అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.
మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.
ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్పచేసికొనినను, ఒకడు ముఖముమీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు.
మేము బలహీనులమైయున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగియున్నాడో, ఆ విషయమందు నేనుకూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నానుసుమా.
వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే.