ఆ యాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, ఆ పొడ అతని దేహచర్మము కంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠుపొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను.
ఆ పుండుండినచోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల, యాజకునికి దానికనుపరచవలెను.
యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారియుండినయెడలను, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ.
అయినను బట్టతలయందేగాని బట్ట నొసటియందేగాని యెఱ్ఱగానుండు తెల్లని పొడ పుట్టిన యెడల, అది వాని బట్టతలయందైనను బట్టనొసటియందైనను పుట్టిన కుష్ఠము.
ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళు గానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కనుపరచవలెను.