మరియు ఏఫోదు నిలువుటంగీని కేవలము నీలిదారముతో కుట్టవలెను.
దానినడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంఠ కవచ రంధ్రమువలె దాని రంధ్రముచుట్టు నేతపనియైన గోటు ఉండవలెను.
దాని అంచున దాని అంచులచుట్టు నీల ధూమ్ర రక్తవర్ణములుగల దానిమ్మపండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగీ చుట్టు తగిలింపవలెను.
ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మపండును ఆ నిలువుటంగీ క్రింది అంచున చుట్టు ఉండవలెను.
సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించునప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను.