రీస్తు పూర్వం అయిదవ శతాబ్దం తరువాతే రాశారు. అంటే హైందవ గ్రంథాలలో బ్రహ్మ అనే పేరుని మొట్టమొదటిసారిగా వాడటానికంటే పదిహేను వందల సంవత్సరాల ముందు కాలంలో అబ్రహాము గారు జీవించారు. దీన్ని బట్టి చూస్తే అబ్రహాము అనే పేరుని కాపీ కొట్టి హిందువులు బ్రహ్మ అనే ఒక కల్పిత పాత్రను సృష్టించారు అని మనకు స్పష్టంగా అర్ధం అవుతుంది. నిజంగానే ఈ కల్పన చాలా బాగుంది ముదిగొండ శివప్రసాద్ గారు!!!

ఇక శారా అనే పదానికి అర్ధం ఏమిటో చూద్దాం. బ్రహ్మ దేవుడి భార్య పేరు శారద, అబ్రహాము భార్య పేరు శారా. కాబట్టి శారద అనే పేరు నుండి శారా అనే పేరుని కాపీ కొట్టారు అనేది ముదిగొండ శివప్రసాద్ గారి ఆరోపణ. మరి ఆయన చెప్పింది నిజమేనా లేక శారా అనే పదానికి మూలాలు హీబ్రూ భాషలోనే ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం. 

శారా అసలు పేరు శారయి. శారయ్(שרי) అనే పేరులో షిన్(ש), రెష్(ר), యుద్(י) అనే మూడు అక్షరాలు ఉంటాయి. "సర్(שר)" అనే హీబ్రూ మూల పదం నుండి "శారయ్" అనే పదం వచ్చింది. మీరు యెషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం చూసినట్లయితే, 

 

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. (యెషయా గ్రంథం 9:6)

 

ఈ వచనం మనకు బాగా తెలిసిన వచనమే. ఇక్కడ "సమాధానకర్తయగు అధిపతి" అనే మాట ఏదయితే ఉందో, అది మనం హీబ్రూ లో చూసినట్లయితే "సర్ షాలోమ్ (שר שלום)" అని ఉంటుంది. ఇంగ్లీష్ లో అయితే "Prince of Peace" అనే మాట ఉంటుంది. "సర్" అనే హీబ్రూ పదానికి "a prince or a leader of warriors", "a ruler", "captain", "అధిపతి" ఇలాంటి అర్ధాలు వస్తాయి. ఈ పదాన్ని Ancient Hebrew Pictographs ప్రకారం ఎలా రాస్తారు అనేది మీరు ఇక్కడ క్రింద ఉన్న చిత్రంలో చూడొచ్చు. 

Sarai 

షిన్(ש) అనే అక్షరాన్ని ప్రాచీన కాలంలో పదునైన పన్ను అంటే ఒక sharp teeth ఆకారంలో రాసేవారు. మనం మన పళ్ళని ఏదయినా తినడానికి, ఆహారాన్ని నలగ్గొట్టడానికి, అంటే "to break down the food into pieces", అలాగే దేన్నైనా నాశనం చేయాలంటే పదునైన వస్తువులు, అంటే కత్తులు లాంటి వాటిని వాడతాం. అలాగే "thorns", అంటే ముళ్ళు కూడా చాలా పదునుగా ఉండి గుచ్చుకుంటాయి. ఉదాహరణకు మీరు ఒక దారిలో ప్రయాణం చేస్తూ ఉన్నారనుకుందాం. మీకు మధ్యలో ఒక ముళ్ల పొద కనిపించింది. మీరు ఏమి చేస్తారు? మీ దిశను కొద్దిగా మార్చుకుని ఆ పక్కగా ముళ్ళు లేని వైపు వెళ్తారు. కాబట్టి ఈ context లో షిన్ అనే అక్షరానికి అర్థం ఏమిటంటే, "to turn the direction". దిశను మళ్లించడం లేదా ఎటు వైపు వెళ్ళాలో చెప్పడం.

 Shin

ఇక రెష్(ר) అనే అక్షరం గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ అక్షరాన్ని ప్రాచీన కాలంలో మనిషి తల ఆకారంలో రాసేవారు. దీనికి తల, ఆరంభం, మొదలు, ఉన్నతమైన, ఎత్తయిన మొదలయిన అర్ధాలు వస్తాయి.

షిన్ మరియు రెష్ అనే అక్షరాలను కలపడం ద్వారా మనకి "సర్" అనే two letter parent root word వస్తుంది. ఈ పదానికి concrete meaning ఏంటంటే, "one who turns the head of the people". అందరికీ దిశానిర్దేశం చేసేవాడు. తన నిర్ణయాలతోనూ అలాగే తన క్రియలతో కూడా అందరినీ ప్రభావితం చేసేవాడు. అందరినీ తన వైపు తిప్పుకునేవాడు. ఒక నాయకుడు నడుస్తూ ఉంటే అందరి దృష్టి అతని మీదే ఉంటుంది. ఒక నాయకుడు మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా తన మాటలనే వింటారు. కాబట్టి ఈ పదానికి "a prince, ruler, captain" మొదలయిన అర్ధాలు వస్తాయి. Feminine form లో తీసుకుంటే గనక, ఈ పదానికి princess లేదా ఒక Noblewoman, అంటే ఒక రాజవంశానికి చెందిన స్త్రీ, A Female of authority, అంటే అధికారం కలిగి ఉన్న స్త్రీ, ఇలాంటి అర్ధాలు వస్తాయి.

 Sar

ఇక "సర్" అనే ఈ two letter parent root word కి చివరిలో యుద్ అనే అక్షరాన్ని చేరిస్తే మనకి శారయ్ అనే పదం వస్తుంది. యుద్(י) అనే అక్షరాన్ని ప్రాచీన కాలంలో ఒక చేతి ఆకారంలో రాసేవారు. ఏదయినా ఒక పనిని చేయడాన్ని ఇది  సూచిస్తుంది. అంతేకాకుండా మనం ఏదయినా ఒక వస్తువుని చూపించి ఇది నాది అని చెప్పాలంటే సహజంగా ఏమి చేస్తాం? మన పిడికిలిని బిగించి, మన చేతిని మన ఛాతి మీద పెట్టి, ఇది నాది అని చెబుతాం. అలాగే హీబ్రూ గ్రామర్ ప్రకారం, ఏదయినా ఒక వస్తువు లేదా ఒక వ్యక్తిని నాది అని చెప్పాలి అంటే, ఆ పదానికి చివరిలో యుద్ అనే అక్షరాన్ని చేరుస్తారు. కాబట్టి శారయ్ అనే పదానికి అర్ధం ఏమిటంటే "My Princess".

 Yud

మరి అబ్రహాము భార్య అయిన శారా అందరిని తన వైపు తిప్పుకుందా అంటే? Yes ofcourse, అధికారంతో కాదు కానీ తన అందంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. "అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి" అని మనం ఆదికాండము 12వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. 

అబ్రాము మరియు శారయి యొక్క పేర్లు మార్చినప్పుడు దేవుడైన యెహోవా వారిద్దరి పేర్లలోనూ హే(ה) అనే అక్షరాన్ని చేర్చాడు. ఈ అక్షరాన్ని ప్రాచీన కాలంలో ఎలా రాసేవారంటే, ఒక వ్యక్తి చేతులు పైకెత్తి ఆశ్చర్యంగా ఎదో చూస్తున్నట్లుగా రాసేవారు. కాబట్టి ఈ అక్షరానికి "Behold, to show, to reveal, a window" మొదలయిన అర్ధాలు వస్తాయి. దేవుడు తన ప్రణాళికను అబ్రహాము ద్వారా బయలుపరిచాడు అలాగే నేడు అనేక జనములు తమ పితరులుగా  అబ్రహాము శారాల వైపు చూస్తారు.

Hey 

ఈ విధంగా ప్రతి అక్షరాన్ని దాని అర్ధాన్ని విశ్లేషిస్తూ, అబ్రహాము మరియు శారా అనే పేర్లను మనం చక్కగా వివరించవచ్చు. అంటే ఈ పదాల యొక్క మూలాలు హీబ్రూ భాషలోనే ఉన్నాయి కానీ ఇవి ఇతర భాషల నుండి తీసుకున్నవి కాదు అనే విషయం కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. మరి ఇదే విధంగా శారద అనే పేరుకి అర్ధం ఏమిటో చెప్పగలరా ముదిగొండ శివప్రసాద్ గారు? శారద అనే పదానికి మూలం సంస్కృతమా లేక ఈ పేరుని కూడా మీరు బైబిల్ నుండే కాపీ కొట్టారా? 

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.