Joseph
ఆదికాండము 45:1-18
1

అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్ను తాను అణచుకొనజాలక నా యొద్దనుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు.

2

అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారును వినిరి.

3

అప్పుడు యోసేపు నేను యోసేపును; నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి.

4

అంతట యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమి్మవేసిన మీ సహోదరుడైన యోసేపున

5

అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమి్మవేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింపనియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.

6

రెండు సంవత్సరముల నుండి కరవు దేశములోనున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును

7

ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.

8

కాబట్టి దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటివారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను.

9

మీరు త్వరగా నా తండ్రియొద్దకు వెళ్లి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు;

10

నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱలమందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును.

11

ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటివారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.

12

ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి.

13

ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి

14

తన తమ్ముడైన బెన్యామీను మెడమీద పడి యేడ్చెను; బెన్యామీను అతని మెడమీదపడి యేడ్చెను.

15

అతడు తన సహోదరులందరిని ముద్దుపెట్టుకొని వారిమీద పడి యేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.

16

యోసేపుయొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను.

17

అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరీలాగు చేయుడి, మీ పశువులమీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి

18

మీ తండ్రిని మీ యింటివారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి; ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకెచ్చెదను, ఈ దేశముయొక్క సారమును మీరు అనుభవించెదరు.

ఆదికాండము 46:31-34
31

యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనానుదేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపువారును నాయొద్దకు వచ్చిరి;

32

ఆ మనుష్యులు పశువులుగలవారు, వారు గొఱ్ఱల కాపరులు. వారు తమ గొఱ్ఱలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పెదను.

33

గొఱ్ఱల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల

34

మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనమునుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గలవారమైయున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను.

ఆదికాండము 47:1-10
1

యోసేపు వెళ్లి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱలమందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశమునుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి

2

తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను.

3

ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱల కాపరులమని ఫరోతో చెప్పిరి.

4

మరియు వారు కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితివిు. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా

5

ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు.

6

ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయుము, గోషెను దేశములో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచిన యెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను

7

మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొనివచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను.

8

ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగినందుకు

9

యాకోబు నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి

10

ఫరోను దీవించి ఫరో యెదుటనుండి వెళ్లిపోయెను.